నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

9, ఫిబ్రవరి 2010, మంగళవారం

Timelessness


నేను గుంటూరుకు వస్తే తమ్ముళ్ళు వచ్చి కూచుంటారు. నా స్నేహితులకందరికీ నేను అన్నగారినే. పాపం వాళ్ళూ వాళ్ళ ఉద్యోగాలు ఇతర పనులతో బిజీగా ఉండేవాళ్ళు. కాని అభిమానంతో నన్ను చూడాలని మాట్లాడాలని వస్తారు. పోసుకోలు కబుర్లు ఉండవు కనుక నాకూ వాళ్ళతో మాటలు బాగానే ఉంటాయి. కాకుంటే మా శ్రీమతికీ పిల్లలకూ ఇబ్బంది. కుటుంబంతో గడిపే కొద్ది సమయం స్నేహితులు కాజేస్తున్నారని శ్రీమతి బాధ పడుతుంది. ప్రతిసారీ మార్షల్ ఆర్ట్స్ లో కొత్త టెక్నిక్స్ నేర్పుతానని చెప్పటమే గాని నేర్పటం లేదని మా అబ్బాయి బాధ. 

నిన్న తమ్ముడు చరణ్ వచ్చి కలిశాడు. పిల్లలూ, చదువులూ, ఇతర మామూలు మాటలు సాగుతున్నాయి. మాటలమధ్యలో ఉన్నట్టుండి ఒక బాంబులాంటి ప్రశ్న అడిగాడు.

అన్నగారూ.Timelessness గురించి మీకేమన్నా తెలుసా?

తనెప్పుడూ ఇంతే. బయటకు ఒక టాపిక్ మాట్లాడుతున్నా, లోపల ఒక ఆధ్యాత్మిక చానల్ ఎప్పుడూ నడుస్తూ ఉంటుంది. ఇలాంటి ప్రశ్నలు సర్వ సాధారణంగా అడుగుతుంటాడు.

"ఇంతకీ నీ సందేహం ఏమిటో సరిగ్గా చెప్పు." అన్నాను.

"ఈ timelessness concept ఊహకు అందటం లేదు. కాలం లేని స్థితి ఎలా ఉంటుంది? అసలు అటువంటి స్తితిఉంటుందా? ఉంటె ఆ స్తితిలో ఏమి ఉంటుంది? కాలం లేనప్పుడు ప్రపంచం కూడా ఉండదు కదా .ఆ స్తితి ఎలా ఉంటుంది. " అడిగాడు.

"అది మనసుకు అందుతుందని ఎలా అనుకుంటున్నావ్?" అడిగాను.

"ఎందుకందదు? ప్రతిదీ మనస్సుకు అర్థం కావాలి కదా".

"అట్లాంటి రూలేమీ ఈ సృష్టిలో లేదు. మనస్సుతో అందుకోలేని విశేషాలు చాలా ఉన్నాయి. మనస్సుకు పైన చాలా planes ఉన్నాయి. ఉదాహరణకి కలలు లేని గాఢ నిద్రలో నీకు టైం సెన్స్ ఉందా?" రమణ మహర్షి గారి బ్రహ్మాస్త్రం వదిలాను.

కాసేపు ఆలోచించాడు. "లేదు"

"అదే నీవడిగిన స్తితి. మైండ్ ఉంటే టైం ఉంటుంది. మైండ్ లేకుంటే టైం ఉండదు.So mindlessness is timelessness. ఇక్కడ నీకొక డౌటు రావాలి. అంటే పిచ్చివాల్లకు మైండ్ ఉండదు కనుక వాళ్ళు టైం లెస్ స్టేట్ లో ఉన్నట్లా? అని. వాళ్ళుసామాన్య మనస్సుకు (ordinary mind) కింద స్థాయికి పోతారు. వాళ్ళు కూడా ఒక విధమైన టైం లెస్ స్టేట్ లో ఉన్నట్లే. కాని అది చీకటితో నిండిన అయోమయ స్థితి. యోగులు మనస్సును అధిగమించి, దాటి పైకి పోతారు. They rise above the mind. వాళ్ళు అన్నీ క్లియర్ గా చూడ గలుగుతారు. అది వెలుగు తో నిండిన ప్రపంచం. అక్కడ మన time co-ordinates పని చెయ్యవు. ఆ ప్లేన్ లోకి అడుగుపెడితే నీవడిగిన స్తితి ఏమిటో తెలుస్తుంది." అన్నాను.

