Pages - Menu

Pages

12, మార్చి 2010, శుక్రవారం

బంధ త్రయం

హఠ యోగములో చాలా రకములైన ముద్రలు బంధములు ఉన్నాయి. వీటన్నింటి పరమ ప్రయోజనం ఏమనగా, ప్రాణాపాన వాయువులను ఏకం చెయ్యటం ద్వారా నిద్రాణ స్థితిలో ఉన్న కుండలినీ శక్తిని జాగృతం చేసి, ఆ శక్తినిషట్చక్రములగుండా ఊర్ద్వగామినిని జేసి శిరస్సులో ఉన్న సహస్ర దళ పద్మమువరకు చేర్చుటయే.ఈ క్రియలన్నింటిలోబంధ త్రయం అనబడే మూడు బంధములు చాలా ముఖ్యమైనవి. అవి మూలబంధము, ఉడ్డియాణ బంధము,జాలంధరబంధము.

వీటిని గురించి హఠయోగ ప్రదీపిక, ఘేరండ సంహిత, శివ సంహిత మొదలగు యోగ గ్రంధములు వివరంగా వర్ణించాయి. ఇవి గాక మంత్ర, తంత్ర రహస్య దీపిక అయినట్టి లలితా సహస్ర నామావళి వీటిని గురించి ఇలా చెప్పింది.

కామేశ్వర ప్రాణ నాడీ కృతజ్ఞా కామ పూజితా
శృంగార రస సంపూర్ణా జయా జాలంధర స్థితా
ఓడ్యాణ పీఠనిలయా బిందు మండల వాసినీ
రహొయాగ క్రమారాధ్యా రహస్తర్పణ తర్పితా

ఈ మంత్ర్ర శ్లోకములలో, రహో యాగము అనబడే ఒక రహస్య ప్రక్రియ నిగూఢంగా సూచించబడింది. ఇది గురుముఖతా మాత్రమే నేర్చుకోవలసి ఉంది.

"కామేశ్వర ప్రాణ నాడీ కృతజ్ఞా కామ పూజితా" అనే మంత్రములో హఠయోగ ప్రక్రియ అయిన మూల బంధముసూచింప బడుతున్నది. "శృంగార రస సంపూర్ణా జయా జాలంధర స్థితా" అనే మంత్రములో జాలంధర బంధముసూచింప బడుతున్నది. "ఓడ్యాణ పీఠనిలయా బిందు మండల వాసినీ" అనే మంత్రములో ఉడ్డియాణ బంధముసూచింప బడుతున్నది. వెరసి ఈ మూడు క్రియలూ ఒక క్రమంలో మంత్ర, ధ్యాన పూరితంగా చేసే క్రియనేరహోయాగము అని అంటారు. దీని వలన కలిగే ఫలితాలు ఏమిటి?

మూల బంధమువల్ల మనిషిలోని కామ శక్తి అదుపులోకి వస్తుంది. బ్రహ్మచర్య పాలన చేయాలనుకునే వారికిమూలబంధ సాధన అత్యంత ప్రయోజనకారిగా ఉంటుంది. దీనివల్ల సాధకునిలోని కామము తన సహజ చాపల్యమునువదలి, అంతర్ముఖముగా మారి, శ్రరీరములో ప్రాణ శక్తిగా స్థితురాలై ఉన్నటువంటి దేవిని అనగా కుండలినీ శక్తినిఆరాధించడం మొదలు పెడుతుంది. బాహ్యముగా ప్రవహించి వృధా అయిపోతున్న తనను నిగ్రహించుకోగలిగినందుకుసాధకునికి కామశక్తి కృతజ్ఞురాలై ఉంటుంది. ఈ ప్రక్రియనే రహస్య నామములు " కృతజ్ఞా కామ పూజితా" అనేమంత్రము ద్వారా సూచించాయి. అంతే గాక ఈ ప్రక్రియ వల్ల "కామేశ్వర ప్రాణ నాడీ" అనబడు సుషుమ్నా నాడి జాగృతంఅవుతుంది. మూసి ఉన్న సుషుమ్నా ద్వారం తెరుచుకుంటుంది. దీనివల్ల సాధకునికి అనేక దర్శనాలు కలుగుతాయి. హార్మోన్ సిస్టంలో మార్పులవల్ల శరీరంలో అనేక ఊహించని మార్పులు వస్తాయి.

