18, జులై 2026, శనివారం

O.P.Nayyar జాతకవిశ్లేషణ - 2

"తెలియనంతవరకూ బ్రహ్మవిద్య, తెలిస్తే కూసువిద్య" అన్నట్లు, లోతుపాతులు తెలియనంతవరకూ జ్యోతిషశాస్త్రం గందరగోళంగా ఉంటుంది. ఒకసారి దానిలో పట్టుచిక్కితే మాత్రం, ఆపైన నల్లేరుమీద నడకే అవుతుంది. అప్పుడు ఒక జాతకాన్ని గానీ, జీవితాన్ని గానీ చదవడం మంచినీళ్లు త్రాగినంత సులభమౌతుంది. 

నయ్యర్ జాతకంలో - సుఖస్థానమైన మకరంలో సన్యాసయోగముంది. అందులోనే నీచగురువున్నాడు. కనుక తీవ్రమైన గురుదోషం కూడా ఉంది. దానికి తోడుగా, వృశ్చికంలో విధ్వంసయోగముంది. కళలను, ప్రేమలను, భావుకతను, సృజనాత్మకతను సూచించే శుక్రుడు బుద్ధిస్థానంలో శనిక్షేత్రంలో ఉన్నాడు. శనిదృష్టి సన్యాసయోగంపైన ఉంది. కుజదృష్టి శుక్రునిపైన ఉన్నది. ధనుస్సుకు, మకరానికి అర్గళం పట్టింది. రాహువు ఏకాకిగ్రహమయ్యాడు. 

అయిపోయింది. మొత్తం జాతకాన్ని అర్ధం చేసుకోవడానికి ఇవి చాలు. ఒక మనిషిని అర్ధం చేసుకోవడానికి, అయిదునిముషాలు సరిపోయినట్లే, ఒక జాతకాన్ని అర్ధం చేసుకోవడానికి కూడా అయిదే నిముషాలు చాలు. 

ఈయన జీవితాన్ని మొత్తాన్నీ శాసించినవి ఈ గ్రహస్థితులే.

అయితే, రాశిచక్రాన్ని ఒక్కదాన్ని చూచి, మనకంతా అర్థమైందని అనుకోకూడదు. నవాంశను, ఇతర వర్గచక్రాలను సరిదిద్దాలి. షష్ట్యంశ వరకూ సరిచేయాలి. అప్పుడు మాత్రమే ఆ జాతకం సరియైనదౌతుంది. లేదంటే తప్పుదారి పట్టిస్తుంది. ఇదంతా చేయాలంటే, జననకాలసంస్కరణ ఎలా చేయాలో  తెలియాలి. దానికి స్ఫురణశక్తి (ఇంట్యూషన్) ఉండాలి. ఇన్ని ఉన్నప్పుడే ఒక జాతకాన్ని స్పష్టంగా చదవగలుగుతాము. అప్పుడే కర్మరహస్యాలు అర్ధమౌతాయి. జన్మజన్మాంతరాలలో ఆ జీవి యొక్క నడకా అర్ధమౌతుంది.

థియరీని పక్కనపెట్టి, జాతకంలోకొద్దాం.

నయ్యర్ జననసమయం ఎక్కడా దొరకడంలేదు. కొందరు వృషభలగ్నమని, కొందరు తులాలగ్నమని అంటున్నారు. ఇంకొందరేమో ఏకంగా, జననసంవత్సరం 1926 కాదు, 1927 అంటున్నారు. ఉదయం 2 గంటలని కొన్నిచోట్ల ఉన్నది. కానీ ఏదీ ఖచ్చితంగా లేదు.

ఈ గందరగోళాన్నంతా సరిదిద్ది, ఈయన జననసమయాన్ని నేను సంస్కరించాను. అంటే, రెక్టిఫై చేశాను. అది 16-1-1926 ఉదయం గం. 1.23 అయింది. ఎలాచేశానో అడక్కండి. చెప్పను. ఆ సమయానికి షష్ట్యంశచక్రం ఇలా ఉంది.

రాశిలో నీచస్థితిలో ఉన్న గురువు, ఇక్కడ ఉచ్ఛస్థితిలోకి పోయాడు. కానీ, నీచకేతుశుక్రుల అర్గళంలో చిక్కుకున్నాడు. ఇదే అర్గళం శనిచంద్రులకు కూడా వర్తిస్తుంది. నీచకేతువును రవిగురుల అర్గళం బంధించింది. రాహుకేతువులు నీచస్థితులలో ఉన్నారు. శనిచంద్రయోగం ఉన్నది. నీచబుధ, కుజయోగం ఉన్నది. సూర్యుడు బలంగా ఉన్నాడు. శుక్రుడు లగ్నంలోకి వచ్చాడు. ఇప్పుడు, రాశిచక్రంతో షష్ట్యంశను అన్వయించుకుంటే, ఈయన జాతకం అద్దంలో చూచినంత స్పష్టంగా ఉన్నది.

సింహావలోకనం

శనికుజులవల్ల నోటిదురుసూ, కోపం, స్నేహితుల నుంచి మోసపోవడం, పైల్స్ మొదలైన రోగాలు కనిపిస్తాయి. శుక్రునివల్ల ప్రేమవ్యవహారాలు, కళాతృష్ణ, గొప్పదైన టాలెంట్,  సినిమారంగంలో పేరు, సృజనాత్మకత వస్తాయి. సన్యాసయోగంవల్ల వృత్తికి, కుటుంబానికి దూరంకావడం, ఒంటరిగా జీవించడం, అలాగే మరణించడం మొదలైనవి కలుగుతాయి. బుధునివల్ల వాయిద్యాలతో నేర్పరితనం, రాగాలను పాటలను సృష్టించడం వస్తుంది. అయితే, ఈయన దుర్మార్గుడు కాదని, సంసారం దెబ్బతింటుందని, తప్పులను చేశానని గ్రహించి, వాటిని దిద్దుకునే క్రమంలో ఒంటరిజీవితాన్ని గడిపి, అనామకంగా కన్నుమూస్తాడని షష్ట్యంశచక్రం చూపిస్తోంది.

జననకాలదశ
 
నా విధానంలో జననకాలదశకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఏమంటే, అది జీవితం మొత్తాన్నీ ఒక ముద్దలో పెట్టి చూపిస్తుంది. జననకాలదశ అయిన కుజ రాహు రాహు గురు శుక్రదశ - దూకుడు ప్రవర్తన, స్నేహితులతో మోసపోవడం, అక్రమసంబంధాలు, సినిమాజీవితం, గురుదోషం వల్ల చిన్నాభిన్నమై జీవితం, కళారంగంలో పేరుప్రఖ్యాతులను స్పష్టంగా చూపిస్తోంది.

కుజదశ

ధనిష్టానక్షత్రం ఒకటోపాదం కాబట్టి, జననసమయానికి 6 ఏళ్ల 6 నెలల 26 రోజుల కుజమహర్దశ మిగిలి ఉన్నది. ఆరేళ్లతర్వాత 18 ఏళ్ల రాహుమహాదశ నడిచింది. దానికి తగినట్లుగానే, ఈయనకు చదువుపైన పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. దానిబదులు సంగీతమూ, సౌందర్యపోషణా ఈయన మనసును ఆక్రమించాయి. ఈ విషయాన్ని ఆయనే బాహాటంగా చెప్పాడు.

"Woman, I am of woman, by woman, for woman. Women are my inspiration.' అని  తన తర్వాతి జీవితంలో ఆయన చాలాసార్లు అంటూ ఉండేవాడు.

వీరిది సంగీతకుటుంబం కాదు. తండ్రి, మెడికల్ స్టోర్స్ లో సూపర్నెంటుగా పనిచేసేవాడు. నయ్యర్ మాత్రం చిన్నప్పటినుంచే సంగీతమంటే చెవికోసుకునేవాడు. దానికి కారణం, గర్భవతిగా ఉన్న సమయంలో ఈయన తల్లిగారు, హార్మనీ ముందేసుకుని స్వరాలను అభ్యాసం చేస్తూ ఉండటం కావచ్చు. అంతకంటే వేరే కారణమేదీ కనిపించదు.

ఈయనపైన ముగ్గురు అన్నయ్యలు, ఒక అక్కయ్య ఉన్నారు.  అక్కయ్య తప్ప మిగిలిన అన్నలందరూ, డాక్టర్లే. వారిలో ఒకన్నయ్య హైద్రాబాద్ లోనే మిలిటరీ డాక్టర్ గా ఉండేవాడు. సంగీతరంగంలో అడుగుపెట్టినప్పటికీ, చివరకు ఈయనకూడా హోమియోపతి డాక్టరే అయ్యాడు. ఇది, కుటుంబంలో ఎప్పటినుండో ఉన్న మెడికల్ జీన్స్ ను చూపిస్తోంది. ఇదెలా వచ్చిందో చూడటం మన సబ్జెక్టు కాదు కాబట్టి దానిని వివరించడం లేదు.

రాహుదశ

ఏడేళ్లవయసులో రాహుదశ మొదలైంది. నయ్యర్ సంగీతాన్ని నేర్చుకోవడం తండ్రికి ఇష్టముండేది కాదు. ఆ రంగం అంత మంచిది కాదని, అప్పట్లో అనుకునే చాలామంది సాంప్రదాయకుటుంబాలలాగే ఆయనకూడా అనుకుని, 'సంగీతం నేర్చుకుని ఏం చేస్తావ్? రోడ్లమీద పాటలు పాడుతూ అడుక్కుతింటావా?' అంటూ నయ్యర్ ను తిట్టేవాడు, కొట్టేవాడు కూడా. కానీ నయ్యర్ మనసంతా సంగీతం పైనే  ఉండేది. తండ్రిమాటను వినలేదు. కానీ చివరకు తండ్రిమాటే చాలావరకూ నిజమైంది. జీవితం ఆఖరిలో ఇతరులపైననే ఆధారపడి అనామకంగా జీవించి, చనిపోయాడు.

అయితే సంగీతాన్ని ఎవరిదగ్గరా నేర్చుకోలేదు. సొంతంగా రహస్యంగా అభ్యాసం చేసి పియానో, ధోలక్, డ్రమ్స్ వాయించడం నేర్చుకున్నాడు. ఇలా దేనినైనా సొంతంగా నేర్చుకునే ప్రజ్ఞ ఆయనలో ఉండేది. దీని సాయంతోనే, పెద్దయ్యాక, హోమియోపతిని, జ్యోతిషాన్ని కూడా స్వయం-అధ్యయనంతో నేర్చుకున్నాడు. దీనికి కారణం దశమంలోని రాహువు. ఇలాంటి జాతకులు సంప్రదాయానికి భిన్నంగా నడుస్తారు. ఒకవిధమైన మొండిగా, విప్లవాత్మకంగా ఉంటారు. నయ్యర్ కూడా అలాగే తయారయ్యాడు.

చిన్నవయసులోనే లాహోర్ ఆల్ ఇండియా రేడియోలో సింగర్ గా పనిచేస్తున్న సమయంలో, సరోజ్ అరోరా అనే డాన్సర్ తో పరిచయం ఏర్పడింది. ఆమె రచయిత్రి కూడా. ఈమె వ్రాసిన 'ప్రీతమ్ ఆన్ మిలో' అనే పాటను 19 ఏళ్ల నయ్యర్ స్వరపరచగా, Ch. Atma పాడాడు. ప్రయివేట్ ఆల్బమ్ అయినప్పటికీ, ఈ పాట పాన్ ఇండియా హిట్ అయింది. ఈ సంఘటన 1945 లో జరిగింది. అప్పుడు నయ్యర్ కు  రాహు-శుక్రదశ నడుస్తున్నది. వయసు 19 ఏళ్ళు. ఈ దశ ఏం చేస్తుందో జ్యోతిషవిద్యార్థులకు తెలిసినదే కదా !  ఈయనకు సరోజ్ అరోరాకు ప్రేమ మొదలైంది.

ఈలోపల 1947 లో దేశం మూడుముక్కలైంది. అప్పుడీయనకు రాహు-చంద్ర-రాహు గ్రహణదశ నడిచింది. వీరి కుటుంబం ఇండియాలోని అమృత్ సర్ కు మారింది. పాటియాలాలో ఉంటూ, ఒక స్కూల్లో మ్యూజిక్  టీచర్ గా పనిచేస్తూ ఉండేవాడు. 

19-5-1951 తేదీన, నయ్యర్, సరోజ్ అరోరాల పెళ్లిజరిగింది. అప్పటికి నయ్యర్ కు 25 ఏళ్ళు. సరోజ్ కు కూడా అటూఇటుగా అంతే ఉండవచ్చు. అయితే, నయ్యర్ చాలా ముక్కుసూటి మనిషి. 'నేను పక్కా స్త్రీలోలుడిని. నా జీవితంలో, అనేకమంది స్త్రీలతో నేను సంబంధాలను పెట్టుకోవచ్చు. ముందే చెబుతున్నాను. తర్వాత నీ ఇష్టం' అని పెళ్ళికి ముందే సరోజ్ తో  ఖండితంగా చెప్పేశాడు. 

దానికి ఒప్పుకున్న సరోజ్ 'సరే నీ ఇష్టం. కానీ ఇంకో పెళ్ళిమాత్రం చేసుకోకు' అని షరతు పెట్టింది. దానికి నయ్యర్ ఒప్పుకున్నాడు. ఆ ఒప్పందాలతో వీరి పెళ్లి జరిగింది. అప్పట్లోనే ఇంత విశాలదృక్పథాలతో కూడిన పెళ్లిళ్లు జరిగేవన్నమాట !

ఆనాడు నయ్యర్ జాతకంలో గురు గురు చంద్ర రాహు శుక్రదశ నడుస్తోంది. ఇందులో వ్యామోహమే ఎక్కువగా కనిపిస్తోంది. గజకేసరీయోగాన్ని కాస్తా గురువుయొక్క నీచత్వం మ్రింగేసింది. దానికింకొక కారణం గోచారశని. ఈయన కన్యలో ఉంటూ వక్రించి సింహంలోకి వస్తున్నాడు.  అంటే,అష్టమశని దశ జరుగుతోంది. అందుకే ఈ పెళ్లి చివరకు పెటాకులై పోయింది.

గురుమహర్దశ

గురుదశ నవంబర్ 1949 లో మొదలైంది. ఇది ఈయన జీవితాన్ని అనేక మలుపులు త్రిప్పింది. గురుదశలోనే గురుదత్ తో పరిచయం ఏర్పడింది. తను తీసిన సినిమాలన్నింటిలో నయ్యర్ కు ఛాన్సిచ్చాడు గురుదత్. అంతేగాక, నయ్యర్ కూడా గీతాదత్ చేత  తన పాటలన్నింటినీ పాడించేవాడు. 

1949 లోనే  బాంబేకు మకాం మార్చి 'కనీజ్' అనే సినిమాకు నేపధ్యసంగీతాన్ని అందించాడు. 1952 లో 'ఆస్మాన్' అనే సినిమాకు మొదటిసారి సంగీతదర్శకత్వాన్ని వహించాడు.

కెరీర్ ప్రారంభ దశ

ఈయన కెరీర్ లో 1949-52 మధ్య సమయాన్ని ప్రారంభదశగా చెప్పుకోవచ్చు. ఆ సమయంలో గురు-గురు, గురు-శని దశలు నడిచాయి. గోచారగురువు మకరం నీచస్థితినుండి వృషభం వరకూ సంచరించాడు. గోచారశని సింహ, కన్యలలో సంచరించాడు. అది అర్ధాష్టమశని దశ. కనుక మొదటి మూడుసినిమాలు సంగీతపరంగా అంత బాగా ఆడలేదు.

గీతాదత్ దశ

1953-56 మధ్యదశను గీతాదత్ దశగా చెప్పుకోవచ్చు.

1954 లో తన 'ఆర్ పార్' సినిమాకు గురుదత్ ఈయనను సంగీతదర్శకుడిగా ఎన్నుకున్నాడు. ఆ సమయంలో గోచారశని దశమంలో ఉచ్ఛస్థితికి వచ్చాడు. ఆ సినిమా సూపర్ హిట్  అయింది. 

దానితర్వాత 1955, 56 లలో వరుసగా గురుదత్ తీసిన మిస్టర్ అండ్ మిసెస్ - 55, సిఐడీ సినిమాలు ఘనవిజయాలను సాధించాయి. గోచారశని దశమంలో ఉచ్ఛస్థితిలో ఉన్నాడు.  అందుకే అలా జరిగింది.

అయితే, గోచారశని వృశ్చికంలోకి మారి, జననకాల శనికుజులపైకి రాగానే,  ఈయన జీవితాన్ని ధ్వంసం చేసిన ఆశాభోంస్లే పరిచయం అయింది. ఆ సమయంలో ఈయనకు గురు-బుధదశ మొదలైంది. బుధుడు నవమాధిపతి, చంద్రలగ్నాత్ కూడా 6-9 ఆధిపత్యం ఉన్నది. కనుక బలమైన గతకర్మానుసారంగా, ఈ పరిచయం ప్రేమగా మారింది.

