Once you stop learning, you start dying

28, ఏప్రిల్ 2025, సోమవారం

సనాతనధర్మం

మొన్న కొంతమంది మా ఆశ్రమాన్ని చూడటానికి వచ్చారు.

కాసేపు కూర్చుని సేదతీరాక, వారిలో ఒకాయన, 'నేను సాయిబాబా ఆలయాల కమిటీకి ప్రెసిడెంట్ ను' అని పరిచయం చేసుకున్నాడు.

జాలిగా ఆయనవైపు చూశాను.

'ముప్పై ఏళ్ళనుంచీ ఇదే మార్గంలో ఉన్నాను' అన్నాడాయన.

ఏడుపొచ్చింది.

'పంచవటి' అని బోర్డుమీద ఉంది. పంచవటి అంటే నాసిక్ దగ్గర కదా?' అన్నాడాయన.

'అవును. వనవాసం సమయంలో సీతారామలక్ష్మణులు ఉన్న ప్రదేశం పేరే పంచవటి. అంతేకాదు, రామకృష్ణులు సాధన చేసిన ప్రదేశం పేరు కూడా అదే' అన్నాను.

'యోగాశ్రమం అని ఉంది. మీరు యోగా నేర్పిస్తారా?' అడిగాడాయన.

'మీరనుకునే యోగా, మాకు తెలిసిన యోగశాస్త్రంలో ఎల్కేజీ మాత్రమే' అన్నాను.

ఆయనకు అయోమయంగా ఉంది.

'మీరు ఇస్కాన్ భక్తులా?' అడిగాడాయన.

'మేము కృష్ణభక్తులమే. కానీ ఇస్కాన్ భక్తులం కాదు. వాళ్ళ పిడివాదం మాకు నచ్చదు' అన్నాను. 

'ఎవరైనా వాళ్ళ ఊరిలో సద్గురువు ఆలయాన్ని కట్టుకుంటామంటే, సాయిబాబా గుడి ఎలా కట్టాలో అదంతా నేను సలహాలిస్తుంటాను' అన్నాడాయన.

'హిందూమతంలో ఉండటం ఎందుకు? ఇస్లాం స్వీకరించండి' అందామనుకున్నా.

'సనాతనధర్మాన్ని కాపాడటానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి కదా?' అన్నాడాయన.

'సనాతనధర్మానికి సాయిబాబాకూ ఏంటి సంబంధం?' అడిగాను.

ఆయన మాటలు ఆగిపోయాయి.

'సద్గురువుకు ఆలయం కట్టాలంటే ఆదిశంకరుల ఆలయాన్నో, రామానుజుల ఆలయాన్నో, మధ్వాచార్యుల ఆలయాన్నో, లేక ఈ మూడుభావనలనూ సమన్వయం చేసిన రామకృష్ణుల ఆలయాన్నో కట్టాలి. అసలు సాయిబాబా సద్గురువు ఎలా అవుతాడు?' అడిగాను.

సాయిబాబా పేరు చెబుతూనే నేనుకూడా అందరిలాగా డంగై పోయి, కాళ్ళు పట్టుకుంటానని అనుకున్నట్టున్నారు. నేనలా లేకపోయేసరికి వాళ్లకేం అనాలో తోచలేదు.

'సద్గురువైనవాడు శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయి ఉండాలని వేదం చెబుతోంది. సాయిబాబా ఈ రెండూ కాదు. మరి ఆయన సద్గురువేంటి?' అడిగాను.

'మీరెవరిని పూజిస్తారు?' ప్రశ్నలు మొదలయ్యాయి.

'ధ్యానమందిరానికి వెళ్లి చూడండి. తెలుస్తుంది' అన్నాను.

'అక్కడ రామకృష్ణుల ఫోటో ఉంది' అన్నాడు.

'ఇంకా చాలామంది ఫొటోలున్నాయి. వివేకానందస్వామి, రమణమహర్షి, జిల్లెళ్ళమూడి అమ్మగారు, మెహర్ బాబా, అరవిందులు, కంచి పరమాచార్య, మా గురువులు ఇలా చాలా ఉన్నాయి. అన్నింటినీ మించి, కలకత్తా కాళీమాత ఫోటో ఉంది. కనిపించలేదా?' అడిగాను.  

'మీది రామకృష్ణా మిషనా?' మళ్ళీ ప్రశ్న.