ఓడ్యాణ బంధము లేక ఉడ్డియాణ బంధము అనబడే ప్రక్రియ వల్ల శరీరములొని క్రింది భాగాలలో ఉన్నటువంటి ప్రాణ శక్తిఊర్ధ్వ గామిని అవుతుంది. అందువల్లనే దీనికి ఉడ్డియాణ బంధము అనే పేరు వచ్చింది. మూల బంధమువల్లప్రాణాపాన వాయువులు ఒకటౌతాయి. సుషుమ్నా నాడి తెరుచుకుంటుంది. క్రియ వల్ల సుషుమ్నా నాడి లో ఉన్న షట్చక్రములు ఉత్తేజితములౌతాయి. అనుకోని అద్భుత దేవతా దర్శనాలు సాధకునికి కలుగుతాయి. కొత్త కొత్త నాడీ కేంద్రములు ఉత్తేజితములవటం వల్ల శరీరంలో కొత్త శక్తులు అందుబాటులోకి వస్తాయి. అతీంద్రియ శక్తులు మేలుకొంటాయి. ఉడ్డియాణ బంధము వల్ల కుండలిని ఊర్ధ్వ గామిని అయి సుషుమ్నా నాడి గుండా ప్రయాణిస్తుంది. అలా ప్రయాణం చేసి మెదడుకు చేరడం వల్ల సాధకుని శరీర రసాయన పొందిక మొత్తం మార్పుకులోనవుతుంది.మెదడులోని రెండు హెమిస్ఫియర్స్ మధ్య ఉన్న చిన్న బ్రిడ్జి వంటి అతుకు పెద్దదై మెదడు మొత్తం ఒకేయూనిట్ గా మారడం వల్ల, నిద్రాణంగా ఉన్న మెదడులోని అనేక భాగాలు మేల్కొంటాయి. దీనివల్ల అతీత లోకాలదర్శనం, out of the body experience వంటి అలౌకిక అనుభవాలు కలుగుతాయి. లైంగిక శక్తి అయిన బిందువుక్రింది నుంచి పైకి ప్రయాణం చేయటం వల్ల, "నాద- బిందు- కళ" లనబడే మూడు స్థాయిలలో ఒకటైన బిందువు అన్నస్థితికి ఈ శక్తి చేరుకుంటుంది. ఈ రహస్యాన్నే "బిందుమండల వాసినీ" అంటూ ఈ మంత్రం సూచనాత్మకంగా తెలిపింది.

జాలంధర బంధము అనే క్రియ వల్ల పైకి ప్రయాణం చేసిన కుండలినీ శక్తి తిరిగి క్రిందకు జారకుండా శిరస్సులోఆపబడుతుంది. బాగా సాధనలో అనుభవం ఉన్న సాధకులు అయితే ఈ క్రియ వల్ల శక్తిని ముఖం యొక్క ముందుభాగం ద్వారా క్రిందకు ప్రయాణింపజేసి తిరిగి హృదయ స్థానానికి తీసుకు రాగలుగుతారు. ఇది చాలా ఉన్నత తరగతికిచెందిన సాధన మరియు చాలా కష్ట సాధ్యమైన క్రియ. ఈ ప్రక్రియ వల్ల " శ్రృంగార రస సంపూర్ణా" అనబడే transcendental bliss అందుబాటులోకి వస్తుంది. సాధారణంగా ప్రపంచమంతా దేనికోసంవెంపర్లాడుతుందో, ఆ orgasmic bliss అనే క్షణికానందానికి ఎన్నో మిలియన్ల రెట్లు ఎక్కువైన మరియు స్వచ్చమైన ఆనందాన్ని ఈ "శ్రృంగార రస సంపూర్ణా" అనబడే స్థితి ఇస్తుంది. అంతే గాక ఈ స్థితికి చేరిన సాధకుడు ప్రపంచములోనిఅన్నింటినీ జయించగలుగుతాడు కనుక "జయా" అని ఈ మంత్రము సూచిస్తుంది.