ఆమెను తన టీమ్ లోకి తీసుకున్నాడు. అప్పటివరకూ అక్క లతా నీడలో దాగి, క్లబ్బు పాటలను పాడుకుంటున్న ఆమెను ఒక ముఖ్యగాయనిగా తీర్చిదిద్దాడు. అప్పటివరకూ తన పాటలను పాడుతున్న షంషాద్ బేగం, గీతాదత్ లను పక్కనపెట్టి ఈమెకు ఛాన్సులివ్వడం మొదలుపెట్టాడు. ఇది తన జీవితంలో చేసిన పొరపాట్లలో ఒకటని తర్వాతి కాలంలో ఒప్పుకున్నాడు.

ఆశాభోంస్లే దశ

1957-68 ను ఆశాభోంస్లే దశగా చెప్పుకోవచ్చు.  ఈ సమయంలో 20 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. వాటిల్లో అన్నీ హిట్ పాటలే. 

1957 లో బీ.ఆర్.చోప్రా తీసిన  'నయా దౌర్' తో ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిల్మ్ ఫెర్ అవార్డును అందుకున్నాడు. ఆ సమయంలోనే ఒక సినిమాకు లక్షరూపాయలు పారితోషికాన్ని తీసుకునేవాడు. ఆ సమయంలో గురు-శుక్రదశ నడిచింది. వృశ్చికశని వక్రించి తులాశని ఫలితాన్నిచ్చాడు.

1958 లో వీరిద్దరూ సహజీవనం మొదలుపెట్టారు. ఆ సమయంలో గురు-శుక్రదశ నడిచింది. పంచమశుక్రుడు మళ్ళీ ప్రేమలో పడవేశాడు. అప్పుడు మొదలైన వీరి ప్రేమాయణం 14 ఏళ్లపాటు సాగి, 1972 లో ముగిసింది. 

Ek Musafir Ek Hasina (1962), Phir Wohi Dil Laya Hoon (1963), Kashmir Ki Kali (1964) ల  వరుసవిజయాలతో ప్రసిద్ధ రొమాంటిక్ మ్యూజిక్ డైరెక్టర్ గా స్థిరపడ్డాడు. ఆ సమయంలో రాహుకేతువులు మిధున-ధనుస్సులలో ఉచ్ఛస్థితులలో ఉన్నారు.

అక్టోబర్ 1964 లో గురుదత్ అర్ధాంతరంగా చనిపోవడం నయ్యర్ ను దెబ్బకొట్టింది. అది గురు-రాహు దశ. దీనిని ఛిద్రదశ అంటారు. ఇది  జీవితాలను చిదిమేస్తుంది. గురుదత్ మరణంతో నయ్యర్ కు కష్టకాలం మొదలైంది. ఆ సమయంలో నయ్యర్ కు ఏలినాటిశని రెండవపాదం నడుస్తోంది. శని కుంభంలో వక్రించి  ఉన్నాడు. గురువు వృషభంలో వక్రించాడు. కనుక, అదృష్టం వక్రించింది.

శనిమహర్దశ

1965 లో మొదలైన శనిదశతో ఈయనకు అవకాశాలు సన్నగిల్లడం మొదలైంది. దానికి కారణాలు అనేకం.  జ్యోతిషకారణం మాత్రం, శని బాధకస్థానంలో, శత్రువైన కుజునితో కలసి ఉండటం. అది దుర్ఘటనాయోగం కావడం.

ఈయనకు PR చేతకాదు. తనదగ్గరకు వచ్చిన నిర్మాతలకు మాత్రం మ్యూజిక్ చేసిపెట్టేవాడు. కానీ, పరిచయాలు పెంచుకొని, స్నేహాలు కలుపుకొని, పార్టీలిచ్చి, ఛాన్సులను సంపాదించడం ఈయనకు రాదు. పైగా, ముక్కుసూటిగా మాట్లాడేవాడు. దానికితోడు అతి డిసిప్లిన్ ఈయనతో ఉండేది. 

ఒక రికార్డింగ్ కు రెండుసార్లు పిలిచినా లతామంగేష్కర్ రాలేదని, ఆమెతో ఎప్పటికీ పనిచెయ్యనని ప్రతిజ్ఞ చేశాడు. ఆమేమో, హీరోయిన్లకు తప్ప వేరే పాత్రలకు తను పాడనంటుంది. క్రమేణా ఆమెకూడా ఈయనపైన పగబట్టి, తన చేతిలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడైన అనిల్ బిశ్వాస్ ద్వారా పావులు కదిపి ఈయనకు అవకాశాలు రాకుండా చేసింది. 

సమయపాలన లేకపోతే ఎంతటివాడినైనా అందరిముందూ తిట్టేసేవాడు. రఫీ, ఆశాల డ్యూయెట్స్ ను ప్రోత్సహించి, రఫీని బాగా సపోర్ట్ చేసింది ఈయనే. అలాంటిది, ఒకరోజున శంకర్ జైకిషన్ రికార్డింగ్ లో లేటై, తన రికార్డింగ్ కు ఆలస్యంగా వచ్ఛాడని మహమ్మద్ రఫీని తిట్టి పంపేసి, రెండేళ్లపాటు పాటలివ్వకుండా బహిష్కరించాడు. 

ప్రముఖ వేణువిద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియాను కూడా ఇదే కారణంతో వెనక్కు పంపించేశాడు.

తలత్ మహమూద్ మంచి గాయకుడు. కానీ, మన పీబీ శ్రీనివాస్ లాగా, ఆయనది సాఫ్ట్ మేల్ వాయిస్. గొంతును కొంచెం బొంగురుగా చేసుకోవడానికి అప్పట్లో కొంతమంది గాయకులు సిగరెట్ త్రాగేవారు. రికార్డింగ్ గ్యాప్ లో తలత్ మెహమూద్ సిగిరెట్ త్రాగుతుండటం నయ్యర్ చూచాడు. కోపంతో అతన్ని తిట్టి పంపించేశాడు. ఆ తర్వాత అతనికి  ఛాన్సులివ్వలేదు.

ఈ విధంగా, ఆర్టిస్టుల దగ్గర క్రమశిక్షణ లేకపోతే ఊరుకునేవాడు కాదు. ఆత్మాభిమానం, కోపాలు ఎక్కువ. పట్టూవిడుపూ లేకపోతే సినిమారంగంలో నెగ్గడం కష్టం. ముఖంమీద ఉమ్మేసినా తుడుచుకొని పోయేవారికే అక్కడ రాణింపు  ఉంటుంది. అది ఈయనకు చేతకాదు.

ఇలాఉండగా, ఈయన మార్కు సంగీతం క్రమేణా పాతబడిపోయింది. వెస్ట్రన్ బీట్స్ కలిసిన మ్యూజిక్ పాపులర్ అయింది. ఆర్దీ బర్మన్ వంటి క్రొత్తతరం ముందుకొచ్చింది.

ఈయన ఆశాభోంస్లే ను అమితంగా ప్రేమించాడు. కానీ ఆశా, తన అవకాశాలను, కెరీర్ ను మాత్రమే ప్రేమించింది. నయ్యర్ కు క్రమేణా ఛాన్సులు తగ్గాయి. పైగా ఈయన బాగా పొసెసివ్ గా ఉండేవాడు. ఆశా ఏ పాటను పాడాలో ఏదివద్దో ఈయనే నిర్ణయించేవాడు. ఏ సినిమా ఒప్పుకోవాలో ఏది వద్దో తనే చెప్పేవాడు. ఇదంతా అనవసరమైన నసగా ఆశాకు అనిపించింది. నయ్యర్  తన కెరీర్ కు అడ్డుగా మారాడని ఆశా భావించింది. ప్రతిదానికీ గొడవలు మొదలయ్యాయి. క్రమేణా ఈయనకు దూరమై, ఆర్దీబర్మన్ కు దగ్గరైంది. 

ఒకరోజున ఏదో చిన్నతప్పు చేసిందని, ఆశా కూతురు వర్షాభోంస్లేను అరిచి, చెయ్యెత్తి కొట్టబోయాడు. దానికి ఆశా అడ్డొచ్చింది. ఇద్దరికీ గొడవైంది. కోపంతో ఆమెను వదలి బయటకు వచ్చేశాడు.

ఆ విధంగా 5-8-1972 న ఆశాభోంస్లే తో విడిపోయాడు. అప్పటికి ఆమెతో 324 పాటలను పాడించాడు. కానీ ఆశా ఈయనను వదిలేసి ముందుకెళ్ళిపోయింది. ఈయన ఒక పిచ్చివాడిలాగా మిగిలిపోయాడు.

ఆ సమయంలో, ఈయన జాతకంలో శని-శుక్ర-రవి దశ నడిచింది. రవికేతువులు గ్రహయుద్ధంలో ఒకే డిగ్రీమీదున్నారు. పదకొండో అధిపతిగా రవి, పేరు ప్రఖ్యాతులున్న ఆశాను సూచిస్తున్నాడు. కనుక ఆ సమయంలో వీరిద్దరికీ గొడవై, విడిపోయారు. తిరిగి జీవితంలో కలుసుకోలేదు.

1972-79 కష్టాలు మొదలు

ఆశాతో విడిపోయాక, నయ్యర్ కెరీర్ బాగా తగ్గడం మొదలైంది. లతాతో పాటలు చెయ్యడానికి ఒప్పుకోడు. రఫీని దూరం పెట్టాడు. అందరితో సత్సంబంధాలు లేవు. PR లేదు. ఇక ఛాన్సులెలా వస్తాయి?

చివరకొకనాడు, తగ్గి, తనే రఫీ ఇంటికి వెళ్లి మాట్లాడాడు. రఫీ మెత్తబడ్డాడు. మళ్ళీ ఇద్దరూ కలిసిపోయారు. కానీ ఆశా దూరమైంది. ఆమె స్థానంలో వాణీజయరాం, దిల్రాజ్ కౌర్, కృష్ణా కల్లే, పుష్పా పగ్దరే, కవితాకృష్ణమూర్తి మొదలైన అప్పుడప్పుడే పైకొస్తున్న సింగర్స్ కు ఛాన్సులిచ్చి, వారిచేత పాడించాడు. కానీ వారెవరూ, ఆశా భోంస్లే మ్యాజిక్ ముందు తూగలేకపోయారు.

రఫీ మాత్రం నయ్యర్ ను బాగా సపోర్ట్ చేశాడు. కానీ మారిన సంగీతపు ట్రెండ్ లో, నయ్యర్ సంగీతం జనానికి నచ్చడం తగ్గింది. 1979 కల్లా ఛాన్సులు బాగా తగ్గిపోయాయి.

మాధురీ జోగ్లేకర్ దశ

అది శని - చంద్రదశ. 1976-77 ప్రాంతాలలో మాధురీ జోగ్లేకర్ అనే మరొక సింగర్ ఈయనకు పరిచయమైంది. ఈ దశను బట్టి వీరిది అందరూ అనుకునేటట్లుగా శృంగారసంబంధం కాదని అనిపిస్తుంది. శృంగారం కంటే ఎక్కువగా, అభిరుచులు, భావుకత, ఫిలాసఫీ మొదలైన హృదయసంబంధమైన విషయాలలో వీరికి శృతి కలిసి ఉండాలి.  ఇదే నిజమని తన తర్వాతి ఇంటర్వ్యూలలో మాధురీ చెప్పింది.

మొదట్లో, ఈయన మ్యూజిక్ ట్రూపులో కోరస్ సింగర్ గా ఈమె చేరింది.  అప్పటికే ఆమె మ్యూజిక్ లో MA చేసి ఉన్నది. ఈమెలో టాలెంట్ ను చూచిన నయ్యర్ ఈమెను దగ్గరకు తీశాడు. చర్చ్ గేట్ ఏరియాలో ఉన్న నయ్యర్ ఇంటికి ఈమె రోజూ వస్తూ ఉండేది. అప్పటికే నయ్యర్ హోమియోపతి, జ్యోతిష్యాలను బాగా అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు. వాటిలో కూడా ఈమె సాయం చేస్తూ ఉండేది. చాలావరకు ఈయనకు సెక్రటరీగా పనిచేసేది. ఈయనకూడా 1976 నుంచే, బాంబే శివార్లలో వీరార్లో ఉన్న ఈమె ఇంటిలోనే ఎక్కువగా ఉంటూ ఉండేవాడు.

1974 లో (అంటే 22 ఏళ్ల వయసులోనే) ఈమె UPSC పరీక్షను క్లియర్ చేసి FCI లో ఆఫీసర్ గా చేరింది. అయినా సరే, సంగీతంపైన ఉన్న మక్కువతో, ఒకవైపు ఉద్యోగం చేస్తూ కూడా, నయ్యర్ కు సాయపడుతూ ఉండేది. క్రమేణా వీరిమధ్య రొమాంటిక్ సంబంధం ఏర్పడింది. ఈమె నయ్యర్ కంటే 26 ఏళ్ళు చిన్నది. అప్పటికి నయ్యర్ కు 50 ఏళ్ళు, ఈమెకు 24 ఏళ్ళు.

అప్పటివరకూ నయ్యర్ ప్రేమాయణాలను ఓపికగా భరిస్తూ వచ్చిన భార్యాపిల్లలు దీనికి అభ్యంతరం చెప్పడం మొదలుపెట్టారు. నయ్యర్ పిల్లలుకూడా పాతికేళ్ళవయసులోకి వచ్చారు. ఎన్నాళ్ళని ఈయన వేషాలను భరిస్తారు? వాళ్ళనుండి తీవ్రమైన ప్రతిఘటన ఎదురయ్యేసరికి నయ్యర్ కోపం తెచ్చుకున్నాడు. ఒకవైపు ఛాన్సులు తగ్గిపోయాయి. ఇంకోవైపు తను అమితంగా ప్రేమించిన సంగీతరంగం వెక్కిరిస్తోంది. ఆశా ఇచ్చిన షాకు చాలా గట్టిగా తగిలింది. ఇప్పుడు కుటుంబసభ్యులు ఎదిరించేసరికి తట్టుకోలేక, వారిని ఇంట్లోనుంచి వెళ్లిపొమ్మని గద్దించాడు. గట్టిగా నిలబడిన వాళ్ళు, ఆస్తిలో వాటాకోసం కోర్టులో కేసువేశారు. తెగేవరకూ లాగవద్దని, కోర్టుబయట ఒప్పందమే మంచిదని లీగల్ నిపుణులు ఈయనకు సలహా ఇచ్చారు. ఇంటిని, ఆస్తిని వారికి రాసేసి, నయ్యర్ కట్టుబట్టలతో ఇంటినుండి బయటకు వచ్చేశాడు. ఇదంతా 1979 లో జరిగింది.

తనవైపునుండి తాను కరెక్ట్ కావచ్చు. కానీ ఎదుటివారినుండి, అందులోనూ కుటుంబసభ్యులనుండి కూడా ఆలోచించాలి. భౌతికసంబంధాలు లేకుండా, గాలికి ఎగిరిపోతూ, భావప్రపంచాల్లో ఎప్పుడూ విహరిస్తూ ఉండే ఇటువంటి కళాత్మకమనస్తత్వాలు, జీవితవిధానాలు ఉన్నవాళ్లు పెళ్లిళ్లు చేసుకోకూడదు.

'నేనింతే' అని పెళ్ళికి ముందే చెప్పాడు కాబట్టి నయ్యర్ కరెక్టే అనడమే అసలు కరెక్ట్ కాదు. 'నేనింతే, నేను పెళ్ళికి పనికిరాను. మన పెళ్లి ఒద్దు. నాతో నువ్వు సుఖపడలేవు. నువ్వేకాదు, నాతో ఎవ్వరూ సుఖపడలేరు. నా దారి వేరు.' అని చెప్పాలి. అలా చెప్పకపోవడం నయ్యర్ చేసిన తప్పు. నయ్యర్ చెప్పినప్పటికీ సరోజ్ ఒప్పుకోవడం ఆమె తప్పు. వెరసి ఇద్దరిఖర్మా అలా ఉంది. పాపం, వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? 

ఆ విధంగా, 1979 లో కుటుంబంతో విడిపోయి  విలాసవంతమైన తన చర్చ్ గేట్ ఇల్లును వదిలిపెట్టాడు. ఆ సమయంలో శని-రాహుదశ నడిచింది. ఇది శపితదశ అని గతంలో ఎన్నో జాతకాలలో నిరూపించాను. ఈ దశ ఏం చేస్తుందో కూడా వందలాది జాతకాలలో వివరించాను. ఈయన్ని కూడా ఈ దశ చావుదెబ్బ కొట్టింది.

ఇంటినుండి బయటకు వచ్చి, కుటుంబంతో తెగతెంపులు చేసుకుని, బాంబే శివార్లలో ఉన్న వీరార్ లో మాధురీతో కలసి ఆమె ఇంటిలో ఉండటం మొదలుపెట్టాడు. వీరి సహజీవనం 1976 నుండి 1996 వరకూ 20  ఏళ్లపాటు సాగింది. అయినా సరే, మధ్యమధ్యలో అప్పుడపుడు కొన్ని సినిమాలకు సంగీతాన్నిస్తూ ఉండేవాడు.

