నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

25, మార్చి 2025, మంగళవారం

6 వ సాధనా సమ్మేళనం విశేషాలు






















ప్రపంచం 
చీకటిని వెలుగుగా భ్రమిస్తూ
ముందుకు పోతోంది.
మా ఆశ్రమంలో
వెలుగుదారులు విరబూస్తున్నాయి.

సాధనాసమ్మేళనంలో జరిగిన సమావేశాలలో ముఖ్యంగా కొన్నింటిని ఇక్కడ పరిచయం చేస్తున్నాను.

జ్యోతిషసమ్మేళనం

వారం రోజులలో జరుగబోతున్న శనీశ్వరుని రాశిమార్పు యొక్క ఫలితాలను శిష్యులకు వివరించాను. అదేసమయంలో అమావాస్య జరుగుతున్నది. జనజీవనంలో ఇది చాలా మార్పులను తెస్తుంది. చాలామందికి కోలుకోలేని దెబ్బలు తగులబోతున్నాయి. శిష్యులలో ఎవరెవరికి ఏయే ఫలితాలు జరుగుతాయో సూచించి, వాటికి తీసుకోవలసిన యోగపరమైన రెమెడీలను వివరించాను.

లోకంలో మీరు చూచే చీప్ రెమెడీలు నా వద్ద ఉండవు. మావి యోగపరమైన రెమెడీలు. ఇవి ప్రభావవంతమైన శాశ్వతఫలితాలనిస్తాయి. డబ్బుకు అమ్మబడేవి కావు. ఇంతకు ముందైతే ఈ శనీశ్వరుని రాశిమార్పు పైన ఒక పెద్ద పోస్ట్ వ్రాసి ఉండేవాడిని. ఇప్పుడు తెలివి తెచ్చుకున్నాను గనుక అటువంటి పనులు చేయడం లేదు. వజ్రాలను రోడ్డుపైన వెదజల్లడం ఎందుకు? అర్హులైనవారికి మాత్రమే వాటిని అందించాలి. అందుకే బ్లాగు బురదలోకంలో వాటిని వ్రాయడం తగ్గించాను. ఎవరికి అర్హత ఉందో వారికి మాత్రమే వాటిని ప్రస్తుతం అందిస్తున్నాను.

'భగవద్గీతా కందమరందము' విడుదల

శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయిగారు, న.ర.సం (నవ్యాంధ్ర రచయిత్రుల సంఘానికి) ఉపాధ్యక్షురాలు. ఈమె నా శిష్యురాలు. మంచి కవయిత్రి. వేంకటేశ్వరస్వామివారికి వీరభక్తురాలు. తెలుగు మరియు సంస్కృత భాషలలో MA చేసిన ఈమె, పద్యాలను అలవోకగా ఆశువుగా చెప్పడంలో సిద్ధహస్తురాలు. వీరి కుటుంబంలోనే కవిత్వధోరణి ఉంది.

ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాడిన భగవద్గీత మీకందరికీ సుపరిచితమే. దానిలో ఆయన 108 శ్లోకాలను పాడారు. వాటన్నిటినీ 150 కందపద్యాలలో జ్యోతిర్మయిగారు తెలుగులో చక్కగా వ్రాశారు. ఆ పుస్తకానికి 'భగవద్గీతా కందమరందము' అని పేరుపెట్టి, ఎంతో గురుభక్తితో నాకు అంకితమిచ్చారు. ఆ కార్యక్రమం ఈ సాధనాసమ్మేళనంలో జరిగింది. త్వరలో ఈ గ్రంధాన్ని మా పంచవటి పబ్లికేషన్స్ నుండి పుస్తకంగా ప్రచురిస్తున్నాము.

గతస్మృతులు

శ్రీ రధం మదనాచార్య, ప్రముఖ పంచాంగకర్త మరియు తెలుగు యూనివర్సిటీ జ్యోతిషవిభాగ ఆచార్యులు మా సభ్యులే. స్వతంత్రంగా గణితం చేసి పంచాంగాన్ని వ్రాయగల సిద్ధహస్తులలో ఈయనొకరు. 

నేను 2000 సంవత్సరం మొదటి బ్యాచ్ లో MA  జ్యోతిషం చేశాను. ఈయన మూడవ బ్యాచ్ లో  చేశారు. ఆ తరువాత వేదాంగజ్యోతిషంలో పీహెచ్ డీ కూడా చేసి డాక్టరేట్ పొందారు. ఇద్దరం శ్రీ గోరస వీరభద్రాచారి గారి శిష్యులమే. MA చేసిన సమయంలో నన్ను ఇంటర్వ్యూ చేసినది శ్రీ గోరస గారే. వారంటే నాకు చాలా అభిమానం మరియు గౌరవం. వారి ప్రియశిష్యులే రథంగారు కావడం. మళ్ళీ మేమిలా కలుసుకోవడం చాలా సంతోషాన్ని కలిగించింది.

