Pages - Menu

Pages

1, జనవరి 2010, శుక్రవారం

శ్రీ రామానుగ్రహం తో వచ్చిన నూట పదహారు పద్యాలు ఒకే చోట

కం||మ్రొక్కితి పాదాబ్జంబుల
చిక్కితి నీ చేతులందు చింతలవేలా
సొక్కెద కరుణా వృష్టిం
దిక్కెవ్వరు నీవు దక్క తిరుమల రాయా||

|| తాళ్ళ పాక యనుచు తనరారు గ్రామాన
బుట్టినావు నిలను దిట్టముగను
ముప్ప దారు వేలు ముద్దుగా కృతులల్లి
నిలిచి నావు మహిని నిబ్బరముగ ||

|| శివుని గొల్చి నీవు చిత్రంపు రీతిగా
విష్ణు జేరినావు వింత లమర
శివుడు కేశవుండు నొక్కడే జనులార
భేదమంచు లేదు వాద మేల ||

కం|| అన్నయ కవితా రీతుల్
వెన్నను పొంగింప వచ్చు సన్నపు నేతుల్
విన్నాణపు వేదములవి
వెన్నంటును తరతరములు వన్నెల నిచ్చున్ ||

కం|| తనరగ సిద్దేశ్వరునకు
ప్రణమిల్లితి నింక నేడు నిశ్చల మనమున్
అనితర మోక్ష ప్రదాతకు
ఘన యోగి బృంద పతికి గిరిజా పతికిన్ ||

కం || కామాక్షి కామదాయిని
వామాంక వర ప్రదాత్రి వారిజ నేత్రీ
రామ సహోదరి తల్లీ
కామంబులు దీర్పవమ్మ కంజ దళాక్షీ ||

కం || సరిగా నిను మదిని దలచి
వరమిమ్మని నెర కవితల సరమును గోరన్
బిరబిర పద్యము లల్లన
వరుసలుగా నొరసి మెరసె వింతగ తల్లీ ||

కం || ఏకా తాతయ సిద్ధుం
డేకాకిగ శివుని గొల్చి యైక్యం బొందెన్
లోకా లోకము లొల్లక
పాకాదుల వదలి మీరి పరమును గాంచేన్ ||

కం|| తాతయ్య వంటి యోగియు
పాతక హారిగ బరగెడి సిద్దేశ్వరుడున్
సీతాపతి వంటి విభుడును
కృతి కవి యన్నయ సరియగు కవియున్ గలరే ||

కం|| అన్నయ గాంచెను ధన్యత
చెన్నుగ కేశవు నిదివ్య సన్నిధియందే
దన్నుగ వైష్ణవు డయ్యెను
వెన్నుని మహిమలను బాడి విఖ్యాతముగా ||

కం|| శ్రీ రామ రామ యనియెడి
తారకమే సర్వ మంత్ర సారము గలదో
రామ నామ మహిమయె
యారామ మ్మొసగు పాప రాశి దహించున్ ||

కం|| రామా నీ నామంబున
నేమా రుచి నెవరికైన నెన్నగ తరమా
వ్యామోహ హరము సాక్షా
త్కామారీ నిత్య జపము కనుగొని జూడన్ ||

కం || శ్రీ రామ నామ మహిమన్
తరియించిరి సిద్దులైరి తాపసులెల్లన్
తరమా నాకది ఎన్నగ
హరుడే నీ జపము సల్ప నను నిత్యంబున్ ||

కం || ఆలయమున నీ చెంతను
తలచితి నీ నామము మది తన్మయ మొన్దన్
జలజల గారెను నశ్రులు
పులకాంకిత మయ్యె మేను పుణ్యచరిత్రా ||

కం || నేలను బడి కట్టె వలెను
బాలకు రీతిన్ బొగిలితి భవపరిహారా
చాలును తాప శతంబులు
చేలాంచల ఛాయ నిమ్ము చాలదె నాకున్ ||

కం || పలికితి నీ నామంబును
తలచితి నీ దివ్య చరిత తగు మాత్రముగా
తొలిగెను తొల్లిటి దొసగులు
గలిగెను శుభగరిమ లింక గరుణా దృష్టిన్ ||