(ఇంకా ఉంది)

read more " O.P.Nayyar జాతకవిశ్లేషణ - 2 "

15, జులై 2026, బుధవారం

O. P. Nayyar జాతకవిశ్లేషణ - 1

పాతతరం హిందీ మధురగీతాలను ఇష్టపడేవారిలో ఓపీ నయ్యర్ పేరును తెలియనివారు ఉండరు. ఈయన అభిమానులందరూ తమను తాము OPiums అని పిలుచుకుంటారు.

ఈయన పూర్తిపేరు ఓంకార్ ప్రసాద్ నయ్యర్.  ఈయనపుట్టి ఇప్పటికి నూరేళ్లు దాటింది. అయినా సరే, నేటికీ ఈయన స్వరపరచిన పాటలను ఇష్టపడేవారు కోట్లలో ఉన్నారు.  

ఈయన తెలుగులో కూడా 'నీరాజనం' అని ఒక సినిమాను చేశారు. అది 1989 లో విడుదలైంది. అందులోని పాటలు కూడా ఆపాతమధురాలే. ఈయన ట్యూన్స్ ను తెలుగులోకి కూడా కాపీ కొట్టారు. ఉదాహరణకు "ఒ లేకే పెహలా పెహలా ప్యార్"  అనే పాటరాగాన్ని తెలుగులో "ఓహో బస్తీ దొరసానీ" అనే పాటకు తీసుకున్నారు.

అయితే, పాతతరం హిందీసినిమా దర్శకులలో అత్యధిక మొత్తాన్ని ఫీజుగా తీసుకున్న ఈయన, తన జీవితం రెండవభాగంలో సంగీతంవైపూ, సినీఫీల్డ్ వైపూ తిరిగి చూడకుండా, వాటిని పూర్తిగా వదిలేసి, ఒక హోమియోపతి వైద్యునిగా, ఒక జ్యోతిష్కునిగా మంచిప్రజ్ఞను సంపాదించి, పదేళ్లపైగా బాంబే స్లం ఏరియాలలోని పేదవారికి నిస్వార్థమైన సేవలందించి, చివరకు తన కుటుంబానికి దూరంగా, ఒంటరిగా కన్నుమూశాడు.

తన కుటుంబసభ్యులు కానీ, సినిమాజీవులుకానీ, విలేఖరులుగానీ, టీవీ జనాలు గానీ,  ఎవరూ తన అంత్యక్రియలకు రాకూడదని, కనీసం తన శవాన్ని తాకడానికి కూడా వీల్లేదని విల్లు వ్రాసిపెట్టి మరీ కన్నుమూశాడు. తన అంత్యక్రియలు కూడా అతినిరాడంబరంగా జరగాలని, ఆ తరువాత సంస్మరణసభలు పెట్టకూడదని గట్టిగా హెచ్చరించి వెళ్ళిపోయాడు.

ఈయన సంగీతాన్ని నేర్చుకోలేదు. కానీ సంగీతదర్శకుడయ్యాడు. నూరేళ్ళతర్వాత కూడా ప్రపంచం మరచిపోలేని స్వరాలందించాడు. కేవలం 19 ఏళ్ల వయసులో "ప్రీతమ్ ఆన్ మిలో" అనే  సూపర్ హిట్ పాటను స్వరపరచాడు. దీనిని ఈయన స్నేహితుడైన Ch. ఆత్మా పాడాడు. 80 ఏళ్ల తర్వాత ఈనాటికి కూడా ఈ పాట ఆపాతమధురమే.

ఈయన వైద్యశాస్త్రాన్ని చదవలేదు. కానీ, ముంబాయికి చెందిన ప్రముఖ హోమియోవైద్యుడు డా. ఎస్సార్ పాఠక్ దగ్గర హోమియోపతిని నేర్చుకుని, వైద్యుడయ్యాడు. వేలాదిమంది పేదరోగులకు ఉచితంగా మందులిచ్చి సేవచేశాడు. ముంబాయ్, కలకత్తా, హైదరాబాద్ లలో ఉచితహోమియో క్లినిక్స్ నడిపాడు. అలా పేదవారికి సేవను చేయడంలో ఆనందాన్ని పొందాడు. 

జ్యోతిషాన్ని ఎవరిదగ్గరా నేర్చుకోలేదు. కానీ, సొంతంగా దానిని నేర్చుకుని దానిలో మంచిప్రజ్ఞను సంపాదించాడు. ఎంతోమంది సినీ ప్రముఖులకు, ఇతరులకు జోస్యాన్ని కరెక్ట్ గా చెప్పాడు. తను పుట్టిననెలలోనే మధుబాల చనిపోతుందని చెప్పాడు. ఆమె అలాగే చనిపోయింది. చివరకు తన మరణాన్ని కూడా తనే కరెక్టుగా జోస్యం చెప్పుకున్నాడు. అదేవిధంగా చనిపోయాడు. 

ఎన్ని చేసినా తన 81 ఏళ్ల సుదీర్ఘజీవితంలో ఆత్మాభిమానాన్ని మాత్రం వదులుకోలేదు. జీవితపు ప్రతిమలుపులోనూ తలెత్తుకునే బ్రతికాడు. అత్యంతవిలాసాలనూ, సాధారణజీవితాన్నీ రెండింటినీ చూశాడు. చివరలో ఒక ఋషిలా బ్రతికి, ఒక అనామకుడుగా చనిపోయాడు.

ఈయనలో ఒక కళాతపస్వి, ఒక ప్రేమపిపాసి, ఒక భావుకుడు, ఒక తాత్వికుడు, ఒక క్రమశిక్షణను కలిగిన రూల్ మాస్టర్, ఒక మొండివాడు, ఒక నోటిదురుసు మనిషి, ఒక నిస్వార్ధహృదయుడు, ఒక నిరాడంబరజీవి  అందరూ కలిసి ఉన్నారు.

ఈయన 16-1-1926 న లాహోర్ లో ఒక బ్రాహ్మణకుటుంబంలో పుట్టాడు. 2007 లో 81 ఏళ్లవయసులో గుండెపోటుతో థానేలో  చనిపోయాడు. 1957 లోనే ఒక సినిమాకు లక్షరూపాయలు పారితోషికాన్ని తీసుకునేవాడు. అప్పట్లోనే బాంబే మొత్తమ్మీద 'కాడిలాక్' కార్లున్న ఇద్దరిలో ఈయనొకడు. కానీ విలాసవంతమైన అటువంటి జీవితాన్ని వదిలిపెట్టి బాంబే స్లంలో ఒక చిన్నగదిలో ఒక లోయర్ మిడిల్ క్లాస్ కుటుంబంతో పేయింగ్ గెస్ట్ గా ఉండేవాడు.చివరకు అక్కడే కన్నుమూశాడు.

తన కెరీర్ మొత్తంలో 500 పైన పాటలను సృష్టించినా, లతామంగేష్కర్ తో ఒక్కపాటను కూడా పాడించలేదు. వాళ్లిద్దరి మధ్యా గొడవలుండేవి. కానీ 1950-60 మధ్యలో హిందీసినిమా సంగీతాన్ని ఏలాడు. 'రిథమ్ కింగ్' అనే బిరుదును సంపాదించాడు. 

1990 లో తనకు డబ్బు ఇబ్బందులున్న రోజులలో కూడా, లతామంగేష్కర్ అవార్డు క్రింద లక్షరూపాయలను తనకు ఇస్తామంటే, ' ఆమెపేరుతో పెట్టిన అవార్డు నాకేంటి? నాన్సెన్స్ !' అని దానిని తిరస్కరించాడు. అలాంటి మొండివాడు. ఆత్మాభిమాని.

అందుకే ఈయనది చాలా విచిత్రమైన జీవితమని అంటాను.  ఈయన జాతకాన్ని చూద్దాం ! 

అంతకుముందుగా,  ఈయన స్వరపరచిన 500+ పాటలనుంచి కొన్ని ప్రముఖపాటలు :

1. ప్రీతమ్ ఆన్ మిలో - ప్రయివేట్ ఆల్బమ్ - 1945

2. మాంగ్ కె సాత్ తుమారా -  నయా దౌర్ -1957

3. బాబూజీ ధీరే చల్నా - ఆర్ పార్ -1954

4. ఆవో హుజూర్ తుమ్కో - కిస్మత్ -1968

5. పుకార్తా చలా హు మై - మేరే సనమ్ -1965

6. యే దిల్ హై ముషికిల్  జీనా యహా - CID 1956

7. దీవానా హువా బాదల్ - కశ్మీర్ కీ కలీ -1964

8. లేకే పెహలా పెహలా ప్యార్ - CID 1956

9. కజరా మొహబ్బత్ వాలా - కిస్మత్ 1968

10. ఇషారో ఇషారో మె - కశ్మీర్ కీ కలీ -1964

11. జాయియే ఆప్ కహా జాయేంగే - మేరె సనమ్ -1965

12. తారీఫ్ కరూ క్యా ఉస్కీ - కశ్మీర్ కీ కలీ -1964

13. జానే కహా మేరా జిగర్ గయా జీ - Mr Mrs 55 - 1955

14. ఆయియే మెహర్ బాన్ - హౌరా బ్రిడ్జ్ - 1958

15. జరా హౌలే హౌలే చలో మేరే సాజ్నా - సావన్ కీ ఘటా -1966

16. ఆఖో హి ఆఖో మే ఇషారా హోగయా - CID -1956

17. యూ తో హంనే లాఖ్ హసీ దేఖే హై - తుంసా నహీ దేఖా - 1957

18. తుం జో హుయే మేరే హంసఫర్ - (12 O'Clock) - 1958

19. యే హై రేష్మీ జ్యూల్పోన్ క అంధేరా - మేరె సనమ్ - 1965

20. ఆప్ యూహీ అగర్ హం సే మిల్తే రహే - ఏక్ ముసాఫిర్ ఏక్ హసీనా -1962 

21. చైన్ సే హంకో కభీ - ప్రాణ్ జాయే పర్ వచన్ న జాయే - 1974

22. ఉడే జబ్ జబ్ జుల్పే తేరీ - నయా దౌర్ -1957

23  మేరా నామ్ చిన్ చిన్ చిన్ - హౌరా బ్రిడ్జ్ -1958

24. ఏక్ పరదేశి మేరా దిల్ లేగయా - ఫాగున్ - 1958

25. కభీ ఆర్ కభీ పార్ - ఆర్ పార్ - 1953

26. సున్ సున్ సున్ జాలిమా - ఆర్ పార్ -1953

27. పియా పియా పియా మేరా జియా పుకారే - బాప్ రే బాప్ -1955

28. సర్ పర్ టోపీ లాల్ దుపట్టా - తుంసా నహి దేఖా -1957

29. తూ ప్యార్ కా సాగర్ హై - సీమా -1955

30. దిల్ కి ఆవాజ్ భి సున్ - హం సాయా -1968

31. రేష్మి సల్వార్ కుర్తా జాలీ కా - నయా దౌర్ - 1957

32. మై ప్యార్ కా రాహీ హూ - ఏక్ ముసాఫిర్ ఏక్ హసీనా -1962

33. లాఖో హై నిగాహ్ మే - ఫిర్  ఓహీ దిల్ లాయా హు. - 1963  

(ఇంకా ఉంది )
read more " O. P. Nayyar జాతకవిశ్లేషణ - 1 "

9, జులై 2026, గురువారం

U.G గారి 108 వ పుట్టినరోజు

ఇవాళ జూలై తొమ్మిది. 

యూజీగారి 108 వ పుట్టినరోజు.

యూజీగారి సన్నిహితులలో ఒకరైన చంద్రశేఖర్ బాబుగారు (బెంగుళూరు) నాకు పంపించిన యూజీగారి మాట ఒకటి మనకోసం.

"The absence of imagination, the absence of will, the absence of effort, the absence of any movement in any direction, on any level, in any dimension - that is the thing."

" ఊహ లేకపోవడం, ఇచ్ఛ లేకపోవడం, ప్రయత్నం లేకపోవడం, ఎటువైపూ, ఏ స్థాయిలోనూ, ఏ భూమికలోనూ, ఏ విధమైన కదలికా లేకపోవడం - అదీ అసలైన విషయం. "

read more " U.G గారి 108 వ పుట్టినరోజు "

30, జూన్ 2026, మంగళవారం

రామమందిర చందాచోరీ వివాదం

అయోధ్య రామమందిరం మొదలవడమే గొడవలతో మొదలైంది. 

మొదలుపెట్టి రెండేళ్లు కూడా కాకముందే పెద్ద వివాదంలో చిక్కుకుంది. భక్తులిచ్చిన చందాలు దొంగిలించబడటం చాలా బాధాకరం. దేశం మొత్తంమీద హిందువుల నమ్మకం తీవ్రంగా దెబ్బతిన్నది.

తిరుమలలో ఇదే జరిగింది. పట్టుకున్న S.I హత్యకు గురయ్యాడు. ఇప్పుడు అయోధ్యలోనూ అదే నేరం జరిగింది. పద్మనాభస్వామి ఆలయంలో వేరేరకంగా ఇదే జరిగింది. మొత్తానికి, దేవుడంటే భక్తులకు భక్తి ఉన్నప్పటికీ, ఆలయంలో పనిచేసేవాళ్లకు  మాత్రం ఏదీ ఉండదని తేలిపోయింది.

ఆలయాలలో అవినీతి, దొంగతనాలు,  జరగడం. అదికూడా భక్తులు చేయడం చాలా బాధాకరం. 'మిశ్రా, శుక్లా, పాండే' అనేపేర్లు బ్రాహ్మణులు. 'బన్సాల్' అంటే వైశ్యులు. యాదవ్ అంటే తెలిసినదే. వీళ్ళే ఇలాంటిపనులు చేస్తే ఇక ఎవర్ని ఏమనుకోవాలి? మేనేజ్మెంట్ లో వేరే కులాలు మతాలవాళ్ళు ఉన్నపుడు వారిని అనుకున్నాం గతంలో. ఇప్పుడు చేసిందెవరు? ఎవర్ని అనాలి? ఏమనాలి?

మేనేజ్ మెంట్ అంటే ఇదేనా? అందులోనూ అయోధ్యరామాలయం వంటి సంస్థను ఇలాగేనా నడిపేది? పైగా, ఉన్నవాళ్ళందరూ పెద్దపెద్దవాళ్లు?

చిన్నదొంగలను పట్టిచ్చి. లేదా పట్టుకున్నవారిని లేపేసి, సినిమాటిగ్గా పెద్దదొంగలు తప్పించుకుంటారని గతంలో చాలావాటిలో రుజువైంది. ఇప్పుడేమౌతుందో చూడాలి.

---------------------

ఎప్పుడూ ఎదురుగా కనిపిస్తుంటే దేవుడు కూడా చీపై పోతాడు. అందుకే, దూరాన్నించి దర్శనంకోసం వచ్చిన భక్తులకున్న భక్తి, అక్కడున్న పూజారికి ఉండదు. హుండీ డబ్బులు లెక్కించేవారికి అసలే ఉండకపోవచ్చు.

ఎదురుగా ఊరిస్తున్న డబ్బూ బంగారాలు ముఖ్యంగాని, గుళ్లో ఉన్న రాతిబొమ్మ మనకెందుకు? మనం పెడితేనేగా దానికి తిండి? అయినా తినేది దేవుడు కాదుగా, మనమే. కనుక మనకు మనమే ముఖ్యం, దేవుడు కాదు.

దేవుడికి కూడా డబ్బుతోనే విలువ. ఇంకా చెప్పాలంటే, అసలు విలువ డబ్బుకే గాని, దేవుడికి  కాదు.

నిజానికి, డబ్బు సంపాదించడానికి దేవుడొక ఆధారం. ఇది వాస్తవం.

ఇదే వాస్తవం !

అదంతా అలా ఉంచితే, జ్యోతిషం ఏమంటున్నదో చూద్దాం.

------------------------

ప్రాణప్రతిష్ఠ 22 జనవరి 2024 న మధ్యాన్నం 12. 30 కు జరిగింది.

అప్పట్లోనే పుష్యమాసం ముహూర్తం మంచిది కాదని చాలామంది అన్నారు. ఎవరూ వినలేదు. అది శూన్యమాసం. ఫలితం స్పష్టంగా కనిపిస్తోంది.

దేవాలయ శిఖరం, కలశం పూర్తి కాకుండానే ప్రాణప్రతిష్ట చేయడం మంచిది కాదని కూడా చాలామంది అన్నారు. కానీ చేసేవారు చేశారు. ఇప్పుడిలా అయింది.

ఆనాటి గ్రహస్థితులు ఇలా ఉన్నాయి.

