Pages - Menu

Pages

26, జనవరి 2010, మంగళవారం

కాళ హస్తి, తిరుపతి సందర్శనం

23-1-2010 సాయంత్రం కాళ హస్తి ఈశ్వర దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది. ఒక VVIP గారితో వెళ్ళ బట్టి ఆలయ EO ఎదురొచ్చి పూర్ణ కుంభ స్వాగతం తో తీసుకెళ్ళి దర్శనం చేయించారు. తరువాత ఒక గంట సేపు ఆలయంలో మృత్యుంజయ లింగం ఉన్న చోట కూర్చొని మౌన జపం లో కాలం గడిపాను.

అదే రోజు రాత్రికి తిరుమల కొండ పైకి చేరుకొని రాత్రికి అక్కడే బస చేసాము. 24-1-2010 తెల్ల వారు జామున నాలుగుకే లేచి స్నానాలు ముగించుకొని అయిదు కల్లా దర్శనం కొరకు బయలు దేరాము. శుక్ర వారం నాడు TTD బోర్డు మీటింగ్ జరిగింది. మాతో పాటు బోర్డు సభ్యులు, ఇంతకూ ముందటి ఈవో గారు, మరికొందరు VVIP లు ఉన్నారు. లోపలి గడప వరకు తీసుకెళ్ళారు. గత ఇరవై ఏళ్లలో అటువంటి దర్శనం జరుగలేదు. గడప దాటితే స్వామి దగ్గరకు చేరుతాము. స్వామిని చాలా దగ్గరగా చూచే అదృష్టం కలిగింది. సర్వాలంకార భూషితుడుగా స్వామి నయనానంద కరం గా ఉన్నాడు. ప్రధాన అర్చకులు హారతి ఇస్తుండగా వజ్ర వైడూర్యాలు ధగ ధగ మెరిసి కళ్ళు మిరుమిట్లు గొలిపాయి. స్వామి మందహాసం ఇంతకు ముందు అంత దగ్గరగా చూడలేదు. అత్యంత సమ్మోహనం గా ఉంది. చెక్కిన శిల్పి ఎవరో గాని అద్భుతమైన ప్రతిభ కలవాడు. చిరు మందహాసం లో ఎన్ని భావాలను పొదగ గలిగాడో.

అంత చలిలో కూడా తమిళ వైష్ణవ భక్తులు, డెబ్భై ఎనభై ఏళ్ళ వాళ్ళు చలికి గజ గజ వణుకుతూ పైన ఆచ్చాదనలు లేకుండా దర్శనం కోసం వేచి ఉండటం చూస్తె, తమిళ సోదరులకు మనకంటే భక్తి చాలా ఎక్కువే అనిపించింది. మన ఆంధ్రా వాళ్ళు మాత్రమె పాంటు చొక్కాలలో దర్శనానికి వచ్చి కనిపించారు. వేషానికి దైవ దర్శనానికి సంబంధం లేక పోయినా, సాంప్రదాయ దుస్తులలో వచ్చి దర్శనం చేసుకుంటే ఆ అనుభూతి వేరు అనిపించింది. ఈ సారి వచ్చినపుడు నేను కూడా పంచె కట్టుకుని, శాలువా కప్పుకుని రావాలని నిశ్చయించుకున్నాను.

ఆరున్నర కల్లా దర్శనం ముగించుకొని బయటకు వచ్చి బయట చైర్మన్ ఆదికేశవులు నాయుడు గారిని కలిశి బసకు చేరాము. పది కల్లా కొండ దిగి క్రిందకు వచ్చి లోకంలో పడ్డాము.

తిరుమల కొండ లోనే ఏదో అద్భుతమైన వాతావరణం ఉంది. పైన ఉన్నంత వరకు సమస్యలు గుర్తుకు రావు. ఏదో వేరే లోకం లో ఉన్న అనుభూతి కలుగుతుంది. The mind reaches an elevated state effortlessly. ఇది నాకేనా అందరికీ ఇలాగే ఉంటుందా అని మా స్నేహితులను అడిగాను. అందరూ అదే అనుభూతికి లోనవుతాము అని చెప్పారు.

పవిత్ర క్షేత్ర దర్శనము, ఆలయ మర్యాదలతో ఆహ్వానములు జరగాలంటే, పంచమ, నవమాధిపతి దశలు, యోగ కారక దశలు జరుగుతూ ఉండాలి. అధిపతులు కూడా మంచి స్థితిలో ఉండాలి. అప్పుడే ఇలాటి అవకాశాలు లభ్యం అవుతాయి.

14, జనవరి 2010, గురువారం

సంధ్యోపాసనా రహస్యాలు


సంధ్యోపాసన అనేది ఉపనయనం అయిన ప్రతివ్యక్తీ చేయవలసిన నిత్యోపాసన.శూద్రుడుగా జన్మించిన ప్రతి మనిషీ, సంస్కారకర్మ వల్ల ద్విజుడు అవుతున్నాడు. ఉత్తజంధ్యాన్ని ధరించి నంతమాత్రాన ఎవడూ ద్విజుడు కాలేడు. సంద్యోపాసనా రహస్యాలను తెలుసుకొని ఆచరించి దాని లోతులు అందుకున్న వాడే ద్విజుడు. ఇతరులు ఒట్టి వేషగాళ్ళు మాత్రమె.

ప్రపంచం యొక్క, తన జీవితంయొక్క అనిత్యత్వాన్ని చక్కగా అర్థం చేసుకోవటమే రెండవజన్మ.అంతేగాని ఉత్త యజ్ఞోపవీతాన్ని ధరించటం కాదు. ఈవిధంగా ద్విజుడైనవాడు ఈ లోకయాత్రను సాగిస్తూనే ఆత్మసాధనను కూడా అభ్యాసం చేస్తాడు.ఈ విధమైనటువంటి అవగాహనను ఇచ్చే సంస్కార కర్మయే ఉపనయనం.

ఈ ఉపనయనం అనే మాటకు సామాన్య అర్థం ఏదైనప్పటికీ నేను మాత్రం ఒకే అర్థాన్ని విశ్వసిస్తాను.మానవునికి గల మూడోకన్ను అనబడే నేత్రాన్ని వికసింపచేసేదే ఉపనయనం.ఈ మూడోకన్ను అనేది దేవీమూర్తులకు, పరమేశ్వరునికి ఉన్నట్లుగా మనం చిత్రాలలో చూస్తాము. ఇది వెన్నెముకలో ఉన్న షట్చక్రాలలో చివరిదైన ఆజ్ఞాచక్రానికి సరాసరి సూటిగా నుదుటిలో ఉండే నాడీకేంద్రం.చాలామంది ఇదే ఆజ్ఞాచక్రం అనుకుంటారు. కాదు. రెంటికీ భేదం ఉన్నది. అది అనుభవంలో తెలుస్తుంది.

ఇది వికసించిన మనిషి దేవతలతో సమానమైన స్థితిని అందుకుంటాడు. దీనికి సూచికగానే హిందువులలో నుదుటిలో బొట్టును ధరించటం అనే సాంప్రదాయం వచ్చింది.బొట్టు అనేది జాగృతి చెందిన మూడవ నేత్రానికి సూచిక.కాని మన ఖర్మకొద్దీ నేటి ఆడపిల్లల్లో బొట్టు పెట్టుకోవటమే మోటు అనే స్తితి వచ్చింది.దీనికి తల్లిదండ్రులదే పూర్తి బాధ్యత. వాళ్ళకే తెలియని విషయాలు వారి పిల్లలకు ఏమి నేర్పించగలరు?

ఇది ప్రతి మనిషికీ ఉంటుంది. కాని నిద్రావస్థలో ఉంటుంది. దీనిని వికసింప చేయగలిగితే మానవుడు అతీంద్రియజ్ఞానం కలిగినవాడౌతాడు.అంటే ఇతరులు చూడలేనివి అతడు చూడగలుగుతాడు.ఇతరులు వినలేని శబ్దాలు అతడు వినగలుగుతాడు.సూక్ష్మభూమికలతో అనుసంధానం కాగలుగుతాడు. అతీంద్రియసిద్ధులు పొందగలుగుతాడు.అంతెందుకు ఒక్క మాటలో చెప్పాలంటే భగవంతుని వెలుగును దర్శించగలుగుతాడు.

ఇటువంటి ఉప నయనాన్ని (additional eye) ఇచ్చే సంస్కారకర్మనే ప్రాచీనులు ఉపనయనం లేక వడుగు అని పిలిచారు. కాని ఈ అర్థం ఇప్పుడు పూర్తిగా విస్మరింపబడింది.ఆంతరికమైన యౌగికఅర్థం మరుగునపడి, ప్రస్తుతం వడుగు అంటే బంధువర్గం అంతా కలిసి చేసుకునే ఒక పండుగగా మారిపోయింది.తూతూ మంత్రంగా ముగించే ఒక తంతుగా మారింది. వివాహానికి ముందుగా చెయ్యాలి కాబట్టి, విసుక్కుంటూ చేసుకునే ఒక తంతుగా మారిపోయింది.ఇది పూర్తిగా తప్పుడు పధ్ధతి. ఇటువంటి స్థితి ఎందుకు కలిగింది?ముఖ్యంగా కలిప్రభావంవల్ల మనిషి ఇంద్రియవ్యామోహాలకు ప్రాధాన్యత ఇస్తూ ఆధ్యాత్మికసాధనను పూర్తిగా నిర్లక్ష్యం చెయ్యటమే దీనికి కారణం.

