నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

25, డిసెంబర్ 2009, శుక్రవారం

ఆంద్ర వాల్మీకిపై వచ్చిన ఇరవై పద్యాలు






























శ్రీ వావిలికొలను సుబ్బారావుగారు(ఆంద్ర వాల్మీకి) 23-1-1863 న రాయల సీమలోని ప్రొద్దుటూరులో జన్మించారు.1-8-1936 న మదరాసులో పరమ పదించారు. వీరు కాలాంతరమున వాసుదాస స్వామిగా ప్రసిద్ధికెక్కిన మహా భక్తుడు. తపోమయ నిరాడంబరజీవి.

కం || వాసిగ వావిలి కొలనున
బూసెను పద్మంబు నొకటి సుబ్బారావై
వాసుందాస స్వామిగ
దోసిలిబట్టెను రాముని దాసుండయ్యెన్||

వావిలికొలను అనే వంశంలో సుబ్బారావు అనే పేరున్న పద్మం ఒకటి విరబూసింది.వాసుదాసస్వామి అనే పేరుతో కాలాంతరంలో ప్రఖ్యాతి గాంచింది.


ఆయన వాల్మీకి సంస్కృత రామాయణాన్ని ఇరవైనాలుగువేల ఛందోభరిత పద్యాలుగా తెలుగులో వ్రాశారు. దానికి మందరం అని పేరు. ఇది అనితర సాధ్యమైన విషయం.వాల్మీకి రామాయణాన్ని (24000 శ్లోకాలనూ ) 108 సార్లు నియమ పూర్వకంగా పూర్తిగా పారాయణం చెయ్యటం వలన ఆయనకు అందులోని నిగూఢమైన అర్ధాలు స్ఫురించాయి.

కం || తెనుగున రామాయణమును
అనుదినమును వ్రాసినాడు అచ్చపుభక్తిన్
ఘనుడాంధ్ర వాల్మికి యను
మునిపుంగవు డొక్కడుండె ముదమున వినుమా ||


రామాయణాన్ని తెలుగుభాషలో భక్తితో వ్రాసినట్టి 'ఆంద్రవాల్మీకి' బిరుదాంకితుడు ఒక ఘనుడున్నాడు.   


కం || వరుసగ రామాయణమును
ఇరువది నాలుగు వేలగు ఇంపౌపదముల్
తరమే సంస్కృత సమముగ
మరి వ్రాయగ నేరికైన మందరమనుచున్ ||


ఇరవై నాలుగువేల పద్యాలలో సంస్కృత రామాయణాన్ని తెలుగులో వ్రాయడం ఎవరికైనా సాధ్యమేనా?మందరం అన్న ఆ మహాకావ్యం ఎంత చక్కనిదో కదా?


ఆయన వ్రాశిన రామాయణాన్ని మహాసభామధ్యంలో ఒంటిమిట్ట రామాలయంలో శ్రీరామునకు అంకితం ఇచ్చారు.అప్పుడు బళ్ళారిరాఘవ గారి అధ్యక్షతన జరిగిన సభలో మహాపండితులు ఆయనకు 'ఆంధ్రావాల్మీకి' అని బిరుదు ప్రదానంచేసారు. అలా ఇవ్వడం వల్ల ఆ ఇచ్చినవారే ధన్యులయ్యారు.

కం || ఆంధ్రా వాల్మికి వనుచున్
సాంద్రముగా బిరుదునిచ్చి సత్కవి కికనా
చంద్రార్క ఖ్యాతిం గని
మందరమై నిల్చితీవు మహినటతిలకా ||


ఓ నటతిలకమా.బళ్ళారి రాఘవా! 'ఆంధ్రావాల్మీకి' అంటూ బిరుదును ఈ మహానీయునకు ఇవ్వడం వల్ల నీ ఖ్యాతి ఇనుమడించింది సుమా.

రాజులు ఆలయానికి ఇచ్చిన వందలాది ఎకరాల మాన్యాలు ఎవరికీ వారు భోంచేయగా రామునికి నైవేద్యం కరువైన స్థితికి ఆలయం వచ్చింది. జీర్ణదశకు చేరిన ఒంటిమిట్ట రామాలయాన్ని ఉద్ధరించటానికి కంకణం కట్టుకొని ఆయన ఆంద్రదేశంలో ఊరూరా తిరిగి బిచ్చమెత్తి ఆ ధనంతో దేవాలయానికి పూర్వవైభవం తెచ్చారు. తన జీవితాన్ని ఒక తపస్సుగా గడిపారు.


