నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

20, సెప్టెంబర్ 2009, ఆదివారం

నవాంశ ప్రాముఖ్యత


జ్యోతిర్విజ్ఞానంలో నవాంశకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. జాతకచక్రం అంటే రాశిచక్రం పక్కనే నవాంశచక్రం కూడా ఉండటం చాలామంది చూచే ఉంటారు. నవమాంశ చక్రానికి ఎంత ప్రాముఖ్యత ఉందంటే, రాశిచక్రాన్ని కూడా అధిగమించి ఇది ఫలితాలను చూపగలదు.

నవాంశ అనే పేరులోనే ఉంది. ఇది ఒక్కొక్క రాశిని తొమ్మిది సూక్ష్మభాగాలు చేస్తే వచ్చే వర్గచక్రం అని తెలుస్తూంది. నవాంశలో గ్రహస్థితి బాగా లేకపొతే రాశిచక్రంలో ఎన్ని యోగాలు ఉన్నా ఫలితాన్ని ఇవ్వవు.చిరంజీవి జాతకంలోజరిగింది అదే.

జ్యోతిష్య గ్రంథాలలో ఉన్న సూచనలను బట్టి రాశిచక్రం చెట్టు అయితే, నవాంశచక్రం ఫలం. రాశిచక్రంలో ఉన్నసూచనలు నవాంశచక్రంలో ఉన్న సూచనలను అనుసరించి ఫలితాన్ని ఇస్తాయి. కాలం గడిచి మనిషి పెద్దవాడు అయ్యేకొద్దీ నవమాంశ చక్రంలో ఉన్న గ్రహస్థితులకు అనుగుణంగా మారటం మనం అనేక జాతకాలలో చూడవచ్చు.

ఉత్తారాదిన, ముఖ్యంగా కాశీలో ఒక శాఖవారు ఉత్త నవమాంశ చక్రాన్నే పరిగణనలోకి తీసుకొని ఫలితాలు చెప్తారు.వారు చెప్పే విషయాలు చాలా ఆశ్చర్యజనకములుగా ఉండి నాడీ జ్యోతిష్యఫలితాలను పోలి ఉంటాయి. ఖచ్చితంగా ఫలానా సంవత్సరంలో ఫలానా సంఘటన జరుగుతుంది అని బల్లగుద్ది మరీ వారు చెప్పగలరు.

హుబ్లీలో కూడా ఇటువంటి ఒక జ్యోతిష్యవిజ్ఞాని ఉండేవాడు.కాని ప్రస్తుతం ఆయన ఉన్నాడో లేడో పరిస్తితి తెలియదు.మామూలు జ్యోతిష్కులలో చాలా మందికి నవాంశ ఎలా విశ్లేషణ చెయ్యాలో తెలియదు.అది రహస్యవిజ్ఞానం. కొన్నికొన్ని కుటుంబాలలో మాత్రమే తరతరాలుగా వస్తూ ఉన్నది.

రాశిచక్రంలో ఫలితాలు బాగా లేకున్నా,నవాంశచక్రంలో మంచి యోగాలు ఉంటే జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది.అలాగే రాశిచక్రంలో ఫలితాలు బాగుండి,నవాంశలో బాగా లేకపోతే జీవితం బాగుండదు.చాలామందికి చెప్పిన ఫలితాలు తప్పటానికి ఒక కారణం నవమాంశ చక్రాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఉత్త రాశిచక్రాన్ని బట్టి ఫలితాలు చెప్పటమే.

ఒక్కొక్క రాశిలో తొమ్మిది నవమాంశలు చొప్పున మొత్తం రాశిచక్రానికి 108 నవమాంశలు వస్తాయి.ఈ సంఖ్యకు మన వైదికసాంప్రదాయంలో ఉన్న ప్రాముఖ్యత అందరికీ తెలిసినదే.ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు చొప్పున ఇరవైఏడు నక్షత్రాలకు కలిపి నూట ఎనిమిది నక్షత్ర పాదాలు వస్తాయి.అలాగే నవాంశలు కూడా నూట ఎనిమిది ఉంటాయి. మనిషి జీవితం సుమారుగా 108 ఏళ్ళని అని ఒక సాంప్రదాయం ఉంది.

"గ్రహానాం అంశకం బలం" అనే సూతాన్ని బట్టి అంశచక్రాలలో గ్రహాలున్న స్థితి అత్యంత ముఖ్యమైనది.రాశి అనగా ఒక గుట్ట.రాశిచక్రంలో అన్ని కారకత్వాలు గుట్టగా కలిసి ఉంటాయి. వర్గ చక్రాలలో చూస్తె ఒక్కొక్క చక్రం ఒక్కొక్క విషయాన్నిముఖ్యంగా చూపిస్తుంది.కనుక స్పష్టత వస్తుంది. అందుకే గ్రహముల స్థితి అంశ చక్రములోనే ముఖ్యం గా చూడాలి.

ఇటువంటి వర్గచక్రాలలో అతి ముఖ్యమైనది నవమాంశ చక్రం.ఈ చక్రం నుంచి ముఖ్యంగా వివాహజీవిత వివరాలు, సమాజంలో తనపాత్ర,మనిషి ఎంతవరకు సంఘంలో విజయాన్ని పొందగలడు అనే విషయాలను చూడ వచ్చు.రాశిచక్రాన్ని నవమాంశ చక్రంతో పోల్చి చూచుకుంటూ విశ్లేషణ సాగిస్తే అది చక్కని ఫలితాలను ఇస్తుంది.తప్పు పోవటానికి ఆస్కారం తక్కువ అవుతుంది. 

ఈ నవాంశ గణన ఎట్లనగా- మేష,సింహ, ధనుస్సులకు మేషాదిగానూ, వృష,కన్యా,మకరాలకు మకరాది గానూ, మిథున,తులా, కుంభాలకు తులాది గానూ,కటక,వృశ్చిక,మీనాలకు కటకాదిగానూ నవాంశాలను లెక్కించాలి. దానిని బట్టి నవాంశ చక్రం నిర్మాణం చెయ్యాలి.

నాడీ విధానంలో నవాంశ చక్రానికి, రాశి తుల్య నవాంశ పద్ధతికి, నవాంశల మీద గ్రహాల గోచారానికి, నవాంశ రాశ్యాధిపతికి, రాశి చక్రంలో అతని స్థితికి అత్యంత ప్రాముఖ్యత ఉన్నది. నవాంశచక్రం వరకు గ్రహాల మధ్య దృష్టులు చూడవచ్చు అని కొందరంటారు.నేను కొంతవరకే నవాంశ రహస్యాలు చూచాయగా చెప్పాను. నాకూ తెలియని పద్దతులు ఇంకా చాలా ఉన్నాయి.

జ్యోతిర్విజ్ఞానంలో నవాంశచక్రం ఒక రహస్యం.అంతు బట్టని ఒక అద్భుతం. కాని దీనిని భేదించగలిగితే జీవితరహస్యాలు తేటతెల్లంగా కనిపిస్తాయి. బహుశా అందుకే ఈ చక్రానికి అత్యంత ప్రాముఖ్యత నిచ్చే నాడీవిధానంలో ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయి.