Pages - Menu

Pages

29, డిసెంబర్ 2009, మంగళవారం

ఒంటిమిట్ట శ్రీ రామునిపై ఇంకో ఎనిమిది పద్యాలు











ఆ || మూగవాడు జెప్పు ముచ్చటౌ పద్యాలు
పంగుడెగురు గట్టి పర్వతముల
అన్నమాట నేడు అతిసత్యమైదోచె
నీదు పాదయుగము నంటినంత ||

ఆ || పాదరజము సోకి పడతియయ్యెను రాయి
శబరి ధన్యయయ్యె సొబగులీన
కోతియొకటి మించి కోపించి గాల్చెరా
వేయి యోజనముల విభవపురిని||

ఆ || నీదు నామమందు నేమి మాహాత్మ్యమో
జపము జేసి ఇలను జంతుతతులు
ఇంద్రియముల మించి ఈశ్వరాత్మకులైరి
ఏమి మహిమ నీదు నామమందు?||

ఆ || పుస్తకములనుండు పుక్కింటి సుద్దులు
నిజముగాదు యనుచు నింతసేపు
తలచినట్టి భ్రమలు తలక్రిందులయ్యెరా
రుజువు జూచినంత రూడిగాను ||

ఆ || ఇట్టి వింతలెన్నో గట్టిగా గనుపింప
ముదమునంది ఘనులు మునిగణములు
మానవుడవు గావు మహిలోన నీవంచు
రామబ్రహ్మమనిరి రక్తిమీర ||

ఆ || ధర్మమెల్ల రూపుదాల్చి నిల్చిన యట్లు
సత్యమెల్ల నీదు సన్నిధగుచు
దైవమిలను జూడ దాక్షిణ్యమూర్తి యై
నీదు రూపమందు నిల్చెనిటను ||

ఆ || భ్రమలు దొలగి జూడ బంగారుగవివీవు
ఇహమునందు నింక నిత్యమందు
దైవరాయుడగుచు దగ్గరైనావింక
నిల్పుకొందునింక నిన్ను మదిని ||

ఆ || లోకయాసలేల లోకేశుడుండంగ
ఇంద్రియముల దగులు ఇచ్ఛలేల
మనసునధిగమింతు మరినీదు కరుణతో
ఆత్మనందు కొనెద నబ్బురముగ ||