ఆశ్రమం సాకారమైంది.
ఆరునెలలుగా మేము పడుతున్న శ్రమ ఫలించింది.
నిన్న జగద్ధాత్రి పూజా పర్వదినాలలో ఆశ్రమం మొదలైంది. సింహవాహిని యైన దుర్గాదేవిని జగద్దాత్రిగా ఈ సమయంలో పూజిస్తారు. ఇదే సమయంలో మా ఆశ్రమం ప్రారంభించబడింది.
దూరదూరాల నుండి వచ్చిన శిష్యుల సమక్షంలో నిరాడంబరంగా మా ఆశ్రమ ప్రారంభోత్సవం నిన్న ఉదయం పది గంటలకు జరిగింది. విచ్చేసిన శిష్యులు చాలామంది తమతమ భావాలను అనుభవాలను తమ ఉపన్యాసాలలో వెలిబుచ్చారు.
పంక్షన్ అంతా లైవ్ ఇవ్వబడింది.
త్వరలో మా యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో క్లిప్స్ కొన్ని పెట్టబడతాయి.
మా ఆశ్రమాన్ని గురించి కొద్దిమాటలలో....
కొందరు భావిస్తున్నట్లు, ఈ ఆశ్రమం వృద్ధాశ్రమం కాదు, జ్ఞానవృద్ధులైన నిత్యయవ్వనుల ఆశ్రమం.
ఇంకొందరు అనుకుంటున్నట్లు, ఇది అనాధాశ్రమం కాదు. దైవం తప్ప వేరే దిక్కులేని అనాధల ఆశ్రమం.
ఇది కాలక్షేప ఆశ్రమం కాదు. కాలాన్ని జయించాలనుకునే వారి ఆశ్రమం.
ఇది వ్యాపార ఆశ్రమం కాదు. వ్యాపకాలను ఖండించే ఆశ్రమం.
ఇక్కడ జ్ఞానదాహార్తులకు దాహం తీర్చబడుతుంది.
ఇక్కడ యోగసాధకుల సాధన ఫలిస్తుంది.
ఇక్కడ మంత్రచైతన్యం వెల్లివిరుస్తుంది.
ఇక్కడ వైధీభక్తి పరాభక్తిగా మారుతుంది.
ఇక్కడ మోక్షం అరచేతిలో వచ్చి నిలుస్తుంది.
మాకు ప్రపంచంతో పనిలేదు. కానీ ప్రపంచాన్ని వదిలిపెట్టం.
మాకు మనుషులతో పనిలేదు. కానీ వారి మధ్యనే ఉంటాం.
లోకోద్ధరణ మా పని కాదు. కానీ లోకానికి బోధిస్తూనే ఉంటాం.
లౌకిక బాధలను తీర్చడం మా పని కానేకాదు. అన్ని బాధలను దాటే మార్గం చూపడమే మా పని.
'ఎందుకలా?' అని కొందరడిగారు.
గడపమీదున్న దీపం లోపలకూ బయటకూ చెందదు. కానీ రెండుప్రక్కలకూ వెలుగును ప్రసరిస్తుంది. అలాంటిది మా ఆశ్రమం.
మలయమారుతం సుడిగాలిలా వీచదు. సుతారంగా తాకుతుంది. అలాంటిది మా విధానం.
ఉలుకూపలుకూ లేకుండా మేము ఉండము. అంటీ ముట్టనట్లుగా మా ఉనికిని ప్రదర్శిస్తాం. అంతేగాని, లోకంతో, లోకులతో అతిగా పూసుకోము.
అర్హులైన వారికి ఇక్కడ అందలాలు అందుతాయి. అర్హతలు లేనివారు ఇక్కడ అడుగుకూడా పెట్టలేరు. ఒకవేళ పెట్టినా, ఎక్కువకాలం మాతో కలిసి నడవలేరు.
సెల్ఫ్ సర్వీసే మా పని. సోషల్ సర్వీస్ మా పని కాదు. ప్రస్తుతపు మాయ ప్రపంచానికి, మాయ మనుషులకు ఎటువంటి సర్వీసూ చెయ్యవలసిన పని లేదు. ఇది నా ఖచ్చితమైన అభిప్రాయం.
అదృష్టవంతులు కొందరు ప్రారంభోత్సవానికి రాగలిగారు. ఇతరులు రాలేకపోయారు.
వచ్చినవారిలో కూడా అందుకున్నవారికి అందుకున్నంత.
ఇన్నాళ్లూ సమాజపు సందుగొందులలో నా పాదయాత్ర సాగింది. ఇక ఆధ్యాత్మిక హైవే పైన సూటిప్రయాణం మొదలు.
పాత్రతను బట్టి యాత్ర.