నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

6, మార్చి 2009, శుక్రవారం

ధర్మ లక్షణం

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించు అది నిన్ను రక్షిస్తుంది అని తరచూ అందరూ అనేమాట.

ఈ మధ్య కాలంలో బస్సులమీద, గోడలమీద నినాదరూపంలో ఎక్కడ చూచినా కనిపిస్తున్న
శ్లోకం ఇది. అసలు ధర్మం అనే మాటకు అర్థము ఏమిటి?

ధర్మము అనే మాట భారతీయ మతములైన హిందూ (వైదిక), బౌద్ధ, జైన, సిక్ఖు మతములలోనే మనకు దర్శనమిస్తుంది. ఇతర మతములలో దీని ప్రస్తావన ఈ రూపంలో లేదు. ఇంకో రూపములో ఉంటే ఉండవచ్చు.

వేదములలో ధర్మము అనగా ధరించునది ధర్మము అని చెప్పబడింది. ధారయతీతి ధర్మః. ప్రపంచమును ధరించునది ధర్మము. ప్రపంచముఅంతా ఒక పొందికగా, అమరికగా ఉన్నది. అస్తవ్యస్తముగా గందరగోళముగా లేదు. గ్రహములు నక్షత్రములు పాలపుంతలు అన్నీ ఒక నియమానికి లోబడి భ్రమిస్తున్నవి.

కనుక ఏదైతే ఈ వ్యవస్థలను అన్నింటినీ ఒక పద్ధతిలో నడుపుతూ విశ్వమును మొత్తాన్ని ధరిస్తున్నదో దానిని ధర్మము అని వేదము భావించింది. ఈ శక్తినే భగవంతుడు లేక ఈశ్వరుడు అని పిలిచింది. కనుక భగవంతుడు ధర్మసవరూపుడు అయినాడు.

కఠోపనిషత్తులో ఒక ప్రసిద్ధ శ్లోకముంది. దానర్థం " అగ్ని, వాయువు, ఇతర భూతములు, ఇంద్రుడు, మృత్యువుమొదలగువారు ఎవని భయముతో తమతమ విధులు చక్కగా నిర్వహిస్తున్నారో " అని ఉంటుంది. దానినే ధర్మము అని భావించారు. ఈ ధర్మమును అతిక్రమించి మానవుడు మనుగడ సాగించలేడు. ధర్మమును అతిక్రమిస్తే దానికి శిక్ష తప్పదు.

ఉదాహరణకు కాల్చటము అగ్ని ధర్మము. దానిని అతిక్రమించి నిప్పులో చేయి పెడితే ఏమౌతుంది? చేయి కాలుతుంది. కనుక ధర్మమునకు తన పని తాను చెయ్యటమే తెలుసు. ధర్మము అంటే నియమము. నియమము దాటితే దాని ఫలితము అనుభవించక తప్పదు.

ఇది సమిష్టి రూపమగు ధర్మము. ఇక వ్యక్తీ స్థాయిలో చూచిన, ధర్మమునకు మనువు తన మను సంహిత లో చక్కగా నిర్వచనం ఇచ్చినాడు.

||ధృతిర్దమో క్షమోస్తేయం శౌచ మింద్రియ నిగ్రహః
ధీర్విద్యా
సత్యమక్రొధొ దశకం ధర్మ లక్షణం ||

1. ధృతి: ఉత్సాహము, బలము, ధైర్య స్తైర్యములు.
2. దమము: తపస్సు
3 .క్షమా: క్షమాగుణము
4. అస్తేయము: ఇతరుల వస్తువులను అపహరించకుండుట
5. శౌచము: శుచిత్వము
6. ఇంద్రియ నిగ్రహము: ఆరు ఇంద్రియములను నిగ్రహములో ఉంచుట.
7. ధీ: బుద్ధి
8. విద్య
9. సత్యము
10. అక్రోధము: కోపము లేకుండుట.

ఈ పది లక్షణములను ధర్మము అని మను సంహితలో మనువు చెప్పి యున్నాడు. మానవ జీవితము సక్రమముగా సాగవలేనంటే ధర్మాచరణ తప్పనిసరి. అనగా ఈ పది లక్షణములు పాటించిన వాడే ధర్మమును పాటిస్తున్నట్లు లెక్క. అంతే గాని మన ఇష్టము వచ్చిన పనులు మనము చేస్తూ ధర్మమును ఆచరిస్తున్నామనే భ్రమలో ఉంటే ధర్మము మనలను రక్షించదు. భగవంతుడు అసలే రక్షించడు.

ధర్మమును ఆచరించిన వాని బాధ్యత ధర్మ స్వరూపుడైన భగవంతుడు వహిస్తాడు. ఇతరులు తమ కర్మకు తామే బాధ్యులు.