Pages - Menu

Pages

6, డిసెంబర్ 2009, ఆదివారం

ఎప్పుడో వ్రాసిన కొన్ని పద్యాలు

ఈ మధ్యన పాత కాగితాలు వెతుకుతుంటే ఎప్పుడో ఏడెనిమిదేళ్ళ క్రితం నేను వ్రాసిన పద్యాలు దర్శనమిచ్చాయి. వాటిలో నాకు బాగా నచ్చిన కొన్ని పద్యాలు మచ్చుకు ఇక్కడ ఇస్తున్నాను.

యోగమంటే...
కం|| యోగంబన నాత్మైక్యము
యో
గంబన లోవెలుపల నాత్మను గనుటే
యో
గంబన సత్యాత్మను
వే
గంబుగ బొందజేయు విద్యర సత్యా ||

కం|| కలవెన్నో యోగంబులు
తల మించిన భారములవి తధ్యంబిలలో
నిలచిన తనలో తానిటు
నిలలో నుత్తమ యోగంబిదియే సత్యా ||

ధైర్యం...
ఉ || కాలము గాసిదప్పి కసుగాలము బెట్టగ జూచునాడు పో
గాలము వచ్చెనంచు నటు గాసిలి ఖేదము నొందనేల; తా
త్కాలిక రీతులౌ సుఖము దుఃఖము లొచ్చుచు బోవుచుండు; నా
జాలము లన్ జిక్కక నిటు జల్లగ నుండుము ధైర్యశాలివై ||

అనిత్యత్వం...
ఉ || పోవలె గాదె నెల్లరిక పాటుగ గాలము బిల్చునాడు; ని
త్తావున నెవ్వరుందు రిల ధాటిగ గోర్కెలు దీరుదాక; నీ
జీవనయానమే ఇచట జూడగ నస్థిర సంచయమ్ము; స్వ
ప్నావళి బోలు నీ జగము నెందుకు యాసలు నిల్వు నెమ్మదిన్ ||

శాంభవీ ముద్ర...
కం || చూపున నున్నది సర్వము
చూపే మారిన సకలము చట్టున మారున్
గోప్యంబౌ జ్ఞానంబిది
నేర్పుగ దీనిని విడువక నేర్వర సత్యా ||

సిద్ధ గురువులు...
కం || గురుడగు వాడే నాటికి
మరుగున గల మణి సరగున మట్టుగ నుండున్
త్వరపడి లోకము దిరుగడు
అరయంగా సిద్ధ గురుల తెరగిది సత్యా ||

నాలో నేను...
కం || నేర్చితి వెన్నో విద్యలు
కూర్చితివా నీదు మనము కూటస్థంబున్
పేర్చితివా సద్గుణముల
నోర్చితివా బాధలన్ని యొంటిగ సత్యా ||

గురూపదేశం ...
కం || వింత గొలుపు లోకంబను
సంతను తెగ దిరిగి నీవు జావగనేలా
అంతము జేయుచు నాశలు
అంతయు నీవుండు సీమ కరుగర సత్యా ||


కం||ఆత్మయె నీవని దెలియర
ఆత్మారామమును జేరి యమరగ వలెరా
ఇతరములన్నియు మిధ్యర
సతమీ సత్యము మరువకు మదిలో సత్యా ||


నీ గురువుల ననుగమించు...
ఘనులగు నీ పూర్వగురుల
ననుగమనము సేయవలయు నమిత ధృతితో
వినరా వారల మాటల
ననునిత్యము నిల్చిజూడు మద్వయ సీమన్