దీనిలో అతి ప్రాచీనకాలం నాటి అవతారపురుషుడైన శ్రీకృష్ణభగవానుని నుండి మొదలుపెట్టి, గౌతమబుద్ధుడు, మహావీరుడు, ఆదిశంకరులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, చైతన్య మహాప్రభువు, శ్రీరామకృష్ణ పరమహంస, శారదాదేవి, వివేకానందస్వామి, రమణమహర్షి, మెహర్ బాబా, పరమహంస యోగానంద, అరవిందయోగి, కంచి పరమాచార్య, ఆనందమయి మా, నీంకరోలి బాబా, జిల్లెళ్ళమూడి అమ్మగారు మొదలైన 18 మంది నిజమైన మహనీయుల జాతకాలు మరియు వారివారి జీవితవిశేషాలు సమగ్రంగా వివరించబడ్డాయి.
జాతకవిశ్లేషణలో నేను ఉపయోగించే అనేక జ్యోతిషరహస్యాలు, సూత్రాలను ఈ గ్రంధంలో ఆయాచోట్ల విపులంగా వివరించడం జరిగింది.
వెరసి, ఈ గ్రంధం జ్యోతిషవిద్యార్ధులకు, జ్యోతిషాభిమానులకు, జ్యోతిషాన్ని నేర్చుకునేవారికి, మన దేశపు అసలైన చరిత్రను, నా పుస్తకాలను మరియు భావజాలాన్ని ఇష్టపడేవారికి ఒక విందుభోజనం వంటిది అవుతుందని నమ్ముతున్నాను.
ప్రపంచ జ్యోతిషచరిత్రలో ఇటువంటి పరిశోధనాగ్రంధం ఇప్పటివరకూ లేదని, ఇకముందు రావడం కూడా కష్టమని సగర్వంగా చెబుతున్నాను. ఈ గ్రంధాన్ని చదవాలంటే మీకు అదృష్టం ఉండాలని చెప్పడం సాహసం కాదు, సమంజసమే.
ఇది అనేక ఏళ్ల పరిశోధనా ఫలితం. ఇది నాకొక Lifetime Achievement వంటిది. ఎన్నో వందల గంటలు కష్టపడి, ఎంతో ప్రాచీన చరిత్రను పరిశోధన చేసి ఈ పుస్తకాన్ని వ్రాయడం జరిగింది.
దీని చిత్తుప్రతిని ఎన్నోసార్లు తిరగామరగా క్షుణ్ణంగా చదివి అనేకచోట్ల అవసరమైన సవరణలు సూచించడమే గాక, ప్రూఫ్ రీడింగ్ మరియు టైప్ సెట్టింగ్ చేసి దీనికొక రూపాన్నివ్వడానికి ఎంతో శ్రమించిన నా శిష్యురాలు అఖిల జంపాలకు నా హృదయపూర్వక ఆశీస్సులు తెలియజేస్తున్నాను.
జ్యోతిషశాస్త్రంలో నాదైన విశ్లేషణా విధానాన్ని అతి చిన్నవయసులోనే ఎంతో పట్టుదలతో శ్రద్ధతో నేర్చుకుని, దానిలో మంచి ప్రజ్ఞను సాధించిన అతి కొద్దిమందిలో ఈమె ఒకరు. ఈ పుస్తకరచనలో నాతో కలసి పనిచేసే అదృష్టం ఈమెకు దక్కింది.
పుస్తకరచనలో నిరంతరం నాకు తోడునీడగా ఉన్న నా సహధర్మచారిణి సరళాదేవికి, ఫౌండేషన్ పనుల్లోనూ, ఆశ్రమ నిర్వహణకు చెందిన అన్ని విషయాలలోనూ ఆసరాగా నిలబడుతున్న మూర్తి మరియు సంధ్యలకు, కవర్ పేజీలను ఎంతో అందంగా డిజైన్ చేసి ఇచ్చిన ప్రవీణ్ కు, పబ్లిషింగ్ పనులలో సహాయపడిన శ్రీనివాస్ చావలి, గణేష్ మరియు శ్రీలలిత మొదలైన నా ఇతర శిష్యులందరికీ ఆశీస్సులు.
ఈ పుస్తకం దాదాపు 800 పేజీలుగా వచ్చింది కనుక రెండు భాగాలుగా దీనిని ముద్రించడం జరిగింది. దీని 'ఈ బుక్' వెంటనే అందుబాటులో వస్తుంది. ప్రింట్ పుస్తకం మాత్రం ఈనెల 19 నుండి మొదలౌతున్న హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలోను, జనవరి 2 నుండి జరిగే విజయవాడ పుస్తక మహోత్సవంలోనూ, మా 'పంచవటి స్టాల్' లో మాత్రమే లభిస్తుంది. బుక్ ఫెయిర్ అయిపోయిన తర్వాత, పోస్ట్ ద్వారా యధావిధిగా ఇక్కడ లభిస్తుంది.
అంతర్జాతీయ పాఠకుల కోసం త్వరలో దీని ఇంగ్లీష్ అనువాదం కూడా విడుదల అవుతుంది.
ఔత్సాహికులైన పాఠకులు, జ్యోతిషశాస్త్ర విద్యార్థులు, చరిత్ర అభిమానులు, నా రచనల అభిమానులు, సనాతన ధర్మానుయాయులు ఈ సువర్ణావకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను.