నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

18, మే 2010, మంగళవారం

ఆది శంకరుల జీవితం- జాతకం
















శంకర శ్శంకర స్సాక్షాత్ (శంకరుడు సాక్షాత్తూ పరమేశ్వరుడే)

శ్లో||శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం ||
(వేద వేదాంత పురాణజ్ఞానమునకు ఆలయమైన వాడును, కరుణామూర్తియు, లోకమునకు శుభము చేకూర్చువాడును, భగవంతుని పాదములయొక్క రూపమైనవాడును అగు శంకరులకు నమస్కరించెదను.)

ఈరోజు వైశాఖ శుక్ల పంచమీ పర్వదినం. ఆది శంకరుల పవిత్ర జన్మ దినం.

సనాతన వేద ధర్మం దాదాపు డెబ్బై రెండు శాఖలుగా విడిపోయి, గందరగోళంలో మునిగి, విపరీత వాదనలు చేష్టలతో కునారిల్లుతూ, మహత్తరమైన వేదజ్ఞానాన్ని మరచి ఎవరికి తోచిన సిద్ధాంతాలు వారు అనుసరిస్తూ, ఇదే సరియైన మతం అని భావిస్తూ భారతదేశమంతా రకరకాలైన మతాలతో నిండి, సత్యం మరుగున పడి, వేదధర్మం కొడిగట్టిన సమయంలో, పదహారేళ్ళు శ్రమించి ఒక్క చేతితో పరి్స్థితినంతా చక్కదిద్ది, భారతదేశాన్నంతా ఒక్కత్రాటిపైన నిలిపి, వేదానికి ఉపనిషత్తులకు అసలైన భాష్యం చెప్పి, తన జీవితాన్ని ధర్మ రక్షణకు ధారపోసి, ఘోర తమస్సులో నిద్రిస్తున్న భారతజాతికి వెలుగు బాటతో దిశానిర్దేశం చేసిన మహాపురుషుడు ఆది శంకరులు జన్మించిన మహత్తరమైన రోజు ఇది.

ప్రపంచంలో అవతార మూర్తులు, మహాప్రవక్తలు, కారణ జన్ములు, ఎప్పుడో ఒకసారి మాత్రమే తళుక్కుమని మెరిసి మాయం అవుతుంటారు. వారి కాలానికి వారు కొన్ని వందల వేల ఏళ్ల ముందుంటారు. వేల సంవత్సరాలు గడచిన తరువాత కూడా వారి మహత్వానికి ప్రపంచం సాష్టాంగ ప్రణామం చేస్తూనే ఉంటుంది. వారిలో కొందరు సాక్షాత్తు భగవంతుని అవతారముగా భావింపగల స్థాయి ఉన్నటువంటి వారుంటారు. అటువంటి మహోన్నత స్థాయి కలిగిన మహాపురుషులలో ఆదిశంకరులు ప్రధమ స్థాయికి చెందినవారు. జగద్గురువు అన్న బిరుదు వ్యాసభగవానుని తర్వాత ప్రపంచంలో శంకరులకే చెల్లుతుంది. తరువాతనే మాటను ఇంకెవరికైనా వాడగలుగుతాము.

