నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

25, మార్చి 2025, మంగళవారం

6 వ సాధనా సమ్మేళనం విశేషాలు






















ప్రపంచం 
చీకటిని వెలుగుగా భ్రమిస్తూ
ముందుకు పోతోంది.
మా ఆశ్రమంలో
వెలుగుదారులు విరబూస్తున్నాయి.

సాధనాసమ్మేళనంలో జరిగిన సమావేశాలలో ముఖ్యంగా కొన్నింటిని ఇక్కడ పరిచయం చేస్తున్నాను.

జ్యోతిషసమ్మేళనం

వారం రోజులలో జరుగబోతున్న శనీశ్వరుని రాశిమార్పు యొక్క ఫలితాలను శిష్యులకు వివరించాను. అదేసమయంలో అమావాస్య జరుగుతున్నది. జనజీవనంలో ఇది చాలా మార్పులను తెస్తుంది. చాలామందికి కోలుకోలేని దెబ్బలు తగులబోతున్నాయి. శిష్యులలో ఎవరెవరికి ఏయే ఫలితాలు జరుగుతాయో సూచించి, వాటికి తీసుకోవలసిన యోగపరమైన రెమెడీలను వివరించాను.

లోకంలో మీరు చూచే చీప్ రెమెడీలు నా వద్ద ఉండవు. మావి యోగపరమైన రెమెడీలు. ఇవి ప్రభావవంతమైన శాశ్వతఫలితాలనిస్తాయి. డబ్బుకు అమ్మబడేవి కావు. ఇంతకు ముందైతే ఈ శనీశ్వరుని రాశిమార్పు పైన ఒక పెద్ద పోస్ట్ వ్రాసి ఉండేవాడిని. ఇప్పుడు తెలివి తెచ్చుకున్నాను గనుక అటువంటి పనులు చేయడం లేదు. వజ్రాలను రోడ్డుపైన వెదజల్లడం ఎందుకు? అర్హులైనవారికి మాత్రమే వాటిని అందించాలి. అందుకే బ్లాగు బురదలోకంలో వాటిని వ్రాయడం తగ్గించాను. ఎవరికి అర్హత ఉందో వారికి మాత్రమే వాటిని ప్రస్తుతం అందిస్తున్నాను.

'భగవద్గీతా కందమరందము' విడుదల

శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయిగారు, న.ర.సం (నవ్యాంధ్ర రచయిత్రుల సంఘానికి) ఉపాధ్యక్షురాలు. ఈమె నా శిష్యురాలు. మంచి కవయిత్రి. వేంకటేశ్వరస్వామివారికి వీరభక్తురాలు. తెలుగు మరియు సంస్కృత భాషలలో MA చేసిన ఈమె, పద్యాలను అలవోకగా ఆశువుగా చెప్పడంలో సిద్ధహస్తురాలు. వీరి కుటుంబంలోనే కవిత్వధోరణి ఉంది.

ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాడిన భగవద్గీత మీకందరికీ సుపరిచితమే. దానిలో ఆయన 108 శ్లోకాలను పాడారు. వాటన్నిటినీ 150 కందపద్యాలలో జ్యోతిర్మయిగారు తెలుగులో చక్కగా వ్రాశారు. ఆ పుస్తకానికి 'భగవద్గీతా కందమరందము' అని పేరుపెట్టి, ఎంతో గురుభక్తితో నాకు అంకితమిచ్చారు. ఆ కార్యక్రమం ఈ సాధనాసమ్మేళనంలో జరిగింది. త్వరలో ఈ గ్రంధాన్ని మా పంచవటి పబ్లికేషన్స్ నుండి పుస్తకంగా ప్రచురిస్తున్నాము.

గతస్మృతులు

శ్రీ రధం మదనాచార్య, ప్రముఖ పంచాంగకర్త మరియు తెలుగు యూనివర్సిటీ జ్యోతిషవిభాగ ఆచార్యులు మా సభ్యులే. స్వతంత్రంగా గణితం చేసి పంచాంగాన్ని వ్రాయగల సిద్ధహస్తులలో ఈయనొకరు. 