"అది ఊహకు అందటం లేదు". అన్నాడు.

"సహజమే కదా. మనసుకు అతీతమైన స్తితి మనసుతో ఎలా ఊహించగలవు? అది సాధ్యం కాదు. నువ్వు దాన్ని అర్థంచేసుకోలేవు. ఊహించలేవు. కాని ఆ స్తితిలో ఉండగలవు. దానిలో లీనం కాగలవు. కాని ఇక్కణ్ణించి ఆ స్తితి ఎలాఉంటుందో ఊహించి తెలుసుకోలేవు.గుంటూర్లో ఉండి హిమాలయాలలో వేల అడుగుల ఎత్తున ఎలా ఉంటుందో ఊహించగలవా?ఇదీ అంతే. అర్థమయింది కదూ." అన్నాను.

"అంటే దాన్ని అర్థం చేసుకోవాలంటే ప్రస్తుతం ఉన్న అయిదు సెన్సెస్ కాకుండా ఆరు, ఏడు సెన్సెస్ ఇంకా ఏవైనా కావాలా?" అడిగాడు.

"అలా కాదు. అది సెన్సెస్ కు అతీతమైన స్తితి. ఇంద్రియాతీత స్తితి అని వేదాంతం చెప్పింది ఇదే. దాన్నే తురీయం అన్నారు. దాన్ని ఏ సేన్సూ పట్టుకోలేదు. "యతో వాచో నివర్తన్తే అప్రాప్య మనసా సహా" ( ఏ స్తితిని అందుకోలేక వాక్కు మొదలైన ఇంద్రియములన్నీ, మనస్సుతో సహా వెను తిరుగుతున్నాయో) అని కఠోపనిషత్తు చెప్పింది ఈ స్థితి గురించే.

చరణ్ కు ఇంకా సంతృప్తిగా లేదు. ఏదో వెలితిగానే ఉంది. నేను చెపుతున్నది నిజం కాదేమో అని అనుకుంటున్నాడు. అతని ఉద్దేశం సిక్స్త్ సెన్స్ ను డెవెలప్ చేసుకుంటే దాన్ని అర్థం చేసుకోవచ్చని.అతని సందేహం నాకు అర్థం అయింది.

"సరే ఆ కొత్త సెన్సెస్ డెవెలప్ చేసుకొని చూడు. నీకే తెలుస్తుంది. అప్పుడు చెప్పు నేను చెప్పింది నిజమో అబద్దమో. ఎన్నిసెన్సెస్ వచ్చినా అవన్నీ టైం ఫ్రేం లోపలే ఉంటాయి. టైం లెస్ స్తితి సెన్సెస్ కు మైండ్ కు అతీతమైనది. ఇది నేను చెప్తున్నది కాదు. వేదం, ఉపనిషత్తులూ, యోగ విజ్ఞానమూ అన్నీ ఈ మాటనే చెప్తున్నాయి. మనంచెయ్యల్సింది మనస్సుతో తర్కిస్తూ ఆలోచిస్తూ దాన్ని అందుకోవాలని చూడటం కాదు. మనస్సును అధిగమించే ఉపాయం కనుక్కొని దాన్ని ఆచరించి ఇంద్రియాతీతసీమలో నీవంతట నీవే అడుగుపెట్టి చూడు. అప్పుడు నీకు ప్రత్యక్షానుభూతి ద్వారా అన్ని సందేహాలూ నివృత్తి అవుతాయి. అంత వరకూ ఈ మధనం తప్పదు." అన్నాను.

"అంతేనంటారా" అంటూ చరణ్ సెలవు తీసుకున్నాడు.