నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

20, మే 2009, బుధవారం

టైగర్ స్టైల్ కుంగ్ ఫూ

టైగర్ స్టైల్ చైనీస్ కుంగ్ ఫూ లో ఒక సామెత ఉంది. రెండు పులులు యుద్ధం చేస్తే ఒకటి చనిపోతుంది. రెండవది కుంటిదౌతుంది. ఇది టైగర్ స్టైల్ కుంగ్ ఫూ లోని భయంకరమైన టెక్నిక్స్ కు చక్కని ఉదాహరణ. దక్షిణ చైనాలో పుట్టిన కుంగ్ ఫూ శాఖలలో టైగర్ స్టైల్ ఒకటి. దీనినే టైగర్ క్రేన్ స్టైల్ అని కూడా అంటారు. ప్రస్తుతానికి క్రేన్ స్టైల్ ను ప్రక్కన ఉంచి టైగర్ స్టైల్ ఏమిటో చూద్దాము.

దీని మూలాలు చరిత్రకు అందని చీకటిలో ఒదిగి ఉన్నాయి. కాని షావోలిన్ జెన్ మాస్టర్ అయిన గీ-సిం-సిం-సి దీనిని తన నలుగురు శిష్యులకు నేర్పినట్లు ఆధారాలు దొరుకుతున్నాయి. షావోలిన్ ఆలయం ప్రసిద్ధి చెందిన ఫైవ్ ఏనిమల్ స్టైల్స్ కు మూల మైన ప్రధాన గురుకులం.

టైగర్ స్టైల్ లో ప్రధాన అంశం బలం మరియు శక్తి. దీని కదలికలు చాలా బలంగా, శక్తి వంతం గా ఉంటాయి. భంగిమలు స్థిరంగా, దృడం గా ఉంటాయి. లో హార్స్ భంగిమ ఎక్కువగా వాడబడుతుంది. భయం అనేది పులికి తెలియదు. అలాగే టైగర్ స్టైల్ సాధకుడికి భయం అనే మాట ఆమడ దూరం లో ఉంటుంది. మంచి ఆరోగ్య వంతుడై, ఏళ్ల తరబడి సాధన చేసిన టైగర్ స్టైల్ వీరుడు ఒక గుంపును ఉత్త చేతులతో తేలికగా ఎదిరించి చెల్లా చెదురు చేసి ఓడించగలడు. విజయమో వీర స్వర్గమో అనేది ఇతని విధానం గా ఉంటుంది.

టైగర్ స్టైల్ దెబ్బలు బలంగా దారుణంగా ఉంటాయి. వీటిని కాచుకోవటం ఎదురు నిలవటం కష్టం. దెబ్బ తగిలిన చోట ముక్కలుగా పగిలి పోతుంది. స్టైల్ లో కాళ్ళు చేతుల జాయింట్లు విరిచి పారేయటం ఉంటుంది. కుంగ్ ఫూ సామెత ప్రకారం వీరుడు నిలబడితే ఒక పర్వతంలా ఉంటాడు, ఎటాక్ చేస్తే ఒక మంచు తుఫాను లా ఉంటాడు. తన దారిలో ఎదురైన వారిని తునా తునకలు చేస్తూ విజ్రుంభిం గలడు. దెబ్బలు తగిలితే తక్షణ మరణం (death on the spot) కలుగుతుంది. లేదా నెలల తరబడి మంచం పట్టక తప్పదు.

స్టైల్ లో కనీస స్థాయి పొందటానికి ఐదేళ్ళ కఠిన సాధన అవసరం. కఠిన బ్రహ్మ చర్యాన్ని పాలిస్తూ శరీరాన్ని, మనసును రాటు దేలుస్తూ వ్యాయామ సాధన, ధ్యాన సాధన కోనసాగించాలి. అప్పుడే దీనిలో ఉన్నత స్థాయిలు అందుకొనగలరు. దీనిలో గొప్ప పేరు గాంచిన వాడు మాస్టర్ వోంగ్ ఫే హంగ్. ఈయన ప్రఖ్యాతి గాంచిన "షాడో లెస్ కిక్" ను కనిపెట్టాడు. ఈయన జీవితం మీద "Once upon a time in China" అనే పేరుతో మూడు నాలుగు సినిమాలు వచ్చాయి. వాటిలో జెట్ లీ హీరో గా నటించాడు. కాని అందులో చూపినది టైగర్ స్టైల్ కుంగ్ ఫూ కాదు. పనికి మాలిన వూ-షూ ను కుంగ్ ఫూ గా భ్రమింప చేసి తాళ్ళ ఫైటింగులు కలిపి చూపించారు. కుంగ్ ఫూ శాఖలలో ఏదేదో తేడాలు తెలియని జనం నమ్మారు. టైగర్ స్టైల్ ను మధ్య కాలంలో బాగా చూపినది జాకీ చాన్ మరియు జెట్ లీ కలిసి నటించిన "The forbidden kingdom" సినిమా. అందులో జాకీ చాన్ డ్రంకెన్ మాస్టర్ గా చక్కని టైగర్ స్టైల్ కుంగ్ ఫూ ను చేసి చూపించాడు.

