Pages - Menu

Pages

2, ఫిబ్రవరి 2010, మంగళవారం

ఒంటిమిట్టపై పరిశోధన- మరిన్ని కఠోర వాస్తవాలు






నిన్న ఆదివారం. మళ్ళీ ఒంటిమిట్ట ప్రయాణం కట్టాను. ఈ సారి పోయినసారి కి మల్లే కవితానుభూతి, రసానుభూతికలుగలేదు. కలగాలని నేను ఆశించనూ లేదు. ఏం జరుగుతుందో చూద్దాం అని ఉదాసీనంగా ఉన్నాను. కాని ఆలయంలో అడుగుపెట్టిన నిముషంనుండి కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. గుండె బరువెక్కింది. ఎందుకో కారణంతెలియదు. దుఖ్ఖం పెల్లుబుకుతున్నది. నాతొ వచ్చిన చంద్రశేఖర్ వింతగా చూస్తున్నాడు. పూజారి వీణారాఘవాచార్యులు గారు, పక్కనున్న భక్తులు వింతగా చూస్తున్నారు. మగవాడు ఏడవటం అసహ్యంగా ఉంటుంది అంటారు. ఇదంతా నటన అనుకుంటారేమో అన్న సందేహం కలిగి చాలా నిగ్రహించుకున్నాను. పక్కకు తిరిగి కళ్ళుకర్చీఫ్ తో తుడుచుకుంటున్నాను. అయినా కన్నీళ్లు ఆగటం లేదు. తెలియని వేదన స్పష్టంగా హృదయాన్నితాకుతున్నది. I felt a torrent of painful feelings touching and entering my heart center.



అలాగే దైవ దర్శనం అయిన త రువాత, మంటపంలో ఒకమూల కూర్చొని నా అంతరిక ప్రపంచంలోకి అడుగుపెట్టాను. ఎందుకిలా జరిగింది అని అంతరిక ప్రపంచంలో ప్రవేశించి కారణాలు అన్వేషించాను. కారణాలు స్పష్టంగా కనిపించాయి. 'నాకు ధ్యానంలో అర్థమైన విషయాలు నిజమైతే, సాయంత్రం లోపల దాన్ని బలపరిచే రుజువులు ఎవరి ద్వారానైనా వినిపించు' అని శ్రీ రాముని ప్రార్ధించి ధ్యానం ముగించాను. మంటపంలోని శిల్పాలను ఫోటోలు తీసే పని నా సహచరుడు చంద్రశేఖర్ కు అప్పగించాను. ఆయన పనిలో పనిగా నా ఫోటోలు కొన్ని తీశాడు.


ధ్యానం ఎలా చెయ్యాలి? ఆ స్థితిలో ఎలా ఉంటుంది? అని అనేక మంది నన్ను ఈ మెయిల్ లో అడుగుతున్నారు. చాలామంది మార్గ దర్శనం చెయ్యమని, గురుత్వం వహించమని అడుగుతున్నారు. నాకు అంతటి సమర్ధత లేదు. ఆ పనికి దైవ సమ్మతి ఉండాలి. దైవాదేశం స్పష్టంగా వినిపించాలి. అంతకు ముందే ఆపని చెయ్యటం దుస్సాహసం అవుతుంది. శ్రీరామకృష్ణులు ఒక ఉపమానంలో చెప్పారు. సమర్ధత లేని పాము కప్పను మింగాలని పట్టుకుంటుంది. కాని మింగలేదు. కక్కలేదు. పాముకూ కష్టమే. కప్పకూ కష్టమే. దైవాదేశం లేని గురుత్వం ఇలాగే ఉంటుంది. కాని నిజాయితీగల సాధకుల సందేహాలకు ఒక మిత్రునిగా నాకు తెలిసినంతవరకూ, పెద్దలనుంచి విన్నంతవరకూ సమాధానంచెప్పగలను. అందులో తప్పు లేదు.


