నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

6, ఫిబ్రవరి 2010, శనివారం

ఒంటిమిట్టపై పరిశోధన- రెండో భాగం

"తరువాతెమైంది" ఆసక్తిగా అడిగాను.

గోవింద స్వామి చెప్పటం సాగించాడు.

తరవాతి కథ అందరికీ తెలిసిందేగా నారాయణా. స్వామి మొదట నడిగడ్డ పాలెం లోనూ తరువాత అంగల కుదురులో స్థిరపడటం, ఆశ్రమం స్థాపించటం వగైరాలు జరిగాయి. వారి పరంపర ఇప్పటికీ అక్కడ కొనసాగుతూ ఉన్నది. స్వామి చనిపోవటానికి కొద్ది రోజుల ముందు మళ్ళీ ఒంటిమిట్టకు వచ్చి కోదండ రాముని దర్శనం చేసుకున్నాడు. తరువాత మద్రాసులో చికిత్స తీసుకుంటూ 1936 లో మరణించాడు.

స్వామి ఒంటిమిట్టను వదిలిన తరువాత మళ్ళీ ఆలయం క్షీణ దశకు వచ్చి కార్యక్రమాలు క్షీణించాయి. ఊరి పెద్దలు ఉన్నారే వారేలాంటివారంటే, ఎవరైనా పూనుకొని ముందుకొచ్చి కార్యక్రమాలు చేస్తుంటే వారిని ఎక్కిరించటం, తప్పులు పట్టటం, హేళన చెయ్యటం వగైరా కార్యక్రమాలు జోరుగా చేస్తారు. కాని వారే చెయ్యాల్సి వస్తే ఎవరూ ముందుకు రారు. అదీ సంగతి.

మరి రెడ్డిగారు తరువాత ఏమయ్యాడు? నా ప్రశ్న.

గోవింద స్వామి కొనసాగించాడు.

ఏమౌతారు నాయనా. స్వాములనూ పాములనూ కదిలించ రాదనీ ఊరకే అనలేదు. సద్బ్రాహ్మనుడూ, సాధువూ అయిన ఆంద్ర వాల్మీకికి చేసిన అవమానానికి , పెట్టిన క్షోభకీ రెడ్డిగారి వంశం దుంప నాశనం అయ్యింది నాయనా. పారు లేకుండా మొత్తం వంశం అంతా రెండు తరాల్లో సర్వం నాశనం అయిపొయింది. సత్య స్వరూపుడైన రాముని వాక్కు సత్యం నాయనా. ఆయన అన్నట్టే జరిగింది. అందుకే మహనీయులను పూజించాలి గాని క్షోభకు గురి చెయ్యరాదు. పాప ఫలం దారుణంగా ఉంటుంది నాయనా.

ఇంతలో వింటున్న ముసలమ్మ కలుగ జేసుకుంది. " మధ్యనే స్వామి ఇదే ఒంటిమిట్టలో కనిపించాడు నాయనా."

నాకు ఆశ్చర్యం కలిగింది.

"
అదెలా సాధ్యమవ్వా? ఆయన గతించి దాదాపు 75 ఏళ్లయింది గదా?" అడగ కూడని ప్రశ్న అని తెలిసే అడిగాను.