కం || అంటవు నే పాపంబులు
తుంటరి తనమున జరిపిన దోషములెల్లా
మంటను బడు దూది పగిది
వెంటనె గాలును రఘువరు డింట వసింపన్ ||

కం || ఝల్లనె నొడలు గ్రమ్మర
నుల్లము తా ఫుల్ల మయ్యె నీ రూపింకన్
చల్లని చందురు వోలెను
పల్లవ పాణిగ గనబడు నల్లదె ఘడియన్ ||

కం || ఏమా దర్శన భాగ్యం
బెమా నా పూర్వ పుణ్య బలమది జూడన్
ఏమా చల్లని చూడ్కుల
వేమా శత జన్మకోటి కామ హరంబుల్ ||

కం || అమ్మగ నీవెదుట నిలువ
కమ్మెడి భయమేల నాకు సొమ్మగు ఘన మా
యమ్మవు సీతమ్మవు నీ
కమ్మని చల్లని నగవులె కాంచితి తల్లీ ||

కం|| ఒంటిగ మిట్టను రాముడు
జంటగ తన సతిని గూడి ధాత్రిని వెలసెన్
బంటుగ లక్ష్మణ దాసుడు
మింటను గల వేల్పులేల్ల నింటి గణంబై ||

కం ||ఏకశిలా నగరంబని
లోకంమున పేరుగన్న నాకంబిదియే
ఏకశిలను నుండెడి యా
పోకడ రాముడు ధరణిజ లక్ష్మణు లిచటన్ ||

కం || చూడగ సీతారాములు
అడవిని వసియించు వేళ ననుజుని తోడన్
వేడుకగా విచ్చేసిట
మూడగు దినములు గడపిన మునివాటిదియే ||

కం ||ఆనాటికి హనుమంతుడు
గాన్పిం చని కారణమున కధయం దింకన్
నాటి పూజా మూర్తులు
ఘన మారుతి రహితులగుచు గనబడు నిచటన్ ||

కం ||సీతను వెదకుచు వానరు
లీతటినా గాధను విని యతి నిశ్చలతన్
ప్రీతిగ జేశిరి స్థాపన
తాతగు జాంబవు కరముల ధన్యాత్మకులై ||

కం ||కాంచితి యా రూపంబది
కాంచితి యా నీల మేఘు కనకాం బరుని
న్గాన్చితి కరుణా మూర్తిని
కాంచితి యా హాస ముఖుని కమనీయముగా ||

కం || తల్లీ యని పిలువగనే
ఝల్లని నా మదిని దోచి చల్లని చూడ్కుల్
వెల్లువ బంపెడి కల్పజ
వల్లీ నీపాద రజము నొసట ధరింతున్ ||

కం || ఏమా శించితి వంచును
ప్రేమా దరమొప్ప నీదు వాణి వచింపన్
ఏమరు పాటెరుగని యా
పామర భక్తియె నినుమరి గోరితి తల్లీ ||

కం || భళిరా ధన్యత నొందితి
కలి దోషము మాపునట్టి కాంతిని గంటిన్
కులమున్ ధన్య మదయ్యెను
సలలిత నీ సాంద్ర కరుణ సీతా రమణా ||

కం || ఉక్కంటి మేను భళిరా
తుక్కగు నీ ధాటి కవియే రక్కసి గుణముల్
ముక్కంటి యంశ విలలో
ఇక్కంటికి నింపు గూర్పు మిప్పుడె హనుమా ||

కం ||తలచితి పోతన సత్కవి
నలసిన మది సేదదీర నతి భక్తి యుతిన్
విలసిత రామచరిత్రు
కలంక నిశ్చల గుణయుతు నద్భుత చరితున్ ||

కం || పోతన పద్యమె పద్యము
వితతముగా భక్తి మీరు వింతౌ నడకల్
సతతము రామానందము
గతి యై గన్పట్టు లోక తతులకు నిలలో ||


కం || బమ్మెర యుండుట నిక్కము
ముమ్మాటికి నోరుగల్లు సామీప్యమునే
నిమ్మహి పోతన జెప్పెను
నెమ్మదిగా భాగవతము నొంటీ మిట్టన్ ||