ఉచ్ఛచంద్రుడు ఎదురులేని ప్రజాభిప్రాయాన్ని సూచిస్తున్నాడు. కనుక దేశంలోని హిందువులందరి మద్దతుతో ఆలయం నిర్మాణమైంది.

అష్టమంలో కుజ బుధ శుక్రులున్నారు. శుక్రుడు ఇంటిదొంగలకు సూచకుడు. బుధుడు కుటుంబసభ్యులకు, అనుచరులకు సూచకుడు. కుజుడు రహస్యశత్రువులకు సూచకుడు. ఈ ముగ్గురూ కలసి నష్టానికి సూచికైన అష్టమంలో ఉన్నారు. ప్రస్తుతం జరిగింది అదే !

ప్రస్తుతం నడుస్తున్న దశ -- కుజ శుక్ర చంద్ర దశ. కుజశుక్రులిద్దరూ పెద్దనష్టాన్ని సూచిస్తున్న అష్టమంలో ఉండటాన్ని చూడవచ్చు. ఈ దశ మార్చి 2026 నుండి ఏప్రియల్ 2027 వరకూ ఉంది. మార్చిలోనే ఈ గొడవంతా బయటపడటం మొదలుపెట్టింది.

అధికారయంత్రాగాన్ని సూచించే సూర్యుడు మతసంబంధమైన నవమంలో పాపార్గళంలో చిక్కుకుపోయాడు. కనుక అధికారులూ యంత్రాంగమూ ఇరుకున పడ్డారు. సూర్యవిదశ సరిగ్గా మే - జూన్ నెలలలోనే నడిచింది.

దశమాధిపతి శని దశమంలో ఉన్నప్పటికీ, పాపార్గళంలో చిక్కుకున్నాడు. లాభస్థానంలోని గురుఛండాలయోగం నీతిలేని అనుచరులను (ఆలయ సిబ్బందిని) సూచిస్తున్నది. వీరివల్ల ఆలయమర్యాదకు ఘోరమైన కళంకం చుట్టుకుంది.

కుజదశ మార్చి 2028 వరకు ఉన్నది. అంతవరకూ పరిస్థితి బాగుపడదు.

ఆ పైన వచ్చే రాహుదశ 2046 వరకూ ఉంటుంది. అప్పుడూ, గురుఛండాలయోగం వల్ల ఏదో ఒక వివాదం ఉంటూనే ఉంటుంది.

ఇంతకంటే ముందుకు ప్రస్తుతం చూడనవసరం లేదు.

-------------------------

బయటనుండి వచ్చి దేవాలయాలను కొల్లగొట్టారని, కూలగొట్టారని రాక్షసులమాదిరిగా ప్రవర్తించారని తురకలను అనుకోవడం దేనికి? ఇంటిదొంగల సాయం లేకుండా వాళ్ళు ఆపనులు చేయగలిగేవారా? ఇప్పుడు మనవాళ్ళు చేస్తున్నదేమిటి?

ఇప్పుడు దోషులు కూడా ఇంటిదొంగలే. హిందూమతం ముఖ్యంగా దృష్టి పెట్టాల్సింది ఇంటిదొంగలమీదనే.

మన దేవుళ్ళపైన దేవాలయాలపైన మనకే గౌరవం లేదు. ఇక బయటవాళ్ళకెలా ఉంటుంది?

దేవుడికే ద్రోహం చేసేవాళ్ళు, మనుషులను ఒదులుతారనుకోవడం వెర్రితనం ! కాకపోతే, నీతికి మారుపేరుగా నిలవాల్సిన వాళ్ళే ఇలా చేస్తే, ఇక ఎవర్ని నమ్మగలం? అందులోనూ VHP, RSS కార్యకర్తలా? కోట్లాది హిందువుల హృదయాలు గాయపడ్డాయి.

వచ్చిన చెడ్డపేరు పోవడం చాలా కష్టం.

ముహూర్తసమయంలో నవాంశలో గురువు ఉచ్ఛస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు రాశిలోనే ఉన్నాడు. గురువు అనుగ్రహిస్తే కష్టాలనుండి తేలికగా బయటపడవచ్చు.  కానీ, ఆ అనుగ్రహానికి తగిన అర్హత మనలో ఉండాలి. అప్పుడే అది మనకు లభిస్తుంది. ఊరకే మాత్రం రాదు. 

ఈ మొత్తం వ్యవహారంలో యోగి ఆదిత్యనాథ్ ఒక్కడే నిజాయితీగా, ధైర్యంగా నిలబడ్డాడు.

చూద్దాం దీనినెలా పరిష్కరిస్తారో? పోయిన పరువునెలా తిరిగి రాబట్టుకుంటారో?

read more " రామమందిర చందాచోరీ వివాదం "

29, జూన్ 2026, సోమవారం

అసహ్యమేస్తున్న పబ్లిక్ జీవితం

నేను రైల్వేలోనే రిటైరయ్యాను. కానీ నేడు రైల్లో ప్రయాణం చేయాలంటే ఇష్టపడటం  లేదు. ఏసీలో ఫ్రీపాస్ ఉన్నప్పటికీ రైల్వేప్రయాణం చేయకుండా ఏసీబస్సుల్లోనో, సొంతకార్లోనో పోతున్నాను. దూరమైతే విమానమే. సర్వీస్ లో ఉన్నప్పుడూ రైల్వేపాసులు వాడలేదు. ఇప్పుడూ వాడటంలేదు. అప్పుడు లీవులు కూడా మురిగిపోయేవి. ఇప్పుడు పాసులు కూడా మురిగిపోతున్నాయి. కారణం?

జనాల వెకిలి, దురుసు, మాస్ ప్రవర్తనలు నచ్చక ! రైలు ప్రయాణాలు నచ్చక !

ఎవడికీ ఎక్కడా సివిక్ సెన్స్ గాని, కామన్ సెన్స్ గాని ఉండటం లేదు.  నాకు ఊహ తెలిసినప్పటినుండీ ఇలాగే ఉన్నప్పటికీ, ఇప్పుడు బాగా ఎక్కువైంది. అప్పుడు మంచి, మర్యాద, మానవత్వం అనేవి కాస్త ఉండేవి. ఇప్పటి మనుషులలో ఎక్కడా కనిపించడం లేదు.

"ప్రయివేట్ లైఫ్ మీ ఇష్టం, పబ్లిక్ లోకి వస్తేమాత్రం ఏమైనా అంటాం" అని శ్రీ శ్రీ అనేవాడు. దాని సందర్భం వేరే ఏదో అయినప్పటికీ, అందరూ ఆయన మాటలని మాటల్లోనే కాక, చేతలలో కూడా అనుసరిస్తున్నట్టు కనిపిస్తున్నది.

పబ్లిక్ రంగం మొత్తం, అది ఏదైనా సరే, దారితప్పింది. ప్రభుత్వసర్వీసులు ఏవైనా సరే, ముఖ్యంగా ట్రాన్స్ పోర్ట్ రంగాలు ఛండాలంగా తయారయ్యాయి. పెరిగిపోయిన జనాభా, సంస్కారం లేని డబ్బు, వెకిలి సినిమాలు, ఇక రాజకీయుల సంగతి చెప్పనే అక్కర్లేదు, అన్నింటినీ మించి సోషల్ మీడియా - ఇవన్నీ కలిసి మనిషిని చాలావేగంగా సంస్కారహీనుడిగా మార్చేస్తున్నాయి.

మొన్న బాంబేట్రెయిన్లో చిన్నగొడవ పెద్దదై, పొడుచుకునేదాకా పోయింది. అతను చనిపోయాడు. ఇతను అరెస్టయ్యాడు. మళ్ళీ ఇద్దరూ వాళ్ళ జీవితాలలో సామాన్యపౌరులే. ఇరుగూపొరుగూ "ఇద్దరూ మంచివాళ్ళే" అని చెబుతారు.

రైల్వే ఏసీలలో ఒకప్పుడు క్లాస్ పాసింజర్లు మాత్రమే ప్రయాణించేవారు. ఇప్పుడు మాసై పోయింది. ఏసీ ఫస్ట్ క్లాస్ కూడా ఛండాలంగా తయారైంది. తిన్నవన్నీ కాళ్ళదగ్గరే పారేస్తూ, మొబైల్ సౌండ్ పెద్దగా పెడుతూ, గట్టిగా అరుస్తూ, సంతలాగా చేస్తున్నారు. చాలా ట్రెయిన్లలో ఏసీల కంటే స్లీపర్లే కాస్త నయమనిపిస్తున్నాయి. వాటిల్లో పాసింజర్స్ కొంచెం పద్దతిగా ఉంటున్నారు. ఆఫ్ కోర్స్ ఇది అన్ని రూట్లకూ వర్తించదనుకోండి. బీహార్, బెంగాల్ వైపును నుండి వచ్చే రైళ్లయితే, అది ఏ క్లాసయినా సరే, ఎక్కకపోవడమే మేలు.

ఒక రైల్వే ఆఫీసర్ అయి ఉండీ మీరిలా చెబుతున్నారేంటని మీరనుకోవచ్చు. సర్వీసులో ఉన్నపుడు కూడా ఇదే చెప్పేవాణ్ణి. నా పరిధిలో సమస్యలను వెంటనే సాల్వ్ చేసేవాణ్ణి. కానీ నాలాంటి వాళ్ళు ఆ వ్యవస్థలో సముద్రంలో కాకిరెట్టలు. రైల్వే ఒక్కటే కాదు, ప్రతి ప్రభుత్వవ్యవస్థా, పబ్లిక్ వ్యవస్థా ఇలాగే ఉన్నాయి.

ఎక్కడైనా వ్యవస్థలు కొద్దిగా బాగుంటే, జనాలు ఛండాలంగా తయారయ్యారు.

అసలు, జనజీవనంలోకొస్తే, ఎక్కడైనా సరే, అది నరకమే. మనుషులే అలా తయారయ్యారు. క్లాస్ ను మన దేశంలో కోరుకుంటే, హైక్లాస్ గేటెడ్ కమ్యూనిటీలలో ఉండాలి. లేదా నాలాగా ఒక అడవిలోకెళ్ళిపోయి ఉండాలి. ఆఫ్ కోర్స్, హైక్లాస్ కమ్యూనిటీలలో హైక్లాస్ మెంటాలిటీస్ ఉంటాయని గ్యారంటీ ఏమీ లేదు. అక్కడెక్కువగా హైక్లాస్ క్రిమినల్స్ ఉంటారు. మరేం చెయ్యాలి? మిగిలిన ఛాయిస్ ఒక్కటే, అయితే హిమాలయాలు, లేదా అడవి. 

లేకిమనుషులు కన్పించనంత దూరం వెళ్ళిపోయి అక్కడ అజ్ఞాతంగా ఉండటం ఒక్కటే పరిష్కారం. అయితే ఇలా చెయ్యడానికి అందరికీ అవకాశాలుంటాయా? అంటే, ఖచ్చితంగా ఉండవు. కర్మ ఒప్పుకోదు. బంధాలు వదలవు. బ్రతుకుపోరును వదిలిపోలేరు.

ఇలాంటి జ్ఞానోదయాలు మన దేశంలో చాలా త్వరగా వస్తాయి. వేరే దేశాలలో అయితే రావు. అందుకే, విదేశాలకు వెళ్ళినవాళ్ళు, ఏదోరకంగా అక్కడే సెటిలవుదామని అనుకుంటారు గాని, తిరిగిరారు. వాళ్ళు చెప్పే కారణాలు కూడా ఇవే - ఎక్కడచూసినా జనం, ట్రాఫిక్ సమస్యలు, సరైన రోడ్లు పరిశుభ్రతా లేకపోవడం, పెరిగిపోతున్న ఖర్చులతో నిత్యజీవితమే టెన్షన్ గా మారడం, మనుషులలో సివిక్ సెన్స్ లేకపోవడం, వ్యవస్థలన్నీ జవాబుదారీతనం లేనివిగా అవడం, ఆహారకల్తీ, మెడికల్ మాఫియా, భవిష్యత్తు గ్యారంటీ లేకపోవడం ఇవన్నీ కారణాలుగా వారు చూపిస్తున్నారు. ఇవన్నీ నిజాలే.

విదేశాలలో కొన్నే సమస్యలుంటాయి. మనదేశంలో మాత్రం నిత్యజీవితమే ఒక సమస్య. డబ్బున్నవాడికైనా, లేనివాడికైనా, మధ్యలోవాడికైనా ఎవరికైనా ఇది తప్పదు. ఇక్కడ ప్రతిదీ ఒక పోరాటమే. ఒక గందరగోళమే. ఒక పరుగే. కారణాలేంటంటే, ఎక్కడ చూసినా జనం, సివిక్ సెన్స్ లేకపోవడం, వ్యవస్థలు ఫెయిలై పోతూ ఉండటం, ఎక్కడా జవాబుదారీతనం లేకపోవడం. 

కనుక, చివరాఖరికి తేలేది ఒక్కటే, ఎవడి ఖర్మ వాడు అనుభవిస్తూ, ఏడుస్తూ బ్రతకడమే.

చేతనైతే ఈ జనాలకు, ఈ పొల్యూషన్ కు, దూరంగా పోయి మనదేశంలోనే బ్రతకడం,  లేదంటే విదేశాలకు పారిపోయి అక్కడ బ్రతకడం, ఈ రెండూ కాకపోతే, మన ఖర్మ అనుకుని ఏడుస్తూ ఇక్కడే ఇదే సొసైటీలో బ్రతకడం. ఈ మూడే చివరికి మిగులుతున్నాయి.

పబ్లిక్ మాత్రం భరించలేనంత చౌకబారుగా, లేకిగా తయారౌతున్నారనేది వాస్తవం ! దీనికి కారణాలెన్నున్నప్పటికీ, వాటిని ఎవరూ ఏమీ చేయలేనంతగా కుళ్లిపోతున్నాయనేది కూడా వాస్తవమే !

read more " అసహ్యమేస్తున్న పబ్లిక్ జీవితం "

27, జూన్ 2026, శనివారం

నేను సన్నాసుల్లో కలుద్దామనుకుంటున్నాను

ఈ మధ్య ఒక అపరిచితునినుంచి ఫోనొచ్చింది. సంభాషణ రసవత్తరంగా జరిగింది. మీకందరికీ కూడా తెలియాలని పోస్ట్ చేస్తున్నాను.

'హలో' అనగానే, ఎవరో అపరిచితుడు 'నాకు దీక్ష కావాలి' అన్నాడు సూటిగా.

'ఏం దీక్ష ? ఎందుకు?' అన్నాను.

'చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి' అన్నాడు.

'ఎవరికి?' అడిగాను.

'నాకే' అన్నాడు.

'దీక్షతో ప్రాబ్లమ్స్ పోతాయని ఎవరు చెప్పారు?' అడిగాను.

దానికి సమాధానం చెప్పకుండా 'నేను సన్నాసుల్లో కలుద్దామనుకుంటున్నాను' అన్నాడు.

'కలువ్. దానికి నా పర్మిషనెందుకు?' అన్నాను.

'మీదగ్గర దీక్ష తీసుకుని కలుద్దామని' అన్నాడు.

'దీక్షకూ సన్నాసుల్లో కలవడానికి సంబంధం లేదు' అన్నాను.

దీక్ష అనగానే, 'సరే ఇస్తాం. ఫలానా రోజున వచ్చేయ్, పనీపాటా లేకుండా ఇక్కడే ఉందువుగాని ' అనకపోయేసరికి అతనికి కోపం వచ్చేసింది.

'ఇంతకూ మీదగ్గరేముంది?' అన్నాడు.

'నాదగ్గర చాలా ఉన్నాయ్. అవన్నీ నీకు పనికిరావు. నీకేం కావాలోచెప్పు' అన్నాను.

'చెబుతున్నాగా. ఎన్నిసార్లు చెప్పాలి?' అన్నాడు దురుసుగా.

'అసలు నీ సమస్య ఏంటో చెబితే కదా తెలిసేది?' అన్నాను.

'మా ఆవిడ ఇంట్లోంచి వెళ్ళిపోయింది' అన్నాడు.

'పోతే పోనీ పీడా వదిలింది' అన్నాను.

'అదికాదు. ముగ్గురు పిల్లలున్నారు' అన్నాడు.

'నువ్వు పెంచు. నీ పిల్లలేగా?' అన్నాను.

'మరి తన పిల్లలు కారా?' అడిగాడు కోపంగా.

'ఏమోమరి నాకేం తెలుసు?' అన్నాను.

'వేరేవాడితో లేచిపోయింది' అన్నాడు.

'ఇన్నేళ్ల తర్వాత నీలో ఏం నచ్చలేదో మరి?' అన్నాను.  

'వాళ్లిద్దరూ కనిపిస్తే చంపేస్తాను' అన్నాడు.

'అందుకే కనపడకుండా దాక్కున్నారు' అన్నాను.

'ఎంతకాలం దాక్కుంటారు?' అన్నాడు.

'అది నాకెలా తెలుస్తుంది? అయినా, కోర్టు వాళ్లనే సపోర్ట్ చేస్తుంది' అన్నాను.

