నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

5, మే 2009, మంగళవారం

డాక్టర్ సామ్యుల్ హానెమాన్ జాతకం


హోమియోపతి వైద్య పితామహుడైన డాక్టర్ సామ్యుఎల్ హానెమాన్ జాతకం చాలా ఆసక్తి కరం గా ఉంటుంది. 2000 సంవత్సరంలో నేను పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి మొదటి బ్యాచ్ లో M.A (Astrology) చేసినపుడు " గ్రహాలు మరియు హోమియోపతి " అనే విషయంపైన పరిశోధనా వ్యాసం సమర్పించాను.

దానిలో దాదాపు ఇరవై అయిదు మంది హోమియో ఉద్దండుల జాతకాలను పరిశీలించి కొన్ని సూత్రాలను తయారుచేయటం జరిగింది. ఆయా గ్రహాల కలయికలు ఏదైనా జాతకంలో ఉంటే అది హోమియోపతి డాక్టరు జాతకం అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఆ విషయం ప్రక్కన పెడితే, డాక్టర్ సామ్యయూల్ హన్నేమాన్ గారు 10.4.1755 న జెర్మనీ లో గల డ్రెస్దెన్ అనే నగరంలోజన్మించారు. జనన సమయం తెలియదు. ఆ రోజున గ్రహ స్థితి ఇలా ఉన్నది.

మేషంలో రవి, సింహంలో గురువు, కన్యలో రాహువు, మకరంలో చంద్రుడు శని, కుంభంలో కుజ శుక్రులు, మీనంలోబుధ కేతువులు ఉన్నారు.

జాతక విశ్లేషణ:
చంద్ర లగ్నాత్ రవి నాలుగింట ఉచ్చ స్థితిలో ఉన్నాడు. కనుక ఆయన సాంప్రదాయ వైద్యంలో ఆ రోజులలోనే M.D చేసాడు. కాని అదే రవి లగ్న సంధిలో ఉండుట వల్ల ఆయన జీవితంలో నానా బాధలు పడ్డాడు. చివరి రోజులలో పారిస్ లో ఉన్నపుడు తప్ప, మిగిలిన జీవిత మంతా బాధలు, కష్టాలు, సమాజం నుండి వెలివేయ బడటం జరిగాయి. భూత వైద్యుడన్నఅపఖ్యాతిని మూట కట్టుకున్నాడు. రవి ఉచ్చలో ఉన్నప్పటికీ తను చదివిన అల్లోపతి వైద్యాన్ని ప్రాక్టీసు చేయలేకపోయాడు. కారణమేమిటంటే దానిలోని మౌలిక సిద్ధాంతాల మీద ఆయనకు తీవ్ర అనుమానాలు ఉండేవి. జాతక పరంగా దీనికి కారణం చతుర్థంలో రవి లగ్న సంధిలో ఉండటం మరియు చతుర్థాథి పతి కుజుడు రెండవ ఇంటిలో శత్రు క్షేత్రంలో ఉండటం. దీనివల్ల చదివిన చదువు పనికిరాకుండా పోయింది.

విద్యా కారకుడైన బుధుడు నీచ స్థితిలో ఉండి కేతువు తో కలిసి ఉన్నాడు. ఈయన అనేక రంగాలలో నిష్ణాతుడైనాడు. ఆ రోజులలో ప్రసిద్ధి గాంచిన రసాయన శాస్త్ర నిపుణులలో ఆయన ఒకడు. కానీ దేనిలోనూ ఈయనకు స్థిరమైన పేరు రాలేదు. కాని రవి మీద గురు దృష్టి
వల్ల చివరి రోజులలో ప్రపంచ ఖ్యాతి పొందాడు. రాహువు, రవి దైన ఉత్తరా నక్షత్రంలో స్థితి కలిగి బుధ రాశిలో ఉన్నాడు. కనుక సాంప్రదాయవిరుద్ధ మైన జ్ఞానాన్ని చూపుతున్నాడు. కనుకనే నూతన హోమియో విజ్ఞానాన్ని ఆవిష్కరించ గలిగాడు.

బుధ కేతువులపైన శని దృష్టి వల్ల లోతైన ఆలోచనా శక్తి, కష్ట పడి పని చేసే తత్త్వం, హఠాత్తుగా నూతన సత్యాలు స్ఫురించటం కలిగాయి. చతుర్తాదిపతి కుజుడు రెండవ ఇంటిలో కుంభంలో ఉండి రవి రాశి యగు సింహం నుండి గురువుచేత చూడ బడుతూ ఉన్నాడు. కనుక కుంభం ( అనగా రిసెర్చి) మరియు సింహం (అనగా వైద్యం ) కలిశి వైద్య శాస్త్రం లో కొత్త ఆవిష్కారానికి ఆద్యుడైనాడు.

