నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

21, ఫిబ్రవరి 2025, శుక్రవారం

శ్రీ సూక్తులు

'కుంభమేళా కెళ్ళొచ్చా' అన్నాడొకడు

'కుంభం లాంటి ఆ పొట్ట తగ్గించు ముందు' అన్నాను.


'కుండలినీ యోగం నేర్చుకుంటున్నా' అన్నాడొకడు

'బండలాంటి నీ గుండెను ముందు మెత్తగా మార్చు' అన్నాను.


'సుషుమ్నా క్రియను అభ్యాసం చేస్తున్నా' అన్నాడింకొకడు

'కర్మ ఎలా చేయాలో ముందు నేర్చుకో. క్రియలు అవే జరుగుతాయి' అన్నాను.


'నా కుండలిని నిద్ర లేచింది ' అన్నాడొకడు

' నాదస్వరం సరిగా ఊదు. లేకపోతే కాటేస్తుంది ' అన్నాను


'బాబాజీ క్రియాయోగంలో దీక్ష తీసుకున్నా' అన్నాడు మరోవాడు. 

'ఆయనెప్పుడో పోయాడు. ఇంకెన్నాళ్లు బ్రతికిస్తారు?' అడిగాను


'మాది అద్వైతమార్గం' అంది ఒకామె.

'ఆ చెప్పడంలోనే తెలుస్తోంది మీ అద్వైతం' అన్నాను.


'నేను శ్రీవిద్యోపాసకురాలిని' అని ఇంకొకామె.

'పాసనాలు తగ్గడానికి ముందు మందేసుకో' అన్నాను


'మాది పెద్దలమార్గం' అన్నాడింకొకడు.

'వాళ్ళు తాగినవి నేతులా? డాల్డానా?' అడిగాను


' ఏ సాధనా అక్కర్లేదు' అంది ఇంకొకామె

'ఏమీ సాధించలేని జీవితం అంతే అంటుంది' అన్నాను


'సూక్ష్మలోకాలు చూశా' అన్నాడు ఇంకో మానవుడు

'ఈ లోకాన్ని సరిగ్గా చూడు ముందు' అన్నాను


'ఆత్మలతో మాట్లాడతా' అంది ఇంకో జీవి. 

'ముందు నీ పెళ్ళాంతో రోజూ కాసేపు మాట్లాడు' అన్నాను


'మాతాజీ నైపోయా' అంది ఎర్రచీర కట్టుకున్న ఒక పతివ్రత

'బాగా ముదిరింది, తగ్గడం కష్టం' అన్నాను

read more " శ్రీ సూక్తులు "

కాగితపు పడవలు

అంతర్జాలపు విషంతో

మెదళ్ళు నిండిపోతున్నాయి 

మనుషుల సమాజంలో

జంతువులు పెరిగిపోతున్నాయి


అహంకారాల బురదలతో

హృదయాలు కుళ్ళిపోతున్నాయి

అతితెలివి బ్రతుకులతో

వయసులు మళ్లిపోతున్నాయి


డబ్బు వెంట పరుగులలో

జీవితాలు చెల్లిపోతున్నాయి

బాంధవ్యాలు ఆవిరైపోతూ

జ్ఞాపకాలను చల్లిపోతున్నాయి


ఆధ్యాత్మికపు ముసుగులలో

ఆవేశాలు చల్లారుతున్నాయి

అజ్ఞానపు ఆకర్షణలతో

అవరోధాలు ఊరేగుతున్నాయి


మురికిగుంటల దారులలో

నీటిచెలమలెందుకుంటాయి?

బండరాళ్ళ కనుమలలో

నదుల జాడలెందుకుంటాయి?


వరద ముంచుకొస్తుంటే

కాగితపు పడవలెలా ఆదుకుంటాయి?