మదనాచార్యగారికి 80 ఏళ్ల పెద్దవయసైనా కూడా అమిత వినయశీలి. జ్ఞానపిపాసి. నా రచనలను ఎంతో అభిమానిస్తారు. నా పుస్తకం, 'మహనీయుల జాతకాలు - జీవిత విశేషాలు' ను ఎంతో మెచ్చుకున్న జ్యోతిషవేత్తల్లో ఈయనొకరు. తనవద్ద జ్యోతిషశాస్త్రాన్ని నేర్చుకునే ప్రతివారికీ ఈ పుస్తకాన్ని, నా రచనలను తప్పకుండా చదవమని ఈయన సూచిస్తూ ఉంటారు. 'మీరు పరిచయం కావడం నా అదృష్టం' అని ఈ నిగర్వి తరచూ అంటూ ఉంటారు. స్వయంగా జ్యోతిషశాస్త్ర డాక్టరేట్ అయి, యూనివర్సిటీలో ఆచార్యులై ఉండి కూడా, గర్వం లేకుండా, నా వద్ద జ్యోతిషశాస్త్రపు లోతులను నేర్చుకోవాలని ప్రయత్నించే మనసున్న మనీషులలో ఈయనొకరు. శ్రీ రధం మదనాచార్యగారు ప్రచురించిన ప్రస్తుత సంవత్సరపు పంచాంగమును ఇక్క చూడండి.

రిట్రీట్లో కొంచెం తీరిక దొరికినపుడు గత స్మృతులను కలబోసుకున్నాం.  గోరస గారితో తన అనుభవాలను ఆయన చెప్పుకొచ్చారు. గోరసగారికి అంజనసిద్ధి ఉండేది. ఒకసారి ఆయనతో హంపీకి వెళ్లిన సమయంలో, అక్కడ విరూపాక్ష ఆలయం దగ్గరలో ఒక ప్రదేశంలో, 'ఇది కృష్ణదేవరాయలు అష్టదిగ్గజాలతో కవిత్వసభ నడిపిన ప్రాంతం. ఎవరైనా చూస్తామంటే ముందుకు రండి' అని ఆయనన్నారట.  ఎవరూ ధైర్యం చేయలేదు. కానీ ఒక అబ్బాయి ముందుకొచ్చాడు. మంత్రించిన విభూతిని ఆ అబ్బాయి కళ్ళను తాకించారు గోరసవారు. వెంటనే కృష్ణదేవరాయల భువనవిజయం దృశ్యం ఆ అబ్బాయి కళ్ల ముందు కనిపించడం మొదలుపెట్టింది. కాసేపు చూచాక, ఆ విభూతిని తుడిచేశారు. వెంటనే ఆ దృశ్యం ఆగిపోయింది. 'ఈ సంఘటనకు ప్రత్యక్షసాక్షిని నేనే' అని రధంగారు నాతో అన్నారు.

అసలైన యోగశాస్త్రం

నేటి నకిలీసమాజంలో ప్రతివాడూ ఒక గురువే. యోగశాస్త్రం 'యోగా' అని కూచుంది. పార్కులలో, క్లబ్బులలో, జిమ్ములలో చేయబడే అధమస్థాయికి చేరుకుంది. అసలైన యోగశాస్త్రం అది కాదు. అసలైన సర్వసమగ్ర సాధనామార్గం మావద్ద మాత్రమే ఉందని ఎన్నోసార్లు గతంలో చెప్పాను. దీనిని అహంకారంగా చాలామంది భావించారు. అహంకారం కాదు, సత్యమని మళ్ళీమళ్ళీ చెబుతున్నాను. వాస్తవాలు అలాగే కనిపిస్తాయి. రుచిచూస్తేనే దేని రుచైనా తెలుస్తుంది. దూరంనుండి ఎలా తెలుస్తుంది? అయితే,  ఒకరికి అర్ధం కానంతమాత్రాన మాకొచ్చిన నష్టమేమీ లేదు. బలవంతాన ఒకరికి నేర్పవలసిన ఖర్మా మాకు లేదు.

సభ్యులలో కొందరు ఆల్ఫాస్టేట్ ఎలా ఉంటుందో రుచి చూస్తామన్నారు. మా సాధనామార్గంలో, ఆల్ఫాస్టేట్ (యోగనిద్ర) చాలా మొదటిస్థాయిలోనే వస్తుంది.  కొద్దిపాటి అభ్యాసంతో వారిని దానిలోకి పంపించాను. ఆ స్థితిలో శిష్యులున్న ఫోటోలను ఇక్కడ చూడండి.