నేను 2000 సంవత్సరం మొదటి బ్యాచ్ లో MA  జ్యోతిషం చేశాను. ఈయన మూడవ బ్యాచ్ లో  చేశారు. ఆ తరువాత వేదాంగజ్యోతిషంలో పీహెచ్ డీ కూడా చేసి డాక్టరేట్ పొందారు. ఇద్దరం శ్రీ గోరస వీరభద్రాచారి గారి శిష్యులమే. MA చేసిన సమయంలో నన్ను ఇంటర్వ్యూ చేసినది శ్రీ గోరస గారే. వారంటే నాకు చాలా అభిమానం మరియు గౌరవం. వారి ప్రియశిష్యులే రథంగారు కావడం. మళ్ళీ మేమిలా కలుసుకోవడం చాలా సంతోషాన్ని కలిగించింది. 80 ఏళ్ల పెద్దవయసైనా కూడా అమిత వినయశీలి. జ్ఞానపిపాసి. నా రచనలను ఎంతో అభిమానిస్తారు. నా పుస్తకం, 'మహనీయుల జాతకాలు - జీవిత విశేషాలు' ను ఎంతో మెచ్చుకున్న జ్యోతిషవేత్తల్లో ఈయనొకరు. తనవద్ద జ్యోతిషశాస్త్రాన్ని నేర్చుకునే ప్రతివారికీ ఈ పుస్తకాన్ని, నా రచనలను తప్పకుండా చదవమని ఈయన సూచిస్తూ ఉంటారు. 'మీరు పరిచయం కావడం నా అదృష్టం' అని ఈ నిగర్వి తరచూ అంటూ ఉంటారు. స్వయంగా జ్యోతిషశాస్త్ర డాక్టరేట్ అయి, యూనివర్సిటీలో ఆచార్యులై ఉండి కూడా, గర్వం లేకుండా, నా వద్ద జ్యోతిషశాస్త్రపు లోతులను నేర్చుకోవాలని ప్రయత్నించే మనసున్న మనీషులలో ఈయనొకరు. శ్రీ రధం మదనాచార్యగారు ప్రచురించిన ప్రస్తుత సంవత్సరపు పంచాంగమును ఇక్క చూడండి.

రిట్రీట్లో కొంచెం తీరిక దొరికినపుడు గత స్మృతులను కలబోసుకున్నాం.  గోరస గారితో తన అనుభవాలను ఆయన చెప్పుకొచ్చారు. గోరసగారికి అంజనసిద్ధి ఉండేది. ఒకసారి ఆయనతో హంపీకి వెళ్లిన సమయంలో, అక్కడ విరూపాక్ష ఆలయం దగ్గరలో ఒక ప్రదేశంలో, 'ఇది కృష్ణదేవరాయలు అష్టదిగ్గజాలతో కవిత్వసభ నడిపిన ప్రాంతం. ఎవరైనా చూస్తామంటే ముందుకు రండి' అని ఆయనన్నారట.  ఎవరూ ధైర్యం చేయలేదు. కానీ ఒక అబ్బాయి ముందుకొచ్చాడు. మంత్రించిన విభూతిని ఆ అబ్బాయి కళ్ళను తాకించారు గోరసవారు. వెంటనే కృష్ణదేవరాయల భువనవిజయం దృశ్యం ఆ అబ్బాయి కళ్ల ముందు కనిపించడం మొదలుపెట్టింది. కాసేపు చూచాక, ఆ విభూతిని తుడిచేశారు. వెంటనే ఆ దృశ్యం ఆగిపోయింది. 'ఈ సంఘటనకు ప్రత్యక్షసాక్షిని నేనే' అని రధంగారు నాతో అన్నారు.

అసలైన యోగశాస్త్రం

నేటి నకిలీసమాజంలో ప్రతివాడూ ఒక గురువే. యోగశాస్త్రం 'యోగా' అని కూచుంది. పార్కులలో, క్లబ్బులలో, జిమ్ములలో చేయబడే అధమస్థాయికి చేరుకుంది. అసలైన యోగశాస్త్రం అది కాదు. అసలైన సర్వసమగ్ర సాధనామార్గం మావద్ద మాత్రమే ఉందని ఎన్నోసార్లు గతంలో చెప్పాను. దీనిని అహంకారంగా చాలామంది భావించారు. అహంకారం కాదు, సత్యమని మళ్ళీమళ్ళీ చెబుతున్నాను. వాస్తవాలు అలాగే కనిపిస్తాయి. రుచిచూస్తేనే దేని రుచైనా తెలుస్తుంది. దూరంనుండి ఎలా తెలుస్తుంది? అయితే,  ఒకరికి అర్ధం కానంతమాత్రాన మాకొచ్చిన నష్టమేమీ లేదు. 

సభ్యులలో కొందరు ఆల్ఫాస్టేట్ ఎలా ఉంటుందో రుచి చూస్తామన్నారు. మా సాధనామార్గంలో, ఆల్ఫాస్టేట్ (యోగనిద్ర) చాలా మొదటిస్థాయిలోనే వస్తుంది.  కొద్దిపాటి అభ్యాసంతో వారిని దానిలోకి పంపించాను. ఆ స్థితిలో శిష్యులున్న ఫోటోలను ఇక్కడ చూడండి.