ఒక పెద్ద భవంతిలో అనేక ఆవరణలు ఉంటాయి. ప్రతి ఆవరణకూ తలుపు ఉంటుంది. మనం బయటనుంచి ఒక్కొక్కతలుపూ మూసుకుంటూ లోలోపలకు పోతున్నాము. చివరిగా బాగా లోపల ఉన్న గది తలుపు కూడా వేసుకొని నిద్రకు ఉపక్రమిస్తాము. ఇది ప్రతివారూ ప్రతిరోజూ చేసేదే. కొందరి ఇళ్ళు పెద్దవిగా ఉండవచ్చు, కొందరివి చిన్నవి కావచ్చు. కానిఈ చర్య ప్రతి వారికీ అనుభవమే. ధ్యానంలో ఇలాగే ఉంటుంది. బయటనుంచి ఒక్కొక్క తలుపు మూసుకుంటూ లోలోపలకు పోతున్నట్లు అనిపిస్తుంది. ఇంకొక ఉదాహరణ ఇస్తాను. అమెరికాలో ఉన్నవారికి ఇది బాగా అనుభవం. వారికి ఇళ్ళలో సెల్లార్లు ఉంటాయి. ఇంటి తలుపులు మూసుకొని సెల్లార్ తలుపు తెరిచి ఒక్కొక్క మెట్టూ దిగుతూ పాతాళ లోకంలోకి అడుగు పెట్టాలి. అందులో లైట్ ఉంటుంది. కాని అంతరికలోకంలో కొంతవరకూ లైట్లు ఉండవు. ఒక్కొక్కసారి ఇటువంటి అనుభవం కలుగుతుంది.ఇంకొక ఉదాహరణ. లోతుబావిలో ఈత తెలిసిన వారికి ఇది అనుభవం లో ఉంటుంది. ఏదైనా వస్తువు బావిలో పడినప్పుడు దాన్ని బయటకు తీసే గజఈతగాళ్ళు ఉంటారు. వారికి కలిగే అనుభవం లాంటిది ధ్యానాభ్యాసికి కలుగుతుంది. బావిఅడుగుకు పొతున్నపుడు చీకటి పెరుగుతూ ఉంటుంది. చెవులలో హోరు ఎక్కువ అవుతుంది. శరీరం మీద వత్తిడి పెరుగుతుంది. చివరిగా బావిఅడుగు తగులుతుంది. ఒక ఆధారం తగిలినట్టు అవుతుంది. ఈ విషయాలు ఇంకొక పోస్టులో ప్రస్తావిస్తాను. ఇక ప్రస్తుత విషయానికొద్దాము.


ఒంటిమిట్ట ఆలయం చాలా ప్రశస్తమైన పుణ్య స్థలం.దాదాపు పదివేల ఏండ్లక్రితం సీతారామలక్ష్మణులు ఇక్కడ మూడురోజులు నివసించారు. ఇక్కడ దగ్గరలోనే మృకండు మహర్షి ఆశ్రమం ఉంది. మార్కండేయుడు ఇక్కడనే ఈశ్వరుని ప్రసన్నుని చేసుకొని మరణాన్ని జయించాడు. ఇక్కడ దగ్గరలోనే ఉన్న శృంగిశైలం అనే కొండపైన శృంగి మహర్షి తపస్సు చేసాడు. పోతన తనయొక్క దివ్యమైన భాగవత గ్రంధాన్ని ఇక్కడే వ్రాశాడు. ఆంద్రవాల్మీకి వాసుదాసస్వామి(వావిలికొలను సుబ్బారావు గారు) ఇక్కడే తెలుగు రామాయణాన్ని 'మందరం' అనే పేరుతొ కొంత భాగం వ్రాశాడు. అన్నమయ్య, వీరబ్రహ్మం గారు, క్షేత్రయ్య మొదలైన మహనీయులు కోదండరాముని దర్శించి కీర్తించారు. ఇంకెందరో కవులు, మునులు, సిద్దులు దర్శించిన పుణ్యస్థలి. ఇది అంతా ఒకకోణం మాత్రమె. ఇంకొక చీకటికోణం ఉన్నది. అదేమిటో, ఇక్కడ ఎన్ని వేలఏళ్లుగా అమాయకుల మూగసాధువుల ప్రాణాలు ఎంత హింసకు గురయ్యాయో, గాలిలోకలసి నిష్కారణంగా బలై పోయాయో, అది నాకెలా తెలిసిందో ఇప్పుడు చెబుతాను.

