నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

10, ఏప్రిల్ 2009, శుక్రవారం

చలం గారి జాతక విశ్లేషణ


చలం గారు 19-5-1894 వైశాఖ పూర్ణిమ రోజున జన్మించారు. జనన సమయం దొరకలేదు. కాని జనన కాల సవరణ చేయబడినది. అది ఎలా చేశాను అనేది తరువాత వ్రాస్తాను. ఆయన పుట్టిన సమయానికి గ్రహ స్థితి ఈ విధంగా ఉంది. నా అంచనా ప్రకారం చలంగారి లగ్నం కన్యాలగ్నం  కావచ్చు. శని వారం. నక్షత్రం అనూరాధ-1 పాదం. లాహిరి అయనాంశ వాడాను.

ఫలిత విశ్లేషణ:



పూర్ణిమ రోజు గాని దాని దగ్గరలో గాని పుట్టిన వారికి దాంపత్య జీవితం బాగుండదు అనటానికి అనేక ఉదాహరణలు ఇవ్వవచ్చు. వారి వైవాహిక జీవితంలో ఏదో విధమైన లోపము, దిగులు, కష్టాలు లేదా వెలితి తప్పక ఉంటుంది. దానికి కారణం ఏమనగా, జీవితానికి వెలుగు ఇవ్వ వలసిన సూర్య చంద్రులు ఒకరి కొకరు సమ సప్తకంలో ఉండటమే. అనేక జాతకాలలో ఈ కాంబినేషన్ గమనించటం జరిగింది.

భార్యాభర్తలు శారీరికంగా కానీ మానసికంగ కానీ దూరంగ ఉంటారు. వైవాహిక జీవిత ఆనందానికి ఇది మంచి గ్రహస్థితి కాదు. కొందరు సన్యాసులు, సాధువుల జీవితాలలో ఇది చూడవచ్చు. చలంగారి జీవితం కూడా అలాగే గడిచింది. భార్య రంగనాయకమ్మ గారితో జీవితాంతం కలిసి ఉన్నప్పటికీ వారి మధ్య మానసికఅగాధం ఉండేది. చలంగారి వివాహేతర సంబంధాలు ఆవిడకు అసహ్యం కలిగించేవి. వారి మధ్య మొదట్లో ఉన్నఅనుబంధం చివరివరకు ఉందా అనేది అనుమానమే.

రెండవది రాహుశుక్రుల కలయిక జలతత్వరాశి యగు మీనంలో జరిగింది. వీరికి ఎదురుగా శనికేతువులు కన్యారాశిలో ఉన్నారు. ఇది ఈజాతకానికి సంబంధించిన అతిముఖ్యయోగం.రాహుశుక్రుల కలయిక అతికామయోగాన్ని ఇస్తుంది.అందులోను జలతత్వరాశి గనుక,శుక్రునికి ఇది ఉచ్చస్తితిగనుక విపరీతమైన శృంగారభావములు ఈజాతకుని జీవితాంతం వేధిస్తాయి. అలాగే జరిగింది కూడాను. వీరికి ఎదురుగా  కన్యారాశిలో శనిదృష్టితో నిమ్నజాతికి చెందిన అనేకమంది అమ్మాయిలతో జాతకునికి సంబంధాలు ఉంటాయి.కన్యారాశి ద్విస్వభావ రాశి,భూతత్వపు రాశి కనుక స్త్రీలంటే చలించే మనస్తత్వం బలంగా ఉంటుంది.

చందురుడు వృశ్చికరాశిలో స్థితితో, ప్రతీదాన్ని ప్రశ్నించటం,విమర్శించటం, తర్కించటం ఉంటుంది. చంద్రుని నీచస్థితి తద్రాసి నాదుడగు కుజుని చతుర్థ కేంద్రస్థితితో నీచభంగం జరిగింది. చంద్రదశ ఈయనకు 1963-1973 మధ్యలో జరిగింది. తరువాత మరణం వరకూ కుజదశ జరిగింది. కనుక చంద్ర కుజ దశలోనే ఈయన కామప్రవృత్తి తొలగి దాని స్థానే ఆధ్యాత్మికప్రవృత్తి కలగటం ఈయోగం ద్వారా సూచింప బడింది. అంటే 1950 లో రమణ ఆశ్రమానికి చేరినా దాదాపు పదమూడు వత్సరాలు ఈయన తన అధమప్రవృత్తిని జయించటానికి శ్రమించవలసి వచ్చింది.