అసాధారణ జీవితం

మూడేండ్ల వయస్సులో అక్షరాభ్యాసము, అయిదేళ్ళ వయస్సులో భిక్షగా తనకు ఒక ఉసిరికాయను తప్ప ఏమీ ఇవ్వలేని పేదరాలిమీద జాలితో ఆశువుగా కనకధారాస్తోత్రం చెప్పటం, బంగారు ఉసిరికాయల వర్షం కురిపించడం, తల్లి నడవలేకపోతున్నదని తన ప్రార్ధనతో పూర్ణానదిని దారి మళ్ళించి తన ఇంటిపక్కగా ప్రవహించేలా చెయ్యటం, ఎనిమిదేళ్ళకే వేదవేదాంతములను ఔపోసన పట్టి అఖండ పాండిత్యము సంపాదించడం, చిట్టివయసులో వైరాగ్య పరిపూర్ణుడై ప్రపంచాన్ని త్యజించి సంన్యాసమును స్వీకరించడం, అంత చిన్న వయసులోనే రవాణా సౌకర్యములు లేని క్రీపూ 509 లో కేరళ నుండి హిమాలయాలకు ఒక్కడే పయనమై ఇల్లువదలి పోవడం, పదహారేళ్ళకే ప్రస్థానత్రయం అనబడే బ్రహ్మ సూత్రములు, పది ఉపనిషత్తులు, భగవద్గీతలకు అద్భుతమైన భాష్యం వ్రాయడం( భాష్యాన్ని అర్ధం చేసుకోడానికి ఈనాటికీ మహాపండితులైనవారు కూడా తల్లకిందులుగా తపస్సు చేయవలసి వస్తుంది), కేరళ నుంచి టిబెట్ లోని కైలాస పర్వతం వరకూ,ద్వారక నుంచి అస్సాంవరకూ,అక్కడనుంచి తిరిగి కన్యాకుమారి వరకూ కాలినడకన పర్యటించి భారతదేశం అంతటా 72 రకాలైన భిన్న మతస్థులలో కొమ్ములు తిరిగిన మహా పండితులతో వాదించి గెలిచి ఆసేతుహిమాచల పర్యంతం అద్వైత స్థాపన చెయ్యడం, కాశీలో పరమేశ్వరుని దివ్య దర్శనాన్ని పొందడం,అక్కడే వ్యాస భగవానుని దర్శనాన్ని పొంది తన వేదాంత భాష్యం అన్ని భాష్యములలోనికి అత్యుత్తమమైనదన్న మాట ఆయన నోట వినడం, అద్భుత యోగ శక్తులను అవలీలగా ప్రదర్శించడం, ఆరు మతములను ధృవీకరించి "షణ్మత స్థాపనాచార్య" అన్న బిరుదును పొందడం, కాశ్మీరంలోని సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించి సర్వజ్ఞుడు (సమస్త జ్ఞానమూ తెలిసినవాడు) అన్న సార్ధక నామధేయమును పొందడం, దేశం మొత్తంమీద గల అనేక దేవాలయాలలో మహిమాన్విత యంత్రములు స్థాపించి ఉగ్ర దేవతలను శాంత మూర్తులుగా మార్చడం, ధర్మ రక్షణకై భారతదేశం నాలుగు మూలలా నాలుగు మఠాలను స్థాపించి తన శిష్యులను అక్కడ ఉండమని ధర్మరక్షణ చెయ్యమని ఆదేశించి తాను కంచి మఠానికి చేరి తన 32 ఏట దేహ త్యాగం చెయ్యటం -- ఇవన్నీ ఒక మామూలు మనిషి చెయ్యగలడా అని ప్రశ్నించుకుంటే, ముమ్మాటికీ చెయ్యలేడు గాక చెయ్యలేడు అని జవాబు వస్తుంది.

మహోత్తమ విశిష్ట దివ్య పురుషుడైనవాడే ఘనకార్యాలను సాధించగలడు,ఇంతటి మహాపాండిత్యము, ఉత్తమసంస్కారము, అపార మేధాసంపత్తి, కరుణాహృదయము, దివ్యశక్తులు, సదాచారపరాయణత్వము, వివేక వైరాగ్యములు, బ్రహ్మజ్ఞానసంపద, ధర్మస్థాపనా దక్షత ఒక్క మనిషిలో చూడాలంటే ప్రపంచం మొత్తం మీద మానవ చరిత్రలో ఎంత వెతికినా ప్రవక్త లోనూ స్థాయిలో లక్షణాలు కనిపించవు. అందుకనే "శంకర శ్శంకర స్సాక్షాత్" అని అన్నారంటే మాటను ఊరకనే అనలేదు. మహనీయుని కన్నటువంటి "శివగురు, ఆర్యాంబ"లు ఎంతటి ధన్యాత్ములో ఎంతటి పుణ్యాత్ములో కదా అని అనిపిస్తుంది.

శంకరుల జనన తేదీ

ఇతర మహాపురుషుల వలెనే శంకరుల జనన తేదీమీద కూడా ఖచ్చితమైన వివరాలు లేవు. మన జాతి ఎంతటి దౌర్భాగ్య స్థితికి దిగజారిందంటే, సాక్షాత్తూ భగవంతుడే మన మధ్యన జన్మించినా ఆయన జనన సమయాన్ని మనం భద్రపరచం. ఆయన జీవితాన్ని మనం లెక్కలోకి తీసుకోం. ఆయన పుట్టిన భూమిని ప్రదేశాన్ని జాగ్రత్త చెయ్యం.

అదేమంటే ఆయన చెప్పినది ఆచరించాలి కాని చిన్న చిన్న విషయాలు పట్టించుకోవటం అనవసరం అని కబుర్లు చెబుతాం. కాని మన పుట్టిన రోజులు మాత్రం చక్కగా జరుపుకుంటాం. మన జాతకాలు, ఇళ్ళు ,భూములు మాత్రం చాలా జాగ్రత్తగా పదిలపరుచుకుంటాం. మరి వేదాంతం అప్పుడేమైతుందో? పొనీ వారు చెప్పినది ఏదన్నా ఆచరిస్తామా అంటే అదీ ఉండదు. వాళ్ళను ఉపయోగించుకోని మన వ్యాపారాలు చేసుకుంటాం. ఇదీ మనకు చేతనైన విద్య. వ్యాపారానికి వీలు పడడు అనుకున్న గౌతమ బుద్ధ్హుని వంటి మహాపురుషులను మనదేశం నుంచి వెలివేస్తాం. లేదా అవతారాలలో కలిపేసి పూజా పునస్కారాలకు పరిమితం చేస్తాం. కాని ఆయన చెప్పినది మాత్రం ఆచరించం. ఇదీ మన పరిస్థితి. మనలో ఆత్మవిశ్వాసం ఎప్పుడు పెరుగుతుందో, ఇటువంటి తమస్సూ, స్వార్ధం ఎప్పుడు తగ్గుతాయో భగవంతునికే ఎరుక.

ఆంగ్లేయులిచ్చిన తప్పుడు చరిత్ర

ప్రస్తుతానికి ఆ విషయాలు అలా ఉంచుదాం. మన చరిత్రను పూర్తిగా అస్తవ్యస్తం చేసి పోయిన ఆంగ్లేయులు శంకరులనూ వదలలేదు. ఆయన జననతేదీ క్రీ శ 788 అని తేల్చి చెప్పారు. దానికి ఏవేవో కారణాలు వారు చూపారు. కాని దేశంలో ఉన్న శంకర సాంప్రదాయ మఠాలైన బదరీ,పూరీ,ద్వారకా,శృంగేరీ,కాంచీ మఠాలలో ఉన్నటువంటి గురుపరంపరను పరిశీలిద్దామని వారికి తోచలేదు. శంకరులు దేశం నాలుగుమూలలా నాలుగు మఠాలను స్థాపించి ధర్మ పరిరక్షణ చెయ్యమని చెప్పి తన శిష్యులను వాటికి గురువులుగా నియమించి ఆదేశించారు. ఆయా మఠాలలో మొదటి నుంచి ఇప్పటిదాకా గురుపరంపర వ్రాసిపెట్టబడుతూ వస్తున్నది. రికార్డులను బట్టి శంకరులు క్రీ పూ 509 లో జన్మించారని నాలుగు మఠాల రికార్డులూ ముక్తకంఠంతో చెబుతున్నాయి.అప్పటినుంచి వరుసగా వస్తున్న గురుపరంపర యొక్క వివరాలు వారి వద్ద ఉన్నవి. ఒక్క శృంగేరీ మఠం మాత్రం క్రీ పూ 44 గా తేదీని భావిస్తున్నది.