మధ్యాహ్నం వరకూ ఆలయంలో మంటపంలో ఒక మూల ధ్యానంలో ఉండి లేచాను. తరువాత ఆలయ ప్రధానఅర్చకులు వీణా రాఘవాచార్యులు గారితో మాట్లాడుతూ కొద్దిసేపు ఉన్నాము. ఆ సందర్భంలో ఆయన ఈ మధ్యనే జరిగిన ఒక సంఘటన చెప్పారు. 'నాడీ జ్యోతిష్యం' అంటే మీకు తెలుసా అని నన్ను అడిగారు. నేను ఆస్ట్రాలజీలో పదేళ్ళ క్రితమే MA చేసానని నాకు జ్యోతిష్యంలో గట్టి అనుభవం ఉంది అని నేను చెప్పలేదు. మౌనంగా నవ్వి ఊరుకున్నాను.


తమిళనాడు లోని సేలంలో ఉన్న ఒక తమిళ తంబి ఒక ఆర్నెల్లక్రితం నాడీజ్యోతిష్యం చూపించుకున్నాడు. ఆయనకు ఎప్పుడూ కలలో ఒక ఆలయం కనిపించేది. ఆ ఆలయం ఎందుకు కనిపిస్తున్నదో ఈ కలకు అర్థం ఏమిటో తెలియక అతను గిలగిలలాడిపోయేవాడు. అనుమాన నివృత్తికి నాడీ జ్యోతిష్యాన్ని ఆశ్రయించగా అందులో వివరాల ప్రకారం- ఆయన పూర్వజన్మలో అనగా రెండువందల ఏళ్ల క్రితం ఒంటిమిట్టలో ఇదే ఆలయంలో పూజారిగా ఉన్నాడు. పూజాదికాలు నిర్లక్ష్యం చేసి సరిగా చెయ్యని కారణం చేత ఈ జన్మలో వేరే వంశంలో తమిళనాడులో పుట్టాడు.

ఇది తెలిసిన వెంటనే ఆయన రైలెక్కి కడపలో దిగి అక్కణ్ణించి బస్సెక్కి ఒంటిమిట్ట ఆలయానికి వచ్చాడు. ఇక్కడ దిగి ఆలయాన్ని తన కలలో కనిపించే ఆలయంగా పోల్చుకొని ఆనందబాష్పాలు కార్చాడు. ఇది ఆర్నెల్ల క్రితం జరిగింది. పూజారిగారి దగ్గర సెల్ ఫోన్ లో ఆయన నంబరు ఉంది. నేను వెంటనే సెల్ లో సేలంలో ఉన్న ఆ తమిళ తమ్బితో మాట్లాడాను. ఆయనకు తెలుగు రాదు. నాకు తమిళం రాదు. ఇంగ్లీషులో సంభాషణ జరిపి ఇదంతా నిజమే అని నిర్ధారించుకున్నాను.

మధ్యాహ్నం నుండి దగ్గరలోనే ఉన్న శృంగిశైలం అనే కొండనెక్కి పైన ఉన్న ఆంద్రవాల్మీకి ఆశ్రమం చేరాము. ఇది రెండుగదుల ఇల్లు. దానికి కొంచం దిగువగా ఇంకొక రెండుగదుల ఇల్లు ఉంది. అందులో ఒక ముసలమ్మ ఉంటూ రాత్రిళ్ళుఆశ్రమానికి కాపలాగా ఉంటుంది. ఆమెకు తోడూ ఒక కుక్క ఉంది. 'కొండమీద ఒంటరిగా రాత్రంతా ఎలా ఉంటావు అవ్వా ' అని ఆమెను అడిగాను.ఆమె నవ్వింది. 'ఆ దేవుడే నాకు దిక్కు నాయనా' అంది. ఆమె ధైర్యానికి ఆశ్చర్యం వేశింది. 'ఆత్మబలమే గదా నిజమైన బలం' అనిపించింది.

