దుకాణం దగ్గర గుడి పూజారి కలిశాడు.
'ఊర్లోకొచ్చారు కదా ! మా ఇంటికెళదాం రండి. కాఫీ త్రాగుతూ మాట్లాడుకుందాం' అన్నాడు మర్యాదగా.
'లేదండి. నేను త్రాగను, ఇంకోసారి వస్తాలెండి మీ ఇంటికి' అన్నాను.
'గుడికి రండి. రాత్రి పదకొండుదాకా భజన చేస్తారు' అన్నాడాయన.
'అవన్నీ చిన్నప్పుడే అయిపోయాయి. క్రొత్తగా ఇప్పుడెందుకు?' అన్నాను
ఆశ్చర్యంగా చూశాడాయన.
'అయినా, అంత రాత్రిపూట భజనలు చేయకూడదు. రాత్రిళ్ళు పూజలు చేసేది రాక్షసులు. పైగా శబ్దకాలుష్యం. ఆ టైంకి మేమొక నిద్రతీసి లేస్తాం' అన్నాను.
మళ్ళీ ఆశ్చర్యంగా చూశాడాయన.
'ఏదైనా వేళకి చెయ్యాలి. అలా చేయకపోవడమే రోగాలకు ఒక కారణం' అన్నాను.
ఆయనలా చూస్తున్నాడు.
'ధర్మాన్ని మనం అనుసరించాలి. మనం చేసే ప్రతిదీ ధర్మం అనుకోకూడదు' అన్నాను
ఇంకా అలాగే చూస్తున్నాడాయన.
నేనొచ్చేశాను.