నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

11, నవంబర్ 2009, బుధవారం

వివేకానంద స్వామి మహాసమాధి-జాతక విశ్లేషణ

వివేకానంద స్వామి 4-7-1902 రాత్రి దాదాపు 9 గంటలకు దేహ త్యాగం చేశారు. అప్పుడు ఆయన వయసు 39 సంవత్సరాలు మాత్రమె. జాతక పరంగా ఆయనకు అప్పుడు వింశోత్తరీ దశా ప్రకారం గురుదశలో శుక్ర అంతర్దశలో బుధ విదశ జరుగుతున్నది. స్వామి జాతక రీత్యా ఘటనను విశ్లేషిద్దాము.

స్వామిది ధనుర్ లగ్నం. మహర్షి పరాశరుని ప్రకారం ధనుర్ లగ్నానికి శని బుధులు మారకులు.

||
అష్టమం ఆయుష స్థానం అష్టమాదష్టమం తథా
తయోరపి వ్యయ స్థానం మారక స్థాన ముచ్యతే ||

అష్టమ భావం ఆయుష్య స్థానం. భావాత్ భావ సిద్ధాంతం ప్రకారం అష్టమానికి అష్టమం అయిన తృతీయ భావం కూడా ఆయుష్య స్థానమే. వీటికి వ్యయ స్తానములైన సప్తమ, ద్వితీయ స్థానములు మారక స్థానములు. కనుక సప్తమాధిపతి ద్వితీయాధిపతి, ఆయా భావముల యందున్న గ్రహములు వీరితో కలిశి యున్న వారు వీరిచే చూడ బడుతున్న వారు మారకులు.

స్వామి జాతకంలో బుధునికి బలీయమైన మారకత్వం ఉన్నది. కారణమేమనగా, బుధుడు సప్తమాధిపతి మాత్రమె గాదు, ద్విస్వభావ లగ్నమునకు సప్తమాధిపతి గా బాధకుడు కూడా అయి ఉన్నాడు. ఇదీ గాక ఉభయ కేంద్రాదిపత్య దోషం కూడా ఉండటం చేత, ప్రబల దోషి గా మారి ఉన్నాడు. వీటికి తొడుగా ద్వితీయ మారక స్థాన స్థితి వల్ల ఇంకా బలం చేకూరి ఉన్నది.

ఇక పొతే ద్వితీయ స్థానములోని శుక్రుడు కూడా మారక శక్తి ని పొంది ఉన్నాడు. కారణం- రోగ స్థానాధిపతి గా మారక స్థానంలో, ప్రబల మారకుడైన బుదునితో కలసి ఉండటం వల్ల ఇతనికి కూడా ప్రబల మారక శక్తి వచ్చింది. శుక్ర బుధు లిరువురూ అంతర్దశా విదశా స్థాయిలలో అధిపతులుగా ఉండి మారకాన్ని సూచిస్తున్నారు. ఇంత వరకూ బాగానే ఉన్నది.

కాని దశా నాధుడైన గురువుకు మారకత్వం ఎలా పట్టింది? గురువు స్వామికి లగ్నాధిపతి మాత్రమె గాక సుఖ స్థానాధిపతి కూడా అయి ఉండి, లాభ స్థానం లో నెలకొని ఉన్నాడు. అటువంటి గురువు తన దశలో మారకాన్ని ఇవ్వటం జరుగదు. లగ్నాధిపతి దశలో అదీ గాక గురుని వంటి శుభ గ్రహ దశలో మారకం జరిగితే అది తన స్వంత ఇచ్చానుసారమే జరగాలి తప్ప వేరే కారణం ఉండటం సాధ్యం కాదు. గురువు కుజుని చిత్తా నక్షత్రం లో స్థితి కలిగి ఉండి కుజునిచేత పంచమ స్థానం అయిన మేషం నుంచి సప్తమ దృష్టితో చూడబడుతూ ఉన్నాడు. మేష రాశి శిరస్సుకూ కుజుడు రక్తానికీ కారకులు అని మనం గుర్తుంచుకుంటే క్రింది విషయాలు తేలికగా అర్థం అవుతాయి.

లగ్నాధిపతి లాభ స్థానంలో మారకం జరిగింది = తన స్వంత ఇచ్చానుసారం జరిగిన సంఘటన.
మేష రాశి= శిరస్సు
కుజుడు= భేదనం, రక్త సంబంధం
గురు కుజుల పరస్పర దృష్టి= తన సొంత ప్రయత్నంతో, మంత్ర స్థాన సంబంధం చేత , యోగ మార్గ రీత్యా బ్రహ్మ రంధ్ర చేదనం ద్వారా
బుధ శుక్రుల ప్రబల మారకత్వం=నరాలు చిట్లటం ద్వారా అంతర్గత రక్త స్రావం ద్వారా మరణం సంభవించింది అని తెలుస్తూంది.

ఇక చంద్ర లగ్న రీత్యా విశ్లేషణ ఎలా ఉందొ చూద్దాము.

