“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

24, ఆగస్టు 2024, శనివారం

మా 67 వ పుస్తకం 'భారతీయ జ్యోతిష్య సంఖ్యా శాస్త్రము' విడుదల

మా 67 వ పుస్తకంగా 'భారతీయ జ్యోతిష్య సంఖ్యాశాస్త్రము' నేడు విడుదల అవుతున్నది. ఇది నా జ్యోతిష్యశాస్త్ర పరిశోధనలో వెలుగుచూచిన న్యూమరాలజీ విధానం.

'సంఖ్యాజ్యోతిష్యం' అంటే బాగుంటుంది కదా? అని కొందరు సందేహం వెలిబుచ్చారు. అనడానికి, వినడానికి బాగానే ఉంటుంది. కానీ, జ్యోతిష్యశాస్త్రం లేకుండా సంఖ్యాశాస్త్రం లేదు. గ్రహాలతో ముడిపెట్టకుండా ఉత్త అంకెలు మిమ్మల్ని ఎంతోదూరం తీసుకుపోలేవు. జ్యోతిష్యశాస్త్రం ముందు, సంఖ్యాశాస్త్రం తరువాత.  అందుకే 'జ్యోతిష్య సంఖ్యాశాస్త్రము' అని పేరుపెట్టాను. 

నా 61 వ పుట్టినరోజు సందర్భంగా జూలై నెలాఖరులో మా ఆశ్రమంలో జరిగిన సాధనాసమ్మేళనంలో ఈ విధానాన్ని శిష్యులకు వివరించాను. ఆ తరువాత ఈ విధానాన్ని గ్రంధస్థం చేయాలన్న సంకల్పంతో, కేవలం రెండువారాలలో ఈ పుస్తకాన్ని వ్రాసి విడుదల చేస్తున్నాను. ఇందులో నాదైన న్యూమరాలజీ విధానం వివరించబడింది. దీనిని 'భారతీయ జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర పధ్ధతి' లేదా క్లుప్తంగా 'BJS పద్ధతి' అని పిలుచుకోవచ్చు.

వెస్టర్న్ న్యూమరాలజీ మీద మార్కెట్లో వేలాది పుస్తకాలున్నాయి. అవన్నీ తప్పుల తడికలేనని నేనంటాను. నేనిలా అనడానికి తర్కబద్ధమైన కారణాలున్నాయి.

అంకెలను ఏ బీ సీ డీ లతో పోల్చి మీ నేమ్ నంబర్ రాబట్టడం, లేదా మీ జననతేదీతో పోల్చి మీ డెస్టినీ నంబర్ రాబట్టడాలు సరియైన విధానాలు కావు. కారణం? ఇవన్నీ నిన్నగాక మొన్న మనం కృత్రిమంగా ఏర్పరచుకున్న గ్రెగోరియన్ కాలెండర్ ను అనుసరిస్తూ ఉంటాయి.

లౌకికమైన లావాదేవీలకు తప్ప మీ 'డేట్ ఆఫ్ బర్త్'  కు ప్రకృతిపరంగా ఎటువంటి విలువా లేదు. అదే విధంగా, ప్రకృతికీ గ్రెగోరియన్ కాలెండర్ కూ ఎటువంటి సంబంధమూ లేదు. కాబట్టి దాని ఆధారంగా లెక్కించబడే వెస్టర్న్ న్యూమరాలజీకి తర్కబద్ధత లేదు. అది సత్యాన్ని ప్రతిబింబించదు. దీనికి పూర్తిగా విభిన్నమైనది  మన భారతీయ సంఖ్యాశాస్త్రము. ఇది ప్రకృతిపైన, నవగ్రహాలపైన ఆధారపడినది. కనుక సత్యమైన ఫలితాలనిస్తుంది.

నా పరిశోధనలో వెలుగుచూచిన ఈ సులభమైన విధానాన్ని 52 మంది ప్రముఖుల జాతకాల సహాయంతో తేలికగా సోదాహరణంగా ఈ పుస్తకంలో వివరించాను.

రామకృష్ణ పరమహంస, వివేకానందస్వామి, సిస్టర్ నివేదిత, పరమహంస యోగానంద, రమణ మహర్షి, జిల్లెళ్లమూడి అమ్మ, మెహర్ బాబా, అరవిందయోగి, ఓషో, జిడ్డు కృష్ణమూర్తి, యూజీ కృష్ణమూర్తి, ఆనందమయి మా వంటి మతప్రముఖుల జాతకాలతో బాటు, సుభాష్ చంద్ర బోస్, మోహన్ దాస్ గాంధీ, నాధూరాం గాడ్సే, జవహర్ లాల్ నెహ్రు, సర్దార్ పటేల్, ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు, ఎన్టీ రామారావు, నరేంద్రమోదీ, యోగి ఆదిత్యనాథ్, బెంజమిన్ నెతన్యాహు, రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు, విక్రమ్ సారాభాయ్, హరగోబింద్ ఖోరానా, సత్యేన్ద్రనాథ్ బోస్, యల్లాప్రగడ సుబ్బారావు, శ్రీనివాస రామానుజం, ఎలాన్ మస్క్, బిల్ గేట్స్, బ్రునీ సుల్తాన్, ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, వెంపటి చినసత్యం, శ్రీపాద పినాకపాణి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, హరిప్రసాద్ చౌరాసియా, పండిట్ రవిశంకర్, ఎమ్మెస్ సుబ్బులక్ష్మి, లతా మంగేష్కర్, కిషోర్ కుమార్, మహమ్మద్ రఫీ, తిరుమలై కృష్ణమాచార్య, బీకేఎస్ అయ్యంగార్, కృష్ణ పట్టాభి జాయిస్, కోడి రామ్మూర్తినాయుడు, దారాసింగ్, బ్రూస్ లీ, మాస్ ఒయామా, మైక్ టైసన్ మొదలైన సెలబ్రిటీల జాతకాలను ఈ సంఖ్యాశాస్త్ర పరంగా విశ్లేషించి చూపించాను.

ఈ విధానాన్ని అనుసరిస్తే, మీ జాతకాన్ని మీరే తేలికగా అర్ధం చేసుకోగలుగుతారు.

ఈ పుస్తకం వ్రాయడంలో నాకు సహాయపడిన నా శ్రీమతి సరళాదేవి, శిష్యులు అఖిల, లలిత, ప్రవీణ్, చావలి శ్రీనివాస్, మూర్తి, సంధ్యలకు నా ఆశీస్సులు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మా ఇతర పుస్తకాలలాగే ఈ పుస్తకం కూడా ఇక్కడ లభిస్తుంది.

చదివి చూడండి మీకే అర్ధమౌతుంది.