'మాది ఏ మిషనూ కాదు. మాదగ్గర వాషింగ్ మిషను తప్ప ఇంకేమీ లేదు. అక్కడున్న ఫోటోలలో ఉన్నవారి సంస్థలతో దేనితోనూ మాకు సంబంధం లేదు. కేవలం వారి ఉదారభావాలు మాత్రం మాకు నచ్చుతాయి. వాటిలో కూడా అన్నీ నచ్చవు. ప్రాచీన ఋషిప్రోక్తమైన వేదాంత-యోగభావాలతో కలిసినంతవరకూ ఎవరిభావాలైనా మాకు నచ్చుతాయి. కలవకపోతే నచ్చవు. వాటిని బోధించిన అసలైన మహనీయులను అందరినీ మేము ఆరాధిస్తాము' అన్నాను, 'అసలైన' అనే పదాన్ని వత్తి పలుకుతూ.

'సేవా కార్యక్రమాలు ఏమీ చెయ్యరా?' అడిగాడాయన.

'సమాజసేవ పైన మాకు నమ్మకం లేదు. దానిపేరుతో చేయబడే వ్యాపారం కంటే, ఆత్మసేవే ముఖ్యమని నా ఉద్దేశ్యం. అందుకే ఏ విధమైన సేవనూ మేము పెట్టుకోలేదు. నా ఉద్దేశంలో సేవ అనేది అసలిప్పుడెవరికీ అవసరం లేదు' అన్నాను.

వారు చేస్తున్న 'సేవ' గురించి చెప్పడం ఆయన మొదలుపెట్టాడు.

'ఏడాదికొకసారి ఊరంతా తిరిగి లారీడు బియ్యం పోగుచేసి అందరికీ అన్నదానం చేస్తుంటాము' అన్నాడాయన.

'అందరూ డబ్బులేసుకుని అందరూ కూచుని తింటే అది పార్టీ అవుతుందిగాని అన్నదానం ఎలా అవుతుంది? అసలు దానమంటే ఏమిటి? అది ఎవరికి అవసరం?' అన్నాను.

ఆయనకు కోపం వచ్చింది. అయినా తమాయించుకుని, 'పిల్లలకు భగవద్గీత పోటీలు పెడుతుంటాము' అన్నాడు.

'పోటీలు పెట్టడానికి అదొక గేమ్ కాదు. పోటీలతో భగవద్గీత ఎన్నటికీ అర్ధం కాదు. ముందు పెద్దలు దానిని సరిగ్గా అర్ధం చేసుకుంటే తరువాత పిల్లలకు నేర్పవచ్చు' అన్నాను.

'శాస్త్రీయసంగీతం నేర్పిస్తుంటాము. గాయకులను పిలిచి కచేరీలు చేయిస్తాము' అన్నాడాయన.

'అవి లలితకళలు. అది మన సంస్కృతి. వాటిని నిలబెట్టడం మంచిదే. కానీ మీరనుకుంటున్న సనాతనధర్మం అదికాదు' అన్నాను.

ఆయన మాటమార్చి, ' మీకు వాచ్ మెన్ లేడా?' అడిగాడు.

'ఉన్నాడు. మీకు కనిపించడు' అన్నాను.

'ఇంత ఎడారిలో ఎలా ఉంటున్నారు?' అన్నాడాయన.

'దేవుడే దిక్కు' అన్నాను.

నా మాటలు వాళ్లకు రుచించలేదు.

'సరే. ఏదో ఆశ్రమం అని ఉంటే చూచి పోదామని వచ్చాము. వెళ్లొస్తాం' అన్నాడాయన.

'సనాతనధర్మం ఏమిటో తెలుసుకోవాలంటే పదినిముషాలు సరిపోదు. తీరిగ్గా రండి. కూచుని మాట్లాడుకుందాం'. అన్నాను.

వాళ్ళు వెళ్లిపోయారు.

చాలా జాలేసింది.

ముప్పై ఏళ్ళనుంచీ గుడ్డిగా నడుస్తున్నంత మాత్రాన అది సరియైనదారి అవాలని ఎక్కడుంది?

ఆ మాటకొస్తే, సరైనదారిని తెలుసుకోవాలని మాత్రం ఎవరికుంది?

ఎవరికి తోచిన పనిని వారు చేస్తూ, 'ఇదే సనాతనధర్మం' అనుకుంటున్నారు. 

దే మరి కలిమాయ అంటే !

ఈ మాయప్రపంచాన్ని, ఈ మనుషులను, సంస్కరించడం ఎవరివల్లా కాదని నాకు మరోసారి అర్ధమైంది.