Once you stop learning, you start dying

13, ఏప్రిల్ 2025, ఆదివారం

అశాంతి నిలయం

'ఆ మధ్యన అమెరికా నుండి కొంతమంది స్నేహితులొస్తే అశాంతినిలయం వెళ్ళొచ్చాము' అన్నదొక శిష్యురాలు. 

'అమెరికా - అశాంతినిలయం, ప్రాస బాగుందిగాని, విషయం చెప్పు' అన్నాను.

'పటాటోపం తప్ప అక్కడేమీ లేదు' అందామె.

'ఇరవై ఏళ్ళనుంచీ నేనుకూడా ఇదే చెబుతున్నాను' అన్నాను ప్రాస కలుపుతూ.

'వాలంటీర్లకూ భక్తులకూ మా ఎదురుగానే గొడవైంది' అన్నదామె. 

'వాలంటీర్లకు వాలం ఉందా?' అడిగాను.

'అర్ధం కాలేదు' అంది 

'పోనీ భక్తులకు రెక్కలున్నాయా?' అడిగాను.

'మళ్ళీ అర్ధం కాలేదు' అంది 

'వాలం అంటే తోక, తోక ఉన్నవారే వాలంటీర్లు. అంటే కోతులు. బకము అంటే కొంగ. నేటి భక్తులందరూ బకులే. అంటే  కొంగజపం చేసే అవకాశవాదులన్నమాట. గట్టిగా అదిలించామంటే తుర్రున ఎగిరిపోతారు. మరి కోతులూ కొంగలూ ఒకచోట చేరితే అశాంతినిలయం కాక ఇంకేమౌతుంది? అడిగాను.

'మరి స్వామి ఏం చేస్తున్నట్టు?' అనుమానమొచ్చింది శిష్యురాలికి.

'ఉన్నప్పుడేం చేశాడు ఇప్పుడు చెయ్యడానికి?' అడిగాను.

'మళ్ళీ అర్ధం కాలేదు' అంది

'విచారణ జరుగుతోంది. బోనులో నిలబడి ఉన్నాడు' అన్నాను.

'ఏంటో మీ మాటలేవీ అర్ధం కావు' అందామె.

'కొన్ని అర్ధం కాకపోవడమే మంచిది' అన్నాను.