నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

5, మార్చి 2009, గురువారం

నాడీ జ్యోతిషం- నాడీ అంశను గుర్తించే విధానం


ఇంతకు ముందు వ్యాసంలో నాడీ అంశను గురించి తెలుసుకున్నాం. వ్యాసంలోదానిని గుర్తించే విధానం చూద్దాం. నాడీఅంశ 48 సెకండ్ల కాలం. దీనిని పూర్వ పరభాగములు చేసి తిరిగి నాలుగు భాగములు చేస్తే 6 సెకండ్ల కాలంలో ఒక జన్మజరుగుతుంది. ఇంతవరకు అంతా బాగానే ఉంది. అసలు సమస్య ఇక్కడే మొదలుఅవుతుంది. ఆరుసెకండ్ల కాలాన్ని ఖచ్చితంగా తెలుసుకోవడం ఎలా? దీనిలో అనేకసమస్యలున్నవి.


1. ఏ గడియారమూ సెకండ్ల స్థాయిలో సరియైన సమయం చూపించదు. కనుక మనము అనుకునే జననసమయం ఏజాతకానికీ సరియైన సమయం కాదు. కనుక నాడీ అంశ అనేదానిని ఏ మనిషికీ సరిగ్గా గుర్తించలేము.

2. అసలు జనన సమయం అంటే ఏమిటి? దీనిలో భిన్నాభిప్రాయాలు ఉన్నవి. నిషేకము, శీర్షోదయము, భూపతనము ఈ మూడింటిలో ఏది సరియైన జననం? నిషేకము అంటే గర్భంలో శుక్రకణం అండంతో కలిసి పిండముగా రూపుదిద్దుకునే ప్రారంభసమయం. ఇదే సరియైన జననసమయం అని కొందరి అభిప్రాయం.

ఇంకొందరి అభిప్రాయం ప్రకారం గర్భస్త శిశుజీవితం లెక్కలోనికి రాదు. జీవి భూమి మీదకు వచ్చినరోజు నుండి దానిజీవితం ప్రారంభం అవుతుంది. కనుక శీర్షోదయసమయం తీసుకోవడం మంచిది అంటారు. ఇంకొందరు శిశువు భూమిమీదపడే భూపతనసమయం సరియైనది అంటారు. ఈ రోజులలో ప్రసవంలో భూమిమీద ఎవరూ పడటంలేదు. ఆసుపత్రులలో, ఆపరేషను రూములో జన్మ జరుగుతున్నది. బొడ్డుకోసిన క్షణంనించే ప్రాణికి జన్మ విడిగా ప్రారంభం అవుతుంది కనుక అదే జనన సమయంగా తీసుకోవడం తార్కికం.


కనుకనే బొడ్డుకోసే సమయమే సరియైన జననసమయం అని అందరూ ఇప్పుడు అంగీకరిస్తున్న సమయం. కాని ఏ రెండు గడియారములు ఒకే సమయం చూపవు గనుక, ఎవరి జననసమయమూ సెకండ్ల స్థాయిలో సరియైనది కాదు. కనుక స్థూలసమయం జాతకం వెయ్యడానికి సరిపోతుంది కాని నాడీ జాతకానికి సరిపోదు. ఈ రోజులలోగడియారములు ఉండికూడా ఈ సమస్య పాతకాలంలో వలెనె యథాతథంగా ఉంది.

పాతరోజులలో పగలు సూర్యుని బట్టి, రాత్రి చంద్ర, నక్షత్రములను బట్టి సమయాన్ని చాలావరకూ సరిగా ఘడియలు విఘడియలలో అంచనా వేసేవారు. ఈ రోజులలో అంతటి ప్రజ్ఞ కలవారు కేరళ, తమిళనాడు, ఒరిస్సా పల్లెటూళ్ళలో అక్కడక్కడా ఉన్నారు. కాని ఈ విద్య కూడా చాలావరకు నశించిపోతున్నది. 