కం || సంకుల సమరానలమౌ
వంకన నా యోరుగంటి నొదలుచు వడిగా
పొంకముగా జేరితివిక
శంకలు పోద్రో యుచునిట సత్కవి చంద్రా ||

కం || అల వైకుంఠ పురంమని
చెలగినదొక కవి మనంబు నిచ్చోటుననే
వెలయుచు రాముం డప్పుడు
బలిమిని పద్యము నొసగిన ప్రాంతం బిదిగో ||

కం || హాలిక కుశలమ్మా యని
గేలిన్ శ్రీ నాధుడు తన వాలము జూపన్
ఆలోకించుచు పోతన
లీలగ నా కాడి విప్పి తోలెను హలమున్ ||

కం || ఒడలెల్ల నొంచి పోతన
మడి దున్నిన యట్టి భూమి మాన్యత గనుమా
సడలిం పడు యభిమానము
నొడి బట్టడు రాజులెదుట వహ్వా యనుచున్ ||

కం || హాలికు డైనను నేమా
జాలమునన్ జిక్కకుండ కాలుని కెదురై
చాలింపుచు నత్యాసలు
మేలంచున్ రాము గొల్చే మనమున నిటనే ||

కం || బాల రసాలం బంచును
లీలగ తా జెప్పెనిచట శ్రీ నాధునితో
హాలికు డైనను నేమని
ఏలేను నా భక్తి సీమ నేకాంతికుడై ||

కం || ఇమ్మని నంతన్ రాజుకు
కమ్మని యా భాగవతపు కన్యా మణినిన్
ఇమ్మనుజా ధములకు తా
నమ్మక పోతన దనరగ రామున కొసగెన్ ||

కం || సేవేల రాచ కొలువున
చావేలని యా కుతంత్ర శోకామ్బుధిలో
ఛీ వలదని యా ఖర్మము
సేవకు డయ్యె నతడిక శ్రీ రామునకున్ ||

కం || పేదవు నీవా కవివర
లేదా యా రామ భక్తి రత్నము నీతో
వేదాంత సారమిలలో
నాదాన్తపు సీమ నిచ్చు నద్భుత మణిగా ||

కం || ఏరీ యా రాజన్యులు
ఏరీ నిను దూరినట్టి యా కవి వర్యుల్
పేరైన గలదె భూమిని
వారలు బోవగ హరికథ వాసిగ నిల్చెన్ ||

కం || తలచిన వారేరిలలో
బలసిన యా గర్వ మతుల భంగపు పాటున్
వెలయుచు తారార్కంబు
నిలచెను నీ కృతి ఎనిట్లు నోకవి వర్యా ||

కం || అక్షర మెరుగని పోతన
నక్షయ కావ్యమ్ము జెప్పె నచ్చెరు వొందన్
అక్షర మారగు మంత్రము
దక్షతగా దలచినట్టి లక్షణ మహిమన్ ||

|| భట్టు రాజు నగుచు బ్రతుగంగ నేటికి
ధరణి పతుల బొగడు దాస్య మేల
లోక నాధు గొలుతు లోటేమి నాకంచు
పోత నార్యు దంత పొంగె మదిని ||

|| లక్ష్మి యన్న యతని లాస్యంపు నిల్లాలు
యతడు జూడ నాకు అయ్య డిచట
తల్లి కొమరు నొదలి తానెట్టు లుండునో
చూడ వలయు నిట్టి చోద్య మికను ||

|| మించి మీరినట్టి మాన్యంబు లవియేల
పట్ట జాల నంత పసిడి యేల
జీవ యాత్ర జరుగ జాలంచు పోతన్న
భక్తి నిధిని బొందె భవ్య ముగను ||

|| మోహ వాంఛ లెల్ల దాహంబు హెచ్చించు
జన్మ లెన్నొ నిచ్చు జంతు రీతి
నిన్ను గొల్చి మదిని నిర్భీతినుండె దన్
మోక్ష సీమ నంది మోద మలర ||

కం || బండలు రాజుల మనములు
మెండగు భక్తియె సరియగు నండగ నిలచున్
గుండె త్తుచు శ్రీ నాధుడు
నిండుగ తా వగచె నిట్లు డెందము నందున్ ||

