Pages - Menu

Pages

26, ఫిబ్రవరి 2010, శుక్రవారం

చంద్ర యాత్ర - ఎడ్విన్ ఆల్డ్రిన్ జాతకం ఏం చెప్తోంది?


శంకర్-గిరి (
శంకరగిరి కాదు)అనే అజ్ఞాత నా పాత పోస్ట్ కు స్పందిస్తూ, నీల్ ఆరమ్ స్ట్రాంగ్ జాతకం ఒక్కటే కాదు, ఎడ్విన్ (బజ్) ఆల్డ్రిన్ జాతకం కూడా చూచి తరువాత, వారు చంద్రుని మీద దిగారా లేదా అనే విషయంలో ఒక నిర్ణయానికి రమ్మని చెప్పారు. అది తార్కికమే కనుక, నాక్కూడా నిజమే అనిపించింది. ఎందుకంటే 20-7-1969 న చంద్రునిమీద దిగిన ట్లుగా నాసా చెబుతున్న ఇద్దరిలో ఇతను కూడా ఒకడు. కనుక ఇతని జాతకంలో కూడా నిజానిజాలకు సంబంధించి ఏదైనా విశేషాలు కనిపించాలి. తార్కికంగా ఇది సరిగానే ఉంది.

కనుక ఎడ్విన్ ఆల్డ్రిన్ జాతకం పరిశీలించాను. ఇతను 20-1-1930 న న్యూ జేర్సీలోని మోంట్ క్లెయిర్ లో మధ్యాన్నం 2-17
కి పుట్టాడుట. సవరించగా సరియైన జన్మ సమయం 2-19 నిమిషాలని వచ్చింది. అతని జాతకం పైన ఇచ్చాను. మనం చూడవలసింది ఈ ఒక్క సంఘటనే కనుక పని చాలా సులభం.

ఇతని లగ్నం మిథునం అయింది. నక్షత్రం=చిత్త రెండో పాదం. సంఘటన జరిగిన రోజు ఇతని జాతకంలో శని/శని/శని/రవి/శని దశ జరిగింది. శని నవమాదిపతిగా సప్తమంలో ఉండి సుదూర ప్రయాణాన్ని సూచిస్తున్నాడు. ఆయన
దశమ దృష్టి చతుర్ధంలో ఉన్న చంద్రుని మీద ఉంది. తృతీయ దృష్టి నవమం అయిన కుంభ రాశి మీద ఉంది. కనుక దూరంగా ఉన్న చంద్రుని మీదకు ప్రయాణం సూచింప బడింది. కాని శనికి ఉన్న అష్టమాదిపత్యం ఏం చెబుతున్నదంటే- విషయంలో ఏదో రహస్యం దాగి ఉంది అని చూపిస్తున్నది. ఎందుకనగా అష్టమ స్థానం రహస్యాలకు నెలవు కనుక.

ఈ జాతకంలో ఇంకొక్క ముఖ్యమైన కాంబినేషన్- త్రుతీయాధిపతిగా దగ్గర ప్రయాణాన్ని సూచించే రవి, రహస్య
విషయాలకు నెలవైన అష్టమంలో, రహస్య విషయాలకు ఇంకొక ఆవాసమైన ద్వాదశాధిపతి యగు శుక్రునితో కలిసి, బుద్ధి కారకుడైన లగ్నాధిపతి యైన బుధుడు వక్ర స్తితిలో ఉండగా కొలువై ఉన్నాడు. రవి అధికారులకు రాజులకు కారకుడు. అంటే ఈ జాతకం వరకూ నాసా అధికారులకూ,అమెరికా అధ్యక్షునికీ సూచకుడు. ఈ కాంబినేషన్ వల్ల ఏమి తెలుస్తున్నది? ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. అధికారుల ఒత్తిడితో, దగ్గర ప్రయాణాన్ని దూర ప్రయాణం గా చిత్రీకరించి, రహస్య కార్యక్రమాలలో పాలు పంచుకున్నట్లు తెలుస్తున్నది.