'ఏమీ చెప్పలేనోడివి నువ్వేంది సన్నాసం ఇచ్చేది?' అన్నాడు.

'నేనిస్తానని ఎప్పుడన్నాను? అయినా, మీ ఇద్దరూ వదిలేస్తే పిల్లల్నెవరు చూస్తారు?' ప్రశ్నించాను. 

'దేవుడు చూసుకుంటాడు' అన్నాడు.

'ఏ దేవుడు?' అడిగాను.

'ఎవరో ఒక దేవుడు' అన్నాడు.

'కనేది మీరూనూ, చూసుకునేది దేవుడా?' అడిగాను.

దానికి సమాధానం చెప్పకుండా, 'మరి నువ్వేం చేస్తావు?' అడిగాడు ఏకవచనంలోకి దిగుతూ.

'నేనా? సన్నాసులకు పెళ్లిళ్లు చేస్తాను' అన్నాను.

'అదేంటి?' అన్నాడు.

'నీలాంటి సన్నాసికి అర్ధం కాదులే' చెప్పాను.

'అదేంటి? ఇంకా కాలేదుగా?' అన్నాడు.

'అవ్వక్కర్లేదు. నువ్వు ఆల్రెడీ అదే, నిన్ను నువ్వు గుర్తించుకో. చాలు' అన్నాను.

ఫోన్ కట్ అయిపోయింది.

దీక్షలూ, సన్యాసాలూ పిల్లాటలై పోయాయి. ప్రతివాడూ ఒక కాషాయవస్త్రం కట్టుకుంటూ ఉండటంతో దాని విలువే పోతున్నది. మన హిందూమతంలో ఒక సెంట్రల్ గవర్నింగ్ బాడీ అంటూ లేకపోవడంతో, ఒక కట్టుబాటు, ఒక అదుపు అంటూ లేకపోవడంతో, ఎవడు పడితేవాడు  ఏదో ఒకటి చెబుతూ ఉండటంతో, ఇలాంటివాళ్లకు అసలు తమ మతమంటే ఏమిటో తెలీకుండా తయారైంది.

కోరికలు తీరడానికి దీక్షలు, పూజలు, గుళ్ళు, గోపురాలు, మంత్రాలు, తంత్రాలు, ఇవే హిందూమతమని కోట్లాదిమంది భ్రమిస్తున్నారు. అంతేగాని, అదేంటో, అదేమి చెబుతున్నదో, ఎలా బ్రతకమని చెబుతున్నదో ఎవరికీ పట్టడంలేదు. ప్రతివాడూ తన ఇష్టానుసారం అన్నీ చేస్తూ, ఒక బొట్టు పెట్టుకుని, ఒక గుడికెళ్ళి వస్తే చాలు, ఒక పూజ చేస్తే చాలు, అన్నీ అయిపోతాయి, ఇదే హిందూమతం అనుకోవడమే నేడు హిందూమతానికి పట్టిన అతిపెద్ద దరిద్రమని నా ఉద్దేశ్యం.'

'ఎర్రగుడ్డలేసుకుని కూచుంటే చాలు, లైఫు సెటిలైపోతుంది. ఆపైన మనల్ని పోషించాల్సిన పని సమాజానిదే. ఇదే సన్నాసం' అని చాలామంది ఇలాంటివాళ్ళు ఊహిస్తుంటారు. అలాంటివాళ్ళు దేశమంతా తిరుగుతూ అడుక్కుంటూ ఉండే దొంగసాధువులలో కలవాలి. 

సన్యాసం అని స్పష్టంగా పలకలేనివాడికి, బాధ్యతలను నెరవేర్చలేనివాడికి , సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనలేనివాడికి, కుటుంబాన్ని దాని ఖర్మకొదిలేసి జల్సాగా గాలికి తిరగాలనుకునేవాడికి సన్యాసమేంటసలు? సన్యాసమనేది ఎంత చీప్ అయిపోయిందో? అసలు, ప్రతివాడికీ సన్యాసార్హత ఉందా? ఉంటుందా?

ఇలాంటి సన్నాసులకు మళ్ళీ సన్నాసమెందుకసలు?

read more " నేను సన్నాసుల్లో కలుద్దామనుకుంటున్నాను "

26, జూన్ 2026, శుక్రవారం

మీ పిల్లలే మీ శత్రువులు

మొన్న పూనాలో, నిన్న బెంగుళూరులో జరిగిన సంఘటనలు, మన సంతానమే మన శత్రువులని ఋజువు చేస్తున్నాయి. 

అందరూ అలాగే ఉంటారా? అంటే, ఉండకపోవచ్చు. కానీ, మెజారిటీని బట్టి అలా అనవలసి వస్తున్నది. నేటికాలంలో, సంతానం చేతుల్లో బాధలుపడకుండా, 'మా పిల్లలతో మేము హాయిగా సుఖంగా న్నాము' అని ఏ తల్లిదండ్రులైనా చెప్పగలరా? గుండెమీద చేయివేసుకుని, నిజాయితీగా అలా చెప్పగలిగిన వాళ్లకు లక్షరూపాయలు బహుమతిగా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను.

ఖర్మకాలితే తనవారే తనకు శత్రువులౌతారు. దీనిని వివరించే ఆణిముత్యంలాంటి సంస్కృతసుభాషితం ఒకటున్నది.

శ్లో||ఋణకర్తాపితా శత్రుర్మాతా చ వ్యభిచారిణీ
భార్యా రూపవతీ శత్రు: పుత్రఃశత్రురపండితః ||

అప్పులు మిగిల్చిపోయిన తండ్రి, వ్యభిచారిణియైన తల్లి, అందమైన భార్య, పండితుడు కాని కుమారుడు - ఈ నలుగురూ తన శత్రువులని ఈ సుభాషితం అంటుంది.

పై శ్లోకంలో కూతుళ్ళ గురించి లేదు. ఎందుకంటే, అప్పట్లో వారికి స్వతంత్రం లేదు. కనుక వారితో సమస్య లేదు. కానీ ప్రస్తుతం ఏ కుటుంబంలో చూచినా సమస్యలన్నీ కూతుళ్లు కోడళ్లతోనే. అంటే ఆడపిల్లలతోనే. ప్రతికూతురూ ఒకింటి కోడలేగా ! అలాగే, ప్రతి కోడలూ ఒకింటి కూతురేగా ! 

ఇప్పుడు ఆడపిల్లలు కూడా చక్కగా చదువుకుంటున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. బయట ఊళ్లలో, హాస్టళ్లలో ఉంటున్నారు.  అంతవరకూ బాగానే ఉంది. కానీ, ఎల్కేజీ నుంచే స్నేహాలెక్కువయ్యాయి. అదేంటని అడిగితే, అడిగినవారిని అడవిమనుషుల్లాగా చూస్తున్నారు. తల్లిదండ్రులను లెక్కచేయడం లేదు. సమాజంలో అంతటా అతిస్వాతంత్య్రం వెల్లివిరుస్తోంది. ఇష్టం వచ్చినట్లు సహజీవనాన్ని, సహకారజీవనాన్ని కోర్టులు కూడా సమర్ధిస్తున్నాయి. ఒక్కసారి మేజర్ అయ్యాక, "ఎవడైతే నాకేంటి?" అనే ధోరణి ఎక్కువైపోయింది.

ఒకప్పుడు తండ్రి, భర్త లేదా అన్నల సంరక్షణలో ఆడపిల్లలు ఉండేవారు. కానీ, ఇప్పటివారికి ఏ సంరక్షణా అవసరం లేదు. ఒకప్పుడు మగాడి దౌర్జన్యానికి ఆడది బలైపోతూ ఉండేది. నేడు ఆడది రోడ్డెక్కి అల్లరిచేస్తుంటే మగాడు ఇంట్లోదూరి దాక్కోవాల్సి వస్తోంది.

చదువులు, ఆర్థికస్వాతంత్య్రం, పదవులు, హోదాలు, బయట పరిచయాలు అన్నీ మంచివే. కానీ ఎంతవరకు? సంస్కారం లేని చదువులెందుకు? హద్దులు తెలియని స్నేహాలెందుకు? అవసరాలు తప్ప ఆప్యాయతలు లేని బంధుత్వాలెందుకు? కనీస మానవత్వం కూడా లేని ఈ బ్రతుకులెందుకు?

పూనా కేసులోగాని, బెంగుళూరు కేసులో గాని నేరస్తులు, డ్రామస్తులు, కూతుళ్లే. బాధితులేమో తల్లిదండ్రులు.

మొదటికేసులో, కాబోయే భర్తను మాత్రమే ఆ అమ్మాయి చంపేసింది. అదికూడా అంత క్రూరంగా లోయలోకి తోసేసి మరీ ! రెండవకేసులో తల్లిని, తండ్రిని, చెల్లెలిని ముగ్గురినీ  స్పాట్లో పొడిచి పారేసింది. ఎవరికోసం? నిన్నగాక మొన్న పరిచయమైన ఒక క్రైస్తవ అపరిచితుడికోసం.

డబ్బు, స్వార్ధం, విలాసాలు, సరదాలు, పైశాచికత్వం తప్ప చాలామంది నేటి ఆడపిల్లలలో ఇంకేమీ కనిపించడం లేదు. స్త్రీసహజ గుణాలైన నెమ్మది, ఓర్పు, ప్రేమతత్త్వం, జాలిగుండె ఇవేవీ ఎవరిలోనూ కనిపించడం లేదు. తల్లిదండ్రులంటే ప్రేమ లేకపోతే మానె, కనీసం కృతజ్ఞత, విశ్వాసం  లాంటివి కూడా ఉండటం లేదు.

ఒకరకంగా చూస్తే,  ఈ ట్రెండ్ మంచిదే. వినాశనం త్వరగా వస్తుంది. అంతా అయిపోయాక గానీ మనకు బుద్ధిరాదు కదా ! నిజానికి ఏ ట్రెండునూ వెనుకకు మరలించలేం. అందరం ముందుకే పోవాలి, అదెక్కడికి తీసుకుపోయినా సరే !

మరొక్క పాతికేళ్లలో పెళ్లిళ్లు, పిల్లలు  మొదలైనవేవీ ఉండకపోవచ్చు.  కేవలం, సహజీవనాలు, సహకార జీవనాలు, వస్తుమార్పిళ్ళలాగా వ్యక్తిమార్పిళ్లు మాత్రమే ఉంటాయేమో?

చూద్దాం, అప్పటిదాకా మనం బ్రతికుంటే !

read more " మీ పిల్లలే మీ శత్రువులు "

22, జూన్ 2026, సోమవారం

యోగా డే - 2026


నిన్న అంతర్జాతీయ యోగదినోత్సవం గనుక, ఆ సందర్భంగా దేశవిదేశాలలో ఉన్న "పంచవటి" సభ్యులు, నా పోరును భరించలేక మొక్కుబడిగా  యోగాసనాలను అభ్యాసం చేసినట్టు కాసేపు నటించి ఫోటోలకు ఫోజులిచ్చారు.

నరేంద్రమోదీగారి ప్రయత్నం వల్ల జూన్ 21 International Yoga Day గా నిర్ణయించబడింది. యోగా అనేది ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన బహుమతి అనిన విషయం అధికారికంగా నిర్ధారణ అయింది. లేకపోతే, యోగాను కూడా "ఇది మాదే" అనడానికి ఇతర దేశాలు మతాలు గతంలో ప్రయత్నాలను చేశాయి. కొన్నిదేశాలలో అయితే కొన్ని ఆసనాలకు కాపీరైట్ ను కూడా కొంతమంది తీసుకున్నారు. 

అయితే, నిన్న యోగా చేసినవాళ్లు, ఫోటోలకు పోజిచ్చినవాళ్లు ప్రతిరోజూ చేస్తున్నారా అంటే, సందేహమే. వాళ్ళ దేహాలను, అవి వంగలేక అవస్థపడుతున్న తీరులను చూస్తుంటే వాళ్ళు యోగాను ఎంత రెగ్యులర్ గా చేస్తున్నారో ఎవరికైనా అర్థమౌతోంది.

కాకపోతే ఒకటి ! పూర్తిగా మర్చిపోవడం కంటే, ఎప్పుడో కాసేపైనా చెయ్యడం కొంతలో కొంత మంచిది కదా ! ఇదొక్కటి తప్ప ఈ మొక్కుబడి యోగాకు విలువేమీ లేదు.

మోదీగారికి మాత్రం ప్రణామమే ! నెహ్రూలాంటి ప్రధానమంత్రులు మన దేశపు సంస్కృతిని, మతాన్ని, పక్కనపెట్టే ప్రయత్నము, ఇంకా చెప్పాలంటే నాశనం చెయ్యాలనే ప్రయత్నమూ  చేస్తే, మోదీగారు స్వయంగా కలకత్తావీధులలో కొచ్చి, యోగా చేస్తున్న వారి మధ్య తిరుగుతూ, వారిని ప్రోత్సాహపరిచారు. ఇదెంత గొప్పవిషయం !  అంతేగాక, రామకృష్ణులు, వివేకానందస్వామి, అరవిందులు, లాహిరీమహాశయులను తన మెసేజిలో ప్రస్తావించారు. ఈ దేశపు ప్రధానమంత్రి అంటే ఇలా ఉండాలి ! నెహ్రూలాగా, ఇందిరాగాంధీలాగా ఉండకూడదు.

ఇప్పుడు కూడా యోగా చేయనివాళ్ళు, ఈ పండుగలో పాలుపంచుకోనివాళ్ళు చాలామంది ఉన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ముస్లిములు,  ప్రతిపక్షాలు దీనికి దూరంగా ఉన్నారు. ఎక్కడో కొద్దిమంది చేసి ఉండవచ్చు. కానీ అందరూ చేయలేదు. వాళ్ళుంటున్న దేశసంస్కృతి గురించిన కనీసగౌరవం అంటూ ఏమైనా వీరికి ఉందా అని సందేహం కలుగుతోంది. వాళ్ళ భావజాలం ఎంత లోలెవల్లో ఉందో అర్థమౌతోంది.

మంచి అలవాట్లు తేలికగా రావు. అప్పుడప్పుడూ చెయ్యగానైనా కొన్నాళ్ళకో  కొన్నేళ్లకో అలవాటౌతాయి. ఈలోపల మనల్ని పట్టుకుని ఉన్న బద్దకం అనే రాక్షసిని వదిలించుకోవాలి. కనీసం ప్రయత్నం చేయాలి. అప్పుడే ఆరోగ్యమైనా, ఏదైనా మనకు దక్కుతుంది.

జిమ్ములు చేసి హార్ట్ ఎటాక్స్ తెచ్చుకుని కుప్పకూలి పోకండి. ఇంట్లోనే యోగాభ్యాసం చేసి నూరేళ్లు ఆరోగ్యంగా జీవించండి.

ప్రస్తుతానికి ఇంతే చెప్పగలం !

read more " యోగా డే - 2026 "

16, జూన్ 2026, మంగళవారం

U.G - 11 (అమనస్కస్థితి)

9-7-1963 నుండి 9-7-1967 వరకూ జరిగిన నాలుగేళ్ళ కాలంలో యూజీగారి జీవితం గొప్ప మలుపులు తిరిగింది.

ఆ సమయంలో ఆయన జాతకంలో శుక్ర శుక్ర బుధ దశనుండి శుక్ర కుజ శని దశ వరకూ నడిచింది.

1963 సెప్టెంబర్ లో లండన్ రామకృష్ణా మిషన్ సెంటర్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయన పారిస్ చేరుకున్నాడు. ఒక గమ్యమంటూ లేకుండా తిరుగుతూ ఉండేవాడు. ఇండియాకు ఉన్న తన తిరుగుప్రయాణపు టికెట్టును అమ్మివేయగా 350 పౌండ్లు వచ్చాయి. ఘనానందస్వామి ఇచ్చిన 50 పౌండ్లు ఉన్నాయి. ఆ డబ్బుతో పారిస్ లోని ఒక చిన్నహోటల్ రూములో ఉంటూ, డిసెంబర్ వరకూ కాలక్షేపం చేశాడు. రోజుకొక్క ఛీజుముక్కను మాత్రం తినేవాడు. అదే ఆయన ఆహారం.

అప్పట్లో ఫ్రాన్స్ అధ్యక్షుడైన చార్లెస్ డి గాల్ "360 రకాల ఛీజులను చేసే దేశాన్ని పాలించడం చాలా కష్టం' అనేవాడు. ఈ మాటను వినిన యూజీగారు ఫ్రాన్స్ లో అన్ని రకాల ఛీజులుంటాయా? అనిన సందేహంతో రోజుకొక కొత్తరకం ఛీజును తింటూ ఉండేవాడు.  నిజంగానే రోజుకొక కొత్తరకం ఛీజు చొప్పున ఏడాదికి 365 రకాల ఛీజులను అక్కడ తయారు చేస్తారు. ఆ విధంగా ఆ మూడునెలలు గడిచాయి.