రాబోయే రిట్రీట్ వరకూ అభ్యాసం చేయవలసిన యోగవిధానాలను శిష్యులకు నేర్పించాను.

సందేహాలు - సమాధానాలు

పనికిరాని ఊకదంపుడు ఉపన్యాసాలంటే నాకు చిరాకు. మనం ఏది మాట్లాడినా ప్రాక్టికల్ గా ఉపయోగపడాలి. మనిషిని జీవితంలో ముందుకు నడిపించే విధంగా ఉండాలి. అందుకే నా శిష్యుల సాధనాజీవితంలో ఎదురౌతున్న సమస్యలకు, సందేహాలకు జవాబులు చెప్పడం, వాటిని పరిష్కరించడం పైనే నేనెక్కువ శ్రద్ధ పెడతాను. అందుకే దీనికి ఎక్కువ సమయాన్ని కేటాయించాము.

కర్మయోగం

ఆశ్రమం తోటలో పనిచేయడం శిష్యులకు సరదా. అదే పనిని కర్మయోగంగా చేయమని నేను చెబుతాను. ఈ మూడు రోజులూ అందరూ కలసి వారికిష్టమైన తోటపనిని ఆడుతూ  పాడుతూ ఆనందంగా చేశారు.

జ్యోతిష్యశాస్త్ర చర్చలు, ధ్యానాభ్యాసం, యోగశిక్షణ, కర్మయోగం, గ్రంథావిష్కారం, శిష్యుల భావావిష్కరణ, సందేహాలు సమాధానాలు, అభిప్రాయాల కలబోత, కులమతాలకు అతీతంగా మానవత్వ భావనతో అందరూ కలసిమెలసి జీవించడం, చివరలో బరువెక్కిన హృదయాలతో వీడ్కోలు తీసుకోవడం,  జూలైలో జరుగబోయే గురుపూర్ణిమ సాధనా సమ్మేళనానికి సిద్ధం కావడం - వీటితో 6 వ సాధనా సమ్మేళనం విజయవంతంగా ముగిసింది.
read more " 6 వ సాధనా సమ్మేళనం విశేషాలు "

21, మార్చి 2025, శుక్రవారం

మా ఆశ్రమంలో 6 వ సాధనా సమ్మేళనం మొదలు



నేడు మార్చి 21ఈక్వినాక్టియల్ డే 

మన భాషలో చెప్పుకుంటే, వసంత విషువత్ దినం. ఈరోజున సూర్యుడు  సరిగ్గా భూమధ్యరేఖపైన ఉంటాడు. కనుక,  భూమిపైన పగలూ రాత్రీ సమానంగా ఉంటాయి. చూడగలిగేవాళ్లకు ప్రకృతిలో అంతటా నేడు సమత్వం కనిపిస్తుంది. అందుకే నేటినుండి మూడు రోజులపాటు పంచవటి ఆశ్రమంలో సాధనాసమ్మేళనం మొదలైంది.

మా విధానం ప్రత్యేకత ఏమిటి?

కులాల కుళ్ళుకూ, మతాల మత్తుకూ, పూజల పుచ్చులకూ, ఆచారాల మెచ్చులకూ, ఫకీర్ల గుళ్ళకూ, రాక్షసదీక్షల బళ్లకూ, మైకుల గోలకూ, టీవీల జోలకూ, పాండిత్య ప్రదర్శనలకూ, వ్యాపార విమర్శనలకూ, మెట్ట వేదాంతాలకూ, పొట్ట వైరాగ్యాలకూ, ఈజీచెయిర్ తీర్పులకూ, లేజీలైఫ్ కూర్పులకూ, వీటన్నింటికీ భిన్నమైన, అసలైన, సర్వసమగ్ర సనాతన సాధనామార్గాన్ని, కులంతో, ధనంతో, ఆస్థిఅంతస్థులతో సంబంధం లేకుండా, అందరికీ సమానంగా బోధించే మహత్కార్యంలో భాగంగా ఈ సాధనాసమ్మేళనం జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్ లోని ఒక మారుమూలగ్రామంలో ఈ ఆధ్యాత్మికవిప్లవం నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంటోంది. అనుసరించేవారు, ఆచరించేవారు, పాలుపంచుకుంటున్నవారు అదృష్టవంతులు.

విపక్షుల గురించి చెప్పడానికేముంది? అవి పక్షులే.

read more " మా ఆశ్రమంలో 6 వ సాధనా సమ్మేళనం మొదలు "

21, ఫిబ్రవరి 2025, శుక్రవారం

శ్రీ సూక్తులు

'కుంభమేళా కెళ్ళొచ్చా' అన్నాడొకడు

'కుంభం లాంటి ఆ పొట్ట తగ్గించు ముందు' అన్నాను.