ఇక వృత్తి ని చూపించే దశమ స్థాన అధిపతి అయిన గురువు స్తితి చూద్దామా? ఆయన వక్ర స్తితిలో ఉండి, రహస్య కార్య
క్రమాలకు నెలవైన ద్వాదశ రాశిలో కొలువై ఉన్నాడు. కనుక వృత్తి పరంగా ఏదో కీలక రహస్యం మొత్తం వ్యవహారం లో దాగుంది అని కాంబినేషన్ వల్ల తెలుస్తోంది. ఇటువంటి విషయాల్లో ఖచ్చితమైన రుజువులు ఇవ్వగల గుళిక కూడా ద్వాదశంలో గురువుతో కలసి ఒకే నక్షత్రమైన రోహిణిలో ఉండటం చూచిన తర్వాత ఇక అనుమానానికి ఆస్కారమే కనిపించదు. రోహిణి అనే నక్షత్రానికి విమ్సోత్తరీ దశా పరంగా చంద్రుడే అధిపతి. కనుక చంద్రునికి+వృత్తికి సంబంధించి ఒక నెగటివ్ రహస్యం ఈ మొత్తం వ్యవహారం లో ఉంది అని గుళిక+వక్రి గురువుల కాంబినేషన్ తో సూచింప బడటం లేదూ?

అప్పుడే ఒక నిర్ణయనికి రావడం ఎందుకు? వృత్తిని సూచించే దశమాంశ చక్రం పరిశీలించగా- లగ్నం చంద్రునిదైన
కర్కాటక రాశి అయింది. కనుక ఈయన వృత్తికి చంద్ర సంబంధం ఉంది అని తెలుస్తొంది. కాని వృత్తి స్థానం అయిన దశమ స్తానం లో శని నీచ స్తితిలో కొలువై ఉన్నాడు.

నీల్
ఆరం స్ట్రాంగ్ జాతకంలో కూడా ఇలాగే దశమాంశ చక్రంలో శని నీచలో కొలువై ఉండి, వృత్తి పరముగా మొత్తం వ్యవహారం లో వీరిద్దరూ కలసి పనిచెయ వలసిన కర్మ బంధాన్ని ఇద్దరి జాతకాలలో చూపిస్తున్నాడు. కాంబినేషన్ వీరిద్దరి జాతకాలలో మొత్తం వ్యవహారాన్ని పట్టించే Karmic Signature అని చెప్పవచ్చు.

ఆల్డ్రిన్ జాతకంలో దశమాంశలో శనికి
నీచభంగం జరుగలేదు. ఎందుకనగా తద్రాశి నాధుడైన కుజుడు గాని తదుచ్చ నాధుడైన రవి గాని లగ్నం నుంచి గాని , చంద్రాత్ గాని కేంద్ర స్థానములలో లేరు. వృత్తిచక్రమైన దశమాంశలొ శని పార్ట్నర్ లను, రహస్య కార్యకలాపాలను చూపించే సప్తమ,అష్టమ రాసులకు అధిపతిగా నీచ స్తితిలో ఉంటే-- జ్యోతిష్య విద్యలో కొద్దిపాటి ప్రవేశం ఉన్నవారికి కూడా తెలుస్తుంది దీని అర్థం ఏమిటి అని. ఒక్క గ్రహ స్తితి చాలు ఈయన వృత్తి పరంగా పార్ట్ నర్లతో కలసి రహస్య కార్యక్రమాలలో పాలుపంచుకున్నాడు, ఇందులో మతలబు ఉంది అని చూపటానికి.

తరువాత దశమాంశ చక్రములో ఇతర గ్రహముల స్తితి చూద్దామా? వింశాంశ దశల్లో ఈ ఘటన జరిగిన సమయానికి
శని/శని/శని/రవి/శని దశ జరిగింది అని చెప్పాను కదా.వీరిలో శని కాక మిగిలిన గ్రహం రవి. ఆ రవి, అధికారులను సూచిస్తూ, దశమాంశ లో లగ్నాత్ పంచమం (బుద్ధి స్తానం) లో నీచకు దగ్గరగా ఉండటం చూడవచ్చు. దీని అర్థం నేను ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ పాటికి చదువరులకు అర్థం అవుతుంది అని ఆశిస్తాను. ఈ శని రవులిద్దరూ షష్ట-అష్టక స్తితిలో ఉండటం బట్టి ఇది ఏమాత్రం మంచి కార్యక్రమం జరిగే సమయం కాదు అని తేలుతోంది. పైగా వీరిద్దరూ పరస్పర మిత్ర గ్రహాలు కారు, బద్ద శత్రువులు. కనుక వీరి దశా సమయంలో అటువంటి విజయం సాధించే అవకాశాలు దాదాపు మృగ్యం అని చెప్పవచ్చు.