ఆ సమయంలో ఆయనకు శుక్ర శుక్ర శని నుండి శుక్ర శుక్ర బుధ దశ వరకు నడిచింది. శుక్రుడంటే కేతువని, శుక్ర - శని అంటే శుక్ర - కేతువులేనని ముందే చెప్పి ఉన్నాను. వాళ్ళేం చేస్తారో కూడా గత పోస్టులో చెప్పాను.  ఇక, బుధుడు బుద్ధికారకునిగా ఈయన యొక్క బుద్ధిని సూచిస్తున్నాడు. 12-3 భావాల అధిపతిగా అంతచ్చేతనను, భావవ్యక్తీకరణను సూచిస్తాడు. కనుక శుక్ర శుక్ర బుధ దశలో భావవ్యక్తీకరణ తగ్గిపోయింది. దానికసలు అవకాశమే లేదు.

లండన్ వీధులలో తిరిగినట్లే పారిస్ వీధులలో కూడా గమ్యరహితంగా తిరుగుతూ ఉండేవాడాయన. ఆ తిరగడానికి ఒక అర్ధమేమీ ఉండేది కాదు. కాసేపిక్కడ, కాసేపక్కడ, ఈ విధంగా అన్నిచోట్లకూ గాలికి ఎగురుతున్న ఎండుటాకులా ఆయన పరిస్థితి ఉండేది.

కుండలిని ఒక మనిషిలో నిద్రలేచిందంటే ఊరకే కూచోదు. ఆ మనిషి మెదడు, సెంట్రల్ నెర్వస్ సిస్టం, హార్మోన్ సిస్టం, ఎండోక్రిన్ గ్రంధులు అన్నీ సమూలమైన మార్పులకు లోనౌతాయి. ఈ రోజున్నట్లుగా రేపు ఆ మనిషి ఉండడు. రోజురోజుకూ మారిపోతూ ఉంటాడు. అతని మనసుకూడా అతని అదుపులో ఉండదు. అతని భావజాలమంతా సమూలమైన మార్పులకు లోనౌతుంది. చివరకు మనసే లేకుండా పోతుంది. అలాంటి మార్పులను తెస్తుంది కుండలిని. ఒక్కొక్కసారి ఈ ప్రక్రియలో గుండె ఆగిపోయి ప్రాణాలకే ప్రమాదం వస్తుంది.

అందుకే కుండలిని అంటే ఆటలు, మాటలు కాదు. కుండలిని నిజంగా నిద్రలేస్తే ఇక నీ ఒళ్ళు నీ అదుపులో ఉండదు. ప్రతిరోజూ ఎన్నో మార్పులు నీ దేహంలో జరిగిపోతూ ఉంటాయి. అవి సుఖంగా ఏమీ  ఉండవు. వాటిని నువ్వు ఆపలేవు. కేవలం ప్రేక్షకపాత్రగా చూస్తూ ఉండటం తప్ప, ఆ నరకం అనుభవించడం తప్ప, నువ్వు ఏమీ చేయలేవు. అవధూతస్థితికి ముందు స్థితి అలా  ఉంటుంది.

చాలామందికి ఈ విషయాలన్నీ తెలీక, కుండలిని అంటే ఏదో పిల్లచేష్టలనుకుంటూ ఉంటారు. రోజూకాసేపు ముక్కు మూసుకుని అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తే చాలు కుండలిని నిద్రలేస్తుంది, వెంటనే మన ఇష్టదేవత మన ఎదురుగా ప్రత్యక్షమై వరాలిచ్చేస్తుంది. లేదా మోక్షం వచ్చి ఒళ్ళో కూచుంటుంది. అనుకుంటారు. అలా ఏమీ జరగదు. జరుగుతుందని ఎవరైనా చెబితే అది పక్కా మోసమే.    

సరే, చేతిలో ఉన్న 400 పౌండ్లు ఆ విధంగా అయిపోయాక, మళ్ళీ సమస్య మొదటికొచ్చింది. ఏం చెయ్యాలి? అన్న ప్రశ్న ఎదురైంది. చెయ్యటానికేమీ లేదు. చెయ్యాలని మనసూ లేదు. చివరికా స్థితిలో, జెనీవాలో ఉన్న ఇండియన్ కాన్సులేట్ కు వెళ్లి, తన పరిస్థితిని వివరించి, తనను ఇండియా పంపించెయ్యమని వారిని అడిగాడాయన. వాళ్ళు కుదరదన్నారు.

ఈ సంభాషణనంతా అక్కడున్న వాలెంటైన్ డి కెర్విన్ అనే ఒక స్టాఫ్ మెంబర్ వింటూ ఉన్నది. నిజానికి ఎంబసీలో ఆమె ఒక భాషా అనువాదకురాలుగా పనిచేస్తున్నది. ఆ రోజున ఫ్రంట్ డెస్కులో ఉండవలసిన స్టాఫ్ సెలవు పెడితే, ఆ స్థానంలో ఆమె పనిచేస్తున్నది. యూజీగారు ఎంబసీవారితో మాట్లాడుతూ ఉండటమంతా ఆమె విన్నది. యూజీగారి నిజాయితీ ఆమెకు నచ్చింది. ఆయనపైన ఆమె జాలిపడింది. వెంటనే ముందుకొచ్చి, ఈ సమస్య తేలేవరకూ తనతో బాటు తన ఇంట్లో ఉండవచ్చని యూజీగారిని ఆహ్వానించింది.

వాలెంటైన్ గారి జాతకాన్ని ఆమె జీవితాన్ని ఇంకొక సీరీస్ లో పరికిద్దాం. ప్రస్తుతానికి ఒక చిన్నమాటను మాత్రం చెప్తాను. వాలెంటైన్ ఒక మామూలు వనిత కాదు. ఆమె ఒక కారణజన్మురాలు. అమ్మవారి అంశ ఆమెలో ఉంది. కనుకనే ముక్కూ ముఖం తెలియకపోయినా, నమ్మి యూజీగారికి ఆమె ఆశ్రయాన్ని కల్పించింది. అంతేకాదు, ఒకసారి ఆయనేమిటో అర్ధమయ్యాక, తనకు తండ్రినుండి సంక్రమించిన ఆస్తిని, తన పెన్షన్ ను, అంతటినీ కలిపి ఒక ట్రస్ట్ ను ఏర్పరచి, తనున్నా లేకపోయినా, యూజీగారికి నెలఖర్చులకు జీవితాంతం ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఆమె ఏర్పాటు చేసింది. ఆ విధంగా 1963 లో మొదలైన వారి విచిత్రబంధం 1991 లో తన 90 వ ఏట ఆమె బెంగుళూరులో చనిపోయేవరకూ నిరాఘాటంగా కొనసాగింది.

ఆమె చనిపోయాక, ఆమె డైరీలను వెతుకుతుంటే, అందులో యూజీగారిని గురించి ఆమె వ్రాసుకున్నది బయటపడింది. యూజీగారిని ఆమె ఎలా అర్ధం చేసుకున్నదో ఆమె మాటలలోనే చూద్దాం. ఆమె ఫ్రెంచి భాషలో వ్రాసుకున్న మాటలకు ఇంగ్లీషు అనువాదం  ఇది.

"Where can I find a man like him? I have at last met a man, a man the like of whom can be met very rarely"

ఇది తెలుగు అనువాదం.

"ఇటువంటి మనిషి ఎక్కడ దొరుకుతాడసలు? ఎట్టకేలకు నేనొక నిజమైన మనిషిని కలుసుకున్నాను. ఇటువంటి మనుషులను చాలా అరుదుగా మాత్రమే మనం కలుస్తాం".

ఇంకొక సందర్భంలో, యూజీగారి గురించి హిందీనటి పర్వీన్ బాబీతో మాట్లాడుతూ వాలెంటైన్ ఇలా అన్నారు, 

"I have known a lot of men in my life; he is the kindest man I have known in my life."

(నా జీవితంలో ఎంతోమందిని నేను చూచాను.  నేనెరిగిన అందరిలోకీ ఈయన అత్యంత దయాహృదయుడు).

యూజీగారిని ప్రపంచానికి అందించే నాటకంలో ఒక ముఖ్యపాత్ర వాలెంటైన్ కు ఇవ్వబడింది. అది ఆమె అదృష్టం. జగజ్జనని ఆ పాత్రకు ఆమెను ఎన్నుకుంది.

ఎలాగైతే, 1893 సంవత్సరంలో, చేతిలోని పత్రాలు పోగొట్టుకుని, దిక్కులేని పరిస్థితిలో శోషవచ్చి చికాగోలో రోడ్డుపైన పడిపోయే స్థితిలో ఉన్న వివేకానందస్వామిని మేరీ హేల్ అనే అమెరికన్ వనిత రక్షించి, తన ఇంటిలోనికి తీసుకెళ్లి మంచినీళ్ళిచ్చి ఆదుకున్నదో, అదేవిధంగా 1963 డిసెంబర్లో యూజీగారికి కూడా వాలెంటైన్ అనే యూరోపియన్ వనిత  ఆసరాగా నిలబడి ఆదుకుని సంరక్షించింది. 

70 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే సంఘటన పునరావృతమైంది. ప్రాంతాలు వేరు కావచ్చు, వ్యక్తులు వేరు కావచ్చు, కానీ స్పందించిన ఇద్దరూ స్త్రీమూర్తులే కావడం, అందులోనూ నిస్వార్ధప్రేమమూర్తులు కావడం వింతలలో వింత ! కాళికామాత లీలలంటే ఇలాగే ఉంటాయి మరి !

చొక్కాలో దాచిపెట్టిన బూడిదను గాల్లోంచి తీసినట్టు నటిస్తూ బయటకు తియ్యడం,  రాళ్లముక్కలను మింగి, తెముల్చుకుని, లింగాలంటూ వాటిని కక్కడం, బూడిదతో అద్భుతాలు చెయ్యడం, కీబోర్డు వాయించి రోగాలు తగ్గించడం, గ్రానైట్ రాయితో వీపుమీద ఇస్త్రీచేసి కేన్సర్ తగ్గిస్తాననడం, నెత్తిమీద చెయ్యిపెట్టి శక్తిపాతం చేస్తానని డబ్బులు కాజెయ్యడం, చిన్నమస్త, ప్రత్యంగిర మొదలైన పేర్లు చెప్పి, దయ్యాలని, భూతాలని, చేతబడులు, హోమాలు అని మాయమాటలు చెప్పి జనాన్ని బురిడీ కొట్టించడం ఇలాంటి పిచ్చిచేష్టలు అసలైన అద్భుతాలు కావు. 

పిచ్చిజనాల్లారా ! అసలైన అద్భుతాలంటే ఇవి ! కాస్త కళ్ళు తెరిచి చూడటం నేర్చుకోండి !

మనకధలో ముందుకెళదాం !

ఆ విధంగా వాలెంటైన్ సంరక్షణలోకి యూజీగారు వచ్చారు. ఒక వారం తర్వాత, "మేము మా ఖర్చులతో మిమ్మల్ని ఇండియాకు పంపించలేము. అది సాధ్యం కాదు" అని ఎంబసీ వాళ్ళు చెప్పేశారు. ఇక ఆయన వాలెంటైన్ తోనే ఉండిపోయాడు. మిగిలిన కథ అంతా చంద్రశేఖర్ బాబు, మహేష్ భట్, ముకుందరావు, మొదలైనవారు వ్రాసిన యూజీగారి జీవితం గురించిన పుస్తకాలలో చూడండి. వాళ్ళు ఆయనను బాగా ఎరిగినవాళ్లు, ఆయనతో ఎన్నో ఏళ్ళు జీవించినవాళ్లు. అదంతా వివరించి చాలా బాగా వ్రాశారు.

ఇకపోతే, నిద్రలేచిన కుండలినీశక్తి, ఆయన దేహంలో తనపనిని తాను చేసుకుంటూ పోతోంది.

కుండలిని ముఖ్యంగా పెద్దమెదడు, చిన్నమెదడు, కేంద్రనరాల వ్యవస్థ, గ్రంధుల వ్యవస్థలపైన పనిచేసి వాటి పనితీరులలో సమూలమైన మార్పులు తెస్తుంది. ఈ ప్రక్రియలో దేహం అతలాకుతలమై పోతుంది. మెడికల్ సైన్సుకు అంతుబట్టని అనేక విచిత్రమార్పులు ఆ వ్యక్తిలో జరుగుతాయి.

మన దేహంలో పినియల్, పిట్యూటరీ, హైపోతాలమస్ అనే గ్రంధులు మెదడులో ఉంటాయి. ఇవి సహస్రార ఆజ్ఞాచక్రాలకు స్విచ్చుల వంటివి. థైరాయిడ్, పారాథైరాయిడ్ గ్రంధులు గొంతుభాగంలో ఉంటాయి. ఇవి విశుద్ధచక్రానికి సంబంధించబడినవి. థైమస్ గ్రంధి ఛాతీమధ్యలో గొంతుభాగం క్రిందుగా ఉంటుంది. ఇది అనాహతచక్రానికి సంబంధపడి ఉంటుంది. పాంక్రియాస్ గ్రంధి మణిపురచక్రంతో ముడిపడి ఉంటుంది. గోనాడ్ గ్రంధులు స్వాధిష్టానచక్రంతో ముడిపడి ఉంటాయి. ఎడ్రినల్ గ్రంధులు మూలాధారచక్రానికి చెందినవి.

కుండలిని నిద్రలేచిందంటే ఈ గ్రంథుల పనితీరులో సమూలమైన మార్పులొస్తాయి.

జాగృతకుండలిని వల్ల యూజీగారి దేహంలో అనేకమైన మార్పులు జరుగుతూ ఉండేవి. ఆయా గ్రంధులు ఉబ్బి ఆయన చర్మంపైన రకరకాల రంగులలో కనిపించేవి. అర్ధనారీశ్వర తత్వాన్ని ప్రతిబింబిస్తూ ఆయన దేహంలోని ఎడమభాగం స్త్రీలాగాను, కుడిభాగం పురుషునిలాగాను మారిపోయింది. ఆయన ఛాతీ కూడా ఎడమవైపు స్త్రీ కున్నట్లు, కుడివైపున పురుషుని లాగాను ఉండేదట. రెండుకళ్ళల్లో కూడా కుడికన్ను ఒక విధంగా, ఎడమకన్ను మరొక విధంగా ఉండేదట. ఈ విధంగా యోగగ్రంధాలలో చెప్పబడిన మార్పులన్నీ ఆయన దేహంలో స్పష్టంగా బయటకే కనిపిస్తూ ఉండేవి. అమావాస్య పౌర్ణమి రోజులలో ఆయన దేహం అతలాకుతలమై పోతూ ఉండేది. ఇతరులకూ తనకూ భేదం ఆయనకు తెలిసేది కాదు. తన దేహమే తనకు కనిపించేది కాదు. అసలు తను బ్రతికున్నానా, చనిపోయానా కూడా తెలిసేది కాదు.

ఆయన దేహమంతా విద్యుత్తు ప్రవహించడం మొదలైంది. ఆయన తన రెండు అరచేతులను రుద్దుకుంటే చక్కుమని మెరుపులు వెలిగేవి. నిద్రలో పక్కమీద దొర్లితే ఆ గదిలో మెరుపులు మెరిసేవి. తన పక్కమీద ఉన్న నైలాన్ బట్టవల్ల అలా స్టాటిక్ విద్యుత్తు ఏర్పడుతున్నదేమో అనిన అనుమానంతో పక్కగుడ్డలను మార్చేసి, కాటన్ దుప్పట్లను వేసినప్పటికీ అదే విధంగా జరుగుతూ ఉండేది. కాళ్లలోనుంచి విద్యుత్తు ఎర్త్ అవుతుంటే, దానిని ఆపడానికి ఆయన ఇంట్లో కూడా చెప్పులేసుకుని నడిచేవాడు. స్నానం చేద్దామని షవర్ కింద నిలబడితే, నీళ్ళు తగలడంతోనే ఒళ్ళంతా కరెంట్ షాకు కొట్టేది.

ఆయన ప్రతిరోజూ చనిపోతూ ఉండేవాడు. ఒళ్ళంతా క్రమంగా బిగుసుకుపోయి, ఎగశ్వాస మొదలై, ఊపిరి ఆగిపోయేది. సరిగ్గా 48 నిమిషాల తర్వాత మళ్లీ ఆయన దేహం మామూలుగా పనిచెయ్యడం మొదలుపెట్టేది. ఇలా ప్రతిరోజూ జరిగేది.

ఈ మార్పులన్నీ ఈ నాలుగేళ్ళ కాలంలో అంచెలంచెలుగా ఆయన దేహంలో వచ్చేశాయి.

మనకు తెలిసి, ఇటువంటి స్థితులను పొందినవాళ్ళు చరిత్రలో ఇంకా ఇద్దరున్నారు.  రామకృష్ణులకు కూడా ఇదేవిధంగా జరిగేది. మళ్ళీ, 'ఆనందమయి మా' కు కూడా ఇవే మార్పులు జరిగినట్లు మనం ఆమె జీవితంలో చూడవచ్చు.