స్టైల్ ను వంశ పారంపర్యంగా సాధన చేస్తూ వస్తున్నది లియు కుటుంబం. గార్డన్ లియు ఇదే కుటుంబం లోని వాడు. ఇతడు ప్రఖ్యాతి గాంచిన "36 th chamber of shaolin" సినిమా లో హీరో గా నటించాడు. మధ్య మధ్యలో అక్కడక్కడా కనిపిస్తూ, మధ్యనే ఘోరంగా ప్లాపు అయిన "చాందిని చౌక్ టు చైనా "లో గుండు విలన్ గా నటించాడు. నిజానికి ఇతని ముందు సినిమా హీరోలు నిలబడలేరు. ఒక్కడే పది మంది అక్షయ కుమార్ లను ఎదుర్కొగలడు. కానీ సినిమా కదా. అలా నటించక తప్పదు మరి.

స్టైల్ లో ముఖ్యమైన ఫాం లు టేమింగ్ టైగర్ ఫాం, బ్లాక్ టైగర్ ఫిస్ట్, యాంగ్రీ టైగర్ ఫిస్ట్, టైగర్ క్రేన్ సెట్, ఐరన్ వైర్ సెట్ మొదలైనవి. వీటిని సాధన చెయ్యటం వలన శారీరక ద్రుడత్వం తో పాటు, ధైర్యం, సంకల్ప శక్తి వృద్ధి అవుతాయి. ప్రతికూల పరిస్థితులలో కూడా, కటిక చీకటిలో కూడా ఒంటరిగా ధైర్యంగా ముందుకు పోగలిగిన ధీరత్వం కలుగుతుంది.

స్టైల్ లో ధ్యాన విధానాలు అద్భుత మైనవి. విశ్వం లో నిండి ఉన్న శక్తిని తనలోకి ఆవాహన చెయ్యటం, తనను రక్త మాంసాలతో నిండిన మనిషిగా కాక, ఉక్కుతో తయారైన శరీరం కలవానిగా గంటలకొలది ధ్యానం చెయ్యాలి. భూమిలో నిండి ఉన్న అచల దృఢ శక్తిని క్రింది నుంచి తనలోకి శ్వాస ఆధారంగా ఆవాహన చెయ్య వలసి ఉంటుంది. వీటికి తోడుగా టైగర్ యొక్క లక్షణాలైన నిర్భయత్వం, రాజసం, ఎటువంటి ప్రతికూల పరిస్థితులలోనూ వేనుతిరగని అచంచల సంకల్ప శక్తి పైన గంటల తరబడి ధ్యానం చేయాలి.

కాల క్రమేణా విధానాల వల్ల సాధకుని శరీరం మనస్సు చాలా అనూహ్య మార్పులకు లోనౌతాయి. వజ్ర శరీరం వజ్ర సంకల్పం కలుగుతాయి. మొక్కవోని దీక్షతో కనీసం అయిదేళ్ళు సాధన చేస్తే అద్భుతాలు చెయ్యటం స్టైల్ లో సాధ్యం అవుతుంది. అటువంటి యోధుని ఎదుర్కోవటం పది మంది మనుషులకు కూడా సాధ్యం కాదు.

టైగర్ స్టైల్ విధానాలు భిన్నమైనవి. వీటిలో తప్పించుకోవడం, ఎక్కువ సేపు ఫైటింగ్ చేయ్యటాలు ఉండవు. టెక్నిక్స్ సూటిగా, సరళంగా ఉంటాయి. వీరికి ఆటబొమ్మలే తప్ప ప్రత్యర్థులు ఉండరు. టైగర్ క్లా అనబడే పంజాను ఉక్కులా మార్చే అభ్యాసాలు ఉంటాయి. సూటిగా కొట్టే దెబ్బలే కాక చక్రాకారంగా విసిరే పంచేస్ ఉంటాయి. వేళ్ళతో శరీరాన్ని చీల్చటం, కండను పీకటం వంటి భయంకర టెక్నిక్స్ ఉంటాయి. విద్యలో డిఫెన్స్ అన్న మాటకు తావు లేదు. అంతా అఫెన్స్ మయంగా ఉంటుంది. డిఫెన్స్ ఎదుటి వ్యక్తి చేసుకోవలసి ఉంటుంది.

ఆజానుబాహులకు, పెద్ద శరీరం ఉన్నవారికి స్టైల్ బాగా పనికి వస్తుంది. కాని చిన్న శరీరాలు కలవారికి కూడా పనికొచ్చే స్మాల్ టైగర్ ఫాం ఇందులో ఉంది. బహుశా అది తరువాతి కాలంలో కనిపెట్టినది కావచ్చు. మొదట్లో విద్య షావోలిన్ కుంగ్ ఫూ లో అంతర్ భాగంగా ఉండేది. కాల క్రమేణా ప్రత్యెక శాఖ గా మారి తనవైన ప్రత్యెక టెక్నిక్స్ తో బాగా వృద్ధి పొందింది. దీనిలో అనేక ఫేమిలీ స్టైల్స్ కూడా ఉన్నాయి.

దీనిని సాధన చేసిన వారు ఎక్కువగా ఉద్రేకానికి లోను కారాదు. ఎందుకంటే తీవ్రమైన శక్తి వీరి అధీనంలో ఉంటుంది. అదుపు లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది. అనుకోకుండా తేలికగా కొట్టిన దెబ్బలకు కూడా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. కనుక ధ్యాన అభ్యాసం వీరికి తప్పనిసరి.