నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

7, నవంబర్ 2024, గురువారం

తిరుపతి లడ్డు నాణ్యతలో చెప్పుకోదగ్గ మార్పు రాలేదు

సెప్టెంబర్ లో తిరుపతి లడ్డు వివాదం బయటకు వచ్చింది. ఆ తరువాత క్రొత్తప్రభుత్వ హయాంలో చాలా మార్పులు జరిగాయని, లడ్డు నాణ్యతలో చాలా మార్పు వచ్చిందని మీడియాలో ప్రచారాలు వీడియోలు వచ్చాయి. నేను నిజమే అనుకున్నాను.

గత మూడు రోజులుగా తిరుమలలో ఉండి నిన్ననే తిరిగి వచ్చాను. నేను ప్రత్యక్షంగా లడ్డును రుచి చూచి చెబుతున్నాను.

లడ్డు నాణ్యతలో చెప్పుకోదగ్గ మార్పు రాలేదు.

ప్రచారపు ఆర్భాటం మాత్రం ఎక్కువగా ఉంది. నేటి ప్రభుత్వం చెబుతున్నట్లుగా లడ్డు తయారీలో వాడే పదార్ధాలలో మార్పులు వచ్చి ఉండవచ్చు. క్వాలిటీ పెరిగి ఉండవచ్చు. కానీ వారు చెబుతున్న మార్పులు ప్రజలకు కనిపించాలి కదా? అదెక్కడా కనిపించడం లేదు.

చాలా పాతకాలం నాటి లడ్డులో కర్పూరం ఘాటు, యాలక్కాయలు కనిపించేవి. కుంకుమ పువ్వు కూడా వాడేవారని అనేవారు. నేటి లడ్డులో అవేవీ లేకపోగా, ఉత్త పంచదార, శనగపిండి, నెయ్యి జిడ్డు తప్ప పాత రుచి ఏ మాత్రమూ రాలేదు. అందుకే ఈ మాటను చెబుతున్నాను. 

TTD గాని, నేటి ప్రభుత్వం గాని, ప్రచారం పైన పెడుతున్న దృష్టిని వాస్తవాల మీద కూడా పెడితే కాస్త బాగుంటుంది.

ఇదే విషయాన్ని helpdesk.ttd@tirumala.org కు మెయిల్ ద్వారా తెలియజేయడం జరిగింది.

ఇది నేనిచ్చిన మెయిల్.

Dear sir/s,

I visited Tirumala a few days back. I am sorry to say that the quality of Laddu has not improved despite the media buzz. There are no Karpur and Elakkai, not even remnants of them in the laddus I got.

You are a dharmic trust, please follow the Truth, not propaganda. I hope there will be real improvement in Laddu quality in the near future.

Regards,

వెంటనే నాకు తిరుగు మెయిల్ వచ్చింది. ఇది TTD నుంచి నాకొచ్చిన జవాబు.

Dear Pilgrim,

TTD management has restored the best quality ingredients and ghee to regain purity. Rest assured, there is no compromise in the purity, and pilgrims can confidently get the laddus without any doubts. However, your mail will be forwarded to the department concerned for perusal.

In the Service of Lord Venkateswara…!

రైల్వే సర్వీసులో ఉన్న రోజులలో ఇటువంటి కంప్లెయింట్లు, వాటికిచ్చే రొటీన్ జవాబులు కొన్ని వేలు నేను చూచాను. ఇవి ఉత్త రొటీన్ రిప్లైస్ అని, అక్కడ చర్యలేవీ ఉండవని కూడా నాకు స్వానుభవంలో బాగా తెలుసు. వీరిచ్చిన రిప్లైలో 'forwarded to the department concerned' అంటే 'into the dust bin' అని అర్ధం.

తిరుమలకు వెళ్లి వచ్చినవారు, 'మన దర్శనం అయిపోయిందిలే, మనకెందుకులే, వ్యవస్థను మనం మార్చలేములే, అంతా వెంకన్న చూసుకుంటాడులే' అని నిస్పృహ చెందకుండా, మీరు చూచిన అవినీతిని, మీకు జరిగిన అసౌకర్యాన్ని పై మెయిల్ అడ్రస్ కు స్పష్టంగా మెయిల్ ఇవ్వండి. లక్షలాది కోట్లాదిమంది ప్రజలు ఇలా చేస్తేనే కొంతకాకపోతే కొంతయినా ప్రభుత్వ వ్యవస్థలలో మార్పును ఆశించగలం.

మనం ఆశాజీవులం కదా ! మార్పు వస్తుందని, మంచి జరుగుతుందని ఆశిద్దాం. అదే సమయంలో మన వంతుగా మన ప్రయత్నం కూడా చేద్దాం.

ఏమంటారు?