రవి, బుధ, గురువులు వృషభరాశి స్థితివల్ల తీవ్రమైన భౌతిక వాంఛలతో జీవితం సతమతమయ్యింది. దీనివల్ల రచనానైపుణ్యం, ప్రభుత్వఉద్యోగం, ఉన్నతవ్యక్తులతో పరిచయాలు కలిగాయి. కుంభంలో కుజునివల్ల సంసార సుఖం నాశం, అతికామం, ఆరోగ్యం చెడిపోవటం కలిగాయి.

శనికేతువుల స్థితి ఆధ్యాత్మికచింతనను, ఆలోచనాపరత్వాన్ని ఇచ్చింది. చంద్రునిపైన శని దృష్టి వల్ల కూడా ఈ ధోరణి ఎక్కువ అవుతుంది. రవి బుధ గురువుల మీద కుజ దృష్టితో ఈయన రచనలలో సమాజాన్ని తీవ్రంగ విమర్శించటం, ఎవరినీ లెక్క చేయకపోవటం, సమాజ ధోరణులకి ఎదురు నడవటం జరిగాయి.

శనిమీద గురుదృష్టి వల్ల జీవితంలో ఆర్ధికపరంగా ఎదుగులేకపోవటం, కష్టాలు, కలిగాయి. కానీ ఇదే కాంబినేషన్ ఈయనమీదగల సద్గురు అనుగ్రహాన్ని చూపిస్తున్నది. అందువల్లనే ఈయన అనేకమంది  మహానీయుల అనుగ్రహానికి పాత్రుడు కాగలిగాడు. శని వక్రత వల్ల తీరని అనేక కర్మబందాలు ఈయనను పట్టి బంధించాయని చెప్పవచ్చు.

చంద్ర లగ్నాత్ పంచమంలో రాహుస్థితివల్ల కొడుకు రవి చిన్న వయసులోనే మరణించాడు. కాని అదే పంచమంలో శుక్రుని ఉచ్చస్థితి వల్ల మహానీయురాలైన కూతురు సౌరిస్ జన్మించింది.

ఈయన జాతకం స్థూలంగా కొద్ది మాటలలో చెప్పవలెనంటే కామప్రవృత్తికీ ఆధ్యాత్మికప్రవృత్తికీ జరిగిన సంఘర్షణ. చలం ఒక మనిషికాదు. ఆయనలో అనేక కోణాలు ఉన్నాయి. చలంలో ఒక సౌందర్యపిపాసి ఉన్నాడు, ఒక కాముకుడు ఉన్నాడు, ఒక సున్నిత హృదయుడు దాగున్నాడు, ఒక మానవతావాది ఉన్నాడు, ఒక ఆధ్యాత్మిక అన్వేషి కూడా ఉన్నాడు.

ఇన్ని పరస్పర విరుద్ధభావాలు ఆయనను ఊపి వేశాయి. జీవితమంతా శాంతి లేకుండా చేసాయి. చివరకు కూడా ఆయనకు శాంతి దొరకలేదు. అవధూత మాలపిచ్చమ్మగారు చెప్పినట్టు అది బహుశా తరువాతి జన్మలో దొరుకుతుందేమో. భగవత్ గీత ప్రకారం మరణ సమయంలో ఉన్న మానసికస్థితి బట్టి తరువాతి జన్మ ఉంటుంది. చలం చివరిలో పరమ సత్యాన్ని తెలుసుకోవాలని చాలా తపించాడు. తన మనస్సుతో తానె దాదాపు మూడుదశాబ్దాలు యుద్ధం చేసాడు. కనుక తరువాతి జన్మలో అతడు తన గమ్యాన్ని చేరగలడని ఆశిద్దాం.

చలం నవీన మానవుని సంఘర్షణాత్మక జీవితానికి ప్రతీక. అతడొక నిరంతర అన్వేషి. అందుకే నేటి తరాన్ని కూడా ఆకర్షించ గలుగుతున్నాడు. చలాన్ని గురించిన కొన్ని నమ్మలేని నిజాలు తరువాతి వ్యాసంలో చూద్దాం.

చలం నిజాయితీని, సత్యసంధతని చెప్పకపొతే అతని వ్యక్తిత్వం సంపూర్ణం కాదు. ఆయనకీ న్యాయం చేసినట్టు కూడా అనిపించదు. కనుక ఇంకా వ్రాస్తున్నాను. మనస్సు కారకుడైన చంద్రుడు అనూరాధ నక్షత్రంలో ఉన్నాడు అది విమ్శోత్తరి దశ విధానంలో శని అధీనంలో ఉంటుంది. ఆ శని ఆధ్యాత్మిక చింతనకు కారకుడైన కేతువుతో కలసి ఉన్నాడు. శని దృష్టి చంద్రుని మీద ఉంది. ఇంకా చంద్రుని మీద గురువు యొక్క సప్తమ దృష్టి ఉంది. కనుక చలం మోసగాడు కాదు. నిజాయితీ మరియు సత్య సంధత కలిగినవాడు. తను నమ్మినదాన్ని నిజంగా భావించి దాన్నే ఏ అరమరికలూ లేకుండా వ్రాస్తూ వచ్చాడు.ఏ స్త్రీతో సంబంధం పెట్టుకున్నా దాన్ని బాహాటంగా ఒప్పుకున్నాడు. తను పెద్ద పవిత్రుడిగా చలామణీ కావాలని తలచలేదు. ఒక వేళ అలా నాటకాలాడి ఉంటే చలంలోని శృంగార పరత్వం లోకానికి ఎన్నటికీ తెలిసేది కాదు.తన రాసలీలల గురించి తనే వ్రాసుకున్నాడు.చలం లోని నిజాయితీని నిరూపించటానికి ఈ ఒక్క రుజువు చాలు. 

బుద్ధి కారకుడైనటు వంటి బుధుని స్థితి చూద్దాం. ఈ బుధుడు రవితో చాలా దగ్గిరగా ఉంటూ, గురువుతో కూడా కలసి ఉన్నాడు. కనుక ఈయన బుద్ధిబలం కలిగిన వాడే కాకుండా, ధార్మికబుద్ధి కలిగిన వాడు. చంద్రుని మీద గురు, శనుల దృష్టుల వల్ల డబ్బు మీద ఆశ, కోరికా లేకుండా పోయాయి. ఈ కారణాల వల్లనే తనకు పదహారు ఏళ్ళు వచ్చేవరకు అప్పటి బ్రాహ్మణకుటుంబాలలో సహజమైన నియమయుతజీవితం గడిపాడు. అప్పటికి దాదాపు అతని శనిమహాదశ అయిపొయింది. బుధదశలో రఘుపతి వెంకటరత్నం నాయుడుగారి శిష్యరికం బ్రహ్మసమాజభావాలు ఆయన్ను ప్రభావితం చేసాయి. దీనికి కారణం బుధునితో కూడిన రవి గురులు వీరిపైన కుజ దృష్టి. ఈ కుజదృష్టి ఈయనను సంప్రదాయబద్ధమైన బ్రాహ్మణజీవితం నుండి అన్నింటినీ ప్రశ్నించి ఎదిరించే తిరుగుబాటు ధోరణి వైపు లాగింది.

దాదాపుగా ముప్పై మూడోఏట ప్రారంభమైన కేతుదశ ఈయన జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. అప్పుడే ఈయనకు భగవాన్ రమణమహర్షి దర్శనం కలిగింది. దాంతో అప్పటివరకూ ఇంద్రియసుఖాలలో వెతుకుతున్న పరమసుఖం అక్కడ లేదు అనే సత్యం ఆయనకు బౌద్ధికంగా అర్థం అయింది. కాని రాహుశుక్రుల బలం ఆయన్ను గట్టిగా పట్టింది. జీవితంలో సంఘర్షణ తీవ్ర స్థాయికి చేరింది.