కం || వాసిగ వావిలి కొలనున
బూసెను పద్మం బునొకటి సుబ్బా రావై
వాసుం దాసు డనను చున్
దోసిలి తో రాముగొల్చి ధన్యుం డయ్యెన్ ||

కం || తెనుగున రామాయణమును
నను దినమును వ్రాసినాడు నచ్చపు భక్తిన్
ఘనుదాంధ్ర వాల్మికి యనెడు
ముని పుంగవు డొక్క డుండె ముదమున వినుమా ||

కం || వరుసగ రామాయణమును
నిరువది నాలుగు వేలగు నింపౌ పదముల్
తరమే సంస్కృత సమముగ
మరి వ్రాయగ నేరి కైన మందర మనుచున్ ||

కం || ఆంధ్రా వాల్మికి వనుచున్
సాంద్రముగా బిరుదు నిచ్చి సత్కవి కికనా
చంద్రార్క ఖ్యాతింగని
మందరమై నిల్చి తీవు మహి నట తిలకా ||

కం || రామునకు బిచ్చ మెత్తెను
కాముని వశమందు నుంచె కర్మల నణచెన్
రామాయణమును జెప్పెను
పామరు వలెనా ఘనుడిట పరగుచు నిల్చెన్ ||

కం || టెంకాయ చిప్ప బట్టుక
శంకాకుల మనము వీడి నింకే మనుచున్
బింకపు వాసుం దాసక
లంకముగా బిచ్చ మెత్తె నింకను వినుమా ||

కం || టెంకాయ చిప్ప శతకము
పొంకము మీరంగ జెప్పె పొంగుచు మదిలో
నింకను లోటేమున్నది
కింకరునకు వాసుదాస వరునకు నిలలో ||

కం ||ఏమీ నీ యదృష్టము
ఏమీ నీ భాగ్య గరిమ నెంతని పొగడన్
ఏమీ నీ జీవిత మిట
ఏమీ నీ ధన్య చరిత టెంకయ చిప్పా ||

కం || పాండితి నొల్లక నీవటు
ఖండితముగ రాము గోరి కరములు మోడ్చీ
దండన లొందుచు జెదరక
నుండితి వీ నొంటిమిట్ట వసు దాసేంద్రా ||

కం || రంగుగ నీ గ్రామంబున
పొంగుచు నా ధూర్తు లెల్ల నిను దిట్టంగా
కుంగుచు నీవటు మదిలో
అంగల కుదురుకు వెడలితి వతిఖిల మతివై ||

కం || పోతన నివసించిన
నీ తావున నిల్చి నీవునతి బింకముగా
యాతనల కోర్చి కూర్చితి
వతి సుందరకా వ్యమొకటి మందర మనుచున్ ||

కం ||మందరమను నా కావ్యము
నందముగా గూర్చితీవు నతి చతురతతో
చందురు డినుడే సాక్షులు
అందరితో నౌనె నిట్టి యద్భుత మనఘా ||

కం || భక్తుండవు రామునకిల
రక్తుండవు గావు నీవు రమ్యల యందున్
శక్తుండవు బహు రీతుల
ముక్తుండవు ముదము నొప్ప మునికులతిలకా ||

కం || అచ్చంబగు కవివి నీవుర
స్వచ్చంబగు కవిత నీది సత్యం బిదిరా
తుచ్చత లేదుర నీలో
మచ్చయే లేనట్టి దివ్య మహిమా న్వితుడా ||

కం || హట యోగపు సాధనమున
నిటునటుగా జీవుడలసి స్వప్నము గాన్చెన్
బాటను ముళ్ళని నిరువురు
పాటిగ జేర్చిరి చదునగు బాటను నెటులో ||

|| రంగ నాయకునికి రంగారు శతకమ్ము
చెప్పినావు నీవు జిత్రముగను
ఎల్ల వారి నెదుట నెల్లూరు సభలోన
యొక్క పూట లోన నిక్క మిదియె ||

|| ఇచ్చటి కొచ్చు వాడు నింగ్లీషు యువరాజు
కవిత జెప్పుమన్న కబురు దెలిసి
రామ దాసు నేను కామ దాసును గాను
కవిత లల్ల ననుచు ఖండి తముగ ||

