నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

19, మే 2024, ఆదివారం

మా క్రొత్త పుస్తకం 'మధుశాల' విడుదలైంది

మా క్రొత్త పుస్తకం 'మధుశాల' విడుదలైంది ఇది నా కలం నుండి వెలువడుతున్న
64 వ పుస్తకం. ఆశ్రమం ప్రారంభించిన తర్వాత నేను విడుదల చేస్తున్న రెండవ పుస్తకం.

ఈ పుస్తకంలో 140 సంఘటనలు, సంభాషణలు ఉన్నాయి. అవి చిన్నవే. నిత్యజీవితంలో మనకు రోజూ ఎదురయ్యేవే. కానీ అవే మనల్ని ఆలోచింపజేస్తాయి. జీవితపు లోతులను స్పృశింపజేస్తాయి. వాటిలో ప్రధాన పాత్రధారి సాకీ. వీటన్నిటిలోనూ, సాకీ అడుగుతుంది. నేను చెబుతూ ఉంటాను. నేనెవరో మీకు తెలుసు.

ఈ ‘సాకీ’ ఎవరు?

ఉమర్ ఖయ్యాం పేరును వినని సాహిత్యపిపాసి ఉండడు. ఆయన వ్రాసిన "రుబాయత్" ను, దువ్వూరి రామిరెడ్డిగారు, ‘పానశాల’ అనే పేరుతో తెలుగులో పద్యాలుగా వ్రాశారు. అది చదవని సాహిత్యాభిమాని కూడా ఉండడు. ఇదే రుబాయత్ ను, హిందీకవి హరివంశరాయ్ బచ్చన్ ‘మధుశాల’ అనే పేరుతో హిందీలో వ్రాశాడు. హిందీ అభిమానులు దానిని తప్పకుండా చదివి ఉంటారు. పరమహంస యోగానంద గారు కూడా దీనిపైన వ్యాఖ్యానించారు.

ఉమర్ ఖయ్యాం స్వప్నసుందరి సాకీ. ఈ సాకీ అనే పాత్ర, మధుశాలలో మధువును పొసే అమ్మాయి. అనేకమంది కవులు అనేకవిధాలుగా సాకీని తీసుకున్నారు. ఒక మంచి స్నేహితురాలిని, ప్రియురాలిని, ఊహాసుందరిని, ఆత్మసహచరిని, సమాధిస్థితిలో కలిగే మత్తును, చివరకు దైవానుభూతిని కూడా ‘సాకీ’ అంటూనే కొందరు మార్మికవాదులు పిలిచారు.

ఏతావాతా, ఈ సాకీ, ఒక మానవవనిత కాదు. కల్పితభావన మాత్రమే. సాకీ అనే పేరులోనే ఏదో గమ్మత్తుంది. బహుశా మన 'సఖి' కి ఇది పార్సీ రూపమై ఉంటుంది. మన తెలుగుకవులలో కూడా ఎవరి సాకీ వారికుంది.

వారందరినీ వదిలేసి, ఉమర్ ఖయ్యాం స్వప్నసుందరిని నేను కాజేసినందుకు ఆయనకు క్షమార్పణలు చెబుతున్నాను. కాకపోతే, మేమంతా ఒకటే కాబట్టి, ఆయన ఏమీ అనుకోడనే నా భావన.

కవి చెప్పాలనుకున్నదానిని, కల్పితపాత్రల ద్వారా చెప్పడం, చెప్పించడం, సాహిత్యప్రక్రియలో సర్వసాధారణం. ప్రాచీన కవులందరూ అదే చేశారు. నేనొక కవినని చెప్పను గాని, నేనూ అదే చేశాను.

ఉమర్ ఖయ్యాం సాకీ ఎవరో అందరికీ తెలుసు. మరి, నా రచనలో ప్రత్యక్షమయ్యే ‘సాకీ’ ఎవరు? అని చాలామంది నా శిష్యులు, అభిమానులు అడిగారు. దీనికి జవాబును ఎలా చెప్పాలి?

