Pages - Menu

Pages

2, జనవరి 2010, శనివారం

చంద్ర గ్రహణం తో మొదలైన ఆంగ్ల నూతన సంవత్సరం

డిసెంబర్ 31 రాత్రి పన్నెండు గంటలకు గుత్తి అనంతపురం మధ్యలో ఒక స్టేషన్లో నైట్ సర్ప్రైస్ ఇన్స్పెక్షన్ ముగించుకొనిఅక్కడి స్టాఫ్ కు హేపీ న్యూ యియర్ చెప్పి వెనక్కు బయలుదేరాను. కారు కెదురుగా పిల్లి ప్రత్యక్షం అయింది. సరిగ్గా 00.20 కి చంద్ర గ్రహణం మొదలు కాబోతోంది. కీడు శంకిస్తూ, డ్రైవర్ ను నిదానంగా నడపమన్నా. డ్రైవర్ శేక్షావలి మంచిడ్రైవరు. 100 కి తక్కువ స్పీడు పోవటం అతనికి ఇష్టం ఉండదు. బొలెరో మీద మంచి కంట్రోల్ ఉన్నవాడు.

అయినా సరే, బాబూ ఇది పరిస్తితి, అని అతనికి వివరించి జాగ్రత్తగా పోనివ్వు అని చెప్పి బయలు దేరాం. గుత్తి దాటికొంచం దూరం వచ్చాం. రోడ్డు చాలా బాగా ఉంది. అక్కడక్కడా హైవే పనులు ఇంకా జరుగుతున్నాయి. డ్రైవర్ 60 లోపోతున్నాడు. టేప్ రికార్డర్ లోనుంచి ఘంటసాల పాత పాటలు వినిపిస్తున్నాయి. లోలోపల ఇష్ట దైవ స్మరణ, జపంచేస్తూ చూస్తున్నాను. సడన్ గా అవతల లేన్ లో వస్తున్న కర్నాటక బస్సు మా లేన్ లోకి దూసుకొచ్చింది. అవతలపక్క రోడ్డు ముక్క వేస్తున్నారు లాగుంది. అందుకని బస్ డ్రైవర్ సడెన్ గా మా లేన్ లోకి తిప్పాడు. నేను ఏక్సిడెంట్అయిందే అనుకున్నా. మా డ్రైవర్ బలంగా బ్రేక్ తోక్కటంతో కీచుమని స్కిడ్ అవుతూ జస్ట్ బస్సు ను తాకుతూ ఆగిందికారు. గండం తప్పినందుకు కాసేపు కారు ఆపి భగవంతున్ని స్మరిస్తూ ముందుకు సాగాం. అనుభవజ్ఞుడైన మా డ్రైవరుకూడా నోరు తడారి పోయింది. నా సర్వీసులో ఇలాంటిది జరగటం ఇదే మొదలు అన్నాడు షేక్ షా వలి.

సరిగ్గా 00.40 ప్రాంతంలో ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి గుండాగి నంత పనైంది. ఒక ఖాళీ పెట్రోల్ టాంకర్పక్కకు పడిపోయి రోడ్డుకు అడ్డంగా ఉంది. అటూ ఇటూ ట్రాఫ్ఫిక్ ఆగిపోయి ఉంది. జస్ట్ అప్పుడే ఏక్సిడెంట్ జరిగింది. ఆగినలారీలు కార్ల డ్రైవర్లు సాయం కోసం మమ్మల్ని కూడా దిగమన్నారు. కారు పక్కన పెట్టి దిగి చూస్తె, టాంకర్ ఒక సుమోనుగుద్ది దాదాపు 100 మీటర్లు ఈడ్చుకుంటూ తెచ్చింది. సుమో నుజ్జు నుజ్జుగా పక్కన గుంటల్లో పడి ఉంది. టార్చి లైట్లవెలుగులో చూస్తె కనీసం అయిదుగురు నుజ్జు నుజ్జు అయి చనిపోయి ఉన్నారు. కోన ఊపిరితో ఇరుక్కుపోయి ఉన్ననలుగురిని అతి కష్టం మీద బయటకు లాగాం. ఇంతలో 108 వాన్ వచ్చింది. వాళ్ళను అందులో ఎక్కించి పంపాము.

తలలు పగిలి, చేతులు విరిగి రక్తాలు కారుతూ భయానకం గా ఉన్నారు వాళ్ళు. టాంకర్ డ్రైవర్ తాగి నడుపుతూ సుమోను గుద్ది నందువల్ల జరిగినట్టుంది. అతనికి 20 ఏళ్ళు కూడా ఉండవు. ముక్కులోనుంచి, చెవులో నుంచి రక్తాలుకారుతూ పక్కకు ఒరిగి పోయి పడిపోయిన టాంకర్ లో ఇరుక్కుని ఉన్నాడు. అతన్ని కూడా బయటకు లాగి 108 లోఎక్కించి పంపాము. అతన్ని రక్షించాలా వద్దా అని జనంలో చిన్న వాగ్వాదం కొస మెరుపు. వీడి వల్లే ఇంతా జరిగింది. ఒదిలేద్దాం ఇలాంటి వాడు బతక కూడదు. అని జనం ఆవేశం గా మాట్లాడారు. ఇంకొందరు వద్దురా ఎవరి ఖర్మానికి వాళ్ళేపోతారు. మనకెందుకు. అంటూ అతన్ని కూడా కిందకు దించి వాన్లో ఎక్కించారు.

టాంకర్ పక్కనుంచి చిన్నగా కొంచం దారి చేసుకొని బయలుదేరి ఇంటికి చేరేసరికి రాత్రి రెండు అయింది. మర్నాడుటీవీలో తెలిసింది. 108 వాన్ లో హాస్పటల్ లో చేర్చిన అందరూ చనిపోయారు అని. నాతొ వచ్చిన ఇన్స్పెక్టరు, డ్రైవరుఅడిగారు. సార్ గ్రహణాల ఫలితం ఇంత దారుణం గా ఉంటుందా అని. మీరే చూసారుగా నేను చెప్పే దేముంది అన్నాను.

మొత్తం మీద కొత్త ఆంగ్ల సంవత్సరం చంద్ర గ్రహణం తో మొదలైంది. దీని ఫలితాలు ఎలా ఉండవచ్చో ఒక్క సంఘటనఅద్దం పడుతున్నది. మహిళలకు చిన్న పిల్లలకు కష్ట కాలం, పాల పరిశ్రమకు, మందుల కంపెనీలకు కష్టకాలం, రవాణా దుర్ఘటనలు, జల సంబంధ ప్రమాదాలు సూచింపబడుతున్నాయి. శుక్ర వారం , చంద్ర గ్రహనంతో మొదలు కావటంతో ఈ రెండూ గ్రహాల కారకత్వాలు దెబ్బ తింటాయి. చెడు సమయాలలో ప్రయాణాలు, కొత్త ప్రాజెక్టులు మొదలు పెడితే జాగ్రత్తగా ఉండటం మంచిది. చెడుసమయాలలో దైవ స్మరణతో, దైవ స్పృహతో పనులు చేసుకుంటే ప్రమాదాలు తప్పుతాయి. లేక పొతే విపరీతపరిణామాలు తధ్యం.