ఆమె మళ్ళీ నవ్వింది. "వాళ్లకు చావు అడ్డంకి కాదు నాయనా. ఒక అంగీ మార్చి ఇంకొక అంగీ తోడుక్కోటమే. రెండు నెలల కిందట ఇక్కడ రామనామ సప్తాహం జరిగింది నాయనా. వారం రోజులు అఖండ రామనామ భజన చేశారు. సమయంలో ఒకరోజున స్వామి ఒక పండు ముసలి వాని రూపంలో వచ్చి హార్మోనియం వాయించే వాణ్ని పలకరించాడు. కాసేపు హార్మొనీ వాయిస్తాను. ఇవ్వు బాబూ అని అడిగాడు. దానికి అతను " స్వామీ నువ్వెవరో గాని పండు ముసలి వానిగా ఉన్నావు. వణుకుతున్నావు. హార్మొనీ వాయించ గలవా? అని సందేహం వ్యక్తం చేసాడు. దానికా ముసలివాడు నవ్వి " ఇటువంటి కార్యక్రమాలు చాలా చేసాను నాయనా." అని జవాబు చెప్పి చాలా సేపు భజనకు అనుగుణంగా హార్మొనీ వాయించాడు. తరువాత ఒక భక్తురాలిని అడిగి మంచినీళ్ళు తాగి, భక్తురాలు కొంచం పాలు ఇద్దామని చూసేసరికి ఎక్కడా కనిపించలేదు. అంతమంది మధ్యలో ఎలా మాయం అయ్యాడో తెలియదు. అందరూ వెదికారు. ఎక్కడా ముసలివాని జాడే లేదు నాయనా. దురదృష్ట వంతురాలిని. సమయంలో నేనూ ఇంకొకామె అక్కడ లేము. కొంచం ఏదన్నా తిని మళ్ళీ పోదామని ఇక్కడకు వచ్చాం నాయనా. అదృష్టం నాకు దక్కలేదు. ఎప్పుడూ ఆశ్రమాన్ని కనిపెట్టి ఉండే నాకు కనిపించలేదు స్వామి. అని వాపోయింది.

"
మరి తర్వాత ఎం జరిగిందవ్వా" అని అడిగాను.

ఏముంది నాయనా. స్వామీ నాకు కనిపించవా? అని ఏడుస్తూ ఇక్కడే ఆశ్రమంలో పడుకున్న నాకు స్వామి లీలగా గదిలో కూచొని ఉన్నట్టు కనిపించాడు నాయనా. అని చెప్పింది.

సూర్యాస్తమయం అవుతున్నది. సూర్యుడు ఎర్రగా మారి పెద్ద బింబంగా కనిపిస్తున్నాడు. సరాసరి చూచినా కళ్ళకు శ్రమ కలగటం లేదు. కొండ కిందగా హైవే మీద వాహనాలు పోతున్నాయి. దూరంగా రైల్వే లైన్ మీద రైలేదో పోతూ పెద్ద పాములాగా కనిపిస్తున్నది. సాయం సంజె అలుముకుంటున్నది. అప్పటి దాకా కథను వివరించి చెప్పిన గోవింద స్వామీ, అవ్వా మౌనం వహించారు. గోవింద స్వామి లేచాడు.

"
నేను సామాన్యంగా ఎవరితోనూ ఎక్కువ మాట్లాడను నాయనా, నా లోకం లో నేను బతుకుతుంటాను. నా సొంత కొడుకులు వచ్చినా నేను పలకను. కాసేపు చూచి స్వామి పలకడులే అని వాళ్ళే పోతారు. ఎందుకో సమయంలో కొండనెక్కి ఇక్కడికి రావాలని అనిపించింది. నిన్ను చూస్తె కథంతా చెప్పాలని అనిపించింది. చెప్పాను. కొండ దిగి ఆలయానికి పోయి దర్శనం చేసుకోవాలి. వస్తా" అంటూ కొండ దిగటం మొదలు పెట్టాడు. ముసలమ్మ రాత్రి వంటకు ఉపక్రమించింది.