నా నిత్యజీవితంలో ఎదురైన, ఎదురౌతున్న అనేక సంఘటనలలో పాత్రధారులైన మనుషులందరూ సాకీలే. వారిలో నా శిష్యులున్నారు, పరిచయస్తులున్నారు, స్నేహితులున్నారు. దారిలో ఎదురయ్యే సంబంధంలేని మనుషులున్నారు. అందరూ సాకీలే.

ఏమంటే, ప్రతివారినుంచీ నాకొక వెలుగు కనిపిస్తుంది. ఒక క్రొత్త దృక్కోణం గోచరిస్తుంది. ఒక క్రొత్త మెరుపు దర్శనమిస్తుంది. నేను నేర్చుకున్నదంతా జీవితం నుంచే నేర్చుకున్నాను. అవన్నీ వ్రాయాలంటే కొన్ని వేలున్నాయి. కానీ వాటన్నిటి సారం మాత్రం ఒకటే. వాటినే, దానినే, ఈ 140 చిన్న చిన్న సంభాషణలుగా ఈ పుస్తకంలో మీకందిస్తున్నాను.

నా మిగతా పుస్తకాలు చిక్కటి వేదాంతగ్రంధాలు. వాటి భాష చాలామందికి అర్థం కాకపోవచ్చు. ఇబ్బంది పెట్టవచ్చు కూడా. కానీ వాటిల్లో ఏముందో ఈ చిన్న పుస్తకంలో కూడా అదే ఉంది. చాలా తేలికైన భాషలో ఉంది.

చిక్కటి వేదాంతాన్ని అతి సులభమైన తేలికభాషలో చెప్పడం రామకృష్ణులు, జిల్లెళ్ళమూడి అమ్మగార్ల విధానం. మామూలు మాటలను కూడా అర్థంకాని కవితాధోరణిలో చెప్పడం జెన్ సాధువుల, మార్మికకవుల విధానం. ఈ పుస్తకంలో నేనీ రెంటినీ అనుసరించాను.

‘మధువు’ అనే పదానికి కొంచెం వివరణ అవసరం. మధువంటే తేనె. మధువంటే సారాయి. అదే విధంగా, మధువు అంటే బ్రహ్మానుభూతి కూడా. ఉపనిషత్తులలో ‘మధువిద్య’ అనే విద్య ఉన్నది. కనుక మధువు అనే పదానికి చాలా అర్థాలున్నాయి.

మధువంటే మనకందరికీ తెలిసిన సారాయి కాదు. మధువంటే అనుభూతి. ఆ అనుభూతి భౌతికం కావచ్చు, అంతరికం కావచ్చు. చాలాసార్లు అది అంతరికమైనదే అయి ఉంటుంది.

భావప్రపంచంలో లీనుడై కవి బాహ్యప్రపంచాన్ని మరచిపోతాడు. ఇంద్రియప్రపంచాన్ని అధిగమించిన యోగి మనుషులకు తెలియని ఏదో చోట తన ఆత్మను లీనం చేస్తాడు. సారాయికి బానిసైన చవకబారు మనిషి ఆ మత్తులో కొద్దిసేపు తన బాధలను మరచిపోతాడు. మౌలికంగా ఇవన్నీ ఒక్కటే అనడం సాహసమే అయినప్పటికీ, ‘మత్తు’గా ఇవన్నీ ఒక్కటే అని చెప్పాలి. ఆ మత్తు యొక్క గుణంలోనూ, జీవితానికి అదిచ్చే పరిణతిలోనూ తేడాలుండవచ్చు. కానీ మౌలికంగా చూచినపుడు, అన్నీ మత్తులే.