చంద్ర లగ్నాత్ పైన ఇచ్చిన వివరణ ప్రకారం గురు శుక్రులు మారకులు. గురువు సప్తమాధిపతి, ఉభయ కేంద్రాదిపత్య దోషి, ద్వితీయ మారక స్థాన స్థితితో ప్రబల మారకుడు అయినాడు. శుక్రుడు ద్వితీయాధిపతి గా మారకుడు. లగ్నాధిపతి అయిన బుదునితో కలసి ఇచ్చా స్థానము మంత్ర స్థానము అగు పంచమ భావము నందు ఉండుటచేత ఏమైనదో చూద్దాము.

లగ్నాధిపతి బుధుని ప్రమేయం = తన స్వంత ఇచ్చ వల్లనే
మారకుడగు శుక్రునితో కలసి ఉండుట వల్ల = మరణాన్ని ఆహ్వానించి
ఇద్దరి పంచమ మంత్ర స్థాన స్థితి = యోగ ప్రక్రియ ద్వారా శరీర త్యాగం చేసాడు. స్వామి మరణం ముందు గా మంత్ర జపం చేయటం గమనించాలి. లగ్నాత్ మరియు చంద్ర లగ్నాత్ కూడా సంఘటనతో పంచమ మంత్ర స్థానం సంబంధం కలిగి ఉన్నది.

అష్టమ కుజుని వీక్షణ= కుండలినీ యోగ రిత్యా ప్రబల యోగ బలంతో
మారక గురుని మీద కుజ దృష్టి= యోగులు పొందే శుభ మరణాన్ని బ్రహ్మ రంధ్ర చేదనం ద్వారా పొందాడు.

చంద్ర లగ్నాత్ గురు బుధ శుక్రుల పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మరణ సమయంలో గురుదశ/శుక్ర అంతర్దశ/బుధ విదశ జరగటం గమనించ వచ్చు. రోజు జ్యేష్ట బహుళ చతుర్దశి కొద్దిగా మిగిలి ఉంది. అమావాస్య ఘడియలు ప్రారంభం అవుతూ ఉన్నాయి. ఆర్ద్రా నక్షత్రం స్వామికి విపత్తారగా జరుగుతున్నది. వారాధిపతి గా శుక్రుడు హోరాధిపతి గా తిరిగి బుధుడు ఉండటం రాత్రి సమయంలో బుధ హోర జరుగుతూ ఉండటం రెండు గ్రహాలు మళ్ళీ పాత్రలలో ప్రత్యక్షం కావటం ఘటన యాదృచ్చికం అని అనలేని బలమైన రుజువుగా ఉన్నది.

స్వామి జూలై నాలుగు నే ఎందుకు ఎంచుకున్నట్లు? ఆయనకు తారీకు అంటే ప్రీతి అనటానికి ఒక కారణం ఉన్నది. జూలై నాలుగవ తారీకున అమెరికాకు స్వతంత్రం వచ్చింది. రోజు అమెరికాలో ఉత్సవ వాతావరణం ఉంటుంది. 4-7-1776 బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి అమెరికా కు స్వాతంత్రం వచ్చింది. స్వామి ప్రపంచ చరిత్ర క్షుణ్ణం గా తెలిసిన వాడు. దేశాలు ,జాతులు ,మతాలు ,సంస్కృతులు ,చరిత్ర ,ప్రాచ్య పాశ్చాత్య తత్వ శాస్త్రాలు - వీటిమీద అనర్గళం గా రోజుల తరబడి మాట్లాడగలిగే విజ్ఞానం మరియు ధారణా శక్తి ఆయన కు ఉండేది.

స్వామికి అమెరికా దేశంతో అవినాభావ సంబంధం ఉన్నది. స్వామికి అంతర్జాతీయ గుర్తింపు కూడా అక్కడ నుంచే వచ్చింది. అంతే కాదు భవిష్యత్తులో భారతీయ యోగ వేదాంత శాస్త్రాలను భారతీయుల కన్నా అమెరికనులే ఎక్కువ ఆదరిస్తారని ఆచరిస్తారని స్వామికి తెలుసు. స్వామి ఆలోచనలో జూలై నాలుగు అంటే దాస్యం నుంచి స్వాతంత్రానికి, బానిసత్వం నుంచి విముక్తికీ సాగిన పోరాటంలో విజయం సాధించిన రోజు.

కనుకనే నేమో ఆయన తన మహా సమాధికి కూడా జూలై నాలుగునే ఎంచుకున్నాడు. ఇంద్రియాల పట్టు అనే చెరసాల లో దేహ మనే బంధంలో మగ్గుతూ విశ్వాత్మానుభావం అనే స్వాతంత్రానికి దూరం గా బ్రతకటానికి యోగులు ఇష్టపడరు. ఎదురుగా సముద్రం కనిపిస్తూ ఉంటే చిన్న గ్లాసులో ఇరుకుగా కదలడానికి చోటు లేక అవస్త పడే చేపలా వారి మానసిక స్థితి ఉంటుంది. కనుక దేహ దాస్యం తీరి బంధాలు ఎల్లలు ఆకలి దప్పులు లేని అమృతత్వ స్థితిని తాను పొందుతున్న రోజును ఎంచుకుంటూ స్వామి అమెరికాకు చరిత్రాత్మక మైన స్వతంత్రం వచ్చిన జూలై నాలుగును ఎంచుకున్నాడు. అదీ గాక ఆరోజు ఇంకొక ప్రత్యేకతను కలిగి ఉన్నది. ఆరోజు కృష్ణ చతుర్దశి, అంటే మాస శివ రాత్రి.

