నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

26, ఏప్రిల్ 2009, ఆదివారం

జెన్ మహా గురువు బోధి ధర్మ


జెన్ సాంప్రదాయానికి చైనాలో మొదటి గురువుగా బోధిధర్మ ఈనాటికీ నీరాజనాలు అందుకుంటున్నాడు.ఆయన చైనాకు ఈ జ్ఞానాన్ని అందించటం వల్ల ఎన్ని వేలమంది జిజ్ఞాసులు సంసార సాగరాన్ని దాటి బుద్ధత్వాన్ని పొందారో లెక్కలేదు.ప్రపంచానికి గొప్ప మేలు చేసిన వారిలో తప్పక ఈయన పేరు ఉంటుంది.


ఈయన తమిళనాడుకు చెందిన పల్లవరాజు సుగంధుని మూడవ సంతానంగా చరిత్ర కారులు భావిస్తున్నారు.ప్రపంచం మీద విరక్తి చెందిన ఈయన సింహాసనాన్ని త్యజించి ధ్యానబౌద్ధ సాంప్రదాయానికి చెందిన ఇరవై ఏడవ గురువైన ప్రజ్ఞాతారకు శిష్యుడైనాడు. ఎన్నో ఏండ్ల ఏకాంత ధ్యానసాధన తర్వాత బుద్ధత్వాన్ని పొందాడు.తరువాత గురువుగారి ఆజ్ఞమేరకు ధ్యానబౌద్ధాన్ని చైనాలో ప్రచారం చెయ్యడానికి సముద్రమార్గంలో చైనా చేరాడు.

అక్కడ దక్షిణ చైనాను "వు" అనే చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. ఆయన బౌద్ధ మతానుసారి. దానధర్మాలు చేసినవాడు.ఎన్నో బౌద్ధ ఆరామాలు కట్టించిన వ్యక్తి. కాని బోధిధర్ముని మాటలు ఆయనకు నచ్చలేదు.అప్పటివరకూ ఆయన చూచిన బౌద్ధ భిక్షువుల తీరుకూ బోధిధర్మ తీరుకూ బోలెడంత తేడా ఉంది.

బోధిధర్మ ఉత్త బౌద్ధపండితుడు కాదు.త్రిపిటకాలను బట్టీపట్టి ఒప్పజెప్పే వ్యక్తి కాదు. బుద్ధత్వాన్ని పొందినవాడు.శాస్త్రచర్చలకూ,ఆచారాలకు,క్రియాకలాపాలకు భిన్నమైన ధ్యానబౌద్ధ శాఖకు చెందినవాడు.వారిద్దరి మధ్యన జరిగిన చర్చ ఇప్పటికీ ఒక శిలా శాసనంలా నిలిచిపోయింది.

బోధిధర్మను ఆహ్వానించటానికి "వు" చక్రవర్తి వచ్చాడు.కాని ఆయన అప్పటి వరకు చూచిన బుద్ధధర్మం కంటే భిన్నమైన ధర్మాన్ని బోధిధర్మలో చూచాడు. చక్రవర్తి అప్పటి వరకూ చేసిన పుణ్యకార్యాలకు,కట్టించిన మఠాలకు,చేసిన దానధర్మాలకు,ఏమాత్రం విలువ లేదని తేల్చిచెప్పాడు బోధిధర్మ.నిర్వాణాన్ని ప్రత్యక్షంగా అనుభూతి చెందకపోతే ఇవన్నీ వృధాపనులని ఖరాఖండిగా చెప్పేశాడు.

బుద్ధుని అత్యున్నత బోధన శూన్యత్వమనీ,దానిలో ఏ ప్రత్యేకతా లేదనీ తేల్చిచెప్పాడు. పిచ్చికోపం వచ్చిన చక్రవర్తి " అంతా శూన్యం అయితే మీరు ఎవరు స్వామీ?" అని బోధిధర్మను అడుగుతాడు.దానికి బోధిధర్మ క్లుప్తంగా "నాకు తెలియదు" అని మాత్రం జవాబు చెబుతాడు.ఈ సంభాషణ అంతా చక్రవర్తికి విపరీతమైన కోపాన్నీ విసుగునూ తెప్పిస్తుంది. బోధిధర్మ ఆయనకు ఒక పిచ్చి వాడిగా, దురహంకారిగా అగుపిస్తాడు.

తన మాటలు చక్రవర్తికి అర్థం కాలేదని గ్రహించిన బోధిధర్మ,నదిని దాటి ఉత్తర చైనాను చేరతాడు.అక్కడ షావోలిన్ మఠంలో తొమ్మిదేళ్ళు ఉండి నలుగురు శిష్యులకు తన బోధనల సారాన్ని తెలిపి అక్కడే మరణిస్తాడు.ఆయనను అక్కడికి దగ్గరలో గల ఒక గుహలో పూడ్చి పెడతారు.

మూడు ఏళ్ల తరువాత,ఒక సరిహద్దు సేనానికి,బోధిధర్మ ఉత్తకాళ్ళతో మంచులో నడుస్తూ భారతదేశానికి పోతూ కనిపిస్తాడు.ఆయన చేతిలో ఒకే ఒక పాదరక్ష ఉంటుంది.సేనానిని త్వరగా వెనక్కు పొమ్మని , తానూ తన దేశానికి పోతున్నానని, చక్రవర్తి త్వరలో మరణించ బోతున్నాడని చెబుతాడు.సేనాని వెనక్కు వచ్చి బోధిధర్మ సమాధిని తెరిపించి చూస్తాడు. అందులో బోధిధర్మ శవం ఉండదు.కాని ఒక పాదరక్ష మాత్రం ఉంటుంది.బోధిధర్మ చెప్పినట్లే చక్రవర్తి త్వరలో మరణిస్తాడు.

బోధిధర్మ బోధనలేమిటో తరువాత పోస్ట్ లలో చూద్దాం.