Pages - Menu

Pages

13, జనవరి 2010, బుధవారం

జనవరి పన్నెండు విశిష్టత

పూర్తి బిజీగా ఉండి కూడా నిన్న వ్రాశిన పోస్ట్, ఈరోజు ప్రచురిస్తున్నాను.

జనవరి పన్నెండో తేదీకి ఒక విశిష్టత ఉంది. ఈ రోజుననే వివేకానంద స్వామి జన్మించారు కదా. తిధుల ప్రకారం అయితేకాదనుకోండి. కాని మాయా ప్రపంచం మాయకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఆ రకంగా చూస్తె, జనవరి పన్నెండుప్రపంచానికే ఒక ముఖ్యమైన రోజు.

భూమ్మీద ఆధ్యాత్మిక చింతన పూర్తిగా అడుగంటిన రోజులలో, నవీన నాగరికత పేరుతో భారతీయమైన అన్నీ చిన్నచూపు చూడ బడుతూ మన జాతి ఒక బానిస జాతిగా ముద్ర పడి, వెయ్యి సంవత్సరాలుగా సంపద పరంగా దోచుకోబడుతూ, చివరికి ఈ జాతి ప్రాణం అయిన ఆధ్యాత్మికత కూడా పూర్తిగా అడుగంటి కొడి గట్టిన దీపం లా ఉన్నదుర్దినాలలో, నిశీధిని తొలగిస్తూ మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తూ ప్రత్యక్షమయ్యే ఉషోదయం లా, సనాతన రుషిపుంగవుడు, దేవతలకు కూడా అందని సప్తర్షి మండలంలో విరాజిల్లెవాడు, శివాంశ సంభూతుడూ అయిన స్వామి ఈభూమ్మీద అవతరించిన రోజు.

తన దివ్య వాణితో, మనం మరచి పోయిన జాజ్వల్య మానములైన మన యోగ- వేదాంతరహస్యాలను మనకు విప్పిచెప్పి, మన వారసత్వ సంపదను మన కళ్ళ ఎదుట నిలిపి- భారత జాతి అంటే బానిస జాతి కాదు- ప్రపంచమంతా ఆటవికులుగా ఆకులు కట్టుకుని పచ్చి మాంసం తింటున్న రోజులలో, దార్శనిక భావాలలో అత్యున్నత శిఖరాలు అందుకున్న ద్రష్టలు జన్మించిన జాతి భారత జాతి- అని విదేశాలలో వారి గడ్డ మీద- వారి మధ్య- ఏకాకిగా- ఎటువంటిసహాయం లేకపోయినా- ఒక్క తన వ్యక్తిత్వమే ఆధారంగా - పర్యటించి- ప్రకటించి- నిరూపించిన- మహా పురుషుడు జన్మించిన రోజు ఇది.

వెయ్యి సంవత్సరాల చీకటిని చీల్చుకుంటూ-వెలుగు దివిటీని తన చేత ధరించి మన దేశం అభ్యున్నతికి సూచనగా - తద్వారా సమస్త ప్రపంచానికి దివ్యమైన వేదాంత జ్ఞానాన్ని ప్రసరింప చేస్తూ- ఎడారి మతాల అజ్ఞాన పూరితదాడులు-మోస పూరిత మత మార్పిళ్ల మధ్య- తేజో పుంజం లా ఆవిర్భవించిన మహర్షి పుట్టిన రోజు ఇది.

భారతీయుడి గా పుట్టిన ప్రతి మనిషీ- ఉదయం నిద్ర లేస్తూనే తలుచుకోవలసింది తన ఇష్ట దైవాన్ని కాదు- ముందుగా వివేకానంద రుషి వరేణ్యుణ్ణి భక్తితో స్మరించాలి అని నా నిశ్చితాభిప్రాయం.

ఎందుకంటే ఈ నాడు ప్రపంచం మన దెశాన్ని గౌరవిస్తున్నదంటే మన యోగ వేదాంత జ్నానాన్ని, మన ప్రాచీన రుషులు మనకు ఇచ్చిపొయిన ఆధ్యాత్మిక సంపదను చూచే గాని ఇతరత్రా కాదు. ప్రపంచం మనలను గురువులుగా భావించి వేల మైళ్ళు వచ్చి నేటి మన మహనీయుల పాదాల వద్ద మోకరిల్లుతున్నదంటే, అది వీళ్ళ గొప్ప కాదు. మన ప్రాచీన మహర్షుల మహిమ. కాపీరైట్స్ ఆశించకుండా మహత్తరమైన జ్నాన సంపదను ప్రపంచానికి ధారాదత్తం చెసి పోయిన మహర్షుల గొప్పతనమే గాని ఇంకోటి కాదు.

వివేకానంద స్వామిని స్మరిస్తే ప్రాచీన రుషి సంఘాన్ని అంతటినీ స్మరించినట్లె. రుషి రుణం లవలేశమైనా తీర్చుకున్నట్లే అని నా నిశ్చితాభిప్రాయం.