|| ఆశ జూపినట్టి యచ్చంపు బంగారు
నిచ్చ గింప బోక నేవ గించి
గెల్చి నావు నీవు ఘనరాము హృదయమ్ము
వాసు దాస భక్త వర వికాస ||

|| బిరుదు నిచ్చె నిచట బళ్ళారి రాఘవ
ఆంద్ర వాల్మికంచు నాదరమున
గణుతి కెక్కి నావు ఘన సభా మధ్యమున
వాసు దాస భక్త వర వికాస ||

|| తుచ్చ మైన నిట్టి లోకమ్ము నందున
బ్రతికి నావు నీవు యతి వరేణ్య
పంక సీమ యందు పద్మంపు రీతిగా
వాసు దాస భక్త వర వికాస ||

కం ||విత్తంబు నొదలి యోబన
తత్వంబుల బాడె నిచట తన్మయు డగుచున్
చిత్తంబును రామునకిడి
మొత్తంబుగ మహిని నిల్చె మోక్షా ధిపుడై ||

కం || అన్నా యనుచుం జీరిరి
కన్నారము నీదగునొక ధన్యపు భక్తిన్
చెన్నారగ రమ్మని యో
బన్నను బట్టుక బొగడిరి భక్త వరేణ్యుల్ ||

|| తాను తినెడి ముద్ద తగ నీకు నర్పించి
కీర్తనముల బాడి యార్తు డగుచు
మాల కులము నందు మహనీయ మూర్తియై
ధరణి నిల్చె యోబ దాసు డిచట ||

|| పండు ముసలి యగుచు నుండేనీ యోబన్న
నూట ఇరువ దేండ్లు వాట ముగను
పుణ్య పురుషు డగుచు పూర్ణాయు వందెరా
మాల యైన నేమి మాన్యు డితడే ||

కం || రఘువీరుని శతకంమును
జిగిమీరగ జెప్పినావు చిత్రపు రీతిన్
తగ నొంటి మిట్ట వాసిగ
జగమేలిన త్రిపురాంతక తిప్పయ రాజా ||

కం || పిల్లని తల్లియు తండ్రియు
చల్లన మరి వీడిపోయి రల్లన గుడిలో
తల్లిగ పాలం ద్రాపెను
బాలకు నా లోక మాత బాగుగ గాచెన్ ||

కం || ఎంతటి భాగ్యము నీదిర
నంతట నా వేల్పులెల్ల వింతగ జూడన్
మాతఏ బ్రహ్మకు పావన
జాతయె నిను ముద్దు చేయు రీతి యదేమో ||

కం || ధన్యము నీదగు జన్మము
ధన్యము నీ గోత్రమికను ధన్యము భువిలో
ధన్యంబిక ముమ్మాటికి
అన్యము గాదనుట తగును అయ్యల భద్రా ||

|| తురక లెల్ల జేరి తుచ్చంపు మనమున
బేగు నంపి కూల్చి దేవళముల
మంచి వైన యట్టి మణులునున్ రత్నాలు
వారి రాజు కంపు విధము నిచట ||

|| బేగు డొచ్చి ఇచట భీకరం బుగనిల్చి
దేవుడున్న యెడల రావల యును
లేని యెడల కూల్తు దేవళం బనిజెప్ప

పలికి నావు నీవు పల్ల వముగ ||


కం || కలడా దైవంబిట యని
అలనీ మాంబే గుడిటను గొల్లున బిలువన్
పలికిన నీ స్వరమును విని
నులుకున నీ భక్తు డయ్యె తురకుం డిలలో ||

||కంది మల్ల పల్లె కవిరాజ ముఖ్యుండు
నిన్ను జూడ వచ్చి సన్ను తించి
కలిమి మీర జెప్పె కాలంపు జ్ఞానంబు
నీదు కరుణ చేత నిక్క ముగను ||

|| పోతు లూరి యోగి పొంకమ్ము గావచ్చి
దండ మాచరించి ధన్యు డయ్యె
కాల జ్ఞాన సుధను కామితంబుగ జెప్పి
కీర్తి నొందె నిచట సార్థ కముగ ||