'కుండలినీ యోగం నేర్చుకుంటున్నా' అన్నాడొకడు

'బండలాంటి నీ గుండెను ముందు మెత్తగా మార్చు' అన్నాను.


'సుషుమ్నా క్రియను అభ్యాసం చేస్తున్నా' అన్నాడింకొకడు

'కర్మ ఎలా చేయాలో ముందు నేర్చుకో. క్రియలు అవే జరుగుతాయి' అన్నాను.


'నా కుండలిని నిద్ర లేచింది ' అన్నాడొకడు

' నాదస్వరం సరిగా ఊదు. లేకపోతే కాటేస్తుంది ' అన్నాను


'బాబాజీ క్రియాయోగంలో దీక్ష తీసుకున్నా' అన్నాడు మరోవాడు. 

'ఆయనెప్పుడో పోయాడు. ఇంకెన్నాళ్లు బ్రతికిస్తారు?' అడిగాను


'మాది అద్వైతమార్గం' అంది ఒకామె.

'ఆ చెప్పడంలోనే తెలుస్తోంది మీ అద్వైతం' అన్నాను.


'నేను శ్రీవిద్యోపాసకురాలిని' అని ఇంకొకామె.

'పాసనాలు తగ్గడానికి ముందు మందేసుకో' అన్నాను


'మాది పెద్దలమార్గం' అన్నాడింకొకడు.

'వాళ్ళు తాగినవి నేతులా? డాల్డానా?' అడిగాను


' ఏ సాధనా అక్కర్లేదు' అంది ఇంకొకామె

'ఏమీ సాధించలేని జీవితం అంతే అంటుంది' అన్నాను


'సూక్ష్మలోకాలు చూశా' అన్నాడు ఇంకో మానవుడు

'ఈ లోకాన్ని సరిగ్గా చూడు ముందు' అన్నాను


'ఆత్మలతో మాట్లాడతా' అంది ఇంకో జీవి. 

'ముందు నీ పెళ్ళాంతో రోజూ కాసేపు మాట్లాడు' అన్నాను


'మాతాజీ నైపోయా' అంది ఎర్రచీర కట్టుకున్న ఒక పతివ్రత

'బాగా ముదిరింది, తగ్గడం కష్టం' అన్నాను

read more " శ్రీ సూక్తులు "

కాగితపు పడవలు

అంతర్జాలపు విషంతో

మెదళ్ళు నిండిపోతున్నాయి 

మనుషుల సమాజంలో

జంతువులు పెరిగిపోతున్నాయి


అహంకారాల బురదలతో

హృదయాలు కుళ్ళిపోతున్నాయి

అతితెలివి బ్రతుకులతో

వయసులు మళ్లిపోతున్నాయి


డబ్బు వెంట పరుగులలో

జీవితాలు చెల్లిపోతున్నాయి

బాంధవ్యాలు ఆవిరైపోతూ

జ్ఞాపకాలను చల్లిపోతున్నాయి


ఆధ్యాత్మికపు ముసుగులలో

ఆవేశాలు చల్లారుతున్నాయి

అజ్ఞానపు ఆకర్షణలతో

అవరోధాలు ఊరేగుతున్నాయి


మురికిగుంటల దారులలో

నీటిచెలమలెందుకుంటాయి?

బండరాళ్ళ కనుమలలో

నదుల జాడలెందుకుంటాయి?


వరద ముంచుకొస్తుంటే

కాగితపు పడవలెలా ఆదుకుంటాయి?

ఊర్లు తగలబడుతుంటే

ఉత్తమాటలెలా అక్కరకొస్తాయి?

read more " కాగితపు పడవలు "

17, ఫిబ్రవరి 2025, సోమవారం

చేపల పాపం

నీళ్లలో మునిగితే పాపాలు పోతాయని

చేపలంటున్నాయి

ఎడారిలో ఎగిరితే పాపాలు పోతాయని

కొంగలంటున్నాయి


చేపలను కొంగలు తింటున్నాయి

కొంగలు వలల్లో పడుతున్నాయి

వలలు ఎండకు చివికిపోతున్నాయి


చేపలూ కొంగలూ వలలూ పోయాక

పాపం !

పాపం అడుగుతోంది

'నేనెలా పోతాను?' అని

read more " చేపల పాపం "

2, జనవరి 2025, గురువారం

విజయవాడ బుక్ ఫెస్టివల్ - 2025 లో పంచవటి స్టాల్ మొదలైంది




నేటి నుండి 12 వ తేదీ వరకూ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం గ్రౌండ్స్ లో జరిగే బుక్ ఫెస్టివల్ లో 'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' కు స్టాల్ నంబరు  219  కేటాయించబడింది.

నేడు విజయవాడ పంచవటి బృందంతో మా స్టాల్ ప్రారంభించబడింది. ఆ ఫోటోను ఇక్కడ చూడవచ్చు.

1992-1995 మధ్యలో నేను విజయవాడలో ఉన్నసమయం లోనూ, ఆ తరువాత కూడా గుంటూరులో ఉన్నంతవరకూ వీలైనప్పుడల్లా ప్రతి ఏడాదీ తప్పకుండా ఈ పుస్తకమహోత్సవాన్ని సందర్శించేవాడిని. అప్పట్లో PWD గ్రౌండ్స్ లో ఎంతో శోభాయమానంగా ఈ బుక్ ఫెస్టివల్ జరిగేది. విజయవాడ మొత్తానికీ ఆ పదిరోజులు పండుగలుగా ఉండేది. పుస్తకాభిమానులందరూ అక్కడ చేరేవారు. కానీ, గతప్రభుత్వం ఆ గ్రౌండ్ ను మార్చేసిన తర్వాత, ఆ వైభవం తగ్గిపోయింది. ఇప్పుడు బుక్ ఫెస్టివల్ ఎక్కడ పెట్టాలో తెలీక, గ్రౌండ్ కోసం వెతుక్కునే పరిస్థితి పట్టింది.

అయినా సరే, పుస్తక మహోత్సవాన్ని ఎక్కడో ఒక గ్రౌండ్ లో పెడుతున్నారు. పుస్తకాభిమానులు వెతుక్కుంటూ వెళ్లి సందర్శిస్తున్నారు. నెట్ ప్రభావంతో పుస్తకాలను చదవడం తగ్గినప్పటికీ, మొబైల్ దెబ్బకు తట్టుకుని పుస్తకం ఇంకా బ్రతికే ఉందని నిరూపిస్తున్నారు.

ఈ పదిరోజులలో ఏదో ఒకరోజున నేను కూడా విజయవాడ బుక్ ఫెస్టివల్ ను సందర్శిద్దామని అనుకుంటున్నాను.

ఈ స్టాల్లో మా పుస్తకాలన్నీ లభిస్తాయి. నా రచనలను అభిమానించే విజయవాడ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అక్కడ మా ఫౌండేషన్ సెక్రటరీ శ్రీ రామమూర్తిగారిని, ఇతర సభ్యులను కలుసుకోవచ్చు. మా సాధనామార్గం మీద గాని, జనరల్ గా ఆధ్యాత్మికమార్గం పైనగాని మీకున్న సందేహాలను తీర్చుకోవచ్చు.

బుక్ ఫెస్టివల్ మధ్యాహ్నం నుండి రాత్రి 8. 30 వరకూ ఉంటుంది. గమనించండి.

read more " విజయవాడ బుక్ ఫెస్టివల్ - 2025 లో పంచవటి స్టాల్ మొదలైంది "

30, డిసెంబర్ 2024, సోమవారం

హైద్రాబాద్ బుక్ ఫెయిర్ - 2024 ముగిసింది - పాఠకులకు సూచన

గత 11 రోజులుగా హైద్రాబాద్ లో జరిగిన పుస్తకమహోత్సవం (బుక్ ఫెయిర్) నిన్నటితో ముగిసింది.

మేము అనుకున్న  దానికంటే ఎక్కువగా పుస్తకాభిమానులు మా స్టాల్ ను సందర్శించారు. మా గ్రంధాలను కొనుగోలు చేశారు. మా భావజాలం ఎంతోమందికి చేరుతోందనడానికి, నిజమైన ఆధ్యాత్మికమార్గంలో ఎంతోమందికి  ఆసక్తి ఉందనడానికి ఇది నిదర్శనం.

ఆధ్యాత్మిక జిజ్ఞాస అనేది భారతీయుల రక్తంలోనే ఉంటుంది. అయితే, దానికి సరియైన మార్గం దొరకదు. దానికి  కారణాలు అనేకం. అటువంటి అసలైన ఆధ్యాత్మికమార్గాన్ని లోకానికి బోధించడానికే 'పంచవటి' ఆవిర్భవించింది.

