నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

20, ఫిబ్రవరి 2009, శుక్రవారం

నవ విధ ప్రాణాయామములు


స్వాత్మారామ యోగీంద్రుని "హఠయోగప్రదీపిక" ప్రకారం ప్రాణాయామము ఎనిమిది విధములు. ప్రాణాయామమును ఆయన కుంభకం అని పెర్కొనినాడు. కుంభకం అనేది ప్రాణాయామములో ఒక ముఖ్య భాగము. పీల్చిన ఊపిరిని లోపలబిగబట్టుట అంతర కుంభకం అంటారు. వదిలిన ఊపిరిని బయటే ఉంచుట బాహ్య కుంభకం అంటారు.

బ్రహ్మచర్య పాలన లేకుండా కుంభకం ఆచరిస్తే నరాల వ్యవస్థ దెబ్బ తింటుందనీ తత్ఫలితంగా పిచ్చేక్కుతుందని,లేదా అసాధ్య రోగాలు వస్తాయనీ యోగశాస్త్రం యొక్క లోతులు తెలిసిన విజ్ఞులు చెబుతారు. 

శ్లో||సూర్య భేదన ముజ్జాయీ సీత్కారీ సీతలీ తథా
భస్త్రికా భ్రామరీ మూర్చా ప్లావినీ అష్ట కుంభకా ||

అనునది స్వాత్మారామ యోగీంద్రుడు హట యోగ ప్రదీపిక ప్రాణాయామ అధ్యాయములో చెప్పిన శ్లోకం. ఎనిమిదిరకములైన ప్రాణాయామములు క్రింద చూపిన విధంగా ఉన్నవి. 



1 . సూర్య భేదనము.
2 . ఉజ్జయీ
3 . సీత్కారి
4 . శీతలి
5 . భస్త్రిక
6 . భ్రామరి
7 . మూర్ఛ
8 . ప్లావిని

ఇవి గాక "హఠరత్నావళి" అను గ్రంథము "భుజగీకరణము" అను తొమ్మిదవ ప్రాణాయామమును చెప్పియున్నది. పాము బుసకోట్టినట్లుగా ఊపిరి పీల్చి వదలడం దీని లక్షణం. 


వీటిలో ఒక్కొక్క ప్రాణాయామానికి ఒక్కొక్క ప్రయోజనం ఉన్నది. 

సూర్యభేదనం వల్ల ఒంట్లో వేడి పుడుతుంది.దీనివల్లే హిమాలయాలలో మైనస్ డిగ్రీల వాతావరణంలో కూడా యోగులు గోచీతో ఉండగలుగుతారు. 

ఉజ్జాయి వల్ల ఊపిరితిత్తులకు శక్తి పెరుగుతుంది.ఆయాసం ఆస్మా ఈసినోఫిలియా మొ|| రోగాలున్నవారికి ఇది చాలా మంచిది.మార్షల్ ఆర్ట్స్ లో కూడా దీనిని అధికంగా వాడుతారు. కరాటే కుంగ్ఫూ లలో ఉన్న "శాంచిన్" కటా లో వాడేది ఉజ్జయి ప్రాణాయామమే. 

శీతలి వల్ల ఒళ్ళు చల్లబడుతుంది. వేసవిలోనూ,ఎండదెబ్బ తగిలి టెంపరేచర్ పెరిగినప్పుడూ,అమిత దాహంతో ఉన్నపుడూ ఇది చేస్తే వెంటనే రిలీఫ్ వస్తుంది.

భ్రామరి నాదయోగ సాధనకు సహాయకారి.క్రియాయోగం లో కూడా దీని ఉపయోగం ఉన్నది. మనస్సును అంతర్ముఖం చేస్తుంది.

మూర్చ అనేది మైండ్ ను బ్లాక్ అవుట్ చేస్తుంది. ఒకరకమైన జడసమాధిని కల్పిస్తుంది. ఏమీ తెలియని అచేతన స్తితిలోకి మనిషి వెళతాడు.

ప్లావిని వల్ల మనిషి నీటిమీద తేలగలడు.భుజగీకరణం వల్ల మనిషిలోని ప్రాణశక్తి అమితంగా వృద్ధి చెందుతుంది. కుండలినీ జాగృతి కలుగుతుంది.ఇక భస్త్రిక వల్ల చాలా ఉపయోగాలున్నాయి. ఒకటని చెప్పలేము. 

ఈ ప్రాణాయామాల సాధనకు ముఖ్యంగా గురువు యొక్క పర్యవేక్షణ , సమయం,సందర్భం,ఆహారనియమం,బ్రహ్మచర్యం అత్యంత ఆవశ్యకాలు. ఇవి లేకుండా టీవీలలో చూచి అమితంగా వీటిని ఆచరిస్తే అంతు బట్టని రోగాలు రావడమో,పిచ్చి ఎక్కడమో జరుగుతుంది. తస్మాత్ జాగ్రత.