నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

6, జనవరి 2010, బుధవారం

పరమహంస యోగానంద గారి జాతకం


పరమహంస యోగానందగారు 5-1-1893 రాత్రి 8-38 కి గోరఖ్ పూర్ లో 
జన్మించారు.

భారతీయయోగాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన మహనీయుల పేర్లలో ఈయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. మనిషిని  దైవంతో అనుసంధానం చెయ్యగల క్రియాయోగం అనే ప్రక్రియను విదేశీయులకు పరిచయం చేశారు.

క్రియాయోగం అనే ప్రక్రియ హఠయోగం, తంత్రయోగం, ప్రాణాయామం, కుండలినీయోగముల కలయికగా చెప్పవచ్చు. దీని అభ్యాసం వల్ల  మనిషి, విశ్వవ్యాప్తమైన  దైవచైతన్యంతో అనుసంధానం కాగలుగుతాడు. విశ్వాంతరాళంలో నిరంతరం ప్రతిధ్వనిస్తున్న  ఓంకారనాదాన్ని వినగలుగుతాడు. ఆ తరువాత దానిలో లయం కావడం ద్వారా బ్రహ్మలీనతను అందుకోగలుగుతాడు.


ఈ క్రియాయోగ ప్రక్రియ వేల సంవత్సరాలుగా భారతీయయోగులకు, సిద్ధులకు తెలుసు. మొదటిసారిగా  దీన్ని  యోగానందగారు సముద్రాలు దాటించి 
విదేశీయులకు పరిచయం చేశారు.

ప్రాచీనకాలం నుంచి  ఇది  గురుశిష్య పరంపరగా మన దేశంలో వస్తూ ఉన్నది.  బాబాజి అనే సిద్ధగురువు  రెండువేల సంవత్సరాలనుంచి నేటికీ శరీరంతో ఉన్న హిమాలయ సిద్ధపురుషుడు.ఆయన శిష్యుడు లాహిరీ మహాశయ.ఆయన నుంచిస్వామి యుక్తెశ్వర్ గిరి,తరువాత పరమహంస యోగానందగార్లకు ఈక్రియాయోగం పరంపరగా వచ్చింది. మొదటిసారిగా క్రియాయోగాన్ని విదేశాలలో ప్రచారం చేసే అనుమతి బాబాజి యోగానందగారికి ఇచ్చారు. లాహిరీ మహాశయులకు ఇతర శిష్యులు చాలామంది ఉన్నారు. వారిద్వారా ఈ క్రియాయోగం అనేక శాఖోపశాఖలుగా విడిపోయి బోధించబడుతున్నది. వీరిలో ఎవరి కుంపటి వారిదే. నేడు అనేకమంది భారతీయులు, విదేశీయులు ఎవరికి వారే క్రియాయోగ గురువులుగా చెలామణీ అవుతున్నారు. వీరిలో ప్రతివారూ 'మాకు బాబాజీ అనుమతి ఉంది' అని చెప్పుకుంటారు. ఉందొ లేదో ఆ బాబాజీ కే ఎరుక.

యోగానందగారు వ్రాసిన "Autobiography of a Yogi" అనే పుస్తకం అరవై  సంవత్సరాలనుంచి కొన్ని మిలియన్ల కాపీలు అమ్ముడుపోయింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ ఈనాడు క్రియాయోగం అంటే తెలుసు.

పరమహంస యోగానందగారి జాతకం ప్రక్కన ఇస్తున్నాను.

వీరిది సింహలగ్నం. సింహరాశి. మఖానక్షత్రం.శుక్రుడు ఆత్మకారకుడు. గురువు అమాత్య కారకుడు. లగ్నాధిపతి రవి మంత్ర స్థానంలోఉండటము. ధర్మస్థానంలో రాహువు ఉండి లగ్నాన్ని చూడటం వల్ల మహాయోగి కాగలిగాడు.

లగ్నారూడం అయిన మేషం నుంచి పంచమంలో చంద్రుడు, నవమంలో రవిఉండటం చూడవచ్చు.ఆత్మకారకలగ్నం అయిన వృశ్చికంనుంచి పంచమంలో గురుకుజులు ఉండడం చూడవచ్చు.ఇవన్నీ కూడాఈయన గొప్ప యోగి అని చూపిస్తున్నాయి.

కుటుంబ స్థానాధిపతి బుధుడు సున్నా డిగ్రీలలో రాశిసంధిలో పడ్డాడు.ఈ లగ్నానికి అతిపాపి అయిన శనిసప్తమాధిపతిగా కుటుంబస్థానంలో ఉండి వివాహాన్ని దూరం చేసాడు. అయితేనేం విశ్వవ్యాప్తమైన కుటుంబాన్నిఇచ్చాడు.

అష్టమంలో గురుకుజుల వల్ల ధార్మికమైన వ్యక్తిత్వం, యోగసాధనలో గట్టి పట్టుదల,యోగసిద్ధి కనిపిస్తున్నాయి.సుఖకారకుడు శుక్రుడు సుఖస్థానంలో ఉండి కారకో భావనాశక సూత్రానుసారంగా సుఖస్థానాన్ని పాడు చేసాడు.కాని అష్టమం నుంచి  గురువు యొక్క నవమదృష్టి  శుక్రుని మీద ఉండడం వల్ల, ఆయన  ప్రాపంచిక సుఖాలను తృణీకరించి  వాటికి అనేక రెట్లు  ఉన్నతమైనది మరియు గొప్పదైన ఆత్మానందాన్ని మాత్రమే కోరుకున్నాడు.

మనదేశమంటే కొంచం అవగాహన కలిగిన  విదేశీయులు  మన దేశాన్ని మతాన్నీ సంస్కృతినీ గౌరవించటానికి ముఖ్యంగా వివేకానందస్వామి, యోగానందస్వామి వంటి మహనీయులే కారణం అని నిస్సంకోచంగా చెప్పవచ్చు. 

దశావివరాలతో ఆయన జీవితం మళ్ళీ చూద్దాం.