నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

4, జనవరి 2010, సోమవారం

మోక్ష త్రికోణం- కొన్ని రహస్యాలు

ద్వాదశ భావం మోక్ష స్థానం. దాని త్రికోణములైన చతుర్థ భావం, అష్టమ భావం మూడూ కలిపి మోక్ష త్రికోణం అని పిలువ బడుతుంది. మూడు భావాల వల్ల మనం జాతకునికి సంబంధించిన మోక్ష పరమైన రహస్య విషయాలు తెలుసుకోవచ్చు.

చతుర్థం వల్ల పూర్వ జన్మ ఎలా గడిచింది అని తెలుస్తుంది. అష్టమం వల్ల గత జన్మలో మరణం ఎలా జరిగిందో తెలుస్తుంది. ద్వాదశం వల్ల జన్మలో మరణం తర్వాత పొందబోయే గతి తెలుస్తుంది. కనుక మూడూ అతి రహస్య విషయాల విశ్లేషణకు పనికి వస్తాయి. అయితే ఎలా దీనిని అన్వయించుకోవాలో జ్యోతిర్విద్యా సాధకునికి తెలియాలి.

చతుర్థం మాతృమూర్తిని, సుఖాన్ని, విద్యనూ, గృహ, వాహన సౌఖ్యాన్ని సూచిస్తుంది. ఇవన్నీ బాగుండాలంటే పూర్వ జన్మలో మంచి పుణ్య బలం ఉండాలి. లేకపోతె వీటిలో లోపాలు కనిపిస్తాయి. ఇవి ప్రత్యక్ష నిదర్శనాలుగా మనం జాతక పరిశీలనలో గమనించవచ్చు.

గత జన్మలో మనం జీవించిన తీరు జన్మలో సుఖ స్థానం అయిన చతుర్ధం లో కనిపిస్తుంది. మనము మంచి కర్మను చేసుకొని ఉంటే జన్మ మంచి సుఖవంతం గా ఉంటుంది. లేదా తేడాగా ఉంటుంది. మనం ఎటువంటి కర్మను మూట గట్టుకొని వచ్చామో చతుర్ధ భావం చూపిస్తుంది. అందుకనే జాతకుడు అదృష్ట వంతుడా, లేక దురదృష్ట వంతుడా అనేది భావం చూచి టక్కున చెప్పవచ్చు.

అలాగే అష్టమ భావం అనేదాన్ని బట్టి గత జన్మలో మరణం ఎలా సంభవించిందో తెలుస్తుంది. మరణం యొక్క చాయలు, ఆశలు, ఆకాంక్షలు తీరని కోరికలు ఇత్యాది అన్నీ అష్టమ భావం లో దాగి ఉంటాయి. అందుకే దీన్ని అంతచ్చేతన అని పిలువ వచ్చు. అష్టమ భావాన్ని విశ్లేషణ చెయ్యటం వస్తే మనిషి లో దాగి ఉన్న మరో మనిషిని చదవ వచ్చు. ఎవరికీ చెప్పక తనలో దాచుకున్న విషయాలు తేట తెల్లంగా వివరించవచ్చు. దీనివల్ల జాతకుడు నిర్ఘాంత పోతాడు.

అంతే కాదు. అష్టమ భావంలో మనిషి యొక్క పరిణామ రహస్య సూత్రం దాగి ఉంటుంది. దేన్ని మార్చుకుంటే జీవితం బాగుపడుతుంది. దేని వల్ల తనకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అన్న విషయాలు భావంలో నిగూడంగా దాగి ఉంటాయి. మార్మిక సాధకులకు, తంత్ర విద్య మొదలైన సాధనలు చేసేవారికి భావం ముఖ్యంగా చూడాలి. దీనిలో వారి విధి అనేది మనకు దర్శనం ఇస్తుంది. కాని భావాన్ని చదవటం అంత తేలిక కాదు. కొంతైనా స్ఫురణ శక్తి లేనిదే భావం కొరుకుడు పడదు.

ఇక ద్వాదశ భావం. దీనివల్ల ప్రస్తుత జన్మలో మరణం ఎలా కలుగుతుంది? దాని తరువాత జీవి స్తితి ఎలా ఉంటుంది. మంచి లోకాలు కలుగుతాయా? లేక అధమ లోకాలకు జీవి పోతుందా? అనేది ఇక్కడ దర్శనం ఇస్తుంది. మనిషికి మోక్షం కలుగుతుందా లేదా అనేది కూడా ఇక్కడే తెలుస్తుంది.

చతుర్దంలో మనం అనుభవించవలసిన కర్మ ఫలం కనిపిస్తుంది. ఇది సాధారణంగా వ్యక్తులతో, మరియు సంఘటనలతో ముడిపడి ఉంటుంది. కాని అష్టమం లో మనిషి యొక్క మనస్సు లోలోతులలో దాగిఉన్న వాంచలు, తీరని కోరికలు, జన్మ జన్మల నుంచి వస్తున్న వాసనలు కనిపిస్తాయి. ఇక ద్వాదశంలో అంతిమ యాత్రకు దారితీసే పరిస్తితులు, దాని తర్వాత కలిగే స్తితులు చూడ వచ్చు.

మన వేదాంతంలో సంచిత, ఆగామి, ప్రారబ్ధ కర్మలు అని చెప్తారు. మూడింటికీ, మూడు భావాలకూ సంబంధం ఉంది.

మోక్షం అంటే పరమమైన ముక్తి అని మాత్రమె కాదు. ఇది పారమార్థిక కోణం మాత్రమె. కాని లౌకిక జీవితంలో పడే బాధలనుంచి, సమస్యల నుంచి ఎం చేస్తే మనకు మోక్షం లభిస్తుంది? అసలు సమస్యలకు కారణాలు ఏమిటి? వాటి మూలాలు ఎక్కడ ఉన్నాయి? అనే విషయాలు మూడు భావాలు చూపిస్తాయి.

ఇంత రహస్య విజ్ఞానం దాచుకున్నాయి కనుకనే మూడు స్థానాలను మోక్ష త్రికోణం అని పిలుస్తారు.మోక్ష త్రికోణ భావాల విశ్లేషణ వల్ల మనిషి యొక్క పురోగమన పరిణామ రహస్య గతి (code of evolution) అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం పడుతున్న బాధలకు పరిష్కారాలు కనుక్కోవచ్చు. చేతనైతే రెమెడీస్ పాటించి తీవ్రత తగ్గించు కోవచ్చు. కాని ఇదంతా పాప ఖర్మం దృడం గా లేనప్పుడు మాత్రమె సాధ్యం అవుతుంది. దానికి భిన్నం గా ఉండి, పూర్వ కర్మ చాలా బలం గా ఉన్నప్పుడు రెమెడీస్ పని చెయ్యవు. చెయ్యాలని బుద్ధి పుట్టదు. వెతికినా సరియైన పరిష్కారాలు దొరకవు. అడుగడుగునా అవాంతరాలు ఎదురౌతాయి.