శుక్ర దశలో ఆయన రమణ మహర్షి సన్నిధికి చేరాడు. రవి చంద్ర దశలలో సాధన కొనసాగించాడు. కుజ దశలో మరణం ఆయన్ను ఈ ప్రపంచం నుండి ఆయన ఆశించిన మరో ప్రపంచానికి తీసుకు పోయింది.

ఆయన ప్రాధమికంగా అత్యంత నిజాయితీపరుడు. ఏ మాత్రం మోసం ఎరుగని వ్యక్తి. మరి భార్యకు చేసింది మోసం కాదా అని అనుమానం రావచ్చు. కోరికలు బలంగా ఆయన్ను ఈడ్చుకు పోయాయి. రాహుశుక్రుల కలయిక దానిమీద శనిదృష్టి ఎంత బలమైన కామోద్రేకాన్ని ఇస్తుందో అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తూంది. కాని ఆ విషయాలను వేటినీ దాచకుండా తానె లోకానికి వెల్లడి చేసాడు. తన అంతర్మథనాన్ని మొత్తం అక్షరబద్ధం చేసాడు. 

సౌందర్యపిపాస, కామం ఒకప్రక్క, తీవ్ర ఆధ్యాత్మిక తృష్ణ ఒకప్రక్క ఆయన్ను చీల్చి ముక్కలు చేసాయి. ఈ ఆంతరిక యుద్ధంలో ఎంతో సంఘర్షణకు గురయ్యాడు. ప్రతి సాధకుడూ ఇటువంటి సంఘర్షణకు లోనవక తప్పదు. కాని కోరికలబలం తక్కువగా ఉన్నవాడు యుద్ధాన్ని తేలికగా గెలుస్తాడు. అదే చలంలాంటి వానికి విజయం చాలా గట్టి ప్రతిఘటన తరువాత మాత్రమె సిద్ధిస్తుంది. 

తనకు ఆనందాన్ని ఇచ్చిన, తానె పెంచి పోషించుకున్న ప్రతి కోరికనూ త్రుష్ణనూ తానే నిర్దాక్షిణ్యంగా నరుక్కుంటూ ఉందొ లేదో తెలియని గమ్యం వైపు సాగిపోవాలి.అదే నిజమైన సాధన. మాటలలో చెప్పినంత తేలిక కానేకాదు. రమణాశ్రమ జీవితంలో ఆయన వ్రాసిన సాహిత్యాన్ని చదివిన వాళ్లకు ఇది తేటతెల్లం అవుతుంది. ఎన్నో చోట్ల తన ఆంతరిక సంఘర్షణను వ్రాస్తాడు. అదొక నరకయాతన. రావణుడు తన పొట్ట చీల్చి పేగులతో రుద్రవీణ మ్రోగించాడని అంటారు.ఇది కూడా అటువంటిదే.ఈ సంఘర్షణను ఊహించటం వల్లే రమణాశ్రమంలో ఉన్నపుడూ చలంగారు గుర్తోచ్చినపుడూ నాకు కన్నీరు ఉబికింది.

చలం జీవితం ఆంతరిక స్థాయిలలో పరిణతి చెందుతూ వచ్చింది. బహుశా అంత త్వరగా ఇవాల్వ్ అయిన జీవితాలు చాలా తక్కువగా ఉంటాయి. మన జీవితాలు చలనం లేని మడుగుల్లా స్తబ్డుగా ఉండిపోతాయి. అంతరికంగా మనబోటివారికి ఎదుగూ బొదుగూ ఉండదు. చలం ఆర్థికంగా ఎదగలేదు. కాని మానసికంగా, బౌద్ధికంగా, ఆత్మపరంగా అతి వేగం తో ఎదిగాడు. 

అందుకనే ఆయన జీవితంలో డబ్బుకోసం వెంపర్లాట కనిపించదు. ఇతరులను మోసంచేసి తాను పైకి ఎదుగుదామనే తపన కనిపించదు. రచయితలకు సహజమైన కీర్తి కండూతి మచ్చుకైనా ఈయనలో కనపడదు. దానికి లోతైన మార్మిక కారణాలు ఉన్నాయి. అవి అందరూ నమ్మలేరు. అయినా వచ్చే వ్యాసంలో వాటి గురించి వ్రాస్తాను.