స్వామికి తాను జ్ఞాన మూర్తి, లోకానికి ఆది గురువు యగు శివుని అంశావతారం అన్న సంగతి తెలుసు. ఆయన విషయం అనేక సార్లు గురుదేవుని నోటివెంట ఇంకా ఇతర సోదర శిష్యుల నుంచి విని ఉన్నాడు. పిల్లల కోసం పరమ శివుని ఎంతో కాలం ప్రార్థించిన మీదట పుట్టిన ఆయనను వీరేంద్ర శివుని వర ప్రసాదిగా ఆయన తల్లి దండ్రులు భావించేవారు. ఇదే భావనను బలపరిచే అనేక సంఘటనలు ఆయన జీవితంలో జరిగాయి.

యువకునిగా సాధనా దినాలలో ఒక నాడు నరేంద్రుడు(స్వామి), తారక్ (స్వామి శివానంద) ఒకే దోమ తెరలో నిద్రించారు. ఒక రాత్రి నిద్ర లేచిన తారక్ ఆశ్చర్య చకితుడైనాడు. కారణం ఆయన పక్కనే నిద్రిస్తున్న నరేంద్రుడు లేడు. ఆయన స్థానంలో చిన్ని పాపల వంటి శివ మూర్తులు కొందరు నిద్రిస్తూ కనిపించారు. అది భ్రమయేమో అని తారక్ కళ్లు నులునుకొని మరీ మరీ ఎంత చూచినా అదే దృశ్యం కనిపించింది. భయం ఆశ్చర్యం ముప్పిరిగోనగా తారక్ రాత్రంతా నిద్ర పోకుండా శివ మూర్తులకు తన కాళ్ళు తగులుతాయేమో అని ఒక మూలకు జరిగి కూర్చొని గడిపాడు.

తెల్ల వారు జాముకో తారక్ కు మాగన్నుగా తూగు వచ్చింది. తెల్ల వారిన తరువాత చూస్తె నరేంద్రుడు నవ్వుతూ కనిపించాడు. శివుని వేషంలో ఉన్న చిన్న పిల్లలు లేరు. ఇదే విషయాన్ని ఆయన నరెంద్రునితో చెబితే, స్వామి నవ్వుతూ అది తారక్ భ్రమగా కొట్టి పారేశాడు. ఇటువంటి అనేక సంఘటనలు సోదర శిష్యులకు కలిగాయి. ఇవన్నీ స్వామికి తెలుసు. కాని ఆయనకు తన స్వరూప జ్ఞానం తను చెయ్య వలసిన పని పూర్తీ అయ్యాకే అందించబడింది. చివరి రోజులలో ఆయనకు తానెవరో తెలిసింది. అంత వరకు జగన్మాత ఆయనను తన మాయతో కప్పి ఉంచింది.

దేహ బంధం నుంచి పరమ స్వాతంత్రం లభించే మహా సమాధి రోజును, స్వాతంత్రానికి సూచిక అయిన జూలై నాలుగవ తారీకుగా ఆయన ఎంచుకున్నాడు. అదే రోజున మాస శివ రాత్రి కావటం, శివునికి ప్రీతి పాత్రమైన బహుళ చతుర్దశి రోజున అది కూడా శివ పూజకు ప్రీతి పాత్రమైన రాత్రి సమయంలో ఆయన దేహాన్ని వదలి పెట్టటం అత్యంత చక్కగా ఉంది.తానెవరో తనకు తెలిసింది కాబట్టే స్వామి మాస శివ రాత్రి రోజున దేహ త్యాగం చేసాడు. బహుశా ఇంతకంటే మంచి సూచనాత్మకమైన రోజును ఎంచుకోవటం సాధ్యపడక పోవచ్చు.

మార్మిక సిద్దాంత రీత్యా నాలుగవ తేదికి ఇంకొక విశిష్టత కూడా ఉన్నది. నాలుగు అనే అంకె జాగ్రత్ స్వప్న సుషుప్తులకు అతీతమైన తురీయ స్థితికి సూచిక. వేదాంతము తురీయ స్థితిని సత్ చిత్ ఆనంద స్వరూపమైన ఆత్మ స్థితి గా చెబుతుంది. కనుక వేదాంత శాస్త్ర రీత్యా నాలుగు అనే అంకె ఆత్మ సాక్షాత్కార స్థితికి సూచిక. అదీ గాక రోజు మాస శివరాత్రి కావడం కూడా తోడయ్యింది. కనుక స్వామి మహా సమాధికి ఎంచుకోవటం చాలా చక్కగా ఉంది.

తరువాతి తరంగంలో మరిన్ని జ్యోతిష్య వివరాలు చూద్దాము.