నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

25, నవంబర్ 2009, బుధవారం

నిజమైన ప్రశ్న జ్యోతిషం-1

18/11/09 రాత్రి 19.10 గంటలకు గుంతకల్ లో నన్నొకరు ప్రశ్నించారు.

సార్. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అడగవచ్చా?

సామాన్యంగా, అది నిజమైన సమస్య అయితే తప్ప, ఉబుసుపోని ఉత్సుకతతో అడిగే ప్రశ్నలకు నేను జవాబు ఇవ్వను. కాని అడిగిన వ్యక్తి బాగా తెలిసిన వాడు కావటంతో తప్పలేదు. ముందుగా శకునాలు పరిశీలించి అన్నీ బాగానే ఉండటంతో అడగమన్నాను.

పృచ్చకుడు అడిగాడు: ప్రస్తుతం నేను దేనిగురించి అడుగబోతున్నానో చెప్పండి.

ఇదే చాలామందితో వచ్చే సమస్య. ముందుగా సరే అనిపించుకుంటారు. ఇక అక్కణ్ణించి పరీక్షించటం మొదలు పెడతారు, అదేదో మనం వాళ్లకు లైసెన్సు ఇచ్చినట్లు. నాకు విసుగు అనిపించింది. కాని మాట ఇచ్చాం కదా తప్పదు.

భలే చిక్కొచ్చి పడిందే అనుకుంటూ గురువులను ఆదిత్యాది నవగ్రహాలను స్మరించి ప్రశ్న చక్రం వేసి చూచాను. సమయానికి ఉన్న గ్రహ స్థితి ఇక్కడ చక్రం లో చూడవచ్చు. లగ్నాధిపతి శుక్రుడు షష్ఠ భావం లో ఉండుట చేత షష్ఠ భావ సంబంధ ప్రశ్న అయి ఉండవచ్చు. కాని శుక్రుడు స్వస్థానంలో బలంగా ఉండుటచేత శత్రు రోగ రుణ భయం లేదు. కనుక షష్ఠ మేమి లేదు ఇతర కారకత్వం అయిన వృత్తి సంబంధ ప్రశ్న అయి ఉండవచ్చు.

కనుక వారిని ఇలా అడిగాను " మీరు అడుగుతున్నది వృత్తి సంబంధ ప్రశ్న? అవునా?
పృచ్చకుడు: అవును.

ఇప్పుడు వృత్తిలో దేనికి సంబంధిత ప్రశ్నో తెలుసుకోవాలి. మన కారకుడగు చంద్రుడు సప్తమ భావంలో బలహీనుడుగా నీచలో ఉన్నాడు. లగ్నం స్వస్థానం అనుకుంటే సప్తమం పరాయి ప్రదేశం. స్వస్థానంలో ఉన్నంతవరకూ ఎవరికైనా మనస్సు బాగానే ఉంటుంది. పరాయి స్థానంలో ఉంటేనే బలహీనం గా ఉంటుంది. ఉద్యోగ పరంగా పరాయి స్థానం అంటే బదిలీ కావటమే. కనుక బదిలీ సంబంధిత ప్రశ్న అయి ఉండవచ్చు.

మీరు అడుగుతున్నది ఉద్యోగ సంబంధిత బదిలీ గురించి. అవునా?
పృచ్చకుడు: అవును. మా బాస్ గారికి బదిలీ కావచ్చని అనుకుంటున్నాము. ఎప్పుడు ఆర్డర్స్ రావచ్చు? చెప్పండి.

బాస్ గారికి బదిలీ వస్తే గిస్తే ఈయనకేందుకు? బాస్ కు బాధ లేదు. కాని ఈయనకి ఆత్రుతగా ఉంది.

ఉన్న చోటి నుంచి మారటాన్ని లగ్నానికి వ్యయం అయిన ద్వాదశ భావం చూపిస్తుంది. కనుక ప్రశ్నలో బదిలీ కి కారకుడు మేష లగ్నాధిపతి అయిన కుజుడు. సప్తమానికి కూడా ఆయనే అధిపతి అవటంతో ఇంకా బలం వచ్చింది. లగ్నాధిపతి శుక్రుడు. ఇక కుజుడు 19.57 డిగ్రీలలో కర్కాటకంలో ఉన్నాడు. శుక్రుడు 19.14 డిగ్రీలలో తులా రాశిలో ఉన్నాడు. ఖచ్చితమైన డిగ్రీ కంజంక్షన్ ఉండటంతో బదిలీ ఉత్తర్వులు ఇప్పటికే జారీ అయ్యాయి అని చెప్పాను.

పృచ్చకుడు: నిజమే. మాకు వచ్చిన సమాచారాన్ని బట్టి ఉత్తర్వు సంతకాలు అయిపోయాయి అని తెలిసింది. ఆర్డర్స్ ఎప్పుడు బయటకు వస్తాయి?

కుజ శుక్రులకు బేదం 43 నిమిషాలు ఉంది. ఒక డిగ్రీ లో సూర్యుడు ఒక రోజును పూర్తి చేస్తాడు. అరవై నిమిషాలు ఒక డిగ్రీ. ఒక డిగ్రీ లోపే దూరం ఉంది కనుక ఫల సమయం ఒక రోజు లోపే కావచ్చు. కాబట్టి ఇంకొక ఇరవై నాలుగు గంటల లోపే మీకు వార్త అందుతుంది అని చెప్పాను.

పృచ్చకుడు: బదిలీ దగ్గరకు ఉండవచ్చా? దూరంగా ఉండవచ్చా?

రూలింగ్ ప్లానేట్స్ కుజుడు బుధుడు వచ్చాయి. కుజుడు ద్వాదశాదిపతిగా మూడింట ఉండి దగ్గరి ప్రదేశాన్ని సూచిస్తున్నాడు. కర్కాటకంలో ఉండటంతో ఉత్తర దిక్కును సూచిస్తున్నాడు. కనుక " ఉత్తర దిక్కుగా దగ్గర ప్రదేశానికి బదిలీ అవుతుంది" అని చెప్పాను.

మరుసటి రోజు అనగా 19/11/09 రాత్రి 8 గంటల ప్రాంతంలో ( అనగా దాదాపు ఇరవై నాలుగు గంటల లో ) పృచ్చకుడు ఫాక్స్ లో బదిలీ ఉత్తర్వులు అందుకున్నాడు. గుంతకల్ కు ఉత్తర దిక్కుగా ఎక్కువ దూరంలో లేని హైదరాబాద్ కు బదిలీ అయింది.

విధంగా, సరదాగా చూచినా కూడా ఇంకొక ప్రశ్న నిజమైంది.

గమనిక
: ప్రశ్నలో ఉత్సుకత తప్ప ఒక సమస్యకు సంబంధించిన నిజమైన ఆత్రుత ప్రుచ్చకునిలో లేదు.