గురుతెరుగగ జెప్పు గురుడెవ్వడునులేడు
గురుతునెరుగు శిష్యవరుడు లేడు
గురుడు శిష్యుడనుట గుడ్డెద్దు చేనురా
విశ్వదాభిరామ వినురవేమ

అని వేమన యోగి చెప్పినట్లు, అంతరార్థాలు వివరించే గురువులూ ప్రస్తుతం కరువయ్యారు.చెప్పినా విని ఆచరించే శిష్యులూ కరువయ్యారు. కనుకనే జీవంలేని కట్టెలా,ఆంతరిక అర్థాలు లేని ఉత్తుత్తి ఆచరణలు,పైపై తంతులు మాత్రమె మిగిలి హిందూమతం,పండుగలు పబ్బాలు చేసుకుంటూ, సినిమాలు వీడియోలు చూసుకుంటూ బంధువులంతా కలసి లోకాభిరామాయణం చెప్పుకునే ప్రస్తుతస్తితికి చేరింది.ఈ స్థితిని ఊర్ధ్వలోకాలనుంచి చూచి గోత్రఋషులు ఎంతగా బాధ పడుతుంటారో ఆలోచిస్తే బాధ కలుగుతుంది. ఇది నిజంగా శోచనీయం.

ఇక ప్రస్తుత విషయానికి వద్దాం. సంధ్య అంటే ఒక స్థితినుంచి ఇంకొక స్థితికి మారే దశ (transitional state).మనకు ఇరవైనాలుగుగంటలలో ఈ స్థితి నాలుగుసార్లు వస్తుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, అర్ధరాత్రి. ఈ నాలుగు సమయాలలో ప్రకృతి ఒక స్థితినుంచి ఇంకొక స్థితికి మారుతుంది. కనుక అప్పుడు సాధనకు అత్యంత అనుకూల సమయంగా ఉంటుంది.

కారణం? ఏ స్థితి అయినా కోనసాగుతున్న వరకూ మనిషి అదే శాశ్వతం అనే భ్రమలో ఉంటాడు.కాని స్థితి మారినప్పుడు అతనికి ఆ స్థితి యొక్క అనిత్యత్వం బాగా అనుభవంలోకి వస్తుంది. సరిగ్గా సంధ్యాసమయంలో ఇదే జరుగుతుంది.మారిన ప్రకృతి స్థితివల్ల ప్రపంచం యొక్క అనిత్యత్వం సరాసరి మానవుడు అనుభవించగలుగుతాడు.అందుకే ఆ స్థితిని చాలామంది తట్టుకోలేరు.

సాయంకాలాల్లో ప్రశాంతంగా కూర్చోనలేక బట్టలు వేసుకొని రోడ్లమీద తిరగటానికి తయ్యారు అయ్యేవాళ్ళు మనకు చాలామంది దర్శనం ఇస్తారు. వారంతా బజారులోని జనసందోహంతో మమేకం చెందుతూ మనం హాయిగా ఉన్నాం మనకు ఏమీ పరవాలేదు అనే భ్రమను కల్పించుకొని తమ అంతచ్చేతనను మోసం చేసుకుంటూ ఉంటారు. మనస్సు లోపల లోతులలో ఇంత తతంగం జరుగుతుంది అని స్పృహ కూడా వారికి ఉండదు.

గొర్రె అనే జంతువు మందలో ఉంటూ తాను సుఖంగా ఉన్నాను అన్న భ్రమలో ఉంటుంది. కాని మృత్యువు తనను మింగటానికి వస్తున్నది అన్న నిజం అది తెలుసుకోలేదు. తెలిసినా ఆ స్పృహను తప్పించుకోటానికి మందతో మమేకం చెందుతూ అదే రక్షణ అన్న భ్రమలో ఉంటుంది. మనుషులలో కూడా చాలా మంది ఈ గొర్రె స్థితిలోనే ఉంటారు.

అందుకే మామూలు మనిషికి సాధకునికి ఉన్న అతి చిన్నతేడా ఏమిటంటే, సంధ్యాసమయంలో సాధకుడు ఏకాంతాన్నిఅభిలశిస్తాడు. జనంతో కలవడానికి ఇష్టపడడు.బాహ్యమైన భ్రమలకంటే ఆంతరికమైన సత్యాన్ని ధైర్యంగాఎదుర్కోటానికే అతడు ప్రాధాన్యతనిస్తాడు. అందుకే సాధకుడైన వాడు ఈ సంధ్యాసమయాన్ని దుర్వినియోగం చెయ్యరాదు.ఇతరత్రా వ్యాపకాలు వదలి ఆంతరిక ధ్యానసాధనలోనే ఈ సమయాన్ని ఉపయోగించాలి.

అలాగే, మానవుని జీవితంలో సంధ్యాసమయం కూడా నాలుగుసార్లు వస్తుంది. మానవుని పూర్ణాయుర్దాయం అయిన 120 ఏళ్లలో ప్రతి 30 ఏళ్ళకూ ఒకసారి సంధ్యాసమయం వస్తుంది.కొందరికి 96 మరి కొందరికి 108 గా ఈ ఆయుర్దాయం ఉంటుంది.అటువంటి వారికి ప్రతి 24 మరియు 27 ఏళ్లకు ఒకసారి ఈ సంధ్యాసమయం వస్తుంది. ఈ వివరాలు జ్యోతిర్విజ్ఞానం లో భాగమైన కాలచక్ర దశాజ్ఞానం ఉన్నవారికి బాగా అర్థం అవుతాయి.

కాలచక్రదశ అనేది దశావిదానములలో ఒక ముఖ్యమైన దశ. పరాశరమహర్షి దీనికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు.ఇది రాశిదశ.ఉడుదశ కాదు.అలాగే రాశిచక్రంలో ఉన్న నాలుగు విభాగాలలో ఈ సంధికాలం మనం జ్యోతిష్యంలో కూడా చూడవచ్చు.1,4,7,10 భావాల మొదటిలో ఈ సంధికాలం ఉంటుంది. 

శైశవం,యవ్వనం,నడి వయస్సు,ముసలితనం ఈ విభాగాల ద్వారా సూచింప బడతాయి.సహజ నైసర్గిక కారకాత్వపరంగా ఈ విభాగాలకు బుధుడు, కుజుడు,గురువు,శని గ్రహాల ఆధిపత్యం ఉంటుంది.ఈ విధమైన సమన్వయము జీవితానికి,ప్రకృతికి,గ్రహాలకు,ఆంతరిక-బాహ్యపరంగా కనిపిస్తుంది. కాని చూచేదృష్టితో దీనిని చూడాలి.

ఆంతరిక ధ్యానసాధన చేసేవారికి దీనిలోని ఇంకొన్ని రహస్యాలు తెలుస్తాయి. మనం మెలకువ నుంచి నిద్రలోకి పోయే సమయంలోకూడా సంధ్యాసమయం ఉంటుంది.అలాగే నిద్రనుంచి మెలకువకు వచ్చే స్థితిలో కూడా సంధ్యా సమయమే.ఈ సంధ్యాసమయంలో ధ్యానస్థితిలో ఉండగలిగితే వానికి ఆధ్యాత్మికపురోగతి అత్యంతత్వరితంగా కలుగుతుంది. దీనిని సూచిస్తూనే మన పెద్దవాళ్ళు నిదానంగా నిద్రలెమ్మని,మెలకువ తెచ్చుకొమ్మని చెబుతారు. అలాగే, నిద్రలో ఉన్న మనిషిని అకస్మాత్తుగా లేపకూడదని కూడా చెబుతారు.

నిద్రపోయే ముందు జపం ధ్యానం చేస్తూ నిద్రలోకి జారుకోవడం ఒక మంచి అభ్యాసం.దీనివల్ల చెడుకలలు రాకపోవటమే కాక నిద్ర లేచేవరకూ అంతచ్చేతనలో మంత్రజపం లేదా ధ్యానస్థితి అలా కోనసాగుతూ ఉంటుంది. నిద్ర మెలకువ వచ్చేటపుడు కూడా మంత్రజపం లేదా ధ్యానస్థితితోనే దానంతట అది మెలకువ వస్తుంది. దీనివల్ల మనస్సు అత్యంత త్వరితంగా శుద్దత్వాన్ని సంతరించు కుంటుంది.

అయితే దీనిలో ఒక ప్రమాదం ఉంది. జపం మొదలుపెట్టగానే నిద్ర ముంచుకొచ్చే అలవాటు కాకుండా సాధకుడు జాగ్రత్తపడాలి.

ఇప్పుడు నేను చెప్పబోయే స్థితి కోటికి ఒకరికి కూడా అనుభవంలో ఉండదు. ఇది ఇంకా లోతైన సంధ్యాసమయం.కలలుకనే స్థితినుంచి గాఢనిద్రలోకి జారుకునే సమయంలో కూడా ఒక సంధ్యాస్థితి ఉంటుంది. తిరిగి గాఢనిద్ర నుంచి కలలుకనే భూమికలోకి వచ్చే స్థితిలో కూడా కొంతసేపు సంధ్యా సమయం ఉంటుంది. అయితే ఈ రెండూ స్తితులు యోగసాధనలో లోతులు అందుకున్నవారికే అనుభవంలోకి వస్తాయి.

జనసామాన్యానికి ఇవి అందుబాటులో ఉండవు. గాఢనిద్ర అనేది పూర్తిగా అరుదైపోయిన నేటి అస్తవ్యస్త సమాజంలో ఇవి ఊరకే బుద్దిపరంగా అర్థం చేసుకోవటానికి పనికొస్తాయిగాని అనుభవంలో అందవు. అందుకే ఈ స్తితి కోటిమందిలో ఒకరు మాత్రమె అందుకోగలరు అని ముందే చెప్పాను. అర్థరాత్రి వరకూ చెత్త టీవీ సీరియల్లు చూసి, నిద్రరాక,ఉత్త మామూలు నిద్ర కోసం తన్నుకులాడి,నిద్రమాత్రల సాయంతోనో లేదా ఆల్కహాల్ సాయంతోనో లేదా సెక్స్ సాయంతోనో ఎప్పుడో అర్థరాత్రి దాటిన తరువాత కలతనిద్రలోకి జారుకునే నేటి మనుషులకి ఇవి చెప్పినా అర్థంకావు.

దీనిలో ఇంకొంత లోతులు చూద్దాం. ఒక ఆలోచన ఆగి మరొక ఆలోచన మొదలయ్యే మధ్యలో కూడా సంధ్యాసమయం ఉంటుంది. ఈ విరామం తెలియాలంటే ఆలోచనలు గమనించే సామర్ధ్యం ఉండాలి. ఇది సామాన్యంగా అందరికీ ఉండదు. ఏ ఆలోచన వస్తే దానిలో పడి కొట్టుకుపోవడమేగాని వాటిని సాక్షిగా గమనించే సామర్ధ్యం సామాన్యంగా ఉండదు. ఇట్టి సామర్ధ్యం ఏళ్ళ తరబడి చేసిన ధ్యానసాధన ద్వారానే వస్తుంది.

ఇట్టి ప్రజ్ఞ కలిగినవాడు ఆలోచనకూ ఆలోచనకూ మధ్యన ఉన్న శూన్యమైన స్థితిని పట్టుకోగలుగుతాడు. ఆ శూన్యస్థితిలో ఎల్లప్పుడూ ఉండటం అలవాటు అయితే ఆలోచనారహితస్థితి అందుకుంటాడు.ఈ ఆలోచనా రహితస్థితి సమాధిస్థితికి అతి దగ్గరగా ఉంటుంది.ఇంకొక్క అడుగు ముందుకు వెయ్య గలిగితే సమాధిస్థితిని అందుకోవచ్చు. కాని ఆఒక్క అడుగు వెయ్యడానికి బ్రహ్మప్రళయం అవుతుంది. అనేకసార్లు ఈఒక్క అడుగు వెయ్యటానికి అనేకజన్మల సమయం పడుతుంది. ఇది అత్యంత రహస్యవిజ్ఞానం మరియు వ్యక్తిగతంగా అత్యంత సమర్థుడైన శిష్యునికి వివరించ వలసిన విషయం కనుక ఇంతకూ మించి వ్రాయలేను.

ఆలోచనారహితస్తితి అందుకుంటే ప్రకృతిలోని రహస్యద్వారాలు తెరుచు కుంటాయి.అంతకు ముందు కనిపించని అనేక వింతలు కనిపిస్తాయి. ఈ లోకానికి చెందని సూక్ష్మధ్వనులు వినపడతాయి. అప్పుడు వినపడే కొన్ని ధ్వనులను ఈలోకంలోని ఏ సంగీత వాయిద్యమూ సృష్టించలేదు.అవి అంతటి విభిన్నంగా మధురంగా ఉంటాయి.అనేక రంగుల వలయాకారాలు,కాంతి ఒక ఫౌంటెన్ వలె విరజిమ్మబడటం వంటి అనేక దృశ్యాలు కనిపిస్తాయి.

ఇట్టి స్తితిని అందుకోగలిగితే ప్రకృతిలో ప్రతిదీ జీవంతో తొణికిసలాడుతూ దర్శనం ఇస్తుంది.చెట్లతో మాట్లాడవచ్చు.రాళ్ళను పలుకరించవచ్చు. గాలి ఆత్మీయస్పర్శను అందుకోవచ్చు.నీటి గలగలలలో సూక్ష్మలోకవాసుల మాటలను ఆలకించవచ్చు.ఇంతెందుకు.సాక్షాతూ దైవస్పర్శను ప్రతి దానిలోనూ అడుగడుగునా తిలకించవచ్చు.

అప్పుడు మామూలు మనుషులకు అగమ్యమైన ఒక కొత్తలోకం ఈలోకంలోనే మనకు దర్శనం ఇస్తుంది.కాని లోకానికి ఒక పిచ్చివానివలె కనిపిస్తాము. మహనీయులైన సిద్దులందరూ ఇట్టి స్థితిలో ఉన్నపుడు లోకం దృష్టిలో పిచ్చివారుగా చూడ బడినవారే.

సంధ్యోపాసన అనేది సరిగ్గాచేస్తే ఇంతటి ఔన్నత్యాన్ని మానవునికి ఇవ్వగలదు. కాని దీన్ని బోధించేవారు,దారి చూపించేవారు కరువు అయ్యారు.ఒకవేళ అటువంటివారు ఉన్నా కూడా ఆచరించే వారు అరుదయ్యారు. సంపదను ఉంచుకొని కూడా అది మరిచిపోయి బికారిగా బతుకుతున్న అభాగ్యునివలె మన పరిస్తితి నేడు ఉన్నది ఆంటే అతిశయోక్తి కానేరదు.కొన్నాళ్ళు పోయాక ఏ అమెరికావాడో వచ్చి నాయనలారా మీ ప్రాచీన వేద-తంత్ర విజ్ఞానంలో ఇంత మహత్తరమైన విషయాలు ఉన్నాయి. తెలుసుకొని ఆచరించండిరా అని చెబితే వాళ్ళను కూడా పిచ్చివాళ్ళ కింద జమకట్టి నవ్వుతామేమో.అలా ఉంది మన హీనస్తితి.

మనం నిర్లక్ష్యం చేస్తున్న సంధ్యావందనం అనే ప్రక్రియలో ఇంతటి గూఢమైన అర్థాలు ఉన్నాయి.సంధ్యారహస్యం ఇంకా చాలాచాలా ఉన్నది. వ్రాస్తూపొతే ఇదే కొన్ని అధ్యాయాలుగల ఒక పుస్తకం అవుతుంది. ప్రస్తుతానికి చాలు.

13, జనవరి 2010, బుధవారం

జనవరి పన్నెండు విశిష్టత

పూర్తి బిజీగా ఉండి కూడా నిన్న వ్రాశిన పోస్ట్, ఈరోజు ప్రచురిస్తున్నాను.

జనవరి పన్నెండో తేదీకి ఒక విశిష్టత ఉంది. ఈ రోజుననే వివేకానంద స్వామి జన్మించారు కదా. తిధుల ప్రకారం అయితేకాదనుకోండి. కాని మాయా ప్రపంచం మాయకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఆ రకంగా చూస్తె, జనవరి పన్నెండుప్రపంచానికే ఒక ముఖ్యమైన రోజు.

భూమ్మీద ఆధ్యాత్మిక చింతన పూర్తిగా అడుగంటిన రోజులలో, నవీన నాగరికత పేరుతో భారతీయమైన అన్నీ చిన్నచూపు చూడ బడుతూ మన జాతి ఒక బానిస జాతిగా ముద్ర పడి, వెయ్యి సంవత్సరాలుగా సంపద పరంగా దోచుకోబడుతూ, చివరికి ఈ జాతి ప్రాణం అయిన ఆధ్యాత్మికత కూడా పూర్తిగా అడుగంటి కొడి గట్టిన దీపం లా ఉన్నదుర్దినాలలో, నిశీధిని తొలగిస్తూ మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తూ ప్రత్యక్షమయ్యే ఉషోదయం లా, సనాతన రుషిపుంగవుడు, దేవతలకు కూడా అందని సప్తర్షి మండలంలో విరాజిల్లెవాడు, శివాంశ సంభూతుడూ అయిన స్వామి ఈభూమ్మీద అవతరించిన రోజు.

తన దివ్య వాణితో, మనం మరచి పోయిన జాజ్వల్య మానములైన మన యోగ- వేదాంతరహస్యాలను మనకు విప్పిచెప్పి, మన వారసత్వ సంపదను మన కళ్ళ ఎదుట నిలిపి- భారత జాతి అంటే బానిస జాతి కాదు- ప్రపంచమంతా ఆటవికులుగా ఆకులు కట్టుకుని పచ్చి మాంసం తింటున్న రోజులలో, దార్శనిక భావాలలో అత్యున్నత శిఖరాలు అందుకున్న ద్రష్టలు జన్మించిన జాతి భారత జాతి- అని విదేశాలలో వారి గడ్డ మీద- వారి మధ్య- ఏకాకిగా- ఎటువంటిసహాయం లేకపోయినా- ఒక్క తన వ్యక్తిత్వమే ఆధారంగా - పర్యటించి- ప్రకటించి- నిరూపించిన- మహా పురుషుడు జన్మించిన రోజు ఇది.

వెయ్యి సంవత్సరాల చీకటిని చీల్చుకుంటూ-వెలుగు దివిటీని తన చేత ధరించి మన దేశం అభ్యున్నతికి సూచనగా - తద్వారా సమస్త ప్రపంచానికి దివ్యమైన వేదాంత జ్ఞానాన్ని ప్రసరింప చేస్తూ- ఎడారి మతాల అజ్ఞాన పూరితదాడులు-మోస పూరిత మత మార్పిళ్ల మధ్య- తేజో పుంజం లా ఆవిర్భవించిన మహర్షి పుట్టిన రోజు ఇది.

భారతీయుడి గా పుట్టిన ప్రతి మనిషీ- ఉదయం నిద్ర లేస్తూనే తలుచుకోవలసింది తన ఇష్ట దైవాన్ని కాదు- ముందుగా వివేకానంద రుషి వరేణ్యుణ్ణి భక్తితో స్మరించాలి అని నా నిశ్చితాభిప్రాయం.

ఎందుకంటే ఈ నాడు ప్రపంచం మన దెశాన్ని గౌరవిస్తున్నదంటే మన యోగ వేదాంత జ్నానాన్ని, మన ప్రాచీన రుషులు మనకు ఇచ్చిపొయిన ఆధ్యాత్మిక సంపదను చూచే గాని ఇతరత్రా కాదు. ప్రపంచం మనలను గురువులుగా భావించి వేల మైళ్ళు వచ్చి నేటి మన మహనీయుల పాదాల వద్ద మోకరిల్లుతున్నదంటే, అది వీళ్ళ గొప్ప కాదు. మన ప్రాచీన మహర్షుల మహిమ. కాపీరైట్స్ ఆశించకుండా మహత్తరమైన జ్నాన సంపదను ప్రపంచానికి ధారాదత్తం చెసి పోయిన మహర్షుల గొప్పతనమే గాని ఇంకోటి కాదు.

వివేకానంద స్వామిని స్మరిస్తే ప్రాచీన రుషి సంఘాన్ని అంతటినీ స్మరించినట్లె. రుషి రుణం లవలేశమైనా తీర్చుకున్నట్లే అని నా నిశ్చితాభిప్రాయం.

10, జనవరి 2010, ఆదివారం

పురుషార్థాలు-కొన్ని జ్యోతిష తంత్ర రహస్యాలు


రాశిచక్రాన్ని పురుషార్థపరంగా నాలుగు త్రికోణాలుగా ఎలా దర్శించవచ్చో చెప్పాను కదా.ధర్మ-కామ త్రికోణాలను మాత్రం తీసుకోని,ఇంకొంత లోతైన విశ్లేషణ చూద్దాం.

ధర్మానికి కామానికి సామాన్యంగా పొసగదు. పొత్తు కుదరదు.కనుక ధర్మ,కామ త్రికోణాలు పరస్పరం ఎదురెదురుగా ఉంది సూటిగా ఖండించుకుంటాయి.కాని ఈ రెంటిని చక్కగా సమన్వయము చేసుకో గలిగితే, అనగా ధర్మాన్ని కామానికి ఆధారం చేసుకోగలిగితే అప్పుడు జీవితం భగవంతుని ఆదేశాలకు,ప్రకృతి యొక్క అమరికకు అనుగుణంగా ఉంటుంది. అప్పుడు మానవుడు భూమ్మీద దేవుని ప్రతిరూపం కాగలడు. అంటే దేవుని కుమారునిగా బ్రతకగలడు.

ధర్మ-కామ త్రికోణాలు రెండూ కలిసిన యంత్రం షట్కోణ సుబ్రమణ్య యంత్రం.లోకాలకు మాతాపితలైన పార్వతీ పరమేశ్వరుల సంతానం కుమారస్వామి.ప్రతి మానవుడూ కుమారుడే.కాని ఎవడైతే ధర్మాన్నీ-అంటే ఒకటి,అయిదు,తొమ్మిది భావాలనూ (శివుణ్ణి) మరియు కామాన్ని అంటే మూడు,ఏడు,పదకొండు భావాలను (శక్తిని) సరిగా సమన్వయము చెయ్యగలడో వాడు కుమారుని అంశ అవుతాడు.దీనిని సూచిస్తూ కుమారస్వామి యంత్రంలో ఎదురెదురుగా ఖండించు కుంటున్న రెండు త్రికోణాలు ఉంటాయి.

ఊర్ధ్వ ముఖంగా ఉన్న త్రికోణం ధర్మ త్రికోణం.రాశిచక్రంలో ఇది 1,5,9 భావాలలో దర్శనం ఇస్తుంది. ఇది ధర్మ స్వరూపుడైన శివునికి సూచిక.ప్రపంచానికి ధర్మమే (universal law)ఆధారం.ధర్మం ఎప్పుడూ ఊర్ధ్వముఖంగా ఉంటుంది. దానికి కింది చూపు ఉండదు.శివతత్త్వం అగ్ని స్వరూపం.అగ్ని ఎప్పుడూ క్రిందినుంచి పైకి ఎగురుతుంది. పైముఖంగా ఉంటుంది.

ఇక అధోముఖంగా ఉన్న త్రికోణం శక్తికి సూచిక.రాశి చక్రంలో ఇది 3,7,11 భావాలలో మనకు దర్శనం ఇస్తుంది.ఏ శక్తి అయినా పైనుంచి కిందికే ప్రవహిస్తుంది.శక్తితత్త్వం జలస్వరూపం. శక్తి ఆర్ద్రమైనది.నీరు ఎప్పుడూ పైనుంచి క్రిందికే ప్రవహిస్తుంది.అందుకే కామత్రికోణం క్రింది ముఖంగా ఉంటుంది.శక్తి లేకపోతే ప్రపంచం లేదు. ప్రపంచమంతా శక్తి మయమే.

శివశక్తుల కలయిక కుమారస్వామి. ఈయన యంత్రంలో ఆరుకోణాలు ఉంటాయి.అందుకే ఆయనకు షణ్ముఖుడు అని పేరు వచ్చింది.ఈ ఆరు కోణాలు రెండు త్రిభుజాల పరస్పర ఖండన,మెళన వల్ల ఏర్పడతాయి. అలాగే ధర్మం,కామం కలయిక వల్ల ఉన్నతుడైన మానవుడు ఏర్పడతాడు. ప్రపంచం లోని ఉన్నతమైన భావాలకు శక్తులకు షణ్ముఖుడు అధిపతి. దీనికి సూచికగానే ఆయనను దేవ సేనాపతి అంటారు.అంటే దేవసేన అనే ఒక దేవతకు భర్త అని కాదు. ధార్మికమైన, శక్తివంతములైన పవిత్ర భావములు అనబడే దేవతలకు ఆయన అధిపతి అని అర్థం. ఇది ధర్మ-కామ సమన్వయ స్వరూపం.

ప్రపంచంలొని అతి ప్రాచీన మతాలన్నిటిలో ఈ భావన ఉంది. హిందూ మతంలో భాగమైన తంత్రశాస్త్రంలో ఈ భావన శివుడు,శక్తి, కుమారుడు అని చెప్ప బడింది. అంటే చలిస్తున్న ప్రపంచం (శక్తి), దీనికి ఆధారమైన అచలమైన శివుడు,మరియు ప్రపంచంలో ఉన్న జీవుడు (కుమారుడు) అని అర్థాలు. దీన్ని కాపీ కొట్టిన క్రైస్తవమతం Father,Holy Ghost,Son అని చెప్పింది. అయితే Father అన్న పదానికి Jehova(Yahveh) నూ, Holy Ghost కు ఆత్మనూ, Son కు జీసస్ నూ సూచికలుగా వారు తీసుకున్నారు.

కాని దీని అసలైన మూలభావనలో చూస్తే, 

Father=జగత్పిత,శివుడు లేక పరమాత్మ

Holy Ghost=కాళి లేక జగన్మాత,

Son=కుమార స్వామి అనేది క్ర్రైస్తవం కంటే అతి ప్రాచీనమైన హిందూ మతంలో తంత్రంలో మనకు దర్శనం ఇస్తుంది.

ఇక్కడ ఒక చిత్రమైన విషయం కనిపిస్తుంది. Holy Ghost అన్న పదానికి కాళీ మాత రూపం అచ్చు గుద్దినట్లు సరిపోతుంది. ఎందుకంటె ఆమె రూపం అతి భయంకరంగా ఉండి కూడా అతి పవిత్రమైనదిగా ఉంటుంది.


మూల భావనలు ప్రాతిపదికగా తీసుకుంటే, ప్రపంచంలోని ఏ మతమూ హిందూ మతం కంటే గొప్పది కాదు. ఎందుకంటే ఇతర మతాలు చెప్పేభావనలు అన్నీ అంతకు వేల సంవత్సరాల ముందే హిందూమతం లో ఉన్నాయి.

ఇంకో విదంగా చెప్పాలంటే హిందూమతంలోని చిన్నచిన్న ముక్కలే ఇతర మతాలు అని అనుకోవచ్చు. ప్రపంచంలోని ఏ మతానికి చెందినా వారైనా శివ-శక్తులనే, తెలిసో తెలియకో పూజిస్తున్నారు. పూజించగలరు. ఇంతకంటే ఎవరైనా ఇంకేమీ చెయ్యలేరు.ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అంతిమ సత్తాకలు (Ultimate Entities) శివ-శక్తులు మాత్రమె.


జ్యోతిష్యపరంగా చూస్తే ఈ రేఖా యంత్రం, ధర్మ మరియు కామ త్రికోణాల కలయికగా మనకు దర్శనం ఇస్తుంది.తంత్రపరంగా ఇది శివ-శక్తి స్వరూపమైన షణ్ముఖ సుబ్రహ్మణ్య యంత్రం.జాతక రహస్యాలు తెలిసిన వారికి దీన్ని చూడగానే ఒక మనిషిలో ధర్మం-కామం ఏఏ పాళ్ళలో కలిసి ఉన్నాయో తెలిసిపోతుంది.

ధర్మం ఎక్కువై కామం తగ్గితే దైవత్వం.

కామం ఎక్కువై, ధర్మం తక్కువ అయితే రాక్షసత్వం.



రెండూ ఇంచు మించుగా సమపాళ్ళలొ ఉంటే మానవత్వం.

ఈ జ్ఞానం కలగాలంటే, పై ఆరు భావాల (1,5,9,3,7,11) సమన్వయ పూర్వక విశ్లేషణ చెయ్యటంలో ప్రావీణ్యత ఉండాలి. ఇక్కడ ఇంకొక విచిత్రం ఉంది. ఈ అంకెలలో ఒక క్రమం మనం చూడవచ్చు. 1,3,5,7,9,11 అంకెలలో ఉన్న రహస్య సంకేతాలను, తంత్రపరమైన రహస్యాలను ఇంకొక సారి వివరిస్తాను.

చివరిగా ఒక కొసమెరుపు ఏమిటంటే ప్రాచీన యూదుమతంలో,ఈ షట్కోణ సుబ్రహ్మణ్య యంత్రాన్ని Solomon Seal అనే పేరుతో పిలుస్తారు. King Solomon ఈ యంత్రాన్ని పూజించేవాడు.మెడలో ధరించేవాడు.అంటే అతడు తెలిసో తెలియకో శివ-శక్తి స్వరూపుడైన సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించేవాడు.ప్రాచీనకాలంలో,నేటివలే మత పరమైన సంకుచిత భావనలు లేవు.నిజమైన జ్ఞానం ఎక్కడ ఉన్నా స్వీకరించేవారు.సాలమన్ రాజు మార్మిక శాస్త్రముల(Occult Sciences) జ్ఞానం కలిగినవాడు.ప్రాచీన తంత్రజ్ఞానం మన దేశంనుంచి,ఈజిప్టుకు చేరింది.కనుక ఆ భావనలు సాల్మన్ రాజుకు తెలుసు అని అనుకోవడం సత్యదూరం కాబోదు.

ఇటువంటి అధ్బుతమైన insights ను జ్యొతిష,తంత్రశాస్త్రాలు మానవునికి ఇవ్వగలవు.

9, జనవరి 2010, శనివారం

ధర్మార్థ కామ మోక్షాలు-జ్యోతిష్య వివరణ


మనిషి జీవితానికి నాలుగు రకాలైన గమ్యాలు ఉన్నాయని భారతధర్మం (హిందూమతం)చెప్పింది.అవే ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్ధాలు.

మానవుడు ధర్మపరంగా జీవితాన్ని గడుపుతూ, ధర్మపరంగా ధనాన్ని సంపాదించి,ధర్మపరంగా కోరికలను తీర్చుకొని, మోక్షాన్ని పొందాలి.

మనిషైనా నాలుగు విషయాలకు లోబడే జీవితాన్ని గడిపితే సద్గతిని పొందుతాడు.

మనిషి యొక్క జీవితాన్ని ప్రతిబింబించే జాతకచక్రం లో కూడా ద్వాదశ భావాలలో నాలుగు భాగాలను మనం చూడవచ్చు.

1,5,9- భావాలు ధర్మాన్ని, ఉపాసననూ,ధార్మిక విషయాలను చూపిస్తాయి కనుక ఇది ధర్మ త్రికోణం.

2,6,10- భావాలు ధనాన్ని, వృత్తిని, సంపాదనను చూపుతాయి కనుక ఇది అర్థ త్రికోణం.

3,7,11- భావాలు ఇతరులతో సంబంధాలను,వివాహాన్ని,లాభాన్ని చూపిస్తాయి కనుక ఇది కామ త్రికోణం.



4,8,12- భావాలు మోక్షాన్ని ఇతర రహస్య విషయాలను చూపుతాయి కనుక ఇది మోక్ష త్రికోణం.

మనిషి జీవితం ఎన్ని రకాలుగా చూచినా ఈ నాలుగు పురుషార్థాలను దాటి అవతలకు పోదు.కనుక ఈ నాలుగు విషయాలను ద్వాదశ భావ పరిశీలనలో,జాతకపరిశీలనలో చక్కగా తెలుసుకోవచ్చు.దిశానిర్దేశం చేసుకోవచ్చు.జీవిత సాఫల్యాన్ని పొందవచ్చు. 

ఈ దిశగా మానవుణ్ణి ఏ ఇతరశాస్త్రమూ సరియైన దారి చూపలేదు. కనుకనే జ్యోతిష్యశాస్త్రం అనేది మానవునికి తెలిసిన అన్ని శాస్త్రాలలోకీ గొప్పది అని చెప్పవచ్చు. అందుకనే వేదానికి జ్యోతిష్యశాస్త్రం కన్ను వంటిది (జ్యోతిషం వేదనయనం) అంటారు.

8, జనవరి 2010, శుక్రవారం

అసలైన సమస్య


సమస్యలు లేని మనిషి ఉండడు. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమస్య ఉంటుంది . కానీ కొంచం లోతుగా ఆలోచిస్తే అన్ని
సమస్యలూ ఒక్క చోటికే చేరుతాయి. అదే అనుభవాల స్థిరీకరణ.

అనుభవమూ శాశ్వతం కాదు. అన్ని అనుభవాలూ క్షణికములే. ఆకలి తీరటం వంటి అతి ప్రాధమిక అవసరం నుంచి
హృదయాన్ని స్పృశించి అంతరించే సున్నితమైన అనుభవం వరకూ ప్రతిదీ అలా కాల గర్భంలో కలిసిపోక తప్పదు. అదీ ప్రకృతి సహజం. అనుభవమూ స్థిరం గా నిలవదు. నిలిస్తే మనిషి భరించలేడు. అది అంతరించినా మనిషి తట్టుకోలేడు. ప్రకృతిలో మనిషి భాగం. కాని మనిషి ప్రకృతిని ఒప్పుకునే స్థితిలో లేడు. అతనికి అనుభవాలు స్థిరం గా కావాలి. మళ్ళీ మళ్ళీ అవే అనుభవాలు మనిషి కోరుకుంటాడు.

ప్రకృతిలో స్థిరత్వం లేదు. ప్రకృతిలో భాగాలైన ఇంద్రియాలు స్థిరమైన అనుభవాలను ఇవ్వలేవు. కాని మనిషి
శాశ్వతమైన అనుభవాలను కోరుకుంటాడు. అదే మనిషి చేస్తున్న తప్పు. లేని స్థిరత్వాన్ని లేని చోట కోరటమే మనిషికి గల అసలైన సమస్య.

స్థిరమైన శాశ్వతమైన స్థితి ఆత్మ లోనే ఉంది. స్థిరమైన అనుభవం ఆత్మానుభావమే. కాని అనుభవాన్ని అశాశ్వతమైన
ఇంద్రియాల పరిధిలో మానవుడు వెతుకుతున్నాడు. ఆశిస్తున్నాడు. ఇది ప్రాధమికంగా అసంభవం అయిన విషయం. కాని అసంభవమైన శాశ్వత ఆనందాన్ని మానవుడు అది లేని చోట వెతుకుతూ బ్రతుకుతున్నాడు. వెతుకులాటలో జన్మలు గడుస్తున్నాయి. ప్రాధమికంగా అతని ఆశ తప్పు కాదు, కాని దాన్ని వెదికే ప్రదేశం, విధానములే తప్పు.

బుద్ధుడు ఇంకొక అడుగు ముందుకు వేశి, అసలు ఆశించటమే పెద్ద పొరపాటు అన్నాడు. ఆశించ టాన్నే ఆయన తృష్ణ
అని పిలిచాడు. అంటే దాహం అని అర్థం చేసుకోవచ్చు. అనుభవాల వెంట పరుగెత్త టమే తృష్ణ. దానికి ముగింపు పలకటమే నిర్వాణం. మనిషి యొక్క అర్థం లేని వెదుకు లాటకు అంతమే నిర్వాణం.

నిర్వాణాన్ని మనిషి చేరుకుంటే మానవుణ్ణి పీడిస్తున్న అసలైన సమస్యకు అతడు పరిష్కారం కనుగొన గలుగుతాడు. తృష్ణా క్షయం అయిన వాడు దేని వెంటా పరుగేత్తడు. అతని ప్రయాణం ముగుస్తుంది. అంగుళి మాలుడు బుద్ధుని
చంపాలని కత్తి తీసుకొని ఆయన వెంట పరిగెత్తాడు. కాని మెల్లిగా నడుస్తున్న బుద్దున్ని అతడు చేరుకోలేకపోయాడు. నీ పరుగు ఆపు అని అతడు అరుస్తాడు. దానికి బుద్ధుడు నవ్వుతూ " నా పరుగు ఎప్పుడో ఆగి పోయింది. నువ్వే ఇంకా పరిగెడు తున్నావు. ఆప వలసినది నీ పరుగు." అంటాడు. అంగులిమాలుడు భౌతిక మైన పరుగును దృష్టిలో పెట్టుకొని అడిగాడు. బుద్ధుడు జన్మ జన్మల నుంచి జీవుడు పెడుతున్న పరుగు గురించి చెప్పాడు.

తృష్ణ అనే పరుగును ఆపగలిగితే మనిషి తనను పీడిస్తున్న అసలైన సమస్యకు పరిష్కారం కనుగొన గలుగుతాడు. అతడి జన్మ ధన్యత్వాన్ని పొంద గలుగు తుంది.

6, జనవరి 2010, బుధవారం

పరమహంస యోగానంద గారి జాతకం


పరమహంస యోగానందగారు 5-1-1893 రాత్రి 8-38 కి గోరఖ్ పూర్ లో 
జన్మించారు.

భారతీయయోగాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన మహనీయుల పేర్లలో ఈయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. మనిషిని  దైవంతో అనుసంధానం చెయ్యగల క్రియాయోగం అనే ప్రక్రియను విదేశీయులకు పరిచయం చేశారు.

క్రియాయోగం అనే ప్రక్రియ హఠయోగం, తంత్రయోగం, ప్రాణాయామం, కుండలినీయోగముల కలయికగా చెప్పవచ్చు. దీని అభ్యాసం వల్ల  మనిషి, విశ్వవ్యాప్తమైన  దైవచైతన్యంతో అనుసంధానం కాగలుగుతాడు. విశ్వాంతరాళంలో నిరంతరం ప్రతిధ్వనిస్తున్న  ఓంకారనాదాన్ని వినగలుగుతాడు. ఆ తరువాత దానిలో లయం కావడం ద్వారా బ్రహ్మలీనతను అందుకోగలుగుతాడు.


ఈ క్రియాయోగ ప్రక్రియ వేల సంవత్సరాలుగా భారతీయయోగులకు, సిద్ధులకు తెలుసు. మొదటిసారిగా  దీన్ని  యోగానందగారు సముద్రాలు దాటించి 
విదేశీయులకు పరిచయం చేశారు.

ప్రాచీనకాలం నుంచి  ఇది  గురుశిష్య పరంపరగా మన దేశంలో వస్తూ ఉన్నది.  బాబాజి అనే సిద్ధగురువు  రెండువేల సంవత్సరాలనుంచి నేటికీ శరీరంతో ఉన్న హిమాలయ సిద్ధపురుషుడు.ఆయన శిష్యుడు లాహిరీ మహాశయ.ఆయన నుంచిస్వామి యుక్తెశ్వర్ గిరి,తరువాత పరమహంస యోగానందగార్లకు ఈక్రియాయోగం పరంపరగా వచ్చింది. మొదటిసారిగా క్రియాయోగాన్ని విదేశాలలో ప్రచారం చేసే అనుమతి బాబాజి యోగానందగారికి ఇచ్చారు. లాహిరీ మహాశయులకు ఇతర శిష్యులు చాలామంది ఉన్నారు. వారిద్వారా ఈ క్రియాయోగం అనేక శాఖోపశాఖలుగా విడిపోయి బోధించబడుతున్నది. వీరిలో ఎవరి కుంపటి వారిదే. నేడు అనేకమంది భారతీయులు, విదేశీయులు ఎవరికి వారే క్రియాయోగ గురువులుగా చెలామణీ అవుతున్నారు. వీరిలో ప్రతివారూ 'మాకు బాబాజీ అనుమతి ఉంది' అని చెప్పుకుంటారు. ఉందొ లేదో ఆ బాబాజీ కే ఎరుక.

యోగానందగారు వ్రాసిన "Autobiography of a Yogi" అనే పుస్తకం అరవై  సంవత్సరాలనుంచి కొన్ని మిలియన్ల కాపీలు అమ్ముడుపోయింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ ఈనాడు క్రియాయోగం అంటే తెలుసు.

పరమహంస యోగానందగారి జాతకం ప్రక్కన ఇస్తున్నాను.

వీరిది సింహలగ్నం. సింహరాశి. మఖానక్షత్రం.శుక్రుడు ఆత్మకారకుడు. గురువు అమాత్య కారకుడు. లగ్నాధిపతి రవి మంత్ర స్థానంలోఉండటము. ధర్మస్థానంలో రాహువు ఉండి లగ్నాన్ని చూడటం వల్ల మహాయోగి కాగలిగాడు.

లగ్నారూడం అయిన మేషం నుంచి పంచమంలో చంద్రుడు, నవమంలో రవిఉండటం చూడవచ్చు.ఆత్మకారకలగ్నం అయిన వృశ్చికంనుంచి పంచమంలో గురుకుజులు ఉండడం చూడవచ్చు.ఇవన్నీ కూడాఈయన గొప్ప యోగి అని చూపిస్తున్నాయి.

కుటుంబ స్థానాధిపతి బుధుడు సున్నా డిగ్రీలలో రాశిసంధిలో పడ్డాడు.ఈ లగ్నానికి అతిపాపి అయిన శనిసప్తమాధిపతిగా కుటుంబస్థానంలో ఉండి వివాహాన్ని దూరం చేసాడు. అయితేనేం విశ్వవ్యాప్తమైన కుటుంబాన్నిఇచ్చాడు.

అష్టమంలో గురుకుజుల వల్ల ధార్మికమైన వ్యక్తిత్వం, యోగసాధనలో గట్టి పట్టుదల,యోగసిద్ధి కనిపిస్తున్నాయి.సుఖకారకుడు శుక్రుడు సుఖస్థానంలో ఉండి కారకో భావనాశక సూత్రానుసారంగా సుఖస్థానాన్ని పాడు చేసాడు.కాని అష్టమం నుంచి  గురువు యొక్క నవమదృష్టి  శుక్రుని మీద ఉండడం వల్ల, ఆయన  ప్రాపంచిక సుఖాలను తృణీకరించి  వాటికి అనేక రెట్లు  ఉన్నతమైనది మరియు గొప్పదైన ఆత్మానందాన్ని మాత్రమే కోరుకున్నాడు.

మనదేశమంటే కొంచం అవగాహన కలిగిన  విదేశీయులు  మన దేశాన్ని మతాన్నీ సంస్కృతినీ గౌరవించటానికి ముఖ్యంగా వివేకానందస్వామి, యోగానందస్వామి వంటి మహనీయులే కారణం అని నిస్సంకోచంగా చెప్పవచ్చు. 

దశావివరాలతో ఆయన జీవితం మళ్ళీ చూద్దాం.

5, జనవరి 2010, మంగళవారం

విరోధి-వికృతి

ప్రస్తుత విరోధి నామ సంవత్సరం లో ఎక్కడ చూచినా విరోధాలు చూస్తున్నాం. అన్న దమ్ముల్లాంటి ఆంధ్రా తెలంగాణా ప్రజలు బద్ద శత్రువులై విద్వేషాలతో మండి పోతున్నారు. రాజకీయ యజ్ఞం లో సమిధలౌతూ అదే గొప్ప అని మురిసి పోతున్నారు.

మూడు నెలల్లో రాబోతున్న వికృతి నామ సంవత్సరంలో ఆంద్ర ప్రదేశ్ వికృతం గా రెండు ముక్కలు కానుందా? ప్రక్రుతి విరుద్దమైన వికృత పరిస్తితులు ఎదుర్కొన బోతున్నదా ? కాలమే దీనికి జవాబు చెప్పాలి.

4, జనవరి 2010, సోమవారం

మోక్ష త్రికోణం- కొన్ని రహస్యాలు

ద్వాదశ భావం మోక్ష స్థానం. దాని త్రికోణములైన చతుర్థ భావం, అష్టమ భావం మూడూ కలిపి మోక్ష త్రికోణం అని పిలువ బడుతుంది. మూడు భావాల వల్ల మనం జాతకునికి సంబంధించిన మోక్ష పరమైన రహస్య విషయాలు తెలుసుకోవచ్చు.

చతుర్థం వల్ల పూర్వ జన్మ ఎలా గడిచింది అని తెలుస్తుంది. అష్టమం వల్ల గత జన్మలో మరణం ఎలా జరిగిందో తెలుస్తుంది. ద్వాదశం వల్ల జన్మలో మరణం తర్వాత పొందబోయే గతి తెలుస్తుంది. కనుక మూడూ అతి రహస్య విషయాల విశ్లేషణకు పనికి వస్తాయి. అయితే ఎలా దీనిని అన్వయించుకోవాలో జ్యోతిర్విద్యా సాధకునికి తెలియాలి.

చతుర్థం మాతృమూర్తిని, సుఖాన్ని, విద్యనూ, గృహ, వాహన సౌఖ్యాన్ని సూచిస్తుంది. ఇవన్నీ బాగుండాలంటే పూర్వ జన్మలో మంచి పుణ్య బలం ఉండాలి. లేకపోతె వీటిలో లోపాలు కనిపిస్తాయి. ఇవి ప్రత్యక్ష నిదర్శనాలుగా మనం జాతక పరిశీలనలో గమనించవచ్చు.

గత జన్మలో మనం జీవించిన తీరు జన్మలో సుఖ స్థానం అయిన చతుర్ధం లో కనిపిస్తుంది. మనము మంచి కర్మను చేసుకొని ఉంటే జన్మ మంచి సుఖవంతం గా ఉంటుంది. లేదా తేడాగా ఉంటుంది. మనం ఎటువంటి కర్మను మూట గట్టుకొని వచ్చామో చతుర్ధ భావం చూపిస్తుంది. అందుకనే జాతకుడు అదృష్ట వంతుడా, లేక దురదృష్ట వంతుడా అనేది భావం చూచి టక్కున చెప్పవచ్చు.

