నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

15, ఫిబ్రవరి 2009, ఆదివారం

నాడీ జ్యోతిషం

నాడీ జ్యోతిషం- 1
------------------

నాడీ జ్యోతిషం గురించి నేడు అందరికీ తెలుసును . కాని దీని అసలు లోతు అతి తక్కువ మందికే అవగాహన ఉంది. నాడీజ్యోతిషాన్ని గురించి నాకు తెలిసిన విషయాలు వ్రాయబోతున్నాను. ఇది ఒక వ్యాసంలో అయ్యే పని కాదు. ఎన్నివ్యాసాలూ అవుతాయో తెలియదు. వ్రాసుకుంటూ పోదాం.

దీనిని దక్షిణాదిన నాడీ జ్యోతిషం అని, ఉత్తరాదిన భ్రుగు సంహిత అని పిలుస్తూ ఉంటారు. ఎవరు వ్రాసారో తెలియదు. ఎంతకాల మైనదో తెలియదు. అసలు నిజాలో కాదో తెలియదు. చాలా మంది ఇది మోసం అంటారు. కాని నిప్పు లేనిదే పొగరానట్లు, ఎంతో కొంత నిజం దీనిలో ఉందా?. ఉంటే దీని పుట్టు పూర్వోత్తరాలేమిటి ? ఇవి ఎలా వచ్చాయి ? వీటిలోరకాలేన్ని ? అన్నీ నిజాలేనా ? అన్నీ ప్రశ్నలే.

ఒక కథతో మొదలు పెడదాము. సత్యాచార్యుడు, వరాహ మిహిరుని కంటే ముందు కాలం లో జీవించిన ఒక జ్యోతిర్వేత్త. ఎందుకనగా, వరహ మిహిరుని బృహజ్జతకం లో ఆయుర్నిర్ణయ అధ్యాయములలో సత్యాచార్యుని ప్రశంస కనిపిస్తుంది. అన్ని విదానములలోకి సత్యాచార్యుని ఆయుర్ నిర్ణయ పధ్ధతి యైన " అంశాయుర్దాయ గణన పద్ధతి " ఉత్తమమనివరాహ మిహిరుడంటాడు. అనగా ఈయన వరాహ మిహిరుని కంటే చాలా ముందు వాడు. క్రీస్తు పూర్వపు వాడు కూడాకావచ్చు.

సత్యాచార్యుని ఆధునిక నాడీ జ్యోతిష్యమునకు పితామహునిగా భావిస్తున్నాము. ఈయన గురించి ఒక గాధప్రచారములో ఉంది.

సత్యాచార్యుడు జ్యోతిస్సాస్త్రమును ఔపోసన పట్టిన వాడు. మహా పండితుడు. కాని జాతక ఫలితములను నూటికి నూరుశాతము చెప్పలేక పోయేవాడు. అనేక సందేహములు పట్టి పీడించేవి. ఎందుకని ఫలితములు పూర్తిగా తెలుసుకోనలేముఅని ఆలోచన చేసేవాడు. చివరకు ఆయన గురువు ఒక సూచన చేసాడు. పరమేశ్వరుని గురించి తపస్సు చేయి. నీకుమార్గం దొరుకుతుంది అని.

సత్యాచార్యుడు శివుని గురించి ఘోర తపస్సు చేసాడు. కొన్నేళ్ళకు శివుడు ప్రత్యక్షం అయినాడు. సత్యాచార్యుడు తనసందేహాలు చెప్పి తరుణోపాయం అడిగాడు. పరమ శివుడు దరహాసంతో " వత్సా. నీవు నేర్చుకుంది స్థూల మైనజ్యోతిర్విద్య. దాని వల్ల ఫలితములు పూర్తిగా అవగతం కావు. సూక్ష్మ జ్యోతిషమని ఇంకొకటుంది. అది తెలిసినచో నీకుభూత వర్తమాన భవిష్యత్తులు కళ్ళ ముందు కనిపిస్తాయి. దీనికి నాడీ అంశ తెలియాలి. పంచ భూత తత్వమూ, కాలవిభజనము, నాడీ అంశతో అనుసంధానము చేసుకుంటే సర్వం బోధపడుతుంది." అని నాడీ విజ్ఞానమునుఅనుగ్రహించినాడు. దీనివల్ల సత్యాచార్యుడు త్రికాల జ్ఞానాన్ని పొందాడు. భవిష్యత్తులో పుట్టబోవు కోటానుకోట్ల జీవితాలుఆయన కళ్ళ ముందు దృశ్యములుగా కనిపించాయి. ఆయన వ్రాసినదే సత్య నాడి లేక ధృవ నాడి. విషయాలనుద్రువీకరించి చెబుతుంది కనుక ధృవ నాడి అయింది.

నాడీ గ్రంథములు అనేకములున్నవి. వీటిలో మార్కండేయ నాడి ఫలితములే సరియైనవని బీ వీ రామన్ గారు తన జీవితకథ లో వ్రాసారు. కౌమార నాడి, వసిష్ఠ నాడి, అగస్త్య నాడి, భ్రుగు నాడి, కాక భుసుండా నాడి ఇత్యాది అనేక నాడీ గ్రంథాలుకలవు. ఈరోజు నాడీ అనేది పెద్ద వ్యాపారం. కాని దీనిలో మోసం చేసేవారే ఎక్కువ మంది కనిపిస్తారు .

వైదీస్వరన్ కోయిల్, కంచి, మద్రాసు, కుంబకోణం, ఇంకా అనేక తమిళ నాడు నగరాలలో నాడి జ్యోతిష్కులు కనిపిస్తారు. బెంగుళూరులో కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అన్ని చోట్లా బ్రాంచిలు పెట్టి నడుపుతున్నారు. డిల్లీ లో అనేకబ్రాంచిలు కలవు. కాని వీరిలో నిజమైన నాడీ జ్యోతిష్కులు ఒక శాతం కూడా ఉండరు అనేది నిజం.