నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

4, ఫిబ్రవరి 2009, బుధవారం

బుగ్గ సంగమేశ్వర ఆలయం



గుంతకల్లు దగ్గరలో కసాపురానికి కొంచం దూరంలో బుగ్గ అనే చోటుంది. రాయలసీమలో నీటి వసతి అనంతపురం జిల్లాలో తక్కువ. అలాంటి నేలలో, అన్ని కాలాల్లో స్వచ్చమైన నీరు ఉబికే ఊట బావి ఈ బుగ్గ అనబడే ప్రదేశం. దీని దగ్గరలో సంగమేశ్వర ఆలయం అనే శివాలయం ఉంది. ఇది ఎన్నో వేల ఏళ్ల నాటి ఆలయం.

విజయ నగర రాజుల సేనాపతి ఒకడు దీనిని పునరుద్ధరించిన శాసనాలు ఇక్కడ ఉన్నాయి. ఆయన ఇక్కడ నందీస్వరునికి ఒక ఆలయం కట్టించాడు. ఈ ప్రదేశం కొండ గుట్టల్లో ఉంది. రాత్రికి పూజారులు తాళాలు వేసి వారి ఊరికి పోతారు. అతి ప్రశాంతం నిర్మానుష్యం అయిన ఈ చోటు ధ్యానానికి చాలా అనుకూలం. ఇక్కడ సిద్దేశ్వర మటం అని ఒక ఆశ్రమం ఉంది. దీనిలో ఉండే ఇద్దరు సోదరులు భూగృహంలో ధ్యాన మందిరం ఏర్పాటు చేసుకొని అందులో దిగి పైన తలుపు మూసుకొని ధ్యానం లో ఉంటారు.

ఈ బుగ్గ గురించి ఒక కథ శాసనం మీద ఉంది. ఒక బ్రాహ్మణుడు ఏదో బాధా నివారణ కోసం తిరుగుతూ ఉండగా, కాశీలో ఒక సాధువు ఒక కర్రను గంగలో వేసి, నీవు దక్షిణాపదానికి వెళ్ళు. అక్కడ ఏ ప్రదేశంలో నీకు ఈ కర్ర దొరికితే అదే నీ బాధలు తీర్చే చోటు అని చెబుతాడు. అతడు ఎన్నో చోట్లు తిరిగి చివరకు బుగ్గ అనబడే ఈ చోటిని దర్శించగా, అతడు కాశీ గంగలో ఒదిలిన కర్ర ఈ బుగ్గలో నించి పైకి ఉబికి వస్తుంది. అందుకని అతడు ఇక్కడే ఉండి కొంతకాలం తపస్సు చేసి బాధనించి విముక్తి పొందాడు.

ఎన్నో వందల ఏళ్ల నాటి రావి చెట్టులు ఇక్కడ ఉన్నవి. తపస్వుల ఆరాధ్య దైవం పరమేశ్వరుడు ఇక్కడ ఏకాంతంగా నిశ్చల సమాధిలో ఉన్నాడా అనిపించింది. గత జన్మలలో నేను ఇక్కడ నివసించిన అనుభూతి ఈ ప్రదేశంలో ధ్యానంలో నాకు కలిగింది.