ప్రాచీనకాలంలో ఈ సమస్యను అధిగమించడానికి ఒక వినూత్న పద్ధతిని కనుక్కున్నారు. గ్రహములకు, నక్షత్రరాశులకు మనిషి శరీరంతో సంబంధం ఉంది. కనుక ఒక ప్రత్యెకసమయంలో పుట్టిన మనిషి శరీరంపైన ఆ సమయాన్ని ఖచ్చితంగా తెలుసుకోగలిగే గుర్తులు ఉంటవి. దీనిని సాముద్రిక శాస్త్రం అంటారని అందరికీ తెలిసిన విషయమే. ప్రతిమనిషినీ భిన్నంగా చూపేవి చేతిరేఖలు.వాటిలో కూడా బొటనవ్రేలు అతన్ని మిగిలిన వారికంటే విభిన్నముగా చూపగలదు.

నేటి సైన్సు కూడా బొటనవ్రేలిముద్ర మనిషిని గుర్తించడానికి తిరుగులేని గుర్తుగా ఒప్పుకున్నది. ప్రాచీన జ్యోతిషము ఇంకొక అడుగు ముందుకేసి పురుషులకు కుడిచేతి, స్త్రీలకు ఎడమచేతి బొటనవ్రేలిముద్రను వారికి మాత్రమె ప్రత్యేకమైనగుర్తు గా గ్రహించింది. దీనికి ప్రమాణం, "అంగుష్ఠ మాత్రో పురుషః" అనే వేదవచనం కావచ్చు.

నాడిఅంశ ఎలాగైతే ఖచ్చిత మైన జనన సమయాన్ని ఆరు సెకండ్ల వ్యవధిలో ఇస్తుందో అదేవిధంగా బొటనవ్రేలిముద్రకూడా ఒక వ్యక్తీ ప్రత్యేకతను చూపుతుంది. కనుక నాడీఅంశకు బొటనవ్రేలిమీది గీతలకు సంబంధం ఉన్నది. అందుకనే నాడీతాళపత్రమును గుర్తించడానికి బొటనవ్రేలి ముద్ర కావాలి.

మనిషి బొటనవ్రేలిమీది గీతలతో అతని మొత్తము జాతకము చెప్పే విధానం రావణసంహితలో ఉన్నది. రావణుడు వేదవేదాంగములలో గొప్ప పండితుడు. రావణసంహిత గురించి వీలైతే ముందు వ్యాసములలో చూద్దాము.

ప్రస్తుత విషయానికి వస్తే, నాడీ అంశను రెండు విధములుగా తెలుసుకోవచ్చు. ఒకటి బొటనవ్రేలి గుర్తుతో. అయితే దీనికి ప్రత్యెకశిక్షణ కావాలి. వ్రేలిమీద ఉన్న శంకులు, చక్రాలు, ఇతర వంపులు, చిన్న మచ్చలు, ఇతర గుర్తులతో నాడీ అంశకుగల సూక్ష్మసంబంధమును తెలిసి ఉండాలి. దానిని బట్టి నాడీఅంశ గుర్తించడం జరుగుతుంది. కాని నేటికాలపు నాడిరీడర్సులో చాలామందికి నాడీ అంశజ్ఞానం ఉండదు. వారు బొటనవ్రేలిగీతలను బట్టి ఆ వ్యక్తికి చెందిన గ్రూపు తాలపత్రముల కట్టను వెతికి చూడడం వరకే తెలుసుకొని ఉంటారు. 

రెండవ విధానంలో, జీవితం కొంతకాలం గడచిన తరువాత జరిగిన సంఘటనలను బట్టి నాడీవివరములను పోల్చి చూస్తూ విలోమ మార్గములో జననసమయమును సరి చేసుకోవచ్చు. దాని ద్వారా భవిష్యత్తును చదువుకోవచ్చు. నేడు ఎక్కువమంది ఈ విధానాన్నే అనుసరిస్తున్నారు.