నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

22, మే 2010, శనివారం

ఆది శంకరుల జీవితం - జాతకం (రెండో భాగం)


















మొదటగా 19-4-788 తేదీనాటి వైశాఖ శుక్ల పంచమి జాతకాన్ని పరిశీలిద్దాము. ఇది చరిత్ర కారులు ఇప్పటివరకూ నమ్ముతున్న తేదీ. వారి నమ్మకానికి కొన్ని మూఢవిశ్వాసాలు కారణాలయ్యాయి. శంకరుడు క్రీస్తు పూర్వం ఉండటం వాళ్ళకు మింగుడు పడలేదు. శంకరులు క్రీస్తుపూర్వంలో ఉన్నారని ఒప్పుకుంటే, బుద్ధుని ఇంకా వెనుకకు ఉంచవలసి వస్తుంది. అది బుద్ధునికి ఇంకా ప్రాచీనతను ఆపాదిస్తుంది. రెండూ ఒప్పుకోటానికి వారికి మనసు రాలేదు. కనుక క్రీ.శ 788 లో శంకరుల జననం జరిగింది అని వారి వాదన. వారి వాదనను సమర్ధించుకోడానికి కంచి మఠ 38 ఆచార్యులైన అభినవ శంకరుల జననతేదీని ఆధారంగా తీసుకున్నారు. మధ్యన బయటపడుతున్న నిజాల ద్వారా వాదన ఎలాగూ వీగిపోయింది. కాని జ్యోతిష్య పరంగా కొంత పరిశీలిద్దాము.

శంకరుల గురించి ఒక ప్రసిద్ధ శ్లోకం ఇలా చెప్తుంది.

శ్లో|| అష్టవర్షే చతుర్వేదీ ద్వాదశే సర్వశాస్త్రవిత్
షోడశే కృతవాన్ భాష్యం ద్వాత్రింశే మునిరభ్యగాత్ ||

భావం: ఎనిమిది ఏళ్ళకు నాలుగు వేదాలను అధ్యయనం చేశాడు. పన్నెండేళ్ళకు సర్వ శాస్త్రవిదుడయ్యాడు. పదహారేళ్ళకు వ్యాస భగవానుని బ్రహ్మ సూత్రములు, దశ ఉపనిషత్తులు,భగవద్గీతలకు భాష్యం వ్రాశాడు. ముప్పై రెండేళ్ళకు జీవితాన్ని చాలించాడు.

వివరాలతో జాతకం సరిపోతుందో లేదో పరిశీలించాలి.

లగ్న చంద్రులు యధావిధిగా కర్కాటక,మిధున రాశులలోనూ, రాహువు కన్యలో,కుజుడు మకరంలో,గురువు కుంభంలో, బుధ శుక్ర శని కేతువులు మీనంలో, రవి మేషంలోనూ ఉన్నారు. ఆధ్యాత్మికతను చూపించే, వింశాంశ చక్రంలో లగ్నం వృషభంలో,రవి చంద్రులు మిధునంలో, రాహుకేతువులు తులలో, వృశ్చికంలో శని శుక్రులూ, మకరంలో బుధుడూ,మీనంలో కుజుడూ,మేషంలో గురువూ ఉన్నారు.

ఈ జాతకానికి ఆది శంకరుల స్థాయి ఉన్నదా?

మంత్ర స్థానాధిపతి యగు కుజుని ఉఛ్చ స్థితివల్ల మహామంత్ర సిద్ధి సూచితం అవుతున్నది. కాని బుధుని నీచ స్థితి, ఆది శంకరుల స్థాయి కలిగిన మహా మేధావిని చూపటం లేదు. మూడింట రాహువు వల్ల ఎక్కువగా దగ్గరి ప్రయాణాలు సూచితం వుతున్నాయి. కాని శంకరులు దేశం అంతా పర్యటించారు.

వింశాంశలో పంచమాధిపతి నవమ స్థితివల్ల ఆధ్యాత్మిక ఔన్నత్యం సూచితం అయినప్పటికీ, ఆది శంకరుల అంతటి మహోజ్జ్వలస్థాయి కనపడటం లేదు. వింశాంశ చక్రంలో ఆది శంకరుల స్థాయిని సూచించే గొప్ప యోగాలు లేవు.

శని,కేతు,శుక్రుల యుతి సంన్యాస యోగాన్నిస్తుంది. నవమంలో ఈ యోగం వల్ల ఆధ్యాత్మిక ఔన్నత్యం కనిపిస్తున్నది. ఈ జాతకం ఒక గొప్ప మతాధిపతినీ మరియు సంన్యాసినీ చూపిస్తున్నది.