అలాగే అష్టమ భావం అనేదాన్ని బట్టి గత జన్మలో మరణం ఎలా సంభవించిందో తెలుస్తుంది. మరణం యొక్క చాయలు, ఆశలు, ఆకాంక్షలు తీరని కోరికలు ఇత్యాది అన్నీ అష్టమ భావం లో దాగి ఉంటాయి. అందుకే దీన్ని అంతచ్చేతన అని పిలువ వచ్చు. అష్టమ భావాన్ని విశ్లేషణ చెయ్యటం వస్తే మనిషి లో దాగి ఉన్న మరో మనిషిని చదవ వచ్చు. ఎవరికీ చెప్పక తనలో దాచుకున్న విషయాలు తేట తెల్లంగా వివరించవచ్చు. దీనివల్ల జాతకుడు నిర్ఘాంత పోతాడు.

అంతే కాదు. అష్టమ భావంలో మనిషి యొక్క పరిణామ రహస్య సూత్రం దాగి ఉంటుంది. దేన్ని మార్చుకుంటే జీవితం బాగుపడుతుంది. దేని వల్ల తనకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అన్న విషయాలు భావంలో నిగూడంగా దాగి ఉంటాయి. మార్మిక సాధకులకు, తంత్ర విద్య మొదలైన సాధనలు చేసేవారికి భావం ముఖ్యంగా చూడాలి. దీనిలో వారి విధి అనేది మనకు దర్శనం ఇస్తుంది. కాని భావాన్ని చదవటం అంత తేలిక కాదు. కొంతైనా స్ఫురణ శక్తి లేనిదే భావం కొరుకుడు పడదు.

ఇక ద్వాదశ భావం. దీనివల్ల ప్రస్తుత జన్మలో మరణం ఎలా కలుగుతుంది? దాని తరువాత జీవి స్తితి ఎలా ఉంటుంది. మంచి లోకాలు కలుగుతాయా? లేక అధమ లోకాలకు జీవి పోతుందా? అనేది ఇక్కడ దర్శనం ఇస్తుంది. మనిషికి మోక్షం కలుగుతుందా లేదా అనేది కూడా ఇక్కడే తెలుస్తుంది.

చతుర్దంలో మనం అనుభవించవలసిన కర్మ ఫలం కనిపిస్తుంది. ఇది సాధారణంగా వ్యక్తులతో, మరియు సంఘటనలతో ముడిపడి ఉంటుంది. కాని అష్టమం లో మనిషి యొక్క మనస్సు లోలోతులలో దాగిఉన్న వాంచలు, తీరని కోరికలు, జన్మ జన్మల నుంచి వస్తున్న వాసనలు కనిపిస్తాయి. ఇక ద్వాదశంలో అంతిమ యాత్రకు దారితీసే పరిస్తితులు, దాని తర్వాత కలిగే స్తితులు చూడ వచ్చు.

మన వేదాంతంలో సంచిత, ఆగామి, ప్రారబ్ధ కర్మలు అని చెప్తారు. మూడింటికీ, మూడు భావాలకూ సంబంధం ఉంది.

మోక్షం అంటే పరమమైన ముక్తి అని మాత్రమె కాదు. ఇది పారమార్థిక కోణం మాత్రమె. కాని లౌకిక జీవితంలో పడే బాధలనుంచి, సమస్యల నుంచి ఎం చేస్తే మనకు మోక్షం లభిస్తుంది? అసలు సమస్యలకు కారణాలు ఏమిటి? వాటి మూలాలు ఎక్కడ ఉన్నాయి? అనే విషయాలు మూడు భావాలు చూపిస్తాయి.

ఇంత రహస్య విజ్ఞానం దాచుకున్నాయి కనుకనే మూడు స్థానాలను మోక్ష త్రికోణం అని పిలుస్తారు.మోక్ష త్రికోణ భావాల విశ్లేషణ వల్ల మనిషి యొక్క పురోగమన పరిణామ రహస్య గతి (code of evolution) అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం పడుతున్న బాధలకు పరిష్కారాలు కనుక్కోవచ్చు. చేతనైతే రెమెడీస్ పాటించి తీవ్రత తగ్గించు కోవచ్చు. కాని ఇదంతా పాప ఖర్మం దృడం గా లేనప్పుడు మాత్రమె సాధ్యం అవుతుంది. దానికి భిన్నం గా ఉండి, పూర్వ కర్మ చాలా బలం గా ఉన్నప్పుడు రెమెడీస్ పని చెయ్యవు. చెయ్యాలని బుద్ధి పుట్టదు. వెతికినా సరియైన పరిష్కారాలు దొరకవు. అడుగడుగునా అవాంతరాలు ఎదురౌతాయి.

3, జనవరి 2010, ఆదివారం

గణిత మేధావి శ్రీనివాస రామానుజం జాతకం

అసాధారణ గణిత మేధావి శ్రీనివాస రామానుజం జాతకం గమనిద్దాం. ఆయన 22-12-1887 న తమిళ్నాడులోని ఈరోడ్ లో జన్మించారు. సమయం సాయంత్రం 6.20 అని దొరికింది. కాని సవరించగా 6.16 అని వచ్చింది. 


ఈయనది మిథునలగ్నం, మకర నవాంశ. మీనరాశి, తులానవాంశ. ఉత్తరాభాద్ర మూడోపాదం.ఆత్మకారకుడు బుధుడు.  ఈయన జనన సమయంలో శని/రవి/శనిదశ జరుగుతున్నది. శని రవులిద్దరూ మారకస్థానాలలో ఉండటం చూడవచ్చు. శని వక్రించిన స్థితిలో ఉన్నాడు.ఈయనదికూడా చాలామంది ప్రసిద్ధవ్యక్తులవలె అల్పాయుజాతకమే. ఈయన 32 ఏళ్ళకే తీవ్రఅనారోగ్యంతో క్షయవ్యాధితో కన్నుమూశాడు.


లగ్నాధిపతి బుధుడు రోగస్థానంలో గురువుతో కలిశి ఉన్నాడు. గురువు ఈలగ్నానికి ఉభయకేంద్రాదిపత్యదోషి. బుధుడు స్వనక్షత్రమైన జ్యేష్టలోఉన్నప్పటికీ, గురువు అష్టమాధిపతి వక్రి అయిన శనినక్షత్రంలో ఉన్నాడు. శని వక్రిగాఉండి లగ్నంలో ఉన్నట్లు తీసుకోవాలి. కనుక చిన్నప్పటినుంచి ఈయన రోగాలతో సహవాసం చేసాడు. వాక్స్తానంలో రాహుశనులయుతితో ఆరేళ్ళపాటు మాటలు రాక మూగవానిగా ఉన్నాడు.


ఈయన పుట్టినప్పటికీ ఎనిమిదిసంవత్సరాల ఆరునెలలు దాదాపుగా శనిమహాదశ మిగిలి ఉన్నది. తరువాత బుధ దశ పదిహేడు ఏళ్ళు గడిచింది. తరువాత ఏడేళ్ళు కేతుదశ జరిగింది. కేతుదశ చివరిలో కేతు/బుధ/శని లోచిన్న వయసులో క్షయవ్యాధితో మరణించాడు.

చతుర్ధ షష్ఠ అధిపతుల పరస్పర పరివర్తనాయోగంతో విద్యలో తీవ్రఆటంకాలు ఏర్పడ్డాయి. అష్టమం నుంచి కేతువువిద్యా స్థానాన్ని చూడటముతో దరిద్రంతో చదువు కోలేక నానాకష్టాలూ పడ్డాడు. కాని లగ్న చతుర్దాదిపతి బుధుడునవాంశలో మిత్రస్థానంలో ఉండటము, చంద్ర లగ్నాత్ చతుర్దాదిపతి బుధుడు తొమ్మిదింట గురువుతో కలిశి ఉండటంతో విదేశీయుల సహాయంతో ఉన్నతవిద్యను పొందగలిగాడు.

చాలామందికి తెలియని విషయం ఏమనగా, ఈయన సాంప్రదాయ తమిళ బ్రాహ్మణకుటుంబంలో జన్మించటం చేత ఈయనకు జ్యోతిష్యజ్ఞానం బాగా ఉండేది. అంతేగాక ఈయన భగవతి పరమేశ్వరీభక్తుడు.దీనికి రుజువులుగా పంచమస్థానంలో శుక్రుడు స్వస్థానములో ఉండటము, చంద్రలగ్నాత్ పంచమంలో రాహువుస్థితి చూడవచ్చు. ఈయనకు అనేక గణితసిద్ధాంతాలు వాటికి జవాబులు నిద్రలో స్వప్నమూలకంగా వచ్చేవి. దీనికి కారణం ఆయన ఉపాసనాబలం.కాని ఈసంగతి ఇంగ్లాండు రచయితలు పూర్తిగా కావాలని దాచిపెట్టారు. లోకంకూడా ఆయన జీవితంలో ఈకోణాన్నిదర్శించలేదు.