అయితే, నిజమైన జిజ్ఞాసాపరులతో బాటు, ఎంతోమంది యూట్యూబ్ యూనివర్సిటీ పట్టభద్రులు కూడా మా స్టాల్ ను సందర్శించి, అక్కడ కూచున్న మా శిష్యులతో వాదన పెట్టుకుని 'ఆంజనేయుని ముందు కుప్పిగంతులన్నట్లు' తమ తమ విజ్ఞానప్రదర్శన చేయబోయారు.  వారిని చూచి మావాళ్లు నవ్వుకుని ఊరుకున్నారు.  ఇంతకు ముందులాగా ఆ ఎపిసోడ్ల నన్నింటినీ వ్రాయదలుచుకోవడం లేదు.

ఇకపోతే, మా గ్రంధాలను కొనిన జిజ్ఞాసాపరులకు ఒక సూచన !

మా భావజాలాన్ని  గురించి, మా సాధనామార్గాన్ని గురించి ఇంకా తెలుసుకోవాలని, మా దారిలో నడవాలని అనుకుంటూ, సరియైన దారి తెలియక తపిస్తున్నవారు, లేదా, మా పుస్తకాలను చదివిన తర్వాత ఇంకేవైనా క్రొత్త సందేహాలు తలెత్తినవారు, ఆ సంశయాల నివారణార్ధం, మా ఫౌండేషన్ సెక్రటరీ శ్రీ రామమూర్తి గారిని 98493 89249 అనే నెంబరులో సంప్రదించండి. మీ అన్వేషణ సమాప్తమౌతుంది. మీకు వెలుగుదారిలో ప్రవేశం లభిస్తుంది.

జనవరి 2 నుండి విజయవాడలో మొదలౌతున్న పుస్తకమహోత్సవంలో మళ్ళీ కలుసుకుందాం.
read more " హైద్రాబాద్ బుక్ ఫెయిర్ - 2024 ముగిసింది - పాఠకులకు సూచన "

19, డిసెంబర్ 2024, గురువారం

హైద్రాబాద్ బుక్ ఫెయిర్ లో పంచవటి స్టాల్

ఈరోజు నుండి హైద్రాబాద్ బుక్ ఫెయిర్ మొదలౌతున్నది. దానిలో "పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్" కు 145 వ నంబరు స్టాల్ కేటాయించబడింది. దానికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ చూడండి.

మా తెలుగు పుస్తకాల లిస్టును ఇక్కడ చూడండి.

మా పుస్తకాల టైమ్ లైన్ వీడియోను ఇక్కడ చూడండి.

బుక్ ఫెయిర్ లోకేషన్ ను గూగుల్ మ్యాప్స్ లో  ఇక్కడ చూడండి.



read more " హైద్రాబాద్ బుక్ ఫెయిర్ లో పంచవటి స్టాల్ "

18, డిసెంబర్ 2024, బుధవారం

మా 68 వ పుస్తకం 'మహనీయుల జాతకాలు - జీవితవిశేషాలు' విడుదల


నా కలం నుండి వెలువడుతున్న 68 వ పుస్తకంగా 'మహనీయుల జాతకాలు - జీవిత విశేషాలు' అనే అద్భుతమైన పరిశోధనాగ్రంధాన్ని నేడు విడుదల చేస్తున్నాము.

దీనిలో అతి ప్రాచీనకాలం నాటి అవతారపురుషుడైన శ్రీకృష్ణభగవానుని నుండి మొదలుపెట్టి, గౌతమబుద్ధుడు, మహావీరుడు, ఆదిశంకరులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, చైతన్య మహాప్రభువు, శ్రీరామకృష్ణ పరమహంస, శారదాదేవి, వివేకానందస్వామి, రమణమహర్షి, మెహర్ బాబా, పరమహంస యోగానంద, అరవిందయోగి,  కంచి పరమాచార్య, ఆనందమయి మా, నీంకరోలి బాబా, జిల్లెళ్ళమూడి అమ్మగారు మొదలైన 18 మంది నిజమైన మహనీయుల జాతకాలు మరియు వారివారి జీవితవిశేషాలు సమగ్రంగా వివరించబడ్డాయి. 

వీరందరి జీవితాలలోని వివిధఘట్టాలను 220 జాతకచక్రాల ఉదాహరణలతో క్షుణ్ణంగా వివరించడం జరిగింది.

వీరిలో ఎవరికీ సరియైన జననసమయాలు రికార్డ్ చేయబడి లేవు. కనుక అందరికీ జననకాల సంస్కరణ అవసరమైంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అది ఎలా చేశానో కూడా ఆయా అధ్యాయాలలో వివరించాను.  జ్యోతిష శాస్త్రాభిమానులను ఈ విశ్లేషణలు ఎంతో సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి.