|| వీర బ్రహ్మ యోగి వింతైన తత్వాల
లోతు నెరుగ తరమె లోకు లకును
నీదు కరుణ వల్ల నిజ బోధ గల్గురా
మంద హాస యొంటి మిట్ట వాస ||

|| శృంగి శైల మనెడి బంగారు కొండపై
తపము జేసె శృంగి ద్వాప రమున
బాల కాండ వ్రాసె భళియాంద్ర వాల్మీకి
ఇదియె పర్వతమున నింపు గాను ||

|| పాము దెచ్చి రాజు పాపమా మునిమెడను
వేశి పోవ శృంగి వేస రిల్లి
తక్షకుండు గఱచి తాజంపు నిన్నంచు
శాప మిచ్చె నపుడు సాహసమున ||

|| శాప మొసగి తాను శక్తి హీనుం డౌట
జూచి శౌన కుండు చల్ల గాను
రాము డున్న యట్టి రమ్యమౌ శైలాన
తపము జేయు మంచు తనయు నంపె ||

కం || వీలుగ మార్కం డేయుడు
శూలిని మెప్పించే నిచట కాలుని గెలిచెన్
హాలా హల కంటుని గని
యేలెను చిర జీవితమ్ము రాలెను సుమముల్ ||

కం || కలదొక పర్వత మిచటను
నిలలో నొక్కటి మృకండు నింపగు పేరన్
లీలగ గంగా ధరుడిట
కాలుని దండిం చెనంత బాలుడు బ్రదికెన్ ||

|| కాంచె నిచట గురుడు ఘన సాల గ్రామంబు
ధరణి యందు నొకటి దాగినటుల
త్రవ్వి తీసి దాని స్థాపించే నం తటన్
రామ లింగు డనుచు రక్తి మీర ||

|| వరద దాసు కవిత వర్ణింప నాలించి
వేంక టాఖ్య కవులు వింత గాను
కవివి యన్న నీవు కామంచు మేమని
సన్ను తించి రతని సమ్మతించి ||

కం || మళయాళ గురుని శిష్యుడు
నిల రాముని గీర్తి చేయ వినుచును వారల్
భళి యని తిరుపతి కవులిట
తల లూచిరి వరదదాస వరకవి వనుచున్ ||

|| పదములెల్ల బాడి పరగెనీ క్షేత్రయ్య
పాప మెల్ల బాసి పావ నుండు
దేశ మెల్ల దిరిగి దైవతంబుల దలచి
నిన్ను గొల్చి తాను ధన్యు డయ్యె ||

|| మువ్వ గోప బాలు ముత్యాల పదముల
బాడి నావు నీవు పాప రహిత
సరిగ నాల్గు వేల శృంగార తత్వాల
రమ్య తాళ గతుల గమ్య మలర ||

|| భక్త కవుల బృంద మత్యంత వినయాన
పొగడి నిన్ను ముక్తి పొంది రిచట
ఇంత కన్న వరము ఇంకేమి కలదురా
మంద హాస యొంటి మిట్ట వాస ||

|| పసిడి గోర నదియె ప్రాప్తించు నిక్కము
నిన్ను గోరి వేడ నిన్నె జేరు
తెలివి గలుగు వారు తేల్చుకో వలెనింక
మంద హాస యొంటి మిట్ట వాస ||

|| తిరిగి జన్మ లందు తపియించి జీవుండు
కడమ పుట్టు కమున కనులు దెరచి
నిన్ను దలచి యపుడు నిర్వాణ మందురా
మంద హాస యొంటి మిట్ట వాస ||

|| నేను నాది యన్న నీచంపు భ్రమలేల
బ్రతుకు లోన నిన్ని బాధలేల
నిన్ను జేరి నేను నిత్యుండ నయ్యెదన్
మంద హాస యొంటి మిట్ట వాస ||

|| ఇట్టి నేల జూడ నెక్కడై ననులేదు
ఎంద రెంద రిచట బంధ మూడి
పరమ ముక్తి గనిరి పావనా శ్రీ రామ
మందహాస యొంటి మిట్ట వాస ||

|| కవులు యోగు లెల్ల కమనీయ మొప్పార
భక్తు లెల్ల నిన్ను బాడి రిచట
భక్తి నదిని మునిగి బ్రహ్మమున్ జేరిరి
మంద హాస యొంటి మిట్ట వాస ||

