నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

17, ఫిబ్రవరి 2009, మంగళవారం

జెన్ కథలు- అంతా శూన్యం

జెన్ కథలు - 3 : అంతా శూన్యం
----


యమోక
తేషు అనే యువకుడు జెన్ గురించి తెలుసుకోవాలని అనేక మాస్టర్ల వద్ద శిష్యరికం చేసాడు. చాలా జ్ఞానాన్ని పొందాడు. కాని తృప్తి చెందక చివరకు దోకువాన్ అనే జెన్ మాస్టర్ వద్దకు వచ్చాడు.

దోకువాన్ సమయంలో శాంతం గా కూచుని హుక్కాలో పొగ తాగుతున్నాడు.

యమోక తన జ్ఞానాన్ని ఇలా వివరించాడు. " మనస్సు, బుద్ధుడు, జీవులు - నిజానికి ఏదీ లేదు. ప్రపంచం యొక్క నిజ తత్వం శూన్యత. భ్రమ లేదు, జ్ఞానం లేదు. జ్ఞాని లేడు, అజ్ఞాని లేడు. ఇచ్చేది లెదు, తీసుకునేది లెదు..అంతా శూన్యం. "

దోకువాన్ మౌనంగా పొగ తాగుతున్నాడు. విన్నాడో లేదో కూడా తెలియటం లెదు.
హఠాత్తుగా తన కర్రతో యమోకను బాదాడు. యమోకకు పిచ్చి కోపం వచ్చింది.
"అంతా శూన్యం ఐతే, నీ కోపం ఎక్కణ్ణించి వచ్చింది?" అన్నాడు దోకువాన్.

యమోక చాలామంది గురువుల వద్ద తిరిగి శిష్యరికం చేసాడు. అతడు పుస్తక జ్ఞానాన్ని పొందాడు. శాస్త్రాలు కంఠతా పట్టి ఉన్నాడు. శ్లోకాలు పుంఖాను పుంఖాలుగా వల్లించ గలడు. బౌద్ధికంగా సత్యాన్ని అర్థం చేసుకున్నాడు. కాని అనుభవ శూన్యుడు. సాధనా బలం లేదు. ఇది తత్వ శాస్త్రాన్ని పుస్తకాలు చదివి అర్థం చేసుకుని అదే సర్వస్వం అనుకునే వారి తీరు. ఫిలాసఫీ అనేది బుద్ధి తో అర్థం చేసుకోవచ్చు. కాని జెన్ కేవలం అనుభూతి ద్వారానే తెలిసేది. అనుభూతికి పుస్తక జ్ఞానానికి సంబంధం లేదు. పై పెచ్చు పుస్తక జ్ఞానం, జెన్ అనుభూతికి ఆటంకం అవుతుంది. నానిన్ కథ లో ప్రొఫెసరు గారు తత్వ శాస్త్ర పండితుడు. కనుకనే బుర్రలో ఉన్న పుస్తక జ్ఞానం ఖాళీ చేయానిదే జెన్ ఎక్కదు అని నానిన్ పరోక్షం గా సూచించాడు.

అంతా శూన్యం అనేది నిజమే. కాని అది యమోక అనుభవ జ్ఞానం కాదు. గ్రంధాలలో చదివి చిలుక లాగా వల్లిస్తున్నాడు. ఫిలాసఫీ లో విహరిస్తూ అదే నిజమైన జ్ఞానం అని భ్రమిస్తున్నాడు. అతన్ని ఊహాలోకం లోనుండి వాస్తవ జగత్తుకు తేవడానికి దోకువాన్ కర్రతో ఒక్క బాదు బాదాడు. యమోక సాధనా బలం కలిగిన వాడితే ఆ దెబ్బతో తెలివి తెచ్చుకునేవాడు. కాని అతనికి అర్థం కాలేదు. మానవ సహజ మైన కోపం అతన్ని వశం చేసుకుంది.

నిజమైన శూన్య స్థితి అయిన No-mind అతనికి అనుభవంలో ఉంటే కోపం వచ్చేది కాదు. అసలు యమోక ఇక్కడికి వచ్చేవాడే కాదు. జ్ఞాని కాలేదు కనుకే దోకువాన్ వద్దకు వచ్చాడు. జ్ఞానం కలిగినప్పుడు ఒకరి ప్రమాణ పత్రం అవసరం లేదు. అపుడు ఎవరి వద్దకో వెళ్ళ వలసిన అవసరం కూడా ఉండదు.

అతనికి ఇంకా తెలివి కలగలేదని గ్రహించిన దోకువాన్ " అంతా శూన్యమైతే, నీ కోపం ఎక్కణ్ణించి వచ్చింది" అని అడిగాడు. అంటే, నీవు చెబుతున్న ఉన్నత సత్యం నీ అనుభవం కాదు. అది అనుభవం కానంత వరకు ఎంత చదివినా అంతా వృధా. నీవు చాలా చదివావు. కాని సాధనా పరంగా మొదటి మెట్టు కూడా ఎక్కలేదు. కనీసం ఇకనన్నా సాధన మొదలు పెట్టు అని పరోక్షంగా దోకువాన్ సూచిస్తున్నాడు.