నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

23, డిసెంబర్ 2009, బుధవారం

ఒంటిమిట్ట -మూడో పది పద్యాలు















కం|| ఒంటగు మిట్టను రాముడు
జంటగ తన సతిని గూడి ధాత్రిని వెలసెన్
బంటుగ లక్ష్మణదాసుడు
మింటను గల వేల్పులెల్ల నింటిణంబై ||
 
ఒంటిమిట్ట అనబడే ఈ ప్రదేశంలో శ్రీరాముడు తన సతీమణితో, సేవకుడైన లక్ష్మణునితో కలసి నివసించాడు. ఆకాశచారులైన దేవతలంతా ఆయన ఇంటి పరివారంగా ఉన్నారు.

కం ||ఏకశిలా నగరంబని
లోకంబున పేరుగన్న నాకంబిదియే
ఏకశిలను తాముండెడి
పోకడ సీతయు రాముడు లక్ష్మణులిన్||

ఏకశిలా నగరం అని చెప్పబడే స్వర్గంవంటి ఊరు ఇదే. ఇక్కడ సీతారామలక్ష్మణులు ఒకే శిలలో మూర్తులుగా ఉన్నందువల్ల ఈ ఊరికి ఆ పేరు వచ్చింది.

కం || చూడగ సీతారాములు
అడవిని వసియించు వేళ ననుజుని తోడన్
వేడుకగా విచ్చేయుచు
మూడగు దినములు గడపిన మునివాటిదియే ||

సీతారాములు తమ్మునితో కలసి అడవిలో నివసించిన సమయంలో వేడుకగా మూడురోజులు గడపిన మునివాటిక ఈ ప్రదేశమే సుమీ.

కం ||ఆనాటికి హనుమంతుడు
గాన్పింపమి రామాయణ ఘట్టము లందున్
నాటికి విగ్రహములు
ఘనమారుతి రహితులుగా గనబడు నిచటన్ ||

ఆ సమయానికి వారికి హనుమంతుడు పరిచయం కాలేదు.అందుకే ఇక్కడి పూజామూర్తులలో హనుమంతుడు ఉండడు.సీతారామలక్ష్మనులే పూజా మూర్తులుగా ఉంటారు.

కం ||సీతను వెదకుచు వానరు
లీతటినా గాధను విని,అతినిశ్చలతన్
ప్రీతిగ జేసిరి స్థాపన
తాతగు జాంబవుకరముల ధన్యాత్మకులై ||

సీతను వెదికే సమయంలో ఇక్కడికి వచ్చిన వానర వీరులు ఈ కధంతా విని, జాంబవంతుని హస్తాలతో ఇక్కడ సీతారామలక్ష్మణుల విగ్రహాలను ప్రతిష్టించారు.

కం ||కాంచితినా రూపంబది
కాంచితినా నీలమేఘు 
కనకాంబరునిన్
గాంచితి కరుణామూర్తిన్
గాంచితినా హాసముఖుని కమనీయముగా ||

ఆ నీలమేఘుని రూపాన్ని చూచాను. కనకాంబరధారిని కన్నాను. కరుణామూర్తిని కనుగొన్నాను. కమనీయమైన ఆ నవ్వు మోమువానిని దర్శించాను.

కం ||తల్లీయని పిలువగనే
ఝల్లని నామదిని దోచి చల్లని చూడ్కుల్
వెల్లువ బంపెడి కల్పజ
వల్లీ నీపాదరజము నొసట ధరింతున్ ||

అమ్మా అని పిలిచినంతనే ఝల్లుమంటూ నా మనస్సులో మెదిలి చల్లని చూపుల వెల్లువను నాపైకి పంపుతున్న ఓ సీతామాతా, ఓ మహాలక్ష్మీ నీ పాదరజస్సును నా నుదుటిమీద ధరిస్తానమ్మా.

కం || ఏమాశించితి వంచున్
ప్రేమాదరమొప్ప నీదు వాణి చింపన్
ఏమరుపాటెరుగని ఆ
పామరభక్తియె జాలని గోరితి తల్లీ ||

నాయనా నీకేం కావాలి? అని ప్రేమగా నీవు ప్రశ్నిస్తే నేనేమి చెప్పగలను.నిన్నెప్పుడూ మరువనటువంటి అమాయక మైన భక్తిని నాకివ్వు తల్లీ. అదే నాకు చాలు అని మాత్రమే అడుగగలను.

కం || భళిరా ధన్యత నొందితి
కలిదోషము మాపునట్టి కాంతిని గంటిన్
కులమున్ ధన్యంబయ్యెను
సలలిత నీ సాంద్రకరుణ సీతారమణా ||
 
భలే!ధన్యత్వాన్ని పొందాను.కలిదోషాలను పోగొట్టే  కాంతిని చూచాను. నేను పుట్టిన వంశం ధన్యం అయ్యింది. ఇదంతా నా గొప్పకాదు.చల్లనైన నీ కరుణాకటాక్ష ప్రభావమే శ్రీరామా.

కం || ఉక్కంటి మేను భళిరా
తుక్కగు నీధాటి కవియె రక్కసి గుణముల్
ముక్కంటి యంవిలలో
ఇక్కంటికి నింపుగూర్పు మిప్పుడె హనుమా ||

స్వామీ ఆంజనేయా! ఏమీ నీ ఆకారం!!ఉక్కులా దృడంగా  ఉంది.నీ ధాటికి రాక్షసగుణాలు తుక్కుతుక్కుగా ధ్వంసం అవుతున్నాయి.నీవు ఈశ్వరాంశసంభూతుడవు. నా కళ్ళ ఎదుట ఇప్పుడే కనిపించి నాకు ఆనందం కలిగించు.