|| నీదు కరుణ యున్న నింకేమి తక్కువ
భక్తి యైన దివ్య శక్తు లైన
ముక్తి యన్న నాకు ముంజేతి దండరా
మంద హాస యొంటి మిట్ట వాస ||

|| రామ రామ యనుచు రామ చంద్ర యనుచు
రామ భద్ర యనుచు రంగు గాను
నీదు నామ మింక నిత్యమ్ము తలచెదన్
మంద హాస యొంటి మిట్ట వాస ||

|| రామ కృష్ణు నింక నీమమ్ము గానేను
గొల్చి నట్టి ఫలిత మిద్ది యేమొ
రామ చంద్రు కరుణ రమ్యంబు గాదక్కె
ధన్యు డైతి నీదు దయను బొంది ||

|| దేహ దాస్య మింక సాహసమ్మున వీడి
ఇంద్రి యముల మించి నిచ్చ గించి
ఆత్మ గతిని బొంది అమరుండ నయ్యెదన్
రామ నీదు కరుణ రచ్చ లేల ||

|| ఒంటి మిట్ట యనెడు యొకదివ్య వరభూమి
గాంచి యుంటి నేను ఘనత రముగ
నీదు కరుణ దడిసి నిక్కంపు కవినైతి
మంద హాస యొంటి మిట్ట వాస ||

కం || కలమా ప్రాణము లేనిది
బలమై యా రాము డుండ బహువిధ రచనల్
గలిగిన రీతిని నాచే
గల్పించితి విట్టి పద్య కవితా గరిమల్ ||

కం || నీదగు కవితా శక్తిని
నాదగు నీ పాణి బట్టి నడపించితివా
నీ దయ గూరిమి మహిమన్
నాదౌ నీ రచన వెలసె నిటు చిత్రముగా ||

కం || ధన్యుడ నన్నమ దేశిక
ధన్యుడ తాతా యతివర ఘన సిద్దేశా
ధన్యుండను వసుదాసా
ధన్యుండను యొంటి మిట్ట ధరణీ నాధా ||

|| మూగ వాడు జెప్పు ముచ్చటౌ పద్యాలు
పంగు డెగురు గట్టి పర్వ తముల
యన్న మాట నేడు యతిసత్య మైదోచే
నీదు పాద యుగము నంటి నంత ||

|| పాద రజము సోకి పడతి యయ్యెను రాయి
శబరి ధన్య యయ్యె సొబగు లీన
కోతి యొకటి మించి కోపించి గాల్చెరా
వేయి యోజనముల విభవ పురిని ||

|| నీదు నామ మందు నేమిమా హాత్మ్యమో
జపము జేసి నిలను జంతు తతులు
ఇంద్రియముల మించి ఈశ్వరున్ గన్నారు
ఏమి మహిమ నీదు నామ మందు ||

|| పుస్తకముల నుండు పుక్కింటి సుద్దులు
నిజము గాదు యనుచు నింత సేపు
తలచినట్టి భ్రమలు తలక్రిందు లయ్యెరా
రుజువు జూచినంత రూడి గాను ||

|| ఇట్టి వింతలెన్నో గట్టిగా గనుపింప
ముదము నంది ఘనులు మునిగణములు
మాన వుడవు గావు మహిలోన నీవంచు
రామ బ్రహ్మ మనిరి రక్తి మీర ||

|| ధర్మ మెల్ల రూపు దాల్చి నిల్చిన యట్లు
సత్య మెల్ల నీదు సన్ని ధగుచు
దైవ మిలను జూడ దాక్షిణ్య మూర్తి యై
నీదు రూపమందు నిల్చె నిటను ||

|| భ్రమలు దొలగి జూడ బంగారు గవి నీవు
ఇహము నందు నికను నిత్య మందు
దైవ రాయుడగుచు దగ్గరై నావింక
నిల్పు కొందు నింక నిన్ను మదిని ||

|| లోక యాస లేల లోకేశు డుండంగ
ఇంద్రియముల దగులు ఇచ్ఛ లేల
మనసు నధిగ మింతు మరినీదు కరుణతో
ఆత్మ నందు కొనెద నబ్బు రమున ||