Pages - Menu

Pages

7, మే 2010, శుక్రవారం

గుడ్ బై రాయలసీమ!!! ప్రస్తుతానికి

రాయల సీమకు ప్రస్తుతానికి గుడ్ బై చెప్పి సర్కార్ జిల్లాలలో అడుగు పెట్టాను.రాయల సీమంటే నాకు చాలా ప్రేమాభిమానాలున్నాయి. దానికి అనేక వ్యక్తిగత, యౌగిక, కారణాలున్నాయి.

రాయలసీమ యోగుల భూమి. మహనీయుల భూమి. రాయలసీమలో మనకు తెలిసిన వీర బ్రహ్మం గారు , వేమన యోగి, రాఘవేంద్ర స్వామి, అన్నమయ్య, మొదలైన వారు కొందరే. ప్రపంచానికి తెలియని తిక్క లక్ష్మమ్మ, ఎర్రితాత, కాశి నాయన వంటి యోగులు, మస్తాన్ బాబా, షేక్ షావలి, షాషావలి వంటి సూఫీ సాధువులు కొల్లలుగా ఉన్నారు. తెలియని సిద్ధులు,యోగులు, మహాత్ములు ఎందరో ఉన్నారు. పల్లెల్లో కొందరిని కదిలిస్తే, చాలా చదువుకున్నామని విర్రవీగే మనకు కళ్ళు తిరిగే వేదాంతాన్ని అతి కొద్ది మాటలలో చెప్తారు. అది జీర్ణించుకోవడానికి మనకు రోజులు పడుతుంది.

ఈ నేలను నేను అభిమానించడానికి ఇంకొక కారణం- అచ్చమైన, చిక్కని, ఇంగ్లీషు వాసన సోకని, తెలుగు భాష ఇక్కడి పల్లె పట్టులలో వినిపిస్తుంది. ముఖ్యంగా కడప జిల్లాలోని పల్లెల్లో వినిపించే తెలుగు పదాలను నేను చాలా ఇష్టపడతాను. అక్కడి పల్లెప్రజలు మాట్లాడే మామూలు భాష, మామూలు మాటలు ఎంత సేపైనా వినవచ్చు. అంత తీపి ఆ మాండలికంలో ఉంది. వారి మాటలలో పెద్ద విషయం ఏమీ ఉండనక్కరలేదు. కాని, ఆ యాస, భాష, పదాలు వినడం, అదొక వింతైన అనుభూతి ని కలిగిస్తుంది. అలా వింటూ ఉంటే, కాలంలో కొన్ని వందల సంవత్సరాలు వెనక్కు పోతున్నట్లుగా నాకు చాలా సార్లు అనిపించింది.

ఆ కారణాలు ఎలా ఉన్నప్పటికీ ( ఇవి చాలామందికి పిచ్చికారణాలుగా అనిపిస్తాయని నాకు తెలుసు) భౌగోళికంగా, చల్లని కొండ ప్రాంతాలను నేను బాగా ఇష్టపడతాను. జన సమ్మర్దం తక్కువగా ఉన్న పల్లె ప్రాంతాలు మరీ ఇష్టం. ఇక సౌకర్యాల పరంగా చూస్తే, అవసరమైనంతవరకూ అతి తక్కువ సౌకర్యాలు అందుబాటులో ఉంటే నాకు చాలనిపిస్తుంది. సింపుల్ లైఫ్ నాకు చిన్నప్పటినుంచి చాలా ఇష్టం. ఎక్కువ వస్తువులు, హడావుడి, దుమ్ము, పొగ, విలాసాలతో కూడిన సిటీ లైఫ్ ఒక్క రోజుకంటే ఎక్కువకాలం నేను భరించలేను. నాకు నచ్చే ఇటువంటి లక్షణాలు రాయలసీమలో కొన్ని ప్రాంతాలకు ఉన్నాయి. భౌగోళికంగా నా ఇష్టాలకు ఇవీ కారణాలు.

ఇక మనుషులు, వాళ్ళ మనస్తత్వాల పరంగా చూస్తే-- మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు ప్రతిచోటా ఉంటారు.కాని కొన్ని ప్రాంతాలలో అమాయకత్వం(ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లా పల్లెలు), కొన్ని చోట్ల మోసం( సర్కారు జిల్లాలు), కొన్ని ప్రదేశాలలో అతితెలివి(గోదావరి జిల్లాలు), కొన్ని చోట్ల అహంకారం(గుంటూరు,కృష్ణా జిల్లాలు), కొన్ని చోట్ల మూర్ఖత్వం(రాయలసీమ,తెలంగాణ జిల్లాలలో కొన్ని ప్రాంతాలు) ఇలా కొన్ని కొన్ని లక్షణాలు కొన్ని ప్రాంతాలలో, జిల్లాలలో ఎక్కువగా కనిపిస్తాయి. బహుశా దీనికి సామాజికంగా,భౌగోళికంగా,అభివృద్ధిపరంగా అనేక కారణాలుండవచ్చు.

రాయలసీమ ప్రజలు అమాయకులు కారు. కాని, వారిలో ఒకరకమైన మొండితనం తో కూడిన ఋజుస్వభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఏదైనా ఎదురుగా మాట్లాడతారు. ఎదురుగా తేల్చుకుంటారు. స్నేహానికి ప్రాణం పెడతారు. అంటే అందరూ అలాగే ఉంటారని నా అభిప్రాయం కాదు. ఎక్కువమందిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఒక మనిషిని అభిమానిస్తే అది ఎన్ని ఏళ్ళైనా అలాగే గుర్తుంచుకుంటారు. అలాగే శత్రుత్వం కూడా.

ఫ్లోరిన్ ఎక్కువగా ఉన్న నీటిని తాగే ప్రజలలో ఇటువంటి విచిత్ర లక్షణాలను నేను గమనించాను. కొందరిలో ఈ లక్షణాలు చూచినప్పుడు నాకు హోమియో మెటీరియా మెడికాలోని "కాల్కేరియా ఫ్లోర్", "ఫ్లోరిక్ యాసిడ్" ల లక్షణాలు స్పురించేవి. నేను చూచిన కొందరి జాతకాలలో కుజ శనుల పాత్ర ఎక్కువగా గమనించాను. ఈ ప్రాంత లక్షణాలకు, పైనచెప్పిన ఔషధాలు, గ్రహాలకు బలమైన సారూప్యతలు నాకు కనిపించాయి.

నా వరకు ఈ రెండేళ్ళలో, కొందరు మంచి స్నేహితులను,ఎక్కువ మంది అభిమానులను, మరికొందరు బాగా నమ్మకస్తులను సంపాదించుకోగలిగాను. నాకు ఆస్తిపాస్తుల సంపాదనపైన పెద్దగా ధ్యాస ఎప్పుడూ లేదు. ధనం కన్నా స్నేహం, మానవ సంబంధాలే మిన్న అని నమ్మేవాళ్ళలో నేనూ ఒకడిని. పనే దైవంగా రెండేళ్ళు అక్కడ పనిచేశాను. ఎంతో విజ్ఞానమూ, విశాల భావాలూ, చక్కని వ్యక్తిత్వమూ కలిగిన కొందరు ఉన్నతాధికారులతో పనిచేసే అవకాశం ఈ రెండేళ్ళలో నాకు కలిగించినందుకు తిరుమల శ్రీనివాసునికి మనసారా నమస్కరించాను.

హంపి,గుంతకల్లు,ఆదోని,రాయచూరు,మంత్రాలయం,కడప,ఒంటిమిట్ట,ప్రొద్దుటూరు,సిద్ధవటం,ధర్మవరం,ప్రశాంతినిలయం,తిరుమల,చంద్రగిరి,పాకాల,చిత్తూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, ఆ నేల,కొండలు,చెట్లు,విశాల నిర్మానుష్య ప్రదేశాలు నాకు ఆధ్యాత్మికంగా ఎంతో దోహద పడ్డాయి. ఎన్నో అంతరిక అనుభూతులను మిగిల్చాయి.

ఈనాడు కళ్ళు మూసుకుని కొద్ది సేపు కూర్చుంటే, చిత్తూరు నుంచి తిరుమల-కడప -గుంతకల్లు-అనంతపురం-ధర్మవరం-గుత్తి- ఆదోని మీదుగా రాయచూరు వరకూ ఎన్నో ప్రదేశాల మీదుగా ఊళ్ళమీదుగా, కొన్ని వందల కిలోమీటర్లు అలా గాలిలో తేలుతూ కొద్ది సేపట్లో ప్రయాణించగలను. ఆయా ప్రాంతాలు ఇచ్చిన అనుభూతులను అలవోకగా మళ్లీ అందుకోగలను. ప్రదేశాలు అనుభూతులను ఎలా ఇస్తాయి? ఏమిటీ పిచ్చి? అన్న అనుమానం వద్దు. ఇస్తాయి. దానికి ధ్యానాభ్యాసం కావాలి. అది ఉంటే నేను చెబుతున్నది తేలికగా అర్ధం అవుతుంది. లేకపోతే అర్ధం కాదు.

ఒంటిమిట్టలో అలవోకగా ధారాపాతంగా వచ్చిన నూట పదహారు పద్యాలను ఎప్పటికీ మర్చిపోలేను. అటువంటివి ఇప్పుడు రాద్దామని కూర్చున్నా ఆ స్ఫూర్తీ, ధారా రావడం లేదు. అది ఖచ్చితంగా ఆ ప్రదేశ మహిమ మరియు కోదండ రాముని అనుగ్రహం మాత్రమే.

అందుకనే రెండేళ్ళక్రితం రాయలసీమలో అడుగుపెట్టినపుడూ, ఈ నాడు తిరిగి వచ్చేటపుడు ఆ నేలకు వంగి నమస్కరించాను. ఆ మట్టిని కళ్ళకు అద్దుకున్నాను. మొదటిరోజూ చివరి రోజూ కూడా ఆ మట్టిని కళ్లకద్దుకున్నానని ఎవరికీ తెలియదు. చాలా సార్లు ఏకాంత ధ్యానసమయంలో నా కళ్ళవెంట ధారలు కట్టిన కన్నీళ్ళతో ఆ మట్టి తడిసింది.అయితే ఈ విషయాలు, రోజూ నాతో కలిసిమెలిసి తిరిగిన మిత్రులకు, చాలాసేపు అనేక విషయాలు మాట్లాడినవారికి కూడా తెలియవు. వారికి చెప్పవలసిన అవసరం లేదు కనుక చెప్పలేదు. చెప్పినా అందరూ అర్ధం చేసుకోలేరు కనుక చెప్పలేదు.

ఓషో రజనీష్ గారి జీవితంలో ఇలాటిదే ఒక సంఘటన జరిగింది. ఆయన పుట్టిన పల్లెటూరిలో ఒక చెరువు గట్టునో లేక ఆయన స్కూలుకు పోయే దారిలోనో ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టుతో ఆయనకు ఎంతో అంతరిక అనుబంధం ఉండేది. దానితో చాలా సేపు ఆడుకుని తరువాత ఆయన స్కూలుకు పోయేవాడు. ఆయన తన తండ్రి చనిపోయినపుడు కూడా ఏడవలేదు. చాలామంది ఆత్మీయులు పోయినపుడూ ఆయన కళ్ళవెంట నీరు రాలేదు.ఒక డ్రామాను చూస్తున్నట్లు చూస్తూ ఉండిపోయాడు. కాని ఆ చెట్టు కొట్టివేయబడిన రోజున మాత్రం ఆయన ఎంతో సేపు వెక్కి వెక్కి ఏడ్చాడు. మార్మికులందరూ (Mystics) ఒక రకమైన పిచ్చివాళ్ళే. వాళ్ళ ధోరణీ, భాషా వాళ్ళకే అర్ధం అవుతుంది.

చివరిగా ఒక జ్యోతిష్య శాస్త్ర కోణం--మొన్న మూడో తేదీన గురువు కుంభరాశిని వదలి మీన రాశిలోకి అడుగుపెట్టాడు.అదే రోజు నేను హడావిడిగా రాయలసీమను వదలిపెట్టి గుంటూరు జిల్లాకు బదిలీపై రావలసి వచ్చింది. గురు గ్రహం ప్రాముఖ్యత వహిస్తున్న జాతకాలలో మొన్నమూడో తేదీకి అటూ ఇటూగా ముఖ్య సంఘటనలు జరిగి ఉంటాయి.

రాయలసీమలో నా ధ్యానానుభవాలను వీలయితే గ్రంధస్తం చేద్దామని ప్రస్తుతానికి సంకల్పం ఉంది. అయితే, ఇదెంతకాలం నిలిచి ఉంటుందో తెలియదు.