అతి ముఖ్యమైన నవాంశ చక్రం ఏమి చెబుతున్నదో చూద్దాము. రాశి చక్రంలో లగ్నాధిపతి యగు బుధుడు(బుద్ధి కారకుడు), నవాంశ లగ్నమగు వృశ్చిక రాశి నుంచి పంచమం(బుద్ధి స్తానం) అగు మీనం లో నీచ స్తితిలో ఉండి, అధికార కారకుడగు రవితో కలసి ఉండటం చూడవచ్చు.

దీనర్థం ఏమిటో ఈపాటికి పై విశ్లేషణ అంతా చదివిన చదువరులే నాకు చెప్పగలరు. అయినా నేనే చెప్తాను.బుద్ధి
కారకుడు, బుద్ది స్థానంలో,వక్రించి ఉండి, అదీ అధికార గ్రహం అయిన రవితో కలిసి ఉండటంతో---- వక్ర బుద్ధితో, అధికారుల వత్తిడితోలేదా వారి కుమ్మక్కుతో, కాకమ్మ కథ అల్లినట్లు, చక్కగా అద్దంలో చూచినట్లు కనిపిస్తోంది.

ఇప్పటికీ నమ్మలేక పోతున్నాము కదా!! పోనీ బెనెఫిట్ ఆఫ్ డౌట్ కింద ఇంకా చూద్దామని పరిశీలించగా--లగ్నారూడం తృతీయం అయిన సింహం అయింది. ఇది దగ్గర ప్రయాణానికి సూచిక. వృత్తిని సూచించే దశామారూడం కర్కాటక రాశిలో పడి, వృత్తి పరంగా దగ్గర ప్రయాణాలనే సూచిస్తున్నది కాని దూర ప్రయాణాలను కాదు. (పై జాతకంలో A-10 అనేది కర్కాటక రాశిలో ఉన్నట్లు తీసుకోవాలి. పొరపాటున సింహ రాశిలో పడింది.)

ఇంకా లాంగ్ రోప్ ఇచ్చి చూద్దామని ఇంకో కాంబినేషన్ పరిశీలించిగా --లగ్నారూడం నుంచి అష్టమ స్థానాధిపతి (రహస్యం) అయిన గురువు వక్ర స్తితిలో వృత్తిని సూచించే దశమ స్తానంలో ఉండటమూ, ఆయనకు తోడుగా గుళిక ఉండటమూ కళ్ళ ముందు కనపడుతున్న నగ్న సత్యం. కనుక వృత్తి పరంగా, ప్రపంచానికి ఇచ్చిన కమ్యూనికేషన్ పరంగా, నిజం కాని రహస్యం ఖచ్చితం గా దాగి ఉంది అని ఘంటాపథం గా రుజువు అవుతున్నది.

ఇంకా చాలా రకాలుగా పరిశీలించవచ్చు. కాని ఇంక అవసరం లెదు అని అనిపిస్తున్నది.

ఆ రోజు చంద్రునిపైన దిగినట్లు గా నాసా ప్రచారం చేసిన వారు ఇద్దరు. ఒకరు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ మరియు రెండవ వారు ఎడ్విన్ (బజ్) ఆల్డ్రిన్. ఆ ఇద్దరి జాతకాల్లో ఆశ్చర్య కరమైన ఒకే రకమైన కాంబినేషన్ లు కనిపించాయి. అవేమిటొ పైన వివరించాను. ఇద్దరూ కలసి ఒకే పని చేసినప్పుడు అలా కనిపించటం లో ఆశ్చర్యం లేదు. కాని ఫలితం ఇలా సూచితం కావటమే ఆశ్చర్య కరం. ఎన్ని రకాలుగా పరిశీలించినా చివరికి అన్నీ ఒక వైపే వేలు చూపుతూ ఉన్నాయి. ఒక్కటంటే ఒక్కటి కూడా తద్వ్యతిరేక యోగాలు లేవు. ఇప్పుడేమనుకోవాలి?