జాతక విశ్లేషణ

>>
మొదటగా అల్పాయుర్యోగం ఉందా లేదా అనేది పరిశీలించాలి. లగ్నం చరరాశిలోనూ, అష్టమాధిపతి శని ద్విస్వభావ రాశిలోనూ ఉండటం అల్పాయువును ఇస్తుంది. లగ్న చంద్రులకూ, లగ్న హోరా లగ్నాలకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. కేంద్రాలలో శుభ గ్రహాలు లేకపోవడము,అష్టమంలో శుభగ్రహం ఉండటమూ అల్పాయు యోగాన్నిస్తుంది. కానీ కొన్ని ఇతర విషయాలు పరిశీలించాలి. లగ్నానికి పరమ యోగకారకుడైన కుజుడు ఉఛ్చ స్థితిలో ఉండి అల్పాయు యోగాన్ని రద్దు చేస్తున్నాడు. అలాగే చతుర్ధ కేంద్రాధిపతియగు శుక్రుడు ఉఛ్చ స్థితిలో ఉండి అల్పాయు యోగాన్ని రద్దు చేస్తున్నాడు. కనుక జాతకానికి అల్పాయు యోగం పోయి, మధ్యాయు యోగం పడుతుంది. అనగా 32-64 ఏళ్ళ మధ్యన ఆయువు సమాప్తి అవుతుంది. కాని శంకరులు 32 ఏళ్ళకే దేహాన్ని చాలించారు. కనుక జాతకం ఆది శంకరులది కాదు.

>>
ఇప్పుడు అంశాయుర్దాయ విధాన రీత్యా ఆయుర్గణన చేయగా 51 సంవత్సరాల ఆయువు వచ్చింది. కనుక జాతకం ఆది శంకరులది కాదు. అభినవ శంకరులు క్రీ.శ 788 లో పుట్టి 839 లో దేహాన్ని చాలించారని మనకు తెలుసు. అనగా ఆయన సరిగ్గా 51 సంవత్సరాలు జీవించారు. ప్రస్తుత జాతకుని ఆయువు 50.9 ఏళ్ళుగా వచ్చింది కనుక జాతకం అభినవ శంకరులది అని తేలుతున్నది.


>> తేదీ ప్రకారం జననకాల రాహు దశా శేషం 5 ఏళ్ళ 8 నెలలుంది.. కనుక నాలుగేళ్ళ వయస్సులో రాహు/చంద్రదశ జరిగింది. పితృస్థానమైన మీనానికి రాహువు మారక స్థానంలో ఉన్నాడు. కాని చంద్రునికి విధంగానూ పితృ మారక స్థానంతోగాని సంబంధం లేదు. కనుక నాలుగవఏట తండ్రి మరణం సూచింపబడటం లేదు.

>>
అయిదవ ఏట రాహువులో కుజ అంతరం జరిగింది. కుజుడు మంత్ర స్థానాధిపతిగా ఉఛ్ఛ స్థితిలో ఉన్నాడు. రాహువుకు పంచమంలో ఉన్నాడు. కనుక ఉపనయనం జరగాలి. కాని నవమాధిపతియగు గురుని స్పర్శ ఎక్కడాలేదు. రాహువుకు చతుర్ధ, మంత్ర స్థానాలతో సంబంధం లేదు. కనుక సమయంలో ఉపనయనం జరిగే అవకాశం లేదు.

>>
ఎనిమిదవ ఏట గురువులో గురు అంతరం జరిగింది. అప్పటికి చతుర్వేదాల అధ్యయనం పూర్తి అయింది. కాని గురువుకు విద్యాధిపతి అయిన శుక్రునికి సంబంధం లేదు. అప్పుడే సన్యాస దీక్ష తీసుకోవడం జరిగింది. కాని గురువుకు జాతకంలో నవమంలో ఉన్న సన్యాస యోగానికి సంబంధం లేదు. సమయంలోనే దేశ సంచారానికి బయలుదేరాడు. కాని స్థిర రాశిలోని గురువు దేశ సంచారాన్నివ్వడు. కనుక ఇదీ సూచితం కావడం లేదు.

>>
పన్నెండవ ఏట గురువులో బుధుని అంతరం జరిగింది. బుధుడు నీచస్థితిలో ఉన్నాడు. విద్యా స్తానంతో ఆయనకు సూటి సంబంధం లేదు. కనుక సమయంలో విద్యాభ్యాసపరంగా చెప్పుకోదగ్గ ఫలితం ఉండదు. కాని స్వామి వయస్సులో సర్వ శాస్త్రాలూ ఔపోసన పట్టాడు. కనుక ఈ సంఘటన కూడా సరిపోవడం లేదు.

>>
పదహారవ ఏట గురువులో చంద్ర దశ జరిగింది. ఇది యోగకారక దశ అయినప్పటికీ,విద్యా స్థానమయిన చతుర్ధసంబంధంగాని, గ్రంధరచనను ఇచ్చే తృతీయ స్థాన సంబంధంగాని లేకపొవడం చేత, ప్రస్థానత్రయ భాష్యం వ్రాయించదగ్గ మహిమాన్విత దశ కాదు. కాని వయస్సులో స్వామి అసాధారణమైన భాష్యం వ్రాశాడు. ఇది మామూలు విషయం కాదు. సంఘటన కూడా సