నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

24, మార్చి 2010, బుధవారం

శ్రీ రామ చంద్రుని దివ్య జాతకం



ఒక జాతకాన్ని చూడటంతోనే అది దివ్య జాతకమా లేక మానవ జాతకమా చెప్పటానికి కొన్ని నియమాలు ఉన్నాయి. పశు స్థాయికి చెందిన వారి జాతకాలు ఒక విధంగా ఉంటాయి. మామూలు మనుషుల జాతకాలు ఇంకొక రకంగా,కొంత మెరుగ్గా ఉంటాయి. మహా పురుషుల జాతకాలు దీనికి భిన్నమైన యోగాలతో, ఉన్నతంగా ఉంటాయి. అవతార మూర్తుల జాతకాలు ఇంకా మహోన్నతమైన యోగాలతో కూడి ఉంటాయి. ఇటువంటి అవతార మూర్తుల కోవకి చెందినదే మన దేశపు ఆరాధ్య దైవం అయిన శ్రీరామచంద్ర ప్రభుని జాతకం. జ్యోతిర్విజ్ఞానం ఏమాత్రం ఉన్నవారైనా జాతకాన్ని చూడటంతోనే ఒకే మాట చెప్పగలరు--" ఇది ఒక మహత్తరమైన దివ్యపురుషుని జాతకం గాని మామూలు మనిషి జాతకం కాదు".

మహర్షి వాల్మీకి కి ప్రపంచం ఎంతగా ఋణపడి ఉన్నదో ఊహించటం కష్టం. అనన్య సామాన్యమైన శ్రీమద్రామాయణ రచన చెయ్యటమే గాక, రామాయణంలో ఆయా సంఘటనలు జరిగినప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి గ్రహస్థితులను, నక్షత్ర స్థితులను ఆయన వివరంగా వర్ణించాడు. ఆయా గ్రహస్థితులు కొన్ని వేల వత్సరాలకు గాని రానివి కొన్ని ఉన్నాయి. దానిని బట్టి రామాయణ కాలం దాదాపు క్రీ పూ 7300 అని కొందరు జ్యొతిష్య పరిశోధకులు నిర్ణయించారు. ప్రతి విషయానికీ ఉన్నట్లే, విషయంలో కూడా వాద ప్రతివాదాలున్నాయి. వివరాలు మళ్ళీ చర్చిద్దాం. ప్రస్తుతానికి శ్రీ రామచంద్రుని దివ్య జాతకంలో ఉన్న విశేషాలు మాత్రం చూద్దాం.

వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణ మహాకావ్యంలో శ్రీరామచంద్రుని జన్మ సమయాన్ని ఇలా వర్ణించాడు. బాలకాండ 18 అధ్యాయంలో 8,9,10,11 శ్లోకములు చూద్దాము.

శ్లో|| తతో యజ్ఞే సమాప్తే తు ఋతూనాం షట్ సమాత్యాయు:||
తతశ్చ ద్వాదశే మాసే, చైత్రే,నావమికే తిథౌ ||

నక్షత్రే2దితి దైవత్యే, స్వోచ్చ సంస్థేషు పంచషు||
గ్రహేషు, కర్కటే లగ్నే వాక్పతా ఇందునా సహా ||

ప్రోద్యమానే జగన్నాధమ్, సర్వలోక నమస్కృతమ్||
కౌసల్యా జనయద్రామమ్, సర్వలక్షణ సంయుతమ్ ||

విష్ణోరర్ధమ్ మహాభాగమ్ పుత్రమైక్ష్వాకు నందనమ్ ||
లోహితాక్షమ్ మహాబాహుమ్ రక్తోష్టమ్ దుందుభి స్వనమ్ ||

అర్థము:
యజ్జము సమాప్తి అయ్యిన తదుపరి ఆరు ఋతువులు గడిచాయి. అప్పుడు పన్నెండో మాసమున, చైత్ర నవమి తిథి రోజున, అదితి దేవత అధిపతి అయిన పునర్వసు నక్షత్రమున, అయిదు గ్రహములు తమతమ ఉచ్చ స్థానములలో ఉండగా, కర్కాటక లగ్నమున, వాక్ పతి చంద్రునితో కలసి ఉండగా,జగత్తులకు నాధుడు, సర్వలోకములచే నమస్కరింపబడువాడును, సర్వ శుభ లక్షణ సంయుతుడును, విష్ణువు యొక్క అవతారమైనవాడును, మహనీయుడును, ఇక్ష్వాకు కులమునకు ఆనందకరుడును, ఎర్రని కన్నులు కలవాడును,గొప్ప బాహువులు కలవాడును, ఎర్రని పెదవులు కలవాడును, మంచి కంఠధ్వని కలవాడును అగు రామునకు కౌసల్యాసతి జన్మ ఇచ్చినది.

చిన్న శ్లోకములో వాల్మీకి మహర్షి మహత్తరమైన జ్యోతిష వివరాలనే గాక, సాముద్రిక వివరాలను, ఇస్తూ తద్వారా శ్రీరాముని దివ్యమైన వ్యక్తిత్వాన్ని మనకు చూపిస్తున్నాడు.

శ్రీరామచంద్రుని జాతకమున, అయిదు గ్రహములు-అనగా-రవి,కుజ,శుక్ర,గురు,శని గ్రహములు- ఉచ్చ స్తితిలొ ఉన్నాయి. లగ్నమున లగ్నాధిపతియగు చంద్రునితో కలసి గురువు ఉచ్చ స్తితిలో ఉండి గజకేసరీ యోగాన్ని ఇస్తున్నాడు. ఇతర స్వల్ప యోగములను అటు ఉంచితే, కుజుడు, గురువు, శనులు వరుసగా ఇచ్చేటటువంటి రుచక, హంస,శశ మహాపురుష యోగాలను జాతకంలో చూడవచ్చు. వీటిలో ఒక్కటి ఉంటే జాతకుడు గొప్పవాడు అని చెప్పవచ్చు. అటువంటి మూడు మహాపురుష యోగాలు కలసి ఇక్కడ ఉన్నాయి. అయిదు గ్రహాలు ఉచ్చ స్తితిలో ఉన్నాయి. ఒక్క రాహు కేతువులు మాత్రం ఒక సిద్ధాంతం ప్రకారం నీచలో ఉన్నాయి. బహుశా అందువల్లనే ఆయన జీవితం కష్టాల పరంపరలో గడిచింది.

లగ్నంలోని హంస గజకేసరీ యోగాలవల్ల, మహాపురుషుడును, మంచి ఖ్యాతి గలవాడు,మంచి మనస్సు, మంచి వాక్కు,మంచి ప్రవర్తన కలవాడు జాతకుడు అని సూచిస్తున్నాయి.

నాలుగింట శని ఉచ్చ స్థితివల్ల,మంచి ధార్మికమైన మనస్సు, నీతి నియమ పూర్వక ప్రవర్తన కలవాడని తెలుస్తున్నది. ధర్మపరమైన సుఖాలను మాత్రమే అనుభవించువాడు అని సూచితం. తల్లికి భోగ భాగ్యాలతో కూడిన జీవితం ఉన్నప్పటికీ మనశ్శాంతి మాత్రం ఉండదు అని తెలుస్తున్నది.

ఏడింట ఉచ్చ యోగకారక కుజునివల్ల, బలవంతులైన శత్రువులు, పతివ్రత యగు మహా సాధ్వి భార్యగా లభించుట, వివాహ జీవితంలో సుఖం లోపించుట కలిగాయి.

పదింట ఉచ్చ రవి వల్ల ధర్మ పరిపాలన చేసే న్యాయమూర్తి అని, రాచ కుటుంబానికి చెందినవాడని, సూర్య వంశమనీ సూచింపబడుతున్నది.

తొమ్మిదింట ఉచ్చ శుక్రునివల్ల, ఆయన మీద లగ్న గురుని దృష్టివల్ల, ధర్మంతో కూడిన భోగ జీవితం గడపిన గొప్ప పూర్వీకులు కలిగినవాడని, దాన ధర్మాదుల యందు ఆసక్తి కలిగిన ఉదార స్వభావుడని, ధార్మిక జీవితం గడుపుతాడని, అవతార మూర్తి యని సూచింపబడుతున్నది.

మహర్షి వాల్మీకి తన శ్లోకాలలో, కొన్ని సాముద్రిక లక్షణాలను చెప్పి ఉన్నాడు. శరీర లక్షణాలను బట్టి మనస్తత్వాన్ని, భవిష్యత్తునూ అంచనా వేసే శాస్త్రమే సాముద్రిక శాస్త్రం. ఎర్రని కండ్లు,ఎర్రని పెదవులు,మంచి కంఠధ్వని ఈ మూడూ మంచి రక్తపుష్టికి, మంచి ఆరోగ్యానికి, చక్కని శరీర ధాతువులకు సూచికలు. గొప్ప బాహువులు అని చెప్పటంలో ఆజానుబాహువులు అని అర్థం కావచ్చు. ఎందుకనగా చిన్నపిల్లవానికి వీరులకుండే గొప్ప బాహువులు ఉండవు. ఆజానుబాహువులు గొప్ప కార్య శూరత్వానికి సూచికలు. కోతుల సాయంతో మహా రాక్షసులచేత రక్షింపబడుతున్న వైభవ పూరిత లంకా నగరాన్ని జయించటం కార్య శూరత్వం కాక మరేమిటి?

రామాయణంలోని జ్యోతిష సూచనలను, ఆయా ఘట్టాలను, శ్రీరాముని జీవితంలోని దశలను తులనాత్మక పరిశీలన చేస్తూ ఒక గ్రంధమే వ్రాయవచ్చు.

అవతార మూర్తులను సూచించే గ్రహస్థితులు, యోగాలు శ్రీరాముని జాతకంలోనూ, శ్రీ కృష్ణుని జాతకంలోనూ, శ్రీ రామకృష్ణుని జాతకంలోనూ మాత్రమే నేను పరిశీలించగలిగాను. మిగిలిన మహాపురుషుల జాతకాలలో గొప్ప యోగాలు ఉన్నాయి కాని, అవతార పురుషుల జాతకాల స్థాయిలో లేవు.

జ్యోతిష విజ్ఞాన రీత్యా, నేడు భగవంతుని అవతారాలుగా కొలవబడుతున్న మహనీయులు చాలామంది నిజానికి మహనీయులే కాని అవతార మూర్తులు కారు అని చెప్పటం సాహసం అనిపించుకోదు. కనుక వారిని మహాపురుషులని అనవచ్చు గాని అవతార మూర్తులని అనకూడదు.

ఇంకా కొన్ని వివరాలు వచ్చె వ్యాసంలో చూద్దాము.