కుండలిని అంటే ఇలా ఉంటుంది.

ఇదంతా ఆయన యొక్క యూరోపియన్ స్నేహితులు, సన్నిహితులు దగ్గరగా గమనించి చూచారు. ఎందరో డాక్టర్లు, శాస్త్రవేత్తలు వీటిని పరిశీలించారు. వారికేమీ అర్ధం  కాలేదు.

ఈయనలోని ఈ మార్పులను గమనించిన నవీనకాలపు యోగపితామహుడు తిరుమలై కృష్ణమాచార్య, 'ప్రస్తుతం జీవించి ఉన్న అత్యున్నతుడైన యోగి' గా యూజీగారిని గురించి చెప్పేవారు.

"మీలో జరుగుతున్న మార్పులు నా ఊహకు అనుభవానికి మించి ఉన్నాయని" కృష్ణమాచార్యగారి తనయుడు మరియు హఠయోగంలో పండిపోయిన ఆచార్యుడు దేశికాచారి గారు అనేవారు.

యూజీగారిలో జరిగిన మార్పులను గురించి వినిన కంచి పరమాచార్యులవారు "ఇది జీవన్ముక్త స్థితి" అని  అన్నారు.

శృంగేరి శంకరాచార్యులైన అభినవ విద్యాతీర్ధులవారు యూజీగారి స్థితిని చూచి, "ఈ స్థితులను మా గురువుగారైన చంద్రశేఖర భారతీస్వామివారిలో చూచాము. మరలా మీలో చూస్తున్నాము" అన్నారు. అంతేగాక,  ఇలా అంటూ యూజీగారికి ఆయన సాష్టాంగనమస్కారం చేశారని చంద్రశేఖర్ గారు నాతో అన్నారు.

కనుక, అలాంటివారికి మాత్రమే ఆయన యొక్క స్థితి ఏమిటో తెలుస్తుంది. మనబోటివారికి అటువంటి స్థితులు ఎలా అర్ధమౌతాయి? 

ఇప్పుడు కొద్దిగా జ్యోతిషశాస్త్రం వైపు దృష్టి సారిద్దాం.

సాధనాపరంగా చూచినపుడు గ్రహాలను గురువర్గం శుక్రవర్గం అని రెండువర్గాలుగా విభజించవచ్చు. ఒకటేమో దేవతావర్గం, రెండవది దానవవర్గం. శుక్రాచార్యుడు దానవగురువు. ఆయనకు మృతసంజీవినీవిద్య తెలుసు. దేవగురువుకు కూడా అది తెలియదు. మృతసంజీవని అంటే కుండలినీవిద్యనే. అజ్ఞానంలో పడిఉన్నవాళ్ళు చచ్చినవాళ్ళకిందే లెక్క. జ్ఞానులైనవాళ్లు బ్రతికినవాళ్లు. అజ్ఞానిని జ్ఞానిగా మార్చేది కుండలిని. అంటే, చనిపోయినవాడిని బ్రతికిస్తుంది.

అందుకే, యూజీగారి జాతకంలో కూడా శుక్రదశలోనే కుండలినీజాగృతి జరిగింది. కుండలినీశక్తిని సూచించే రాహుకేతువులు కూడా, మన పురాణాల ప్రకారం రాక్షసులేనని మనం గుర్తుంచుకోవాలి.

ఈ  విధంగా నాలుగేళ్లు గడిచాయి. 1967 సంవత్సరం వచ్చేసింది. జూలై నెల 9 వ తేదీ యూజీగారి పుట్టినరోజు. ఆరోజున సానెన్ లో తన ఇంటిని ముందున్న ఒక చెస్ట్ నట్ చెట్టుక్రింద ఒక బెంచీమీద ఆయన కూచుని  ఊరకే శూన్యంలోకి చూస్తున్నాడు. ఆ సమయంలో ఒక పెద్ద విస్ఫోటనం ఆయన దేహంలో జరిగింది. అది ఒక ఆటంబాంబు పేలుడు లాంటిది. ఆ రోజునుంచీ ఏడురోజులపాటు ఆయనలో అనేక మార్పులు చకచకా జరుగుతూ వచ్చాయి. ఏడవనాటికి అవి పూర్తయ్యాయి. అప్పటివరకూ ఆయనకున్న మనస్సు నాశనమైపోయింది. ఆలోచన పూర్తిగా అంతరించింది.

బుద్ధునికి రావిచెట్టు క్రింద జ్ఞానోదయమైంది. రావిచెట్టు బ్రహ్మ-విష్ణు-శివుల సమ్మిళిత స్వరూపం. యూజీగారికి చెస్ట్ నట్ వృక్షం క్రింద అమనస్కస్థితి సిద్ధించింది. మహనీయులకు అటువంటి స్థితులను అందించిన వృక్షాలకు కూడా చాలా ప్రాముఖ్యతలుంటాయి. అయితే అవి అందరికీ అర్ధం కావు.

ఈ చెట్టును సంస్కృతంలో నాగకేసర వృక్షమంటారు. నాగాహ్వ, అహిపుష్ప అనికూడా  అంటారు. నాగకేసరమనే మాట కుండలినీశక్తికి, వికసించిన యోగచక్రాలకు సూచిక. ఆ చెట్టు క్రిందనే యూజీగారికి అటువంటి స్థితి కలగడం కాకతాళీయం ఏమాత్రం కాదు. అది ప్రకృతి చేసిన ఒక మార్మిక ఏర్పాటు మాత్రమే.

ఇక్కడ మరొక్క విషయాన్ని చెప్తాను. రామకృష్ణులు నాగకేసరపుష్పాలను చాలా ఇష్టపడేవారు.

అప్పటివరకూ యూజీగారిని ఆయన మనస్సు నడుపుతూ వచ్చింది. ఆ క్షణంనుంచి అది నశించిపోయింది. విశ్వమంతా నిండి ఉన్న ఏదో ఒకశక్తి ఆయన దేహాన్ని తన అదుపులోకి తీసుకొని, సూటిగా దానిని నడపడం మొదలుపెట్టింది. దాని పనిముట్లు దేహంలోని ఎండోక్రిన్ గ్రంధులు. ఆయనలోని పినియల్, పిట్యూటరీ గ్రంధులు పూర్తిగా ఉత్తేజితాలై, విశ్వశక్తికి ప్రతిస్పందిస్తూ, ఆయన  దేహాన్ని తమ కంట్రోల్ లోకి తీసుకుని నడపడం మొదలుపెట్టాయి. ఇన్నాళ్లూ ఆ పనిని మనసు చేస్తూ ఉండేది. ఇప్పుడు విశ్వశక్తి, గ్రంధుల వ్యవస్థ దానిని తమ చెప్పుచేతలలోకి తీసుకున్నాయి.

యోగపరిభాషలో ఈ రెండుగ్రంథులను 'ఆజ్ఞాచక్రం (పిట్యూటరీ గ్రంధి), సహస్రారచక్రం (పినియల్ గ్రంధి)' అంటారు. ఆజ్ఞాచక్రానికి రెండుదళాలున్నాయని యోగశాస్త్రం అంటుంది. ఆ దళాలే పిట్యూటరీగ్రంథిలోని రెండు లోబ్స్ (యాంటీరియర్ లోబ్ లేదా ముందుభాగం, పోస్టిరియర్ లోబ్ లేదా వెనుక భాగం). ఇవి ఒక గింజలోని రెండు పప్పులలాగా ఉంటాయి. పిట్యూటరీ గ్రంధి దేహంలోని మాస్టర్ గ్లాండ్. అంటే దేహంలోని ప్రతిభాగాన్నీ, ప్రతిగ్రంథినీ ఇది కంట్రోల్ చేయగలదు. ఆజ్ఞాపించి నడిపించగలదు. అందుకే దీనిని "ఆజ్ఞాచక్రం" అన్నారు.

ఆజ్ఞాచక్రం జాగృతమైతే దేహంలో ఇదంతా జరగాలి. కానీ, క్రియాయోగులమని, కుండలినిని సాధించామని, లోకలోకాలు సూక్ష్మశరీరంతో తిరుగుతామని గప్పాలు కొట్టుకునే నేటి జోకర్లలో ఎవడిలోనూ ఈ మార్పులు కనిపించవు. అందుకే ప్రతివాడూ, "నాకు ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అయింది, కుండలిని లేచింది" అని చెబుతుంటే నాకు చచ్చే నవ్వొస్తూ ఉంటుంది. "మీ కర్మ ! అనుభవించండి" అనుకుంటూ ఉంటాను.

మన కధలోకొద్దాం.

దేనికోసమైతే దాదాపు 40 ఏళ్లుగా తాను వెదుకుతున్నాడో ఆ జ్ఞానోదయం అనేదేమీ అసలు లేనేలేదని యూజీగారికి అర్ధమైపోయింది.  తన మనసే తనకు అడ్డు అని అర్ధమైంది. ఆ మనసే ధ్వంసమైపోయింది. ఆ క్షణంలోనే ఆయన యొక్క వెదుకులాట అంతమైపోయింది. అమనస్కస్థితి ఆయనకు సిద్ధించింది.

చాలామంది "రాజయోగం" అనేమాటను తెలిసీ తెలియకుండా వాడేస్తూ ఉంటారు. సాంఖ్య, తారక, అమనస్కయోగాల కలయికకే రాజయోగమని పేరు. వీటిల్లో ఒకదానికంటే మరొకటి పైమెట్లలో ఉంటాయి. అమనస్కయోగాన్ని సాధించినవాడే రాజయోగి అనిన పదానికి అర్హుడు.

కనుక, యూజీగారు ఒక రాజయోగి అని చెప్పాలి. అందుకే ఆయన ఒక రాజులాగానే బ్రతికాడు. రాజులు సంపాదించరు. సేవకులు  మాత్రమే సంపాదిస్తారు. రాజులకు సంపాదనతో అవసరం ఉండదు. కానీ, దేనికీ వారికి లోటుండదు. యూజీగారి జీవితమే దీనికి సజీవతార్కాణం.

ఉన్నమాటను ఉన్నట్లుగా చెప్పాలంటే,  పరమహంస తోతాపురి, త్రైలింగస్వామి,  రామకృష్ణులు, రమణమహర్షి, జిల్లెళ్ళమూడి అమ్మగారు, యూజీగారు మొదలైనవారే నిజమైన రాజులు, చక్రవర్తులు. వీరిముందు, ప్రపంచపు రాజులు, రాజ్యాధినేతలు, కేవలం సేవకులు మాత్రమే.

ఇకపోతే, జ్ఞానోదయమైనవాడికి అది జ్ఞానోదయమని తెలియదు. ఆత్మజ్ఞానికి తాను ఆత్మజ్ఞానినని తెలియదు. అదే ఆ స్థితియొక్క విచిత్రం. అందుకే జిల్లెళ్ళమూడి అమ్మగారు తరచూ "నాది తెలిసీ తెలియని స్థితి" అంటూ  ఉండేవారు.

యూజీగారైతే ఇంకొక అడుగు ముందుకేసి అసలు ఆత్మజ్ఞానమనేదే లేదు పొమ్మన్నారు. నిజమే కదా ! ఆత్మలయమైనవాడికి ఆత్మజ్ఞానమెలా మిగిలి ఉంటుంది?

ఇంకా చెప్పాలంటే, సాధనామర్గంలో ఉన్నది మనోలయం, మనోనాశాలు మాత్రమే. అప్పుడు మిగిలేదానిని 'ఆత్మ' అనుకుంటే అభ్యంతరమేమీ లేదు. కానీ ఆ ఆత్మ అనేది ఒక ఆకారమూ కాదు, ఒక స్థితీ కాదు. మరేమిటది? అదేంటో దానికే  తెలుసు. లేదా, దానిక్కూడా తెలీదేమో? మనకు మాత్రం దానిసంగతి ఏమీ తెలియదు. తెలుసుకోవడం సాధ్యం కాదు కూడా !

స్థూలంగా చెప్పాలంటే, మనల్ని నడిపించేది మన మనస్సు. మనస్సంటే ఏమిటి? జ్ఞాపకాల గుట్ట. జ్ఞాపకాన్ని నియంత్రించే మెదడు భాగం ఏమిటి? ఒకటి కాదు. చాలా ఉంటాయి. అవన్నీ కలసి జ్ఞాపకాలను దాచిపెడతాయి, మళ్ళీ గుర్తు చేస్తాయి, అదే దారిలో మనల్ని నడిపిస్తాయి. ఆ భాగాలేంటి? Hyppocampus, Amygdala, PFC, Cerebellum లు ఈ పనిని చేస్తాయి. వాటికి కావలసిన స్రావాలను పినియల్, పిట్యూటరీ గ్రంధులు విడుదల చేస్తాయి. అప్పుడు జ్ఞాపకాల పరంపర మనల్ని నడిపిస్తూ ఉంటుంది. దీనికే మనసు అని పేరు.

అయితే, ఈ వ్యవస్థ అంతా మన జీన్ కోడ్ ను బట్టి నడుస్తుంది. దానికే సంస్కారాలని పేరు. గతజన్మలలో మనం చేసిన పనులు, ఆలోచించిన ఆలోచనలే జీన్ కోడ్ రూపంలో ఉంటాయి. వాటికి తగిన తల్లిదండ్రులకే మనం పుట్టడం జరుగుతుంది. మన జీవితాలు కూడా ఈ జీన్ కోడ్ ను బట్టే నడుస్తుంటాయి. దీనినే గతజన్మసంస్కారాలని వేదాంత - యోగ పరిభాషలో పిలుస్తారు. 

ఈ విధంగా, కోటానుకోట్ల జీవులకు ఎక్కడా పొల్లుపోకుండా వారివారి జన్మజన్మాంతరాలలో జరుగుతూ ఉంటుంది. దీనినంతా కొంచెంకూడా తేడా రాకుండా  కోట్ల ఏళ్లనుంచీ నడిపిస్తున్న మహాశక్తినే జగన్మాత, జగజ్జనని, ఆదిశక్తి అని మనం పిలుస్తున్నాము.

మామూలు మనుషులకైతే ఇదంతా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. కుండలినీశక్తి నిజంగా జాగృతమైన యోగులలో అయితే, ఈ వ్యవస్థ అంతా తారుమారౌతుంది. వారి మెదడులోని అన్నిభాగాలు, కేంద్రాలు, గ్రంధులు అన్నీ పూర్తిగా నిద్రలేచి పనిచేయడం మొదలుపెడతాయి. ఒక క్రొత్తవ్యవస్థ వారి దేహాన్ని తన చెప్పుచేతలలోకి తీసుకుంటుంది. ఇక, వారి దేహంపైన వారికి నియంత్రణ ఉండదు. వారి మనస్సు ఆగిపోతుంది గనుక, విశ్వశక్తి వారిదేహాన్ని నడిపించడం మొదలుపెడుతుంది.

మనస్సు లేదు గనుక, లోకాన్ని వారు చూచేతీరు మారిపోతుంది. వారి ఇంద్రియానుభూతులు మారిపోతాయి. వారి జీవనవిధానం అంతా ఒక క్రొత్తపంథాను అనుసరిస్తుంది. వారి గతం అంతరిస్తుంది. ప్రతిక్షణం వారికి క్రొత్తగానే ఉంటుంది. ఒక అప్పుడే పుట్టినపిల్లవాడు చూచినట్లు లోకాన్ని వారు చూస్తుంటారు. వారి సంగతి వారికే అర్థంకాకుండా ఉంటుంది.  కుండలినీ జాగృతి మనిషిలో ఇన్ని మార్పులను తీసుకొస్తుంది.

ఆ రోజున యూజీగారికి ఇదే జరిగింది. ఇప్పుడు దీనివెనుక ఉన్న జ్యోతిష్యకోణాలను పరికిద్దాం.

9-7-1967 న యూజీగారి జాతకంలో శుక్ర కుజ శని బుధ శని దశ నడిచింది. చతుర్ధాధిపతిగా శుక్రుడు మనస్సును సూచిస్తాడు. కేతువుతో కలసినందువల్ల మనస్సు ధ్వంసమైపోయింది. కుజుడు పంచమాధిపతి. అంటే  బుద్ధిని సూచిస్తాడు. అక్కడున్న నీచరాహువు వల్ల బుద్ధి నాశనమైపోయింది. శని సప్తమ, అష్టమాధిపతి. మనస్సును బుద్ధిని సూచించే చంద్రబుధులతో కలసి నీచరాహువుచేత చూడబడుతున్నాడు. రాహువంటే కుండలినీశక్తి గనుక దాని జాగృతివల్ల అవి రెండూ మాయమయ్యాయి. 

