'కుంభమేళా కెళ్ళొచ్చా' అన్నాడొకడు
'కుంభం లాంటి ఆ పొట్ట తగ్గించు ముందు' అన్నాను.
'కుండలినీ యోగం నేర్చుకుంటున్నా' అన్నాడొకడు
'బండలాంటి నీ గుండెను ముందు మెత్తగా మార్చు' అన్నాను.
'సుషుమ్నా క్రియను అభ్యాసం చేస్తున్నా' అన్నాడింకొకడు
'కర్మ ఎలా చేయాలో ముందు నేర్చుకో. క్రియలు అవే జరుగుతాయి' అన్నాను.
'నా కుండలిని నిద్ర లేచింది ' అన్నాడొకడు
' నాదస్వరం సరిగా ఊదు. లేకపోతే కాటేస్తుంది ' అన్నాను
'బాబాజీ క్రియాయోగంలో దీక్ష తీసుకున్నా' అన్నాడు మరోవాడు.
'ఆయనెప్పుడో పోయాడు. ఇంకెన్నాళ్లు బ్రతికిస్తారు?' అడిగాను
'మాది అద్వైతమార్గం' అంది ఒకామె.
'ఆ చెప్పడంలోనే తెలుస్తోంది మీ అద్వైతం' అన్నాను.
'నేను శ్రీవిద్యోపాసకురాలిని' అని ఇంకొకామె.
'పాసనాలు తగ్గడానికి ముందు మందేసుకో' అన్నాను
'మాది పెద్దలమార్గం' అన్నాడింకొకడు.
'వాళ్ళు తాగినవి నేతులా? డాల్డానా?' అడిగాను
' ఏ సాధనా అక్కర్లేదు' అంది ఇంకొకామె
'ఏమీ సాధించలేని జీవితం అంతే అంటుంది' అన్నాను
'సూక్ష్మలోకాలు చూశా' అన్నాడు ఇంకో మానవుడు
'ఈ లోకాన్ని సరిగ్గా చూడు ముందు' అన్నాను
'ఆత్మలతో మాట్లాడతా' అంది ఇంకో జీవి.
'ముందు నీ పెళ్ళాంతో రోజూ కాసేపు మాట్లాడు' అన్నాను
'మాతాజీ నైపోయా' అంది ఎర్రచీర కట్టుకున్న ఒక పతివ్రత
'బాగా ముదిరింది, తగ్గడం కష్టం' అన్నాను