కాబట్టి చివరికి ఏమి తేలింది? అది నేనెందుకు చెప్పాలి? ఈపాటికి చదువరులకు అర్థం అయ్యే ఉంటుంది కదా. ఇంతా చేసి ఇదంతా నా ఊహాగానం మాత్రమె అని కొట్టి పారేసే వాళ్ళు చాలా మంది ఉంటారని నాకు తెలుసు. అయినా సరే నాకు కనిపించిన దాన్ని నేను వ్రాశాను. ఇంతకూ ముందే వ్రాశినట్లు నిజానిజాలు నాసా వారికి, ఆ దేవునికే ఎరుక.

ఇప్పుడు ఒక మనిషిగా, నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తాను.

వాళ్ళు చంద్రుని మీద దిగినా దిగక పోయినా- ప్రపంచంలో, ముఖ్యంగా ఆఫ్రికా లాంటి పేద దేశాలలో ఆకలితో
చచ్చిపోతున్న వారికీ , చదువుకునే స్తోమత లేక బాల్యాన్ని చాకిరీ లో మగ్గిస్తున్న వారికీ, కట్నాలు ఇచ్చుకోలేక 50 ఏళ్ళొచ్చినా ఇంకా పెళ్ళికాక కన్యలుగానే ఉన్నవారికీ, మందులు కొనుక్కునే స్తోమత లేక రోగాలకు బలైపోతున్న వారికీ, తిండికోసం వ్యభిచారగృహాల్లో మగ్గుతున్నవారికీ....ఇలా అనేకానేక సమస్యలలో కొట్టుమిట్టాడుతున్న వారికి ఒరిగిందేమీ లేదు.

సైన్యం కోసం, ఆయుధ పోటీకోసం లక్షల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టటం, ఉగాండాలో,ఇథియోపియాలో ఆకలితో జనం
చచ్చిపోతున్నా, లక్షలాది టన్నుల గోధుమలు సముద్రానికి ఆహారం చెయ్యటం, ఎంత ఖర్చు చేసారో ఊహకందక పోయినా, చంద్రునిమీద కనీసం నీరు అనేది ఉందా లేదా అనే విషయం ఈనాటికీ చెప్పలెక పోవటం వంటివి మాత్రమే మనం సాధించిన విజయాలేమో? చివరికి సాధించింది ఏమిటి, మనం అడుగు పెట్టి చంద్రుని మీద వాతావరణాన్ని కలుషితం చెయ్యడం తప్ప. ఇవీ నా వ్యక్తిగత అభిప్రాయాలు. వీటికీ జ్యోతిష్య విద్యకూ సంబంధం లేదు.

తరువాత,ఇక ప్రస్తుత విషయానికి వస్తే, ఇదంతా నేను భారతీయ జ్యోతిష్య విద్య ఆధారంగా వ్రాశాను. పాశ్చాత్యులు
కూడా దీనిపైన వ్రాశారు. ఈ విషయంలో పాశ్చాత్య జ్యోతిష్కుల అభిప్రాయం కూడా చూడాలనుకునే వారు ఈ క్రింది లింకు చూడవచ్చు. కాకుంటే వెస్ట్రన్ అస్ట్రాలజీ లో ప్రవేశం లేని వారికి ఆ విశ్లేషణ గందరగోళంగా ఉంటుంది. అస్సలు కొరుకుడు పడదు. కారణం- ఇతర గ్రహాలతో బాటు, డార్క్ మూన్(లిలిత్) మొదలైన గణిత బిందువులను కూడా వారు లెక్కలోకి తీసుకున్నారు. జ్యోతిష్య విద్యలో ప్రవేశం లేనివారికి నేను పైన వ్రాసిన విశ్లేషణ అర్థం కాదు. కాని ఓపెన్ మైండ్ ఉండి, జ్యోతిష్య జ్ఞానం కలవారికి నా ఈ వ్యాసం విందు భోజనమే అవుతుంది. ఇంకా ఆసక్తి ఉన్నవారు ఈ క్రింది లింకు చూడవచ్చు.

http://www.zimbio.com/NASA/articles/Hgt3af2Ex4G/fake+moon+landing+astrologer+skeptics+సి