సూర్యునికి అభిముఖంగా కూర్చున్నాను. అంత ఎత్తులో కూర్చుని ఎర్రని సూర్య బింబాన్ని చుట్టూ ప్రకృతినీ చూస్తున్నాను. సూర్యాస్తమయం జరుగుతోంది. తీరని ఆశలూ, కోరికలూ వేధిస్తుండగా నిస్సహాయంగా జీవితం చాలిస్తున్న మనిషిలా సూర్యుడు ఎర్రగా మారి మెల్లిగా ఆస్తమిస్తున్నాడు. ప్రతి మనిషీ జీవితం చివరికి ఇలాగే ముగుస్తుందేమో. ముంచుకొస్తున్న చీకటిలో మునిగి తెలియని లోకాలకు సాగిపోవాల్సిందే. మళ్ళీ కొంత కాలానికి తూర్పునసూర్యుడు ఉదయించినట్లు ఎక్కడో మళ్ళీ ఒక పసి పాపగా పుట్టాల్సిందే. ఎంత విచిత్రం.

ఒక వ్యక్తి నిస్వార్థంగా ఒక మంచి పని చేస్తున్నా దాన్ని వ్యతిరేకించే శక్తులు ఎందుకు ఉంటాయి ? ఒక వేళ అటువంటివారు ఉన్నా కూడా దైవ శక్తి ఎందుకు ఆయన్ని కాపాడలేక పోయింది? ఆయనకు అనుభవించాల్సిన ఖర్మ ఉందా? లేదాఆశ్రమం అంగల కుదురు లోనే పెట్టాలని దైవ సంకల్పమా ? ఇదంతా రకరకాల వ్యక్తుల జన్మ జన్మల పరంపరలలోనికర్మ సంబంధమా ? అసలు వీరిద్దరి మధ్య వైరం ఎలా మొదలైందో? దీనికి మొదలు ఎక్కడో?

జన్మ జన్మల నుంచి వెంటాడుతున్న అనుభవాల బరువుతోనో అన్నట్లు హృదయం భారంగా మారింది. అప్రయత్నంగా సంధ్యా వందన మంత్రాలు మనస్సులో తిరుగుతున్నాయి. అలాగే కళ్ళు మూసుకొని ధ్యానంలో మునిగాను. ఒక గంట గడిచిపోయింది. కళ్ళు తెరిచి చూసేసరికి బాగా చీకటి పడింది. సహచరుడు చంద్ర శేఖర్ ఓపికగా కొంత దూరంలో చెట్టుకింద దెయ్యంలా చీకట్లో కూచొని చూస్తున్నాడు. మెల్లిగా లేచాను. మాట్లాడే మూడ్ లేదు. నిదానంగా చీకట్లోనే కొండ దిగటం మొదలు పెట్టాను. చంద్ర శేఖర్ లేచి మౌనంగా అనుసరించాడు. కొండ దిగే వరకూ ఇద్దరం మాట్లాడుకోలేదు.

మరొక్క సారి ఆలయం చేరి స్వామి దర్శనం చేసుకొని కడపకు బయలు దేరాను. నేను పొద్దున్న చేసిన విన్నపంమన్నించి గోవింద స్వామి ద్వారా నాకు కథంతా చెప్పించి నా ధ్యానానుభావానికి రుజువులు చూపించినందుకు శ్రీరామచంద్ర ప్రభువుకు మనస్సులో నమస్కరించి బయలుదేరాను. ఆలయం నుంచి బయటకు వచ్చేటప్పుడు చూస్తె ఒక మంటపంలో ఎవరో మునగ దీసుకొని కూర్చొని కనిపించారు. దగ్గరికి పోయి చూస్తె గోవింద స్వామి. కళ్ళు మూసుకొని ధ్యానం లో మునిగి ఉన్నాడు. నిశ్సబ్దంగా అక్కడ నుంచి బయలుదేరి రాత్రికి కడప చేరాము.

ఏమిటీ వింత? ఎక్కడి గుంటూరు జిల్లా? ఎక్కడి కడప జిల్లాలోని మారుమూల గ్రామాలు? జన్మలోనిదీ అనుబంధం? ఎప్పుడో నూరు సంవత్సరాల క్రితం జరిగిన కథకూ నాకూ ఏమిటి సంబంధం? నా గుండెలో ఎందుకీ స్పందన కలగాలి? ఇలా ఆలోచిస్తున్నాను. ఇంతలో చంద్ర శేఖర్ ప్రశ్నించాడు.