కం || రామునకై బిచ్చమడిగె
కాముని వశమందు నుంచె కర్మల నణచెన్
రామాయణమున్ జెప్పెను
పామరు వోలెన్ పండితుడేమరి బ్రతికెన్||

కం || టెంకాయ చిప్ప బట్టుక
శంకాకుల మనము వీడి ఇంకేమనుచున్
బింకపు వాసుందాసక
లంకముగా బిచ్చమెత్తె నింకను వినుమా||

టెంకాయ చిప్పను చేతిలో ధరించి ఊరూరా తిరిగి బిచ్చమెత్తి వచ్చిన ధనంతో ఆయన ఆలయాన్ని పునరుద్ధరించారు. ఎంత ధనం తనలో పడినా ఏదీ ఉంచుకోనక రామునకిచ్చి చివరకు తాను ఖాళీ అయిన టెంకాయచిప్ప ను చూచి " నీ జన్మ ధన్యము కదే టెంకయ చిప్పా " అంటూ దానిమీద 'టెంకాయ చిప్ప శతకం' చెప్పిన మహాకవి.

కం || టెంకాయచిప్ప శతకము
పొంకము మీరంగ జెప్పె పొంగుచు మదిలో
ఇంకను లోటేమున్నది
కింకరునకు వాసుదాసవరునకు నిలలో ||

మనస్సులో ఉప్పొంగుతూ టెంకాయ చిప్ప శతకాన్ని చెప్పినావు. నీకింకా లోటేమున్నదయ్యా వాసుదాస యతీంద్రా?


కం ||ఏమీ నీ యదృష్టం

బేమీ నీ భాగ్యగరిమ నెంతని పొగడన్
ఏమీ నీ జీవితమిట
నేమీ నీ ధన్యచరిత టెంకయచిప్పా ||

రామాలయ జీర్ణోద్ధరణకు దేశమంతా తిరిగి నీలో పడిన ధనాన్ని ఒక్క రూపాయి కూడా ఉంచుకోనకుండా చివరికి ఖాళీగా మిగిలిన నీ జీవితం ధన్యం కదా టెంకాయ చిప్పా. నీవలె మేము కూడా ఆశామోహాలను వదల్చుకొని శూన్యాన్తరంగులమై ఎప్పుడు నిలుస్తామో కదా !

ఆయన 1920 ప్రాంతాలలోనే మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజిలో తెలుగు పండితునిగా పనిచేసారు. వైరాగ్యపూరితుడై భోగమయ జీవితాన్ని త్యజించి గోచీ ధరించి రామునికోసం ఒంటిమిట్టలో ఏళ్ల తరబడి తపస్సు చేసారు. కాని ఊరిలోని కొందరు స్వార్థపరులు కుళ్ళు రాజకీయాలతో ఆయన్ను అవమానించి ఆలయం లోనికి రానివ్వక వెడలగొట్టారు. ఆయనకు ఊరిలో నిలువలేని పరిస్తితి కల్పించారు. ఆయన దుఖించి, ఆ ఊరిని వీడి, మొదట గుంటూరు జిల్లా నడిగడ్డపాలెం లోనూ తరువాత అంగలకుదురులోనూ తన ఆశ్రమాన్ని స్తాపించుకొని అక్కడే ఉన్నారు. వారు మొదలు పెట్టిన గురుపరంపర నేటికీ కొనసాగుతూ ఉన్నది. వారి వెబ్ సైట్ ఇక్కడ చూడండి. www.kodandarama.com



కం || పాండితి నొల్లక నీవటు
ఖండితముగ రాముగోరి కరమోడ్పులతో
దండన లొందుచు జెదరక
నుండితి వీ యొంటిమిట్ట వసుదాసేంద్రా||

మహా పండితుడవైనప్పటికీ, ఆ పాండిత్యాన్ని వదలిపెట్టి,రాముని దర్శనాన్ని కోరి గ్రామస్తుల చీదరింపులను సహిస్తూ ఈ ఒంటిమిట్టలో ఒక బికారివలె ఉన్నావు కదా.

కం || రంగుగ నీ గ్రామంబున
పొంగుచు నాధూర్తులెల్ల నిను దిట్టంగా
కుంగుచు నీవటు మదిలో
అంగలకుదురుకు బోయితి వతిఖిలమతివై ||

మంచి చేద్దామని సంకల్పించినట్టి నిన్ను ఆ గ్రామస్తులే రకరకాల మాటలతో అవమానించగా నీవు బాధపడి చివరకు తెనాలి వద్ద గల అంగలకుదురు కు చేరావు కదా.

కం || పోతనయే నివసించిన
ఈ తావున నిల్చి నీవు అతిబింకముగా
యాతనల కోర్చి కూర్చితి
వతి సుందరమౌ కావ్యము మందరమనుచున్ ||

పోతన ఇక్కడ నివసించాడు అన్న కారణం వల్ల నీవు కూడా ఇక్కడే ఉంటూ ఎన్నో యాతనలకు ఓర్చుకుని మందరమనే సుందరకావ్యాన్ని రచించావు కదా.