ఊర్లు తగలబడుతుంటే

ఉత్తమాటలెలా అక్కరకొస్తాయి?

read more " కాగితపు పడవలు "

17, ఫిబ్రవరి 2025, సోమవారం

చేపల పాపం

నీళ్లలో మునిగితే పాపాలు పోతాయని

చేపలంటున్నాయి

ఎడారిలో ఎగిరితే పాపాలు పోతాయని

కొంగలంటున్నాయి


చేపలను కొంగలు తింటున్నాయి

కొంగలు వలల్లో పడుతున్నాయి

వలలు ఎండకు చివికిపోతున్నాయి


చేపలూ కొంగలూ వలలూ పోయాక

పాపం !

పాపం అడుగుతోంది

'నేనెలా పోతాను?' అని

read more " చేపల పాపం "

2, జనవరి 2025, గురువారం

విజయవాడ బుక్ ఫెస్టివల్ - 2025 లో పంచవటి స్టాల్ మొదలైంది




నేటి నుండి 12 వ తేదీ వరకూ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం గ్రౌండ్స్ లో జరిగే బుక్ ఫెస్టివల్ లో 'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' కు స్టాల్ నంబరు  219  కేటాయించబడింది.

నేడు విజయవాడ పంచవటి బృందంతో మా స్టాల్ ప్రారంభించబడింది. ఆ ఫోటోను ఇక్కడ చూడవచ్చు.

1992-1995 మధ్యలో నేను విజయవాడలో ఉన్నసమయం లోనూ, ఆ తరువాత కూడా గుంటూరులో ఉన్నంతవరకూ వీలైనప్పుడల్లా ప్రతి ఏడాదీ తప్పకుండా ఈ పుస్తకమహోత్సవాన్ని సందర్శించేవాడిని. అప్పట్లో PWD గ్రౌండ్స్ లో ఎంతో శోభాయమానంగా ఈ బుక్ ఫెస్టివల్ జరిగేది. విజయవాడ మొత్తానికీ ఆ పదిరోజులు పండుగలుగా ఉండేది. పుస్తకాభిమానులందరూ అక్కడ చేరేవారు. కానీ, గతప్రభుత్వం ఆ గ్రౌండ్ ను మార్చేసిన తర్వాత, ఆ వైభవం తగ్గిపోయింది. ఇప్పుడు బుక్ ఫెస్టివల్ ఎక్కడ పెట్టాలో తెలీక, గ్రౌండ్ కోసం వెతుక్కునే పరిస్థితి పట్టింది.

అయినా సరే, పుస్తక మహోత్సవాన్ని ఎక్కడో ఒక గ్రౌండ్ లో పెడుతున్నారు. పుస్తకాభిమానులు వెతుక్కుంటూ వెళ్లి సందర్శిస్తున్నారు. నెట్ ప్రభావంతో పుస్తకాలను చదవడం తగ్గినప్పటికీ, మొబైల్ దెబ్బకు తట్టుకుని పుస్తకం ఇంకా బ్రతికే ఉందని నిరూపిస్తున్నారు.

ఈ పదిరోజులలో ఏదో ఒకరోజున నేను కూడా విజయవాడ బుక్ ఫెస్టివల్ ను సందర్శిద్దామని అనుకుంటున్నాను.

ఈ స్టాల్లో మా పుస్తకాలన్నీ లభిస్తాయి. నా రచనలను అభిమానించే విజయవాడ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అక్కడ మా ఫౌండేషన్ సెక్రటరీ శ్రీ రామమూర్తిగారిని, ఇతర సభ్యులను కలుసుకోవచ్చు. మా సాధనామార్గం మీద గాని, జనరల్ గా ఆధ్యాత్మికమార్గం పైనగాని మీకున్న సందేహాలను తీర్చుకోవచ్చు.

బుక్ ఫెస్టివల్ మధ్యాహ్నం నుండి రాత్రి 8. 30 వరకూ ఉంటుంది. గమనించండి.

read more " విజయవాడ బుక్ ఫెస్టివల్ - 2025 లో పంచవటి స్టాల్ మొదలైంది "