అంటే, పైన చెప్పిన మెదడులోని భాగాలన్నీ  ఆజ్ఞాచక్రం (పినియల్/ పిట్యూటరీ గ్రంధుల) కంట్రోల్ లోకి వెళ్లిపోయాయి. ఇక బుధుడేమో బుద్ధికారకుడు, పైగా 12-3 భావాల అధిపతిగా భావవ్యక్తీకరణ లోపించడాన్ని సూచిస్తున్నాడు. తనలో ఏమి జరుగుతున్నదో దానిని ఏ యోగీ బయటకు చెప్పలేడు. చెప్పినా, అది వాళ్ళ అనుభవంలో లేదు గనుక, వినేవాళ్లకు అది అర్ధం కాదు.

కనుక, ఆనాటి దశ యూజీగారిలో జరిగిన కుండలినీజాగృతిని, తత్ఫలితంగా ఆయనకు సిద్ధించిన అమనస్కస్థితిని స్పష్టాతిస్పష్టంగా సూచిస్తున్నది.

ఆనాటి (9-7-1967) గోచారగ్రహాలను పరికిద్దాం.

చతుర్ధమైన తుల రాహుకేతువులచేత కొట్టబడుతూ, మనోనాశాన్ని సూచిస్తున్నది. జననచంద్రునిపైన ఉచ్ఛగురువు సంచరిస్తూ ఉత్తమగజకేసరీయోగాన్నిస్తున్నాడు. జాతకంలో ఉచ్ఛగురువు ఉండటం ఒక అదృష్టయోగం. ప్రస్తుతం కూడా గోచారగురువు ఉచ్చస్థితిలోనే ఉన్నాడు. రవిబుధులు 12 వ భావంలో పడి, బుద్ధినాశనాన్ని సూచిస్తున్నారు. 9 వ భావమైన మోక్షరాశిలో శని ఉంటూ, సిద్ధిని సూచిస్తున్నాడు. యూజీగారి జాతకంలో సర్వాష్టకవర్గులో  మీనమేషాలకు అత్యధికంగా 37 మరియు 40 బిందువులొచ్చాయి. అక్కడే గోచార శనిరాహువులున్నారు.

పై విశ్లేషణను బట్టి, ఆనాడు యూజీగారికి అమనస్కసిద్ధి కలిగిందని స్పష్టంగా గోచరిస్తున్నది. అందుకే ఆయన చెప్పినదంతా కుదించి కొద్దిమాటలలో చెప్పాలంటే, ఆయన మాటలలోనే Mind is a myth అని చెప్పవలసి వస్తుంది.

అయితే ఆయనలాంటి మనుషులు ఆమాటను చెబితే ఒక అర్ధముంటుంది. మనలాంటి వాళ్లూ, 24 గంటలూ మనసులో పడి కొట్టుకుంటున్నవాళ్లూ ఆ మాటను అంటే బాగోదు. హాస్యాస్పదంగా ఉంటుంది.

అందుకే ఆయన మనకు అర్ధం కాడు. మనస్సు పరిధిలో మాత్రమే  బ్రతకడానికి అలవాటు పడినవాళ్లకు, మనస్సును దాటిన భూమికలో నిరంతరం ఉండేవాళ్ళు ఎలా అర్ధమౌతారు?

అసలు మనం ఆయనను అర్ధం చేసుకోవలసిన అవసరమేముంది? మనం అర్ధం చేసుకోకపోతే ఆయనకొచ్చిన నష్టం మాత్రం ఏముంటుంది?

అటువంటి మనుషులకు, ఒకళ్ళు వారిని అర్ధం చేసుకుంటే ఎంత? అర్ధం చేసుకోకపోతే ఎంత? ఎవడెట్లా పోతే వాళ్లకేంటసలు?

read more " U.G - 11 (అమనస్కస్థితి) "

14, జూన్ 2026, ఆదివారం

U.G - 10 (కుండలిని - రాహుకేతువులు - తపస్వీయోగం)

చంద్రశేఖర్ గారు యూజీగారి స్మృతులను వ్రాస్తూ 'బ్రహ్మణస్పతి యోగం' అనే ఒక జ్యోతిషయోగాన్ని ఉటంకించారు.

జ్ఞానచక్రవర్తి బిరుదాంకితులైన సత్యనారాయణగారనే జ్యోతిష-వేదపండితుడొకాయన యూజీగారి జాతకాన్ని చూచి, ఆ సమయంలో (ఒకానొక సమయంలో యూజీగారు బెంగుళూరు మైసూరులను సందర్శించినప్పుడు) ఆయన జాతకంలో ఆ యోగం నడుస్తున్నదని అన్నాడు. దీనివల్ల ఈయన యొక్క సాధన ఇంకా లోతులను అందుకుంటుందని, బహుముఖతా విస్తరిస్తుందని, లోకప్రఖ్యాతి కలుగుతుందని ఆయన జోస్యం చెప్పాడట. అలాగే జరిగిందని చంద్రశేఖర్ గారు వ్రాశారు.

జ్యోతిశ్శాస్త్రంలో నాకున్న స్వల్ప అనుభవంలో అటువంటి యోగమెక్కడా నాకు గోచరించలేదు. కాకపోతే, శాస్త్రం అనంతం గనుక, పాండిత్యం కూడా ఆనంతమే గనుక, సత్యనారాయణ గారు దానినెక్కడ చూచారో మనకు తెలియదు గనుక, సందేహలాభాన్ని (benefit of doubt) ఆయనకు ఇచ్చివేసి మనం ముందుకెళదాం.

రాహుకేతువులకు కుండలినీశక్తికి ఉన్న సంబంధాన్ని ఇప్పుడు గమనిద్దాం.

జ్యోతిషశాస్త్రంలో రాహుకేతువులను ఒక మహాసర్పంగా భావిస్తాము. దానికే కాలసర్పమని పేరు.  అంటే, కాలానికే మరొక పేరు రాహుకేతువులు. కాలానికి అతీతుడైన మనిషి ఈ భూమ్మీద లేడు గనుక, ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, అందరూ రాహుకేతువుల అదుపులో ఉన్నవారేనని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే కాలసర్పం నోటిలో చిక్కుకుని ఉన్నవారమే అందరమూ.

సర్పానికి తలా తోకా ఉంటాయి. భూమికున్న ఉత్తరదక్షిణ ధ్రువాలే అవి. భూమియొక్క ఉత్తర అయస్కాంతధృవం రాహువైతే, దక్షిణం కేతువౌతుంది. మనం "కాలము" అంటున్నప్పుడు, అది భూమిపైన మనకు అనుభవంలోకి వస్తున్న కాలంగానే మనం చూడవలసి ఉంటుంది. ఇతర గ్రహాలలో ఇతర లోకాలలో ఉన్న కాలప్రమాణాలు మనకు అవసరం లేదు. మనవరకే మనం చూడాలి. అలాంటప్పుడు, భూమిని చుట్టుకుని ఉన్న ఒక మహాసర్పంగా రాహుకేతువులను మనం భావించవచ్చు. నిజానికి అవి రెండూ భూ-అయస్కాంత శక్తులే.

కుండలినీజాగృతి జరగాలంటే జాతకంలో రాహుకేతువులు ఉచ్ఛస్థితిలో గాని, నీచస్థితిలో గాని ఉండాలని ఇంతకుముందు వ్రాశాను. అయితే, రాహువు వృషభంలో ఉండటానికీ, మిథునంలో ఉండటానికీ తేడా ఉంటుంది. అదే విధంగా నీచలో ఉన్నపుడు వృశ్చికంలో ఉండటానికీ, ధనుస్సులో ఉండటానికీ చాలా తేడా ఉంటుంది. కేతువుక్కూడా ఇంతే అవుతుంది. వాటిని బట్టి ఆయా జాతకుల సాధనావిధానాలు, వారికి కలిగే ఫలితాలు రకరకాలుగా ఉంటాయి.

సాధారణంగా చెప్పాలంటే, ఉచ్ఛజాతకులకు భక్తిమార్గం బాగా యోగిస్తే, నీచజాతకులకు జ్ఞానమార్గం యోగిస్తుంది. భక్తిలోనైనా, జ్ఞానంలోనైనా కుండలినీజాగృతి లేకుండా సాధన ముందుకు కదలదు. అయితే వారి దృష్టి భక్తిమీదనో జ్ఞానసిద్ధిమీదనో ఉంటుంది గాని, కుండలినిని  వారు పట్టించుకోరు. ఒక్క యోగమార్గంలో మాత్రమే దానికి విలువనివ్వడం, సూటిగా దానితో డీల్ చెయ్యడం ఉంటుంది. మిగతావారు దీనిని పట్టించుకోరు.

రాహువేమో అనుభవాలను సూచిస్తే, కేతువు వాటికి అతీతమైన స్థితిని సూచిస్తాడు.  రాహువు సహస్రారచక్రాన్ని, కేతువు మూలాధారాన్ని సూచిస్తారు. వీరు ఉచ్ఛస్థితిలో  ఉంటే జీవితాన్ని పూర్తిగా అనుభవించిన తర్వాత కుండలినీజాగృతి  కలుగుతుంది. నీచస్థితిలో ఉంటే, జీవితం మొదట్లోనే అనేక ఎదురుదెబ్బలు, గందరగోళాలు జరిగి, జీవితంపైనా మనుషులపైనా విసుగుపుట్టి వైరాగ్యంవైపు మరలుతారు. ఆ ఫలితంగా కుండలినీజాగృతి కలుగుతుంది. ఈ విధమైన తేడాలు జాతకాలలో ఉంటాయి.

ఆయా జాతకాలలో ఉన్న మిగతా గ్రహస్థితులను బట్టి, రాహుకేతువులపైన వారి దృష్టులను, ప్రభావాలను బట్టి వారివారి దారులుంటాయి.

యూజీగారి జాతకంలో రాహుకేతువులు వృశ్చిక - వృషభరాశులలో నీచస్థితిలోను, చంద్రుని నుండి రాహువు బుద్ధిస్థానంలో ఉండటంతో ఆయనది జ్ఞానమార్గపు ఛాయ అయింది. 

నాకు తెలిసినంతవరకూ యూజీగారి జాతకంలో బ్రహ్మణస్పతి యోగం కంటే, తపస్వీయోగం బలంగా ఉన్నది. ఈ యోగాన్ని గురించి జైమినీమహర్షి యొక్క జ్యోతిషసూత్రములలో  మనకు కనిపిస్తుంది.

సూ || శనిదృష్టే తపస్వీ ప్రేష్యో వా || (జైమిని సూత్రములు 1:2:36)

కారకాంశకు జైమినిమహర్షి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చాడు. కారకాంశలో ఉన్న కేతువును శని చూస్తూ ఉన్నట్లయితే ఆ జాతకుడు తపస్విగాని, సేవకుడు గాని అవుతాడని ఆయనన్నాడు. ప్రతి ఉద్యోగీ ఒకవిధంగా సేవకుడేగాని, ఇక్కడ సేవకుడంటే చిన్న ఉద్యోగని అర్ధం చేసుకోవాలి. 

శనికేతుయోగం దరిద్రాన్నిస్తుంది. అది కర్మఫలితంగా వచ్చేది కావచ్చు, లేదా ఖర్మకాలి తను ఆహ్వానించేది కావచ్చు. తపస్సుకు కేతువు, సేవకత్వానికి శనీ కారకులు. కనుక మహర్షి ఈ విధమైన సూత్రాన్ని మనకు ఇచ్చారు.

గతకర్మవల్ల ఈ యోగం ఏర్పడితే, చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటూ, ఒకరిక్రింద ఊడిగం చేసుకుంటూ, డబ్బుకోసం ఇబ్బంది పడుతూ, దరిద్రంలో బ్రతికే పరిస్థితి వస్తుంది. ఖర్మకాలి వచ్చే పనైతే, అన్నీ ఉన్నప్పటికీ, నిరాడంబరంగా బ్రతకడం, తినగలిగి ఉన్నా ఉపవాసాలుంటూ మాడటం, లంకంత కొంప ఉన్నా, ఒక చిన్నరూములో చాప వేసుకుని పడుకోవడం, లేదా ఆస్తులన్నీ వదులుకుని ఒక ఆశ్రమంలో ఉండటం, ఒంటిపూట తినడం మొదలైనవి జరుగుతాయి. అది ఆరోగ్యం కోసం కావచ్చు, సాధనగా కావచ్చు. ఎలాగైతేనేమి, చివరకు ఇలాగే  జరుగుతుంది. 

గ్రహాలమధ్యన ఉన్న పఞ్చవిధసంబంధాల వల్ల యోగాలేర్పడతాయి. భారతీయ జ్యోతిషశాస్త్రమంతా గ్రహయోగాలపైననే ఆధారపడి ఉంటుంది. జాతకంలోని యోగాలను సరిగ్గా గుర్తించడం వస్తే, జ్యోతిషంలో పట్టు చిక్కినట్లే అవుతుంది. ఈ విషయాన్ని పాతపోస్టులలో వివరించాను. కనుక, శనికేతువుల మధ్యనున్న ఐదువిధాలైన సంబంధాలవల్ల తపస్వీయోగం ఏర్పడుతుందని స్థూలంగా అర్ధం చేసుకోవచ్చు.

యూజీగారి విషయంలో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

యూజీగారి జాతకంలో లగ్నం, శనికేతువుల అర్గళంలో ఉన్నది. కేతువు 12 వ భావంలో నీచస్థితిలో ఉంటూ శుక్రుడినే సూచిస్తున్నాడు. శుక్రునితో కలసి ఉన్నాడు. ఈ విధంగా వీరి జాతకంలో తపస్వీయోగం ఏర్పడింది.

అందుకనే, 1961 లో శుక్రదశ మొదలు కావడంతోనే ఆయన "సంపాదన" అనే మాటను తన జీవితంలోనుంచి తీసివేశాడు. ఆయన దగ్గర డబ్బులు, ఆస్తిపాస్తులు ఏమీ లేవు. కానీ సంపాదన పైన ఆసక్తి పోయింది. ఎలా బ్రతకాలి? ఏమో? దానికి జవాబు లేదు. కానీ సంపాదన పైన ఇచ్ఛ లేదు. ఇచ్ఛలేనపుడు చెయ్యడం ఎలా సాధ్యమౌతుంది? కాదు. అందుకని ఆయన డబ్బు సంపాదించే ప్రయత్నాలేమీ చేయలేదు. అప్పటికాయనకు కేవలం 43 ఏళ్లే. చేతిలో ఒక్క రూపాయి లేకుండా ఆయన జీవితం నుండి రిటైర్ అయిపోయాడు. కానీ, చీకూచింతా లేవు. ఇది తపస్వీయోగ ప్రభావం.

ఆ తరువాత ఆయన 46 ఏళ్ళు బ్రతికాడు. కాణీ సంపాదన లేదు. కానీ, సాధారణ జీవనానికి ఎక్కడా లోటురాలేదు. ఆ విధంగా ఆయనను చూచుకునేవారిని జగన్మాత ఎక్కడికక్కడ ఏర్పాటు చేసింది.

పైగా, 1963 లో కుండలినీజాగృతి కలిగిన సమయంలో ఆయనకు నడిచిన దశకూడా శుక్ర శుక్ర శని శుక్ర శుక్ర దశనే. ఈ జాతకంలో కేతువు శుక్రుడిని సూచిస్తున్నాడు. కనుక అది కేతు శని దశనే అవుతుంది. అందుకే, అప్పటినుండి తపస్వీయోగం ఆయన జీవితాన్ని ఆక్రమించింది.

అంతేకాదు, 1963 మే నెలలోనే గోచారంలో కూడా ఇదేయోగం మొదలైంది. ఆ సమయంలో కేతువు ధనుస్సులోకి వచ్చి ఉచ్ఛస్థితిని అందుకున్నాడు. మకరంలో ఉన్న శని తన వక్రత్వం వల్ల ధనుస్సులోకి వచ్చి కేతువును కలసినట్లే అవుతుంది. జూలై నెల వచ్చేసరికి, మిధునం నుండి వీరిని శుక్రుడు చూస్తున్నాడు. కనుక సంసారం దూరం కావడం, కుండలినీజాగృతి, అమనస్కస్థితి మొదలైనవన్నీ వెంటవెంటనే జరిగిపోయాయి. ఇవన్నీ తపస్వీయోగ ప్రభావాలే.

గోచారగురువు కూడా దీనికి ఆసరాగా ఉంటూ, నవమభావంలో స్వస్థానంలోకి వచ్చి, జననకాలచంద్రుడిని, అక్కడున్న బుధశనులను చూస్తున్నాడు. ఇది తీవ్రవైరాగ్యాన్ని, అంతర్ముఖత్వాన్ని ఇచ్చింది.  

ఈ విధంగా యూజీగారి జాతకంలో, మిగిలిన యోగాలకంటే తపస్వీయోగప్రభావం చాలా ఎక్కువగా పనిచేసిందని చెప్పాలి.

ఆయనకు అమనస్కస్థితి సిద్ధించిన 9-7-1967 న కూడా ఇదేయోగం ఏ విధంగా పనిచేసిందో ఇప్పుడు గమనిద్దాం.

(ఇంకా ఉంది)

read more " U.G - 10 (కుండలిని - రాహుకేతువులు - తపస్వీయోగం) "