మరి ఆంగ్లేయుల తేదీకి ఆధారాలు ఏమిటి? క్రీ శ 788 లో అభినవ శంకరులనే ఒక ఆచార్యులు కంచి పీఠాన్ని అధిష్టించారు. ఆయన ఆదిశంకరుల స్థాయి కలిగిన వక్తా, యోగీ మరియు మహా పండితుడూ. అనేక దేవీ దేవతా స్తోత్రాలు భక్తి ప్రబోధకంగా వ్రాసినది అభినవ శంకరులే. ఈయనే ఆది శంకరులని ఆంగ్లేయులూ, వారిని గుడ్డిగా అనుసరించిన భారతీయ చరిత్ర కారులూ నమ్మారు. ఇక్కడే చరిత్ర మొత్తం బోల్తా కొట్టింది. చరిత్రలో 1296 సంవత్సరాలు చెరిగిపోయాయి. క్రీస్తు పూర్వం ఐదో శతాబ్దిలోఉన్న ఆది శంకరులు క్రీస్తు శకం ఎనిమిదో శతాబ్దంలోకి వచ్చికూర్చున్నారు. అదే నిజమని ఇన్నాళ్ళూ మనం నమ్ముతూ వచ్చాము.

ఆదిశంకరుల అసలైన జనన వత్సరం- జ్యోతిశ్శాస్త్ర ఋజువులు

శంకరుల జననతేదీని ఆధారాలతో నిరూపించే ప్రయత్నం ఎందరో మహాపండితులూ పరిశోధకులూ చేశారు. అదంతా నేను మళ్ళీ వ్రాయదలుచుకోలేదు. అంతర్జాలంలో వెదికితే బోలెడంత సమాచారం దొరుకుతుంది. ప్రస్తుతం జ్యోతిషశాస్త్ర రీత్యా మాత్రమే నేను పరిశీలన చేశాను. నా పరిశీలనలో తేలిన విషయాలను ఇక్కడ ఉంచుతున్నాను.

ఆచార్యుల జనన తిధి గురించి వివాదాలు లేవు. ఆయన వైశాఖ శుక్ల పంచమి రోజున జన్మించారు అన్నది అందరూ అంగీకరిస్తున్నారు. నక్షత్రం గురించి భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు ఆర్ద్రా నక్షత్రమని, కొందరు పునర్వసు నక్షత్రమని వ్రాశారు. అసలు వివాదం సంవత్సరం దగ్గరే ఉన్నది. ఇంగ్లీషువారు, వారిని అనుసరించే భారతీయ రచయితలు చెప్పిన సంవత్సరం క్రీ.శ 788 అనేది తప్పు అని ఇప్పుడు అందరూ ఒప్పుకుంటున్నారు. వత్సరం కంచి మఠ ఆచార్యులైన అభినవ శంకరులది. అంతేగాని ఆది శంకరులది కాదు.

పరిశోధకులు తేల్చినవి రెండు సంవత్సరాలున్నాయి. ఒకటి- శృంగేరి మఠం తప్ప మిగిలిన నాలుగు శంకర మఠాలూ (అనగా బదరీనాధ్ లోని జ్యోతిర్మఠం, పూరీలోని గోవర్ధన పీఠం, ద్వారకా పీఠం, మరియు కంచి కామకోటి పీఠం) ఒప్పుకున్న కలియుగాది సరియగు క్రీ.పూ 509 , రెండవది శృంగేరి మఠం రికార్డుల ననుసరించినది-కలియుగాది సరియగు క్రీ.పూ 44 మూడవది ఇప్పటివరకూ అందరూ నమ్ముతున్న క్రీ. 788 .

మూడు కుండలులనూ జ్యోతిశ్శాస్త్ర రీత్యా తులనాత్మక పరిశీలన చేయగా ఏది సరియైన జనన తేదీగా వస్తుందో చూద్దాము.