సంస్కృత మహాభారతం నుండి శ్రీమద్భాగవతం నుండి తీసుకున్న ఖగోళసూచనలతో శ్రీకృష్ణుని జాతకాన్ని రాబట్టటం జరిగింది. మిగతా వారికి కూడా వారి వారి జీవిత సంఘటనలతో పోల్చి జననకాల సంస్ఖరణ చేయడం జరిగింది. అంతేగాక, గౌతమబుద్ధుడు, మహావీరుడు, ఆదిశంకరుల అసలైన జనన సంవత్సరాలను జ్యోతిషశాస్త్రపు సూత్రాల ఆధారంగా రాబట్టి నిరూపించడం జరిగింది. 

ప్రస్తుతం చరిత్రపుస్తకాలలో మనం చదువుతున్న వీరి జనన సంవత్సరాలన్నీ తప్పుల తడికలే. ఇవి యూరోపియన్ మరియు లెఫ్టిస్ట్ కుహనా చరిత్రకారులు లోకాన్ని తప్పుద్రోవ పట్టించడం కోసం  వాస్తవాలను వక్రీకరించి వ్రాసినవి. ఈ విషయాన్ని ఈ గ్రంధంలో స్పష్టంగా నిరూపించి చూపించి, వీరి అసలైన జనన సంవత్సరాలను మాత్రమేగాక, జననతిధులను, జనన సమయాలను కూడా రాబట్టి చూపించాను.

అవసరమైన చోట్ల ఆయా మహనీయుల తల్లిదండ్రులు, జీవిత భాగస్వాములు, పిల్లల జాతకాలను కూడా ఇస్తూ, వారికి వీరికి ఉన్న జాతకసంబంధాలను (జన్యు జ్యోతిషాన్ని) కూడా వివరించాను.

ఈ క్రమంలో, ఎప్పటినుంచో అంతుబట్టకుండా ఉన్న కొన్ని చారిత్రక చిక్కుముడులను సవరించాను. ఉదాహరణకు, చైతన్య మహాప్రభువు ఎలా చనిపోయారు? ఆయన యొక్క మరణం సహజమా? అసహజమా? దానికి కారణం అనారోగ్యమా? ప్రమాదమా? హత్యా? అనేది ఇప్పటికీ తేలని చిక్కుప్రశ్నగా చరిత్రకారులను వెక్కిరిస్తున్నది. దీనిని స్పష్టంగా తేల్చి, పరిష్కరించి చూపించాను.

జాతకవిశ్లేషణలో నేను ఉపయోగించే అనేక జ్యోతిషరహస్యాలు, సూత్రాలను ఈ గ్రంధంలో ఆయాచోట్ల విపులంగా వివరించడం జరిగింది.

వెరసి, ఈ గ్రంధం జ్యోతిషవిద్యార్ధులకు, జ్యోతిషాభిమానులకు, జ్యోతిషాన్ని నేర్చుకునేవారికి, మన దేశపు అసలైన చరిత్రను, నా పుస్తకాలను మరియు భావజాలాన్ని ఇష్టపడేవారికి ఒక విందుభోజనం వంటిది అవుతుందని నమ్ముతున్నాను.

ప్రపంచ జ్యోతిషచరిత్రలో ఇటువంటి పరిశోధనాగ్రంధం ఇప్పటివరకూ లేదని, ఇకముందు రావడం కూడా కష్టమని సగర్వంగా చెబుతున్నాను. ఈ గ్రంధాన్ని చదవాలంటే మీకు అదృష్టం ఉండాలని చెప్పడం సాహసం కాదు, సమంజసమే.

ఇది అనేక ఏళ్ల పరిశోధనా ఫలితం. ఇది నాకొక Lifetime Achievement వంటిది. ఎన్నో వందల గంటలు కష్టపడి, ఎంతో ప్రాచీన చరిత్రను పరిశోధన చేసి ఈ పుస్తకాన్ని వ్రాయడం జరిగింది.

దీని చిత్తుప్రతిని ఎన్నోసార్లు తిరగామరగా క్షుణ్ణంగా చదివి అనేకచోట్ల అవసరమైన సవరణలు సూచించడమే గాక, ప్రూఫ్ రీడింగ్ మరియు టైప్ సెట్టింగ్ చేసి దీనికొక రూపాన్నివ్వడానికి ఎంతో శ్రమించిన నా శిష్యురాలు అఖిల జంపాలకు నా హృదయపూర్వక ఆశీస్సులు తెలియజేస్తున్నాను. 

జ్యోతిషశాస్త్రంలో నాదైన విశ్లేషణా విధానాన్ని అతి చిన్నవయసులోనే ఎంతో పట్టుదలతో శ్రద్ధతో నేర్చుకుని, దానిలో మంచి ప్రజ్ఞను సాధించిన అతి కొద్దిమందిలో ఈమె ఒకరు. ఈ పుస్తకరచనలో నాతో కలసి పనిచేసే అదృష్టం ఈమెకు దక్కింది.