కం ||మందరమను ఆ కావ్యము

నందముగా గూర్చితీవు అతిచతురతతో

చందురుడినుడే సాక్షులు
అందరితో నౌనె ఇట్టి యద్భుతమనఘా ||

మందరమనే ఈ సుందర కావాన్ని వ్రాయడం ఇతరులవల్ల అవుతుందా? ఈ అద్భుతాన్ని నీవు చెయ్యడం చూచిన చంద్రుడు సూర్యుడే దీనికి సాక్షులు.


కం || భక్తుండవు రామునకిల
రక్తుండవు గావు నీవు రమ్యల యందున్

శక్తుండవు బహు రీతుల
ముక్తుండవు ముదమారగ మునికుల తిలకా||

నీవు రామభక్తుడవు. నీకు సుందరీమణుల యందు మోహం లేదు. ఎన్నో రహస్య శక్తులు కలిగినవాడవు. చివరకు ముక్తిని కూడా పొందినావు.

కం || అచ్చంబగు కవివి నీవుర

స్వచ్చంబగు కవిత నీది సత్యంబిదిరా

తుచ్చత లేదుర నీలో
మచ్చయె  లేనట్టి దివ్య మహిమాన్వితుడా ||

నా దృష్టిలో అచ్చమైన కవివి నీవే. నీ కవిత స్వచ్చమైనది. నీలో అల్పత్వం ఎక్కడా లేదు. నీవు మహిమాన్వితుడవు.

ఆయన మొదట హఠయోగ సాధనలు చేసెడివారు. ఒకనాడు స్వప్నములో ఇద్దరు సోదరులు కనిపించి నీవు నడుస్తున్న దారి ముళ్ళబాట.ఇటు రమ్మని చేయి పట్టుకొని మంచి రాచబాటలో విడిచినట్లు కలగన్నారు.అంతట హఠయోగమును విడచి భక్తియోగమును ఆశ్రయించి కృతార్దుడైనాడు.

కం ||హఠయోగపు సాధనమున
ఇటునటుగా జీవుడలసి స్వప్నము గాంచెన్
బాటను ముళ్ళని ఇరువురు
పాటిగ జేర్చిరి సొంపగు బాటను ఎటులో ||

ఆయన ఎంతటి మహా కవి యంటే ఒక్క ఉదాహరణ. నెల్లూరులో జరిగిన ఒక సభలో సభ అందరి ఎదురుగానే కొన్ని గంటలలో ఆశువుగా రంగ నాయకునిపై నూరు పద్యాలు ఆశువుగా చెప్పి శతకాన్ని పూర్తిచేసారు.


|| రంగ నాయకునికి రంగారు శతకమ్ము

జెప్పినావు నీవు జిత్రముగను
ఎల్లవారి ఎదుట నెల్లూరు సభలోన
ఒక్కపూటలోన నిక్క మిదియె ||

ప్రిన్స్ ఆఫ్ వేల్స్ యువరాజు మన దేశాన్ని చూడటానికి ఒచ్చినపుడు, కళాశాల తెలుగు పండితుడు గనుక యువరాజును స్తుతిస్తూ కవితలు చెప్పమని బ్రిటిషు ప్రభుత్వం ఆయన్ను ఆదేశించింది. బహుమతిగా బంగారు కంకణం ఇస్తామని ఆశ చూపింది. దాన్ని ఖరాకండి గా తిరస్కరించి తాను రామదాసునే గాని కామదాసును గానని తేల్చి చెప్పాడు.

ఆ || ఇచటికొచ్చువాడు ఇంగ్లీషు యువరాజు
కవిత జెప్పుమన్న కబురు దెలిసి
రామదాసు నేను కామదాసును గాను
కవితలల్లననుచు ఖండితముగ ||

ఆ || ఆశ జూపినట్టి అచ్చంపు బంగారు
నిచ్చగింప బోక నేవగించి
గెల్చినావు నీవు ఘనరాము హృదయంబు
వాసుదాస భక్తవర వికాస ||

ఆ || బిరుదు నిచ్చె నిచట బళ్ళారి రాఘవ
ఆంద్ర వాల్మికంచు నాదరమున
గణుతి కెక్కినావు ఘనసభామధ్యమున
వాసుదాస భక్తవర వికాస ||

తుచ్చమైన లోకంలో స్వచ్చమైన జీవితాన్ని గడపి శ్రీరామసాక్షాత్కారాన్ని పొందిన ధన్య జీవి. నవీనయుగంలో రుషివలె బ్రతికి చూపిన మహాపురుషుడు.

ఆ || తుచ్చమైన నిట్టి లోకంబు నందున
బ్రతికినావు నీవు యతివరేణ్య
పంకసీమయందు పద్మంపు రీతిగా
వాసుదాస భక్తవర వికాస ||