జీవితమే మధుశాల అనేది నా అభిప్రాయం. ఏమంటే, లౌకికులైనా, వేదాంతులైనా, సామాన్యులైనా, అసామాన్యులైనా, ఎవరైనా ఇక్కడ బ్రతకవలసినవారే. అందరికీ అదే రంగస్థలం. దీనిని విడచి ఎవరూ సాము చెయ్యలేరు. ఎవరికి కలిగే అనుభవాలైనా ఇక్కడనుంచే కలుగుతాయి. కనుక, దీనికంటే వేరే మధుశాల లేదని నా ఉద్దేశ్యం. దీనిని విడచి వేరే మధుశాలకు పోవలసిన పని కూడా లేదని నేనంటాను.

నీ నిత్యజీవితాన్ని విడచి, ఆధ్యాత్మికమంటూ వేరే ఎక్కడా లేదు. ఇదే నా అభిప్రాయం. జీవితాన్ని 50 ఏళ్లపాటు పరిశీలించినమీదట నేనీ నిశ్చితాభిప్రాయానికి వచ్చాను. ఇదే మాటను జిల్లెళ్ళమూడి అమ్మగారు కూడా అనేవారు.

ఇందులో నేనొక త్రాగుబోతుగా మీకు కనిపిస్తాను. సరదాగా నేను వేసిన నాటకాలలో చాలా పాత్రలు ధరించాను. అలాగే, ఇదికూడా ఒక పాత్ర. ఈ పాత్రపోషణ ద్వారా లోతైన జీవితసత్యాలను తేలికైన మాటలలో మీకు వివరించే ప్రయత్నాన్ని చేశాను. ఈ నాటకంలో నా సహపాత్రధారిణి సాకీ. నా జీవితంలో నాకెదురైన అందరూ సాకీలే. అసలు నా జీవితమే పెద్ద నాటకం.  అందులో అన్నీ పాత్రలే.

త్రాగుడును నేనస్సలు సమర్ధించను. మనిషి జీవితానికి అది అవసరమైనది కాదు. దాని జోలికి పోవద్దని మీకందరికీ సలహా ఇస్తాను కూడా. ఈ పుస్తకంలో చెప్పబడిన మధుసేవనం అంతర్మధనమే గాని, సారాయిని త్రాగడం కాదు.

జీవితమే మధుశాల. అందులో, మనకిష్టమైనవారు, మనతో వారి మనస్సును అరమరికలులేకుండా పంచుకునే వారు, ఆత్మీయంగా మనతో మాట్లాడేవారు, అందరూ సాకీలే. ఈ కోణంలో మాత్రమే మీరు ఈ పుస్తకాన్ని, ఇందులో కనిపించే సాకీని అర్థం చేసుకోవాలి.

జీవితంలో ప్రతి సన్నివేశమూ మనల్ని అలౌకికమైన అనుభూతి మత్తులో ముంచుతున్నపుడు వేరే మధువు యొక్క అవసరం మనకు ఏముంటుంది?

మనసు పెట్టి చదివితే, ఈ చిన్నపుస్తకం మీ జీవితాన్ని ఎంతో ఉన్నతంగా మార్చివేస్తుంది. ఈ మాట మాత్రం గట్టిగా చెప్పగలను.

ఈ పుస్తకాన్ని వ్రాయడంలో నాకు తోడుగా ఉన్న నా శ్రీమతి సరళాదేవి,  శిష్యులు, శిష్యురాళ్ళు, అఖిల. లలిత, ప్రవీణ్, శ్రీనివాస్ చావలి లకు, పంచవటి సభ్యులందరికీ నా కృతజ్ఞతలు, ఆశీస్సులు.

సాకీలకందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. వారెందరో ఉన్నారు, అందరి పేర్లూ వ్రాయలేను. అందుకే సాకీ పేరుతోనే వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

యధావిధిగా ఈ 'ఈబుక్' ఇక్కడ నుండి మీకు లభిస్తుంది. త్వరలో ప్రింట్ పుస్తకంగా కూడా వస్తుంది.
read more " మా క్రొత్త పుస్తకం 'మధుశాల' విడుదలైంది "