ఆమెకు నన్ను చూచి ఏదో తెలియని ఆత్మీయత కలిగింది. ఎప్పణ్ణించో పరిచయం ఉన్నవానిలాగా పలకరించింది. కూచోబెట్టి చల్లటి కుండలోని మంచినీళ్ళు ఇచ్చి 'టీ' పెట్టి ఇచ్చింది. 'ఈ కొండమీద పాలెక్కడివి అవ్వా' అంటే 'కిందనుంచి తెచ్చుకోటమే నాయనా' అంది. పాపం ఆమె కొండదిగి తెచ్చుకున్న పాలతో మాకు 'టీ' చేసి ఇస్తుంటే వద్దని ఎంత చెప్పినా వినలేదు. కొండకొమ్ము మీద వేపచెట్టు కింద నేలమీద కూచొని టీ తాగుతూ చూస్తె చుట్టూపక్కల పచ్చని చేలుకొండలు మైళ్ళకు మైళ్ళు ఆహ్లాదకరంగా కనిపిస్తోంది. చల్లనిగాలితో వాతావరణం ఎంతో బాగుంది.

రాత్రి పూట ఒంటరిగా ఈ కొండపైన ఉండి ధ్యానంలో ఉంటె ఎంత అధ్బుతంగా ఉంటుందో అనిపించింది. అదే మాట ఆమెతో అన్నాను. నీ ఇష్టమొచ్చినన్ని రోజులుండు నాయనా. ఆ పెద్దాయన పిలిస్తేనే నీవొచ్చావు.నీకూ ఈ కొండకూ ఏదోబంధం ఉంది నాయనా' అంది. ఫోటోలు తీద్దామని చూస్తె అప్పటికే కెమెరాలో సెల్ చార్జ్ అయిపొయింది. శృంగిశైలం ఫోటోలు ఇంకోసారి తీసి బ్లాగులో పెడతాను.

ఇంతలో గోవిందస్వామి అనే ఒక సాధువు కొండనెక్కి వచ్చి మాకు కలిశాడు. ఆయన దేశసంచారి. రెడ్డి కులస్తుడు. కాని సంసారం వదిలిపెట్టి దేశాలు తిరుగుతూ ఉన్నాడు. అంతకు ముందు పేరు గోవిందరెడ్డి కావచ్చు. ప్రస్తుతం అందరూ గోవిందస్వామి అంటారు. ముఖము, కళ్ళు చూస్తె ఆధ్యాత్మికంగా కొంత పురోగమించినవాడే అనిపించింది. ఆయనకు ఈ ఒంటిమిట్ట క్షేత్ర చరిత్ర బాగా తెలుసు. ఎందుకనో ఆయనకు ఆ సమయంలో కొండనెక్కి రావాలని అనిపించిందిట.వాళ్ళిద్దరూ కలిశి ఆంద్రవాల్మీకి వాసుదాసస్వామి గురించి ఎన్నో విషయాలు మాకు చెప్పారు. అప్పుడునాకు ఉదయాన్నే గుడిలో అడుగు పెట్టగానే అంత దుఖ్ఖం ఎందుకు కలిగిందో అర్థం అయి సమాధానం దొరికింది. జీవితంఎంత విచిత్రమైనదో అనిపించింది.

వాసుదాసస్వామి ఈ ప్రాంతంలోనే తహసీల్ దార్ గా పనిచేసినవాడు.ఆ తరువాత మద్రాస్ కాలేజీలో తెలుగుపండితునిగా ఉద్యోగం చేసి విరమణ చేసినవాడు. ఇదంతా నూరు సంవత్సరాల క్రితం జరిగింది. ఆయన ఇదే ఊరిలోఉంటూ, ఉత్త గోచీ మాత్రం ధరించి విరాగియై కొన్ని వేల పల్లెలు,ఊర్లు కాలినడకన సంచరించి చేతనున్న టెంకాయచిప్పలో భిక్షఎత్తి వచ్చిన ధనాన్ని జీర్ణ దశకు చేరిన ఈ ఆలయఉద్ధరణకు వెచ్చించిన మహానుభావుడు. ఆ రోజులలో రోజుకు ఐదువేల మందికి చొప్పున భోజనంపెట్టిన మహా త్యాగి. ఆయన వ్రాశిన పుస్తకాలు చదవాలంటే ఒక మనిషికి ఒకజన్మ చాలదు. అన్ని గ్రంధాలు ఎలా వ్రాశాడో ఆయనకే ఎరుక. ఆయనను అనుగ్రహించిన ఆ శ్రీరామునకే ఎరుక. డెభ్బైఏళ్ల వయస్సులో రోజుకు ఇరవై గంటలు శ్రమిస్తూ రచనా వ్యాసంగం చేసేవాడు. మహా పండితుడు. మహాకవి. మహాసాధువు. అట్టి మహనీయుని కీర్తి ప్రతిష్టలు ఆంద్ర దేశం అంతటా వ్యాపించి జనం తండోప తండాలుగా వచ్చి ఆయనకాళ్ళకు మొక్కటం చూచి ఆ ఊరిరెడ్డిగారికి అభిమానం దెబ్బ తిన్నది. కన్ను కుట్టింది. మహాకోపం వచ్చింది.