ఈ మూడు క్రియలనూ చెయ్యగలిగినప్పుడు అది రహోయాగము అనబడు రహస్య యోగ ప్రక్రియ అవుతుంది. ఈరహస్యాన్ని " రహొయాగ క్రమారాధ్యా రహస్తర్పణ తర్పితా" అన్న మంత్రం సూచిస్తున్నది. ఇక్కడ ఉన్న ఇంకొక యోగరహస్యం ఏమనగా, మనం బాహ్యంగా చేసే ఏ తర్పణమైనా పైనుంచి క్రిందకు వదులుతాము. కాని రహస్తర్పణము అనబడే ఈ తర్పణము మాత్రం శరీరం లోపల జరుగుతుంది. బాహ్య ప్రక్రియకు భిన్నంగా ఇది క్రిందనుంచి పైకి వ్యతిరేకదిశలో జరుగుతుంది. క్రింది నుంచి పైకి శక్తి రూపంగా ప్రవహించి సహస్రార కమలంలో ఉన్న నిత్య బోధ స్వరూపుడైన పరమ శివుని అభిషేకిస్తుంది.

ఈ ప్రక్రియ ఎటువంటి సిద్ధిని సాధకునికి కలుగజేయగలదో తరువాతి మంత్రం చెబుతుంది.

సద్య: ప్రసాదినీ విశ్వ సాక్షిణీ సాక్షివర్జితా
షడంగ దేవతా యుక్తా షాడ్గుణ్య పరిపూరితా

ఇది "సద్య ప్రసాదిని", అనగా తత్క్షణమే సిద్దిని కలిగించగలట్టి క్రియ. "విశ్వ సాక్షిణీ" విశ్వము నంతటినీ మనో నేత్రంతోసాధకునికి దర్శింపచేస్తుంది. "సాక్షివర్జితా" ప్రపంచాతీత నిర్గుణ స్థితికి సాధకుని తీసుకు పోతుంది. "షడంగ దేవతాయుక్తా", షట్చక్ర దేవతలైన పంచభూతములు, మనస్సు సాధకుని సర్వదా ప్రసన్నంగా కాచుకొని ఉంటాయి. "షాడ్గుణ్యపరిపూరితా" ఈ ఆరు శక్తుల యొక్క గుణములు పరిపూర్ణముగా సాధకునికి ధారాదత్తం అవుతాయి. అనగా శివ శక్తుల కుమారుడైన షణ్ముఖునిగా సాధకుడు పరివర్తనం చెందగలడు. అనగా భూమిమీద నడిచే దేవతగా మారగలడు.

ఇట్టి అద్భుత స్థితికి సాధకుని తీసుకుపోగల శక్తి ఈ యోగ క్రియలకు ఉన్నది. కాకపోతే పట్టుదలగా సాధన చేసేవారు, సాధనలో ఆటంకాలను, ప్రమాదాలను జాగ్రత్తగా అధిగమిస్తూ ముందుకు పోయేవారు చాలా అరుదుగా ఉన్నారు. అదివేరే విషయం. ఈ క్రియలను గురుముఖంగా నేర్చుకోని సాధన చేస్తే మానవ పరిణామ క్రియ అతి త్వరితంగా జరిపిస్తుంది. దీనిని అంతర్గత పరుసవేది విద్య అని పిలువవచ్చు. క్షుద్ర లోహం అయిన ఇనుము, పరుసవేదిని తాకి బంగారుగా ఎలా మారుతుందొ అలాగే ఈ Inner Alchemy అనబడే అంతర్గత పరుసవేది విద్య సాధారణ మానవుని దేవతగా మార్చగల శక్తిని కలిగి ఉన్నది. మన యోగ శాస్త్రం ఇట్టి రహస్య ప్రక్రియలకు కాణాచి. లలితా సహస్ర నామములలో ఎన్నో ఇట్టి రహస్య ప్రక్రియలు నిగూఢంగా ఉన్నాయి.