“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

11, నవంబర్ 2023, శనివారం

కష్టం - సుఖం

గుడ్డల  రంగులు మార్చడం - అతి సులభం

మనసు రంగులు కడగడం - అతి కష్టం


దేహాన్ని బాధపెట్టడం - అతి సులభం

మోహాన్ని సానపట్టడం - అతి కష్టం


మాయమాటలు చెప్పడం - అతి సులభం

మాయను అధిగమించడం - అతి కష్టం


మతాలు మారిపోవడం - అతి సులభం

గతాన్ని  మార్పు చెయ్యడం - అతి కష్టం


మంచితనాన్ని నటించడం - అతి సులభం

వంచనను వదిలించుకోవడం - అతి కష్టం


లోకాన్ని ఉద్ధరించడం - అతి సులభం

శోకాన్ని మీరగలగడం - అతి కష్టం


లోకులకు దారిచూపడం - అతి సులభం

తన దారేదో తెలుసుకోవడం - అతి కష్టం


ఆధ్యాత్మిక బోధలు చెయ్యడం - అతి సులభం

ఆత్మలో ఆత్మగా మిగలడం - అతి కష్టం


సులభం - మేకతోలులో ఉన్న శార్దూలం

కష్టం - విషపు వన్నెలో ఉన్న అమృతం


సుఖాన్ని కోరుకునేవాడు కష్టంలో మునుగుతాడు 

కష్టాన్ని వరించేవాడు సుఖంలో తేలతాడు 


సులభాన్నీ కష్టాన్నీ గ్రహించేవారేరి?

సుఖాన్నీ దుఃఖాన్నీ సహించేవారేరి?


దిక్కుతెలియని ఈ దారిలో

దారిచూపేవారేరి?

చెక్కుచెదరని దన్నుగా

చేరి నిలిచేవారేరి?


మూడునాళ్ళ ఈ జీవితంలో

ముఖ్యమేదో గ్రహించేవారేరి?

కష్టసుఖాల కల్లోలంలో

సత్యపు ఉనికిని గణించేవారేరి?