ఇక్కడ రాయలసీమరెడ్ల గురించి కొంత చెప్పాలి. నాకు ఏ కులంపైనా ద్వేషం లేదు. అన్ని కులాలలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉన్నారు. చిన్నప్పటినుంచి నా మిత్రులలో దళితులతో సహా అన్ని కులాల వాళ్ళూ మతాల వాళ్ళూఉన్నారు. రాయలసీమ రెడ్లలో ఉన్న కొన్నివిచిత్ర లక్షణాలు ఏమిటంటే వారికి అహంకారం జాస్తి. దర్పం జాస్తి. ఊరకే కయ్యానికి కాలు దువ్వటం వీరికి అలవాటు. తామేదో రాజవంశపు వాళ్ళమని మిగతా వాళ్ళు నౌకర్లు అని భావిస్తూ ఉంటారు. ఆ ఊరిలో ఎవడైనా కొంత వెలుగులోకి వస్తే వాణ్ని అణగదొక్కి ఊరినుంచి వెల్లగొట్టేవరకూ నిద్రపోరు. ఏమిటీ వింతమనస్తత్వం అంటే ఏమీ చెప్పలేము. అదంతే. నిష్కారణంగా పగబట్టి వెంటాడి ప్రాణాలు తీసేవరకూ నిద్రపోరు. ఎవడైనాసరే వాళ్ళ కాళ్ళకు మొక్కి 'నీ బానిసను దొరా' అనాల్సిందే. దానికి వ్యతిరేకంగా ఉంటె చావాల్సిందే. ఇటువంటి లక్షణాలుఉన్నవాడే ఆ ఊరిలోని (---)రెడ్డి అనబడే వ్యక్తి.

వాసుదాసస్వామిగారి పేరు ప్రతిష్టలు, జనం వచ్చి ఆయన కాళ్ళకు మొక్కటం చూచి ఆయన అభిమానం దెబ్బతిన్నది. ఆ చుట్టుపక్కల పదహారు ఊళ్లకు ఆయనే రెడ్డి. అంటే జమీందారులాటి వాడన్నమాట. జనం ఆయన్నుగౌరవించకుండా ఎవడో బక్కచిక్కిన పేద సాధువును కాళ్ళకు మొక్కుతుంటే, ఎలాగైనా స్వామిని ఊరిలోనుంచి వెల్లగొట్టాలని పథకం వేశి తన మనుషులను( గూండాలను) పంపి ముసలివాడైన స్వామికి వెంటనే ఊరు వదలి పొమ్మని వార్నింగ్ ఇచ్చాడు. స్వామి వినమ్రంగా " నాయనా. రాముని ఆజ్ఞ అయినప్పుడు అట్లాగే పోతానులే." అని చెప్పి ఊరకున్నాడు.

మర్యాదగా చెబితే స్వామి వినటం లేదని ఆ రెడ్డి కోపం తెచ్చుకొని ఒకరోజున తానె వచ్చి చెప్పు తీసుకొని, ఉపవాస దీక్షల్లో మౌనధ్యానంలో బక్క చిక్కి ఉన్న ఆంద్ర వాల్మీకిని పట్టుకొని వీదిలోకి లాగి కొట్టుకుంటూ, రాయలసీమ బండబూతులలో తిడుతూ లాక్కు వచ్చాడు. జరిగిన అవమానాన్ని మౌనంగా భరిస్తూ స్వామి చేతులు జోడించి- "రామా రామా" అనటం తప్ప ఇంకేమీ చెయ్యటం లేదు. దీనితో ఇంకా కోపం పెరిగిన రెడ్డి ఇష్టం వచ్చినట్టు స్వామిని కొట్టి ఊరువిడచి పొమ్మని ఆజ్ఞాపించి వెళ్లి పోయాడు. వీధిలో పడిఉన్న స్వామిని భయభ్రాన్తులైన భక్తులు లేపి ఇంటిలోనికి తెచ్చిసేద తీర్చారు.

