నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

23, ఫిబ్రవరి 2009, సోమవారం

శివ తత్త్వం


ఈ రోజు శివ రాత్రి. శివ తత్వాన్ని కొంత తెలుసుకుందాం.

ప్రపంచంలొ శివ శక్తులు తప్ప వేరేమీ లేదు అంటుంది శైవం.అనగా పురుష స్త్రీ తత్వములు.దీనికి అతీత మైనది పరమెశ్వర తత్వం.



ఒకటిగా
ఉన్నదేదో అదే రెండుగా మారినది
రెండైనదే అనేకం అయింది
ఇంతే సృష్టి...
అంటారు వివేకానంద స్వామి తన లేఖలలో.


వాక్కుకు, మనస్సుకు, ఇంద్రియములకు అందని అతీత నిర్గుణ, నిరాకార, నిశ్చల స్థితిలో ఏముందో అదే శివుడు. అది ఒక స్థితి అని భావిస్తున్నామే కాని నిజానికి అది స్థితి కాదు. ఉండటానికి, లేకుండటానికి మించిన చెప్పలేని ఒక మౌనం. యతో వాచో నివర్తన్తే అప్రాప్య మనసా సహ, దేనిని అందుకోనలేక వాక్కు మనస్సులు వెనుకకు మరలుతున్నవో అది అని వేదములు వర్ణించిన భూమిక.

ప్రతి దెవత వెనుకా ఉన్నటువంటి పర బ్రహ్మ తత్వమును చూడడం వేదాంతము యొక్క ఉన్నత భావనలో ఒకటి. లయ కారకుడైన శివుని ద్వారా పర బ్రహ్మోపాసన చెయ్యడం శైవం. శివం అనగా శుభంకరము అని అర్థము. నిర్వికల్ప సమాధిలో ఏదైతే ఉన్నదో అదే శివ తత్త్వం. దానిని అనుభూతి లోనికి తెచ్చుకోవటం మానవ జన్మ ఉద్దేశం.