ఓషధీ నాదుడగు చంద్రుడు తన సొంత నక్షత్రంలో ఉండి, రాహువు యొక్క పంచమ దృష్టి చేత చూడ బడుతూ ఉండటంవల్ల కొత్త మూలికలు, మందులు కని పెట్టటం జరిగింది. ఈయన దాదాపు 100 మందులను ప్రూవ్ చేసి లోకానికి అందించాడు. వీటిలో ఒక్క దానికి ఒక నోబుల్ ప్రైజు ఇవ్వవచ్చు. అంతటి లోతైన పరిపూర్ణమైన ప్రూవింగ్ చేసాడు. ఈనాటికీ ఆయన రాబట్టిన లక్షణాలను దాటి ఎవరు కూడా ఔషధ ప్రూవింగ్ చెయ్యలేక పోయారు. ఈ నూరు మందులతో ఇప్పటి వరకూ ప్రపంచంలో ఎన్ని లక్షలాది మంది ఆరోగ్యాన్ని పొందారో లెక్క లేదు.

చంద్రుడు శనితో కలిసి ఉండుట వల్ల బాధామయ జీవితం వచ్చింది. కాని ఇదే కాంబినేషన్ ఈయనకు మొండిపట్టుదలను, తన రీసెర్చిలో ఎన్ని ఆటంకాలు ఎదురై
చివరకు ప్రాణాలకు ప్రమాదం వాటిల్లినా కూడా చలించని మనస్తత్వాన్నిఇచ్చింది. తనకు స్ఫురించి తన రీసెర్చిలో నిగ్గు తేలిన సత్యాలను లోకానికి చాటటానికి జీవితమంతా ఒక యోధుని వలె పోరాటం సాగించాడు. ఇదే కాంబినేషన్ వల్ల తాత్విక ధోరణి అలవాటు అయింది. ఈయన వ్రాశిన " ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్ " చదివితే అనేక చోట్ల ఒక Philosophical treatise చదువుతున్నట్లు అనిపిస్తుంది. ఈ ప్రభావం శని చంద్రుల కలయిక వల్ల కలిగింది.

దశమాదిపతి శుక్రుడు, చతుర్తాదిపతి కుజుడు కలసి రాహువు నక్షత్రంలో ఉన్నారు. దీనివల్ల వైద్య రంగంలో విప్లవాత్మకమైన ఆవిష్కారాలు చేయ గలిగాడు. కాని ప్రజల ప్రభుత్వాల వ్యతిరేకత వల్ల జీవితమంతా దేశ దిమ్మరిగా తిరుగవలసి వచ్చింది.

ఈయన సారూప్య ఔషధ సూత్రాన్ని రాహువు వృశ్చిక రాశిలో ఉన్నపుడు 1790 లో కనుక్కున్నాడు. ఈయనజాతకంలో వైద్య గ్రహాలైన రవి, చంద్రుడు మరియు సాంప్రదాయ విరోధి నూతన ఆవిష్కారాలకు కారకుడు అయిన రాహువు ల ప్రభావం స్పష్టం గా కనిపిస్తుంది.
ప్రపంచ ప్రఖ్యాతి శుక్రునివల్ల మరియు అసాధారణ మైన తెలివి తేటలు బుధుని స్థితి వల్ల కలిగాయి. కాని బుధుని కేతువు ఆక్రమించుట వల్ల ఈయనకు రావలసినంతగుర్తింపు తన జీవిత కాలం లో రాలేదనే చెప్పాలి.

ఈ నాటికీ హోమియోపతి మరియు ఆయుర్వేదం వైద్య శాస్త్రాలు కావు అని మొండిగా వాదించేవారు బోలెడంత మందికనిపిస్తారు. వారు జపనీస్ ఎన్కెఫలైటిస్ అనబడే బ్రెయిన్ ఫీవర్ కేసులలో బెల్లడోనా అనే హోమియో మందు ఎంతటిసమర్థ వంతం గా పని చేసిందో చూస్తె అటువంటి వాదనలు చెయ్యరు. హానేమాన్న్ బ్రతికి ఉన్న సమయంలో కూడాయూరోపులో కలరా ప్రబలినపుడు ఆయన సూచించిన కేంఫర్, కుప్రం మేటాలికం , విరేట్రం ఆల్బం అనే మందులు వేలాదిమందిని మృత్యు ముఖం నుంచి రక్షించాయి.

అలాగే కోరింత దగ్గు మహామ్మరిగా ప్రబలి అనేక మందిని పొట్టన పెట్టుకుంటున్న సమయంలో డాక్టర్ బోనింగ్ హాసేన్ వాడిన ఎకోనైట్, హేపార్ సల్ఫ్, స్పాన్జియా అనబడే మందులు వేలాది మందిని రక్షించాయి. ఇవి అన్నీ వైద్య చరిత్రలో రికార్డుచెయ్య బడిన కేసులు. రికార్డు చెయ్య బడని కేసులు, నిత్య జీవితంలో డాక్టర్ల ప్రాక్టీసులో రుజువు అవుతున్న కేసులు లెక్క లేనన్ని ఉన్నాయి. ప్రపంచం డాక్టర్ హానెమాన్ కు రుణ పడి ఉంది అనటంలో ఎంత మాత్రం సందేహం లేదు. డాక్టర్ హానెమాన్ జీవితాన్ని ఇంకోసారి వివరం గా చూద్దాము.