ఈ అవమానానికి దుఖ్ఖిస్తూ ఉన్న స్వామి స్వప్నంలో శ్రీరామచంద్రమూర్తి కనిపించి " ఏమయ్యా.ఈ మాత్రానికే బాధపడుతున్నావా? వాడొక కాకిరా. కాకులు నిన్ను పోడిచాయని ఇలా బాధపడుతుంటే నీవేమి భక్తుడవు? భక్తుల జీవితాలు కష్టాలకొలుములు నాయనా. ఆ కొలిమిలో కాగినపుడే నీవు అచ్చమైన బంగారుగా ప్రకాశించగలవు." అనిచెప్పి - "నీవు వెంటనే ఊరు విడచి ఇక్కడ పక్కనే ఉన్న శృంగిశైలం అనే కొండపైన నివశించు. ఆ కొండపైన శృంగిమహాముని తపస్సు చేసి సిద్ధి పొందినాడు. నేను కూడా నా అరణ్యవాససమయంలో అక్కడ మూడురోజులు ఉన్నాను. అక్కడనే నీవు కూడా నివసించు." అని చెప్పాడు.

ఆ తీరుగానే వాసుదాసస్వామి తనకు ప్రియమైన ఒంటిమిట్ట కోదండరాముని విడచి, శృంగిశైలం పైన నివశించసాగాడు. భక్తులు ఆ కొండపైకి ఎక్కి స్వామిని దర్శించేవారు. క్రమేనా జనం తెంపులేని తిరనాళ్లలాగా రావటం చూచిన రెడ్డి మళ్ళీ కొండపైకి తన అనుచరులను పంపి స్వామిని ఈడ్చుకుంటూ తెమ్మని పంపాడు. ఆ గూండాలు కొండనెక్కి, ఉపవాసములతో బక్కచిక్కి శల్యావశిష్టుడై, రామధ్యానతత్పరుడైన ఆ మహర్షిని చూచి కొట్టటానికి మనసురాక చేతులు జోడించి " స్వామీ ఆ రెడ్డి నీపైన పగ బట్టాడు. నిన్ను చంపినా చంపుతాడు. నీ పేరు చూచి భరించలేకున్నాడు. దయుంచి ఈ ఊరు ఒదిలి పో స్వామీ" అని ప్రార్ధించారు. స్వామి మరలా అదే సమాధానం చెప్పి "రాముడు పొమ్మంటే అలాగే పోతాలే నాయనా" అని అన్నాడు. ఈ సంగతి తెలిసి ఆ రెడ్డి మళ్ళీ ఒకరోజున కొండెక్కి వచ్చి దుర్భాషలాడుతూ, చెప్పరాని బూతులతో తిడుతూ స్వామిని చెప్పుతో మళ్ళీ కొట్టాడు. ఈ కొండను కూడా వదిలి పోకపోతే చంపుతానని చెప్పి వెళ్లి పోయాడు.

ఆరాత్రంతా స్వామికి నిద్ర లేదు. కంటికి మంటికి ధారగా నీళ్ళు కారుతున్నాయి. 'రామా నేను చేసిన నేరమేమిటిస్వామీ? తెలుగు నేలను వదలి పెట్టి తమిళనాడులోని శోలింగూర్లో ఉన్న నన్ను నీవు కనిపించి ఒంటిమిట్టకు రమ్మంటేనే గదా నేను వచ్చింది. జీర్ణ స్థితిలో పల్లేరుగాయలతో ఉన్న నీ ఆలయాన్ని బాగు చెయ్యమని నీవు అజ్నాపిస్తేనే గదా నేను ఊరూరా తిరిగి బిచ్చమెత్తి నీ దేవాలయాన్ని బాగు చేయించి నిన్ను సేవిస్తూ నీ నామాన్నిజపిస్తూ ఉన్న నాకు ఈ బాధలేమిటి? ఈ ముసలి వయసులో ఈ అవమానాలు దెబ్బలు ఏమిటి స్వామీ? ఏ జన్మలో ఏపాపం చేసానో గదా ఈ శిక్ష అనుభవిస్తున్నాను.' అని వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూ ఒంటరిగా ఆ కొండ కొమ్ముమీదఎప్పటికో నిద్ర పోయాడు.