ఈయన ఇంగ్లాండులో ఉన్నపుడు మాంసాహారానికి పూర్తిగా దూరంగా ఉండటమే గాక, తెల్లవారుజామున లేచి చన్నీళ్ళస్నానంచేసి సంధ్యావందనం క్రమంతప్పక చేసేవాడు.అనారోగ్యంతో బాధపడుతున్నాకూడా తన ఉపాసన ఆపేవాడు కాదు. నవమాధిపతి శని మారకస్థానంలో వక్రించి ఉండటము, సాంప్రదాయకారకుడైన గురువు రోగస్థానంలో లగ్నాధిపతితో కలసి ఉండి తొమ్మిదో దృష్టితో శని రాహువులను చూడటము-వీటివల్ల అనారోగ్యం ఎదురైనాకూడా సాంప్రదాయ విధానాలనుంచి వైదొలగని మొండితనం కనిపిస్తుంది.

కేతువు అష్టమంలో ఉండటము, శని అష్టమాదిపతిగా మారకస్థానంలో ఉండటము, బుధుడు లగ్నాదిపతిగా రోగస్థానంలో ఉండటము చూస్తె కేతు/ బుధ/శని దశలో మరణం ఎందుకో అర్థం అవుతుంది. 1913 లో తన గణితసిద్ధాంతాలను తొమ్మిదిపేజీలలో వ్రాసి Prof.G.H.Hardy కి పంపటంతో ఈయన జీవితం మలుపు తిరిగింది. అప్పుడు ఈయనకు బుధ/శని దశ జరుగుతూ ఉండవచ్చు.

ఈయన జీవితంలో ముఖ్య ఘట్టాలు, దశలు, గ్రహప్రభావం గమనిద్దాం.


>1902-Cubic equations ఎలా సాధించాలో తెలుసుకున్నాడు. తరువాత తానె Quartic equations ను సొంతంగాసాధించాడు. అప్పుడు ఆయనకు బుధ/శుక్ర జరుగుతున్నది. లగ్న విద్యాస్థానాధిపతి గా బుధుడు/పంచమాదిపతిగా శుక్రుడు వీరిద్దరి మిత్రత్వం గమనార్హం. వీరిద్దరూ ఆత్మ అమాత్య కారకులుగా ఉండటం కూడా గమనించాలి.


>1904- లో లోతైన పరిశోధన చెయ్యటం మొదలు పెట్టాడు. అప్పుడు బుధ/కుజ దశ మొదలైంది. కుజుడు విద్యాస్థానంలో ఉండి చంద్రునితో చూడబడుతూ చంద్ర మంగళయోగంలో ఉండటం చూడవచ్చు.

>1904-06 డబ్బు లేక పేదరికంతో నానాకష్టాలు పడ్డాడు. చదువుకుందామని ఉండి, డబ్బులేక అవస్తలు పడ్డాడు. అప్పుడు బుధ/రాహు జరిగింది. రాహు అంతర్ దశలోనే చదువు మానేసి కొంతకాలం విశాఖపట్నంలో ఉన్నాడు.

>1906 లో మద్రాస్ పచ్చయప్ప కాలేజిలో FA లో చేరి గణితంలో తప్ప మిగిలిన అన్ని సబ్జెక్టులలో తప్పాడు. అప్పుడుబుధ/రాహు/గురు, బుధ/రాహు/శని జరిగింది. రాహు గురువుల కలయిక రాహుశనుల కలయిక ఏమి చెయ్యాలోఅదే చేసింది.

>1908 లో continued fractions and divergent series మీద పరిశోధన చేసాడు. కొత్త విషయాలు కనిపెట్టాడు కానీ తీవ్ర అనారోగ్యం పాలైనాడు. అప్పుడు బుధ/రాహు/రవి, బుధ/రాహు/చంద్ర దశలు జరిగాయి. వివరణ అవసరంలేదు.

>ఏప్రిల్ 1909 లో హైడ్రోసిల్ ఆపరేషన్ జరిగింది. అప్పుడు బుధ/గురు/బుధ దశ జరిగింది. బుధుడు, గురువు ఇద్దరూ సహజ అష్టమస్థానం అయిన వృశ్చికంలో ఉండటం చూడవచ్చు. ఇది రోగస్థానం మాత్రమె కాక, సహజరాశి చక్రంలోగుహ్యాంగాలకు సూచకం. గురువు పెరగటానికి, వ్యాకోచానికి కారకుడు. కనుక హైడ్రోసిల్ వ్యాధి వచ్చింది.

>జూలై 1909 లో వివాహం జరిగింది. గురువు సప్తమాధిపతి, కేతువు చంద్ర లగ్నాత్ లాభస్థానంలో ఉన్నాడు. కాని లగ్నాత్ అష్టమం అవటంతో వివాహంవల్ల ప్రయోజనం లేకుండా పోయింది.

>1912 లో మద్రాస్ పోర్ట్ ట్రస్ట్ లో గుమాస్తా గా ఉద్యోగం లో చేరాడు. అప్పుడు బుధ/శని జరిగింది. శని వక్ర స్థితి వల్లలగ్నంలో ఉండి దశమంలోని చంద్రున్ని చూడటం వల్ల చిన్న ఉద్యోగం వచ్చింది. కాని మానసిక వ్యధ కూడా ఇదే యోగంఇచ్చింది.

>జనవరి 1913 లో G.H.Hardy అనే ప్రొఫెసర్ కు తన పరిశోధనా కాగితాలను పంపటం వల్ల అతని జీవితంలో మార్పువచ్చింది. అప్పటికి బుధ/శని దశ జరుగుతూ బుధ మహా దశ చివరకు వచ్చింది. 1914 లో నవమాధిపతి అయిన శనిఅంతర్దశలో విదేశ యానం కలిగింది.

>16-3-1916 లో కేంబ్రిడ్జ్ యునివర్సిటి నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాడు. అప్పుడు కేతు/కుజ దశ జరిగింది. చంద్ర లగ్నాత్కేతువు లాభ స్థానంలో ఉండటం, కేతువు విదేశాన్ని చూపించే సప్తమంలో ఉండటం తో ఆ సంఘటనా జరిగింది. కుజవత్కేతు అనే సూత్రం ఇక్కడ గుర్తుంచు కోవాలి. ఇంకా కేతువు శనిని సూచిస్తూ ఉండి శని/కుజుల కలయికగా మారి తీవ్రఅనారోగ్యంతో ఆస్పత్రి పాలు చేసాడు.

>మే 1918 లో Fellow of Royal Society of London కు ఎంపిక కాబడ్డాడు. అప్పుడు కేతువులో శని దశ జరిగింది. భాగ్య భావం వెలుగు లోకి వచ్చింది. కేతువు లాభ స్థానం లో ఉండటము శని నవమాధిపతి కావటము చూడాలి. ఈ దశలలో కేతువు, శనుల కారకత్వాలు మారుతూ వారి విచిత్రపాత్రపోషణ చాలా వింతగా కనిపిస్తుంది. అదే సంవత్సరం అక్టోబరులోFellow of TrinityCollege of Cambridgeగా ఎన్నుకోబడ్డాడు.

>13-3-1919 భారత దేశానికి తిరిగి వచ్చాడు. అప్పుడు కేతువు/శని/రాహువు జరుగుతున్నది. కేతువు అష్టమ స్థితి, శని రాహువుల మారక స్తితి జాగృతం అయ్యింది.

>26-4-1920 మన దేశంలో తీవ్ర అనారోగ్యంతో ముప్పై రెండూ ఏళ్లకే కన్ను మూశాడు. అప్పుడు ఆయనకుకేతు/బుధ/శని జరిగింది. వివరణ అవసరం లేదు.

విద్యకు రోగాలకు సహవాసం ఈయన జీవితంలో ఒక విచిత్ర మైన యోగం. దీనికి కారణం లగ్న, విద్యా స్థానాధిపతిఅయిన బుధుడు, మారక అధిపతి అయిన గురువు తో కలసి రోగ స్థానం లో ఉండటం అనే విచిత్ర యోగం.

తెలివి తేటలు కలిగిన ఆణిముత్యాలకు మన దేశంలో ఎటువంటి గతి పడుతుంది, అదే తెలివితేటలకు ఇతర దేశాలలో ఎంత గుర్తింపు, విలువ ఉన్నాయి అనటానికి ఈయనజీవితం ఒక ఉదాహరణ.మన బానిస మనస్తత్వంతో, డబ్బును అధికారాన్ని గౌరవించటమే మాత్రమె మనకు తెలుసు. అంతేకాని నిజమైన ధీశక్తిని ప్రోత్సహించటం గౌరవించటం బానిసజాతిగా మనకు చాతకాదు అన్న విషయం ఎన్నోసార్లు మనం రుజువు చేసాం.శ్రీనివాస రామానుజం జీవితంకూడా దీనికి ఒక మచ్చుతునకగా చెప్పుకోవచ్చు.

తెల్లవాడు నెత్తిన పెట్టుకుంటే అప్పుడు మనకు మనవాళ్ళ విలువ తెలుస్తుంది. అంతే కాని అదే మనుషులు మన మధ్యనే ఎన్నాళ్ళు తిరిగినా గుర్తించని, విలువ ఇవ్వని బానిసజాతి మనది. ఒక వివేకానందుడైనా, శ్రీరామకృష్ణు డైనా, శ్రీనివాస రామానుజం అయినా ఇదే కోవకు చెందిన రుజువులు అని ఘంటాపధంగా చెప్ప వచ్చు.

ఈయన జాతకంలో అల్పాయుర్యోగాలు మరోసారి చూద్దాం.