"
మీ తీరు చూస్తుంటే నాకు వింతగా ఉంది సార్. హాయిగా ఏసీ రూం లో కూచొని ఉండక ఇక్కడ కొండలు గుట్టలుపట్టుకొని తిరగటం, అలా నిష్కారణం గా ఏడవటం, అడుక్కునే సాధువులతో చర్చలు, కొండమీద చీకట్లో ధ్యానం- ఏమిటి సార్ ఇదంతా? నాకైతే ఏదో పురాణ కాలంలోకి పోయి వచ్చినట్లుంది. మీరు ఏమీ అనుకోకుంటే ఒక మాట. మీకుకొంచం పిచ్చి ఉందని నా అనుమానం. " అని నవ్వుతున్నాడు.

నాకూ నవ్వొచ్చింది.

నిజమే చంద్ర శేఖర్. ఏసీ రూములు శాశ్వతం కాదు. పదవులు శాశ్వతం కాదు. ప్రక్రుతితో మమేకం అయి బతుకుతున్నసాధువు గోవింద స్వామి, కొండమీద ముసలమ్మా-వారి జీవితాల్లో ఉన్న తృప్తి మనకుందా? వారిలా స్వచ్చమైనబతుకు మనం బతక గలుగుతున్నామా? వాళ్లకు బాంక్ బెలేన్సులు లేవు. రేపు భోజనం ఉంటుందో లేదో తెలియదు. అయినా వారెంత ధైర్యంగా, తృప్తిగా, భగవంతుని మీద నమ్మకంతో ఉన్నారో చూడు. స్వచ్చమైన గాలి పీలుస్తూ, నీళ్ళుతాగుతూ, కలో గంజో తాగుతూ దైవ ధ్యానంలో కాలం గడుపుతున్న వాళ్ళ జీవితాలు సార్థకాలు. పొద్దున్న లేచినదగ్గర్నుంచీ టెన్షన్లు, మోసాలు, కుళ్ళు కుచ్చితాలతో కృత్రిమ బతుకులు బతుకుతున్న మన జీవితాలకూ వాళ్ళ జీవితాలకూ ఎంత తేడా ఉందొ చూడు.

బహుశా ఇటువంటి పరిస్తితిని చూచేనేమో జీసస్ "కాలి బాట పక్కన లిల్లీపూవుకున్న గ్లోరీ మహా రాజుకు కూడా దొరకదన్నాడు". నిశ్చింత అన్నీ ఉన్న మనకు ఎందుకని లేదు? నిజంగాఆలోచించు. ఏదో ఒక రోజు నువ్వు నాది అనుకుంటున్న ప్రతిదీ ఒదిలి ప్రక్రుతి ఒడిలోకి చేరవలసి ఉంటుంది. అప్పుడేంచేస్తావ్?

లోకం లో ప్రతి వాడికీ ఏదో ఒక పిచ్చి ఉంది. ఇది నా టైపు పిచ్చి. కానీ నా పిచ్చి లెవెల్ చాలటం లేదు. పిచ్చి ఇంకా బాగా ముదరాలని కోరుకుంటున్నా. సారి ఒచ్చినపుడు కొండమీద రాత్రంతా ఉందాం. నీకింకా విచిత్రాలుచూపిస్తా." అన్నాను

చంద్రశేఖర్ అర్థం కానట్లు చూచాడు. " సారీ సార్. నేను రాను. మీరు కళ్ళు మూసుకొని కూచుంటారు. నాకు మాట్లాడేదిక్కు లేదు. నాకక్కడ తోచదు. కావాలంటే మిమ్మల్ని అక్కడ దించి మళ్ళీ పొద్దున్నే వస్తాను." అన్నాడు.

సరే అలాగే చేద్దాం. అన్నాను నవ్వుతూ.

(అయిపొయింది)