రాబోయే రిట్రీట్ వరకూ అభ్యాసం చేయవలసిన యోగవిధానాలను శిష్యులకు నేర్పించాను.

సందేహాలు - సమాధానాలు

పనికిరాని ఊకదంపుడు ఉపన్యాసాలంటే నాకు చిరాకు. మనం ఏది మాట్లాడినా ప్రాక్టికల్ గా ఉపయోగపడాలి. మనిషిని జీవితంలో ముందుకు నడిపించే విధంగా ఉండాలి. అందుకే నా శిష్యుల సాధనాజీవితంలో ఎదురౌతున్న సమస్యలకు, సందేహాలకు జవాబులు చెప్పడం, వాటిని పరిష్కరించడం పైనే నేనెక్కువ శ్రద్ధ పెడతాను. అందుకే దీనికి ఎక్కువ సమయాన్ని కేటాయించాము.

కర్మయోగం

ఆశ్రమం తోటలో పనిచేయడం శిష్యులకు సరదా. అదే పనిని కర్మయోగంగా చేయమని నేను చెబుతాను. ఈ మూడు రోజులూ అందరూ కలసి వారికిష్టమైన తోటపనిని ఆడుతూ  పాడుతూ ఆనందంగా చేశారు.

జ్యోతిష్యశాస్త్ర చర్చలు, ధ్యానాభ్యాసం, యోగశిక్షణ, కర్మయోగం, గ్రంథావిష్కారం, శిష్యుల భావావిష్కరణ, సందేహాలు సమాధానాలు, అభిప్రాయాల కలబోత, కులమతాలకు అతీతంగా మానవత్వ భావనతో అందరూ కలసిమెలసి జీవించడం, చివరలో బరువెక్కిన హృదయాలతో వీడ్కోలు తీసుకోవడం,  జూలైలో జరుగబోయే గురుపూర్ణిమ సాధనా సమ్మేళనానికి సిద్ధం కావడం - వీటితో 6 వ సాధనా సమ్మేళనం విజయవంతంగా ముగిసింది.
read more " 6 వ సాధనా సమ్మేళనం విశేషాలు "

21, మార్చి 2025, శుక్రవారం

మా ఆశ్రమంలో 6 వ సాధనా సమ్మేళనం మొదలు



నేడు మార్చి 21ఈక్వినాక్టియల్ డే 

మన భాషలో చెప్పుకుంటే, వసంత విషువత్ దినం. ఈరోజున సూర్యుడు  సరిగ్గా భూమధ్యరేఖపైన ఉంటాడు. కనుక,  భూమిపైన పగలూ రాత్రీ సమానంగా ఉంటాయి. చూడగలిగేవాళ్లకు ప్రకృతిలో అంతటా నేడు సమత్వం కనిపిస్తుంది. అందుకే నేటినుండి మూడు రోజులపాటు పంచవటి ఆశ్రమంలో సాధనాసమ్మేళనం మొదలైంది.

మా విధానం ప్రత్యేకత ఏమిటి?

కులాల కుళ్ళుకూ, మతాల మత్తుకూ, పూజల పుచ్చులకూ, ఆచారాల మెచ్చులకూ, ఫకీర్ల గుళ్ళకూ, రాక్షసదీక్షల బళ్లకూ, మైకుల గోలకూ, టీవీల జోలకూ, పాండిత్య ప్రదర్శనలకూ, వ్యాపార విమర్శనలకూ, మెట్ట వేదాంతాలకూ, పొట్ట వైరాగ్యాలకూ, ఈజీచెయిర్ తీర్పులకూ, లేజీలైఫ్ కూర్పులకూ, వీటన్నింటికీ భిన్నమైన, అసలైన, సర్వసమగ్ర సనాతన సాధనామార్గాన్ని, కులంతో, ధనంతో, ఆస్థిఅంతస్థులతో సంబంధం లేకుండా, అందరికీ సమానంగా బోధించే మహత్కార్యంలో భాగంగా ఈ సాధనాసమ్మేళనం జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్ లోని ఒక మారుమూలగ్రామంలో ఈ ఆధ్యాత్మికవిప్లవం నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంటోంది. అనుసరించేవారు, ఆచరించేవారు, పాలుపంచుకుంటున్నవారు అదృష్టవంతులు.

విపక్షుల గురించి చెప్పడానికేముంది? అవి పక్షులే.

read more " మా ఆశ్రమంలో 6 వ సాధనా సమ్మేళనం మొదలు "