స్వప్నంలో మందహాసముతో శ్రీ రామచంద్రుడు దర్శనం ఇచ్చి " నాయనా. ఇక నీవిక్కడ ఉండలేవు. తెనాలి దగ్గర అంగలకుదురులో నేను ఉన్నాను. అది ప్రశాంత వాతావరణం. అక్కడ నీ ఆశ్రమాన్ని ఏర్పరచుకో. నేను దండకారణ్యం అనబడే ఈప్రాంతంలో ఎన్నో వేలఏండ్ల క్రితం సంచరించాను. అప్పుడు కూడా ఇక్కడ శాంతస్వభావులైన మునులను నరమాంసభక్షకులైన రాక్షసులు నానాబాధలు పెట్టేవారు. కొట్టి, తిట్టి, చంపి, తినటం చేసేవారు. తపస్సులు భగ్నంచేసేవారు. అందమైన మునికాంతలను అపహరించి వారిపైన నానాదారుణాలు చేసేవారు. చివరకు వారిని చంపి తినేవారు. ఆ పరంపరను  ఈనాటికీ ఈ రూపంలో వీరు కొనసాగిస్తున్నారు. ఇక్కడంతా దొంగల, మానవరూప రాక్షసుల, గుంపులమయం. నేను ఈప్రాంతం లో సంచరించినప్పటికీ ఇప్పటికీ పెద్ద భేదం లేదు నాయనా. సాత్వికుడవైన నీవు వీరి మధ్యన ఉండలేవు. కనుక నేను చెప్పినట్లు చెయ్యి. వారి పాపఫలం వారిని కట్టి కుడుపుతుంది. నీవే చూస్తావు." అని మాయంఅయ్యాడు.

అని వాళ్ళు ఇంకా చేబుతుండగా-- అప్పుడు నాకు చటుక్కున స్ఫురించింది. అంతా అర్థం అయ్యింది. వేల సంవత్సరాల క్రితం అక్కడ రాక్షసుల చేతులలో బలాత్కారాలకు హత్యలకు బలైపోయిన అమాయక రుషికాంతలు, సాధువుల మూగవేదన ఆ ప్రాంతంలో గూడు కట్టుకొని ఉంది. నూరుసంవత్సరాల క్రితం అమాయకుడు ఆంద్రవాల్మీకి వాసుదాస స్వామి అనుభవించిన మూగవేదన సూక్ష్మతరంగాల రూపంలో అక్కడి వాతావరణ శూన్యంలోనే ఉంది. ఆ తరంగాలకు ట్యూన్ అయిన నా చేతన బరువెక్కి ఆ వేదనను నాచేత అనుభవింపచేసింది. ఆ తరంగాలు నా హృదయాన్ని తాకాయి. అందుకే నిష్కారణంగా గుండెబరువెక్కింది. అందుకే అలా కంటికి మంటికి ధారగా కన్నీళ్లు కారాయి. 'ఓహో ఇదా సంగతి' అని నాకు లోలోపలే అర్థమై బయటకు చెప్పకుండా మౌనంగా వింటూ ఊరకున్నాను.

అప్పుడు తెలతెల వారుతుండగా స్వామి దిగ్గున లేచి అన్నీ అక్కడే వదలి గోచీతో రోడ్డు వైపుగా కొండదిగి దగ్గరలోని ఒంటిమిట్ట రైల్వేస్టేషను చేరి రైలెక్కి హైదరాబాదు చేరి అక్కడ భక్తుల ఇంటిలో కొన్నాళ్ళు ఉండి తరువాత తెనాలి దగ్గర అంగలకుదురుకు చేరాడు. (ఇంకా వుంది )