నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

21, మార్చి 2025, శుక్రవారం

మా ఆశ్రమంలో 6 వ సాధనా సమ్మేళనం మొదలు



నేడు మార్చి 21ఈక్వినాక్టియల్ డే 

మన భాషలో చెప్పుకుంటే, వసంత విషువత్ దినం. ఈరోజున సూర్యుడు  సరిగ్గా భూమధ్యరేఖపైన ఉంటాడు. కనుక,  భూమిపైన పగలూ రాత్రీ సమానంగా ఉంటాయి. చూడగలిగేవాళ్లకు ప్రకృతిలో అంతటా నేడు సమత్వం కనిపిస్తుంది. అందుకే నేటినుండి మూడు రోజులపాటు పంచవటి ఆశ్రమంలో సాధనాసమ్మేళనం మొదలైంది.

మా విధానం ప్రత్యేకత ఏమిటి?

కులాల కుళ్ళుకూ, మతాల మత్తుకూ, పూజల పుచ్చులకూ, ఆచారాల మెచ్చులకూ, ఫకీర్ల గుళ్ళకూ, రాక్షసదీక్షల బళ్లకూ, మైకుల గోలకూ, టీవీల జోలకూ, పాండిత్య ప్రదర్శనలకూ, వ్యాపార విమర్శనలకూ, మెట్ట వేదాంతాలకూ, పొట్ట వైరాగ్యాలకూ, ఈజీచెయిర్ తీర్పులకూ, లేజీలైఫ్ కూర్పులకూ, వీటన్నింటికీ భిన్నమైన, అసలైన, సర్వసమగ్ర సనాతన సాధనామార్గాన్ని, కులంతో, ధనంతో, ఆస్థిఅంతస్థులతో సంబంధం లేకుండా, అందరికీ సమానంగా బోధించే మహత్కార్యంలో భాగంగా ఈ సాధనాసమ్మేళనం జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్ లోని ఒక మారుమూలగ్రామంలో ఈ ఆధ్యాత్మికవిప్లవం నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంటోంది. అనుసరించేవారు, ఆచరించేవారు, పాలుపంచుకుంటున్నవారు అదృష్టవంతులు.

విపక్షుల గురించి చెప్పడానికేముంది? అవి పక్షులే.