పుస్తకరచనలో నిరంతరం నాకు తోడునీడగా ఉన్న నా సహధర్మచారిణి సరళాదేవికి, ఫౌండేషన్ పనుల్లోనూ, ఆశ్రమ నిర్వహణకు చెందిన అన్ని విషయాలలోనూ ఆసరాగా నిలబడుతున్న మూర్తి మరియు సంధ్యలకు, కవర్ పేజీలను ఎంతో అందంగా డిజైన్ చేసి ఇచ్చిన ప్రవీణ్ కు, పబ్లిషింగ్ పనులలో సహాయపడిన శ్రీనివాస్ చావలి, గణేష్ మరియు శ్రీలలిత మొదలైన నా  ఇతర శిష్యులందరికీ ఆశీస్సులు.

ఈ పుస్తకం దాదాపు 800 పేజీలుగా వచ్చింది కనుక రెండు భాగాలుగా దీనిని ముద్రించడం జరిగింది. దీని 'ఈ బుక్' వెంటనే అందుబాటులో వస్తుంది. ప్రింట్ పుస్తకం మాత్రం ఈనెల 19 నుండి మొదలౌతున్న హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలోను, జనవరి 2 నుండి జరిగే విజయవాడ పుస్తక మహోత్సవంలోనూ, మా 'పంచవటి స్టాల్' లో మాత్రమే లభిస్తుంది. బుక్ ఫెయిర్ అయిపోయిన తర్వాత, పోస్ట్ ద్వారా యధావిధిగా ఇక్కడ లభిస్తుంది.

అంతర్జాతీయ పాఠకుల కోసం త్వరలో దీని ఇంగ్లీష్ అనువాదం కూడా విడుదల అవుతుంది.

ఔత్సాహికులైన పాఠకులు, జ్యోతిషశాస్త్ర విద్యార్థులు, చరిత్ర అభిమానులు,  నా రచనల అభిమానులు, సనాతన ధర్మానుయాయులు ఈ సువర్ణావకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను.

read more " మా 68 వ పుస్తకం 'మహనీయుల జాతకాలు - జీవితవిశేషాలు' విడుదల "

16, డిసెంబర్ 2024, సోమవారం

హైద్రాబాద్ బుక్ ఫెయిర్ (పుస్తక ప్రదర్శన) - 2024 లో పంచవటి స్టాల్

హైదరాబాద్ బుక్ ఫెయిర్ - 2024 వచ్చేసింది.

డిసెంబర్ 19 నుండి 29 వరకూ 11 రోజులపాటు జరుగబోతున్న ఈ పుస్తక ప్రదర్శన, హైద్రాబాద్ లోని NTR స్టేడియంలో జరుగుతుంది. దీనిలో పంచవటి బుక్ స్టాల్ కు స్టాల్ నంబర్ - 145 కేటాయించబడింది. అక్కడ పంచవటి ప్రచురణల పుస్తకాలన్నీ మీకు లభిస్తాయి.

మధ్యాహ్నం 12 నుండి రాత్రి 9 గంటల వరకూ పుస్తకప్రదర్శన ఉంటుంది.

నా రచనలను అభిమానించేవారు మీకు కావలసిన పుస్తకాలను మా స్టాల్ నుండి కొనుగోలు చేయవచ్చు.  అంతేగాక, పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్ గురించి, మా యోగాశ్రమం గురించి, మా సాధనామార్గం గురించి మీకున్న సందేహాలను మా సభ్యులతో మాట్లాడి నివృత్తి చేసుకోవచ్చు.

గతంలో ఉన్న ప్రింట్ పుస్తకాలకు తోడుగా, ఎంతోమంది అడుగుతున్న ఈ క్రొత్త పుస్తకాలు ఇప్పుడు ప్రింట్ చేయబడ్డాయి. స్టాల్ లో మీకు లభిస్తాయి.

1. ఆరు యోగోపనిషత్తులు

2. వెలుగు దారులు (మూడు భాగాలు)

3. మహనీయుల జాతకాలు - జీవిత విశేషాలు (రెండు భాగాలు)

4. గోరక్ష సంహిత

5. శ్రీరామ గీత

6. ముక్తికోపనిషత్తు

7. గాయత్రీ రహస్యోపనిషత్తు

8. పతంజలి యోగసూత్రములు

9. మధుశాల

10. భారతీయ జ్యోతిష సంఖ్యాశాస్త్రము

పుస్తకాభిమానులు, నా రచనల అభిమానులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం.

read more " హైద్రాబాద్ బుక్ ఫెయిర్ (పుస్తక ప్రదర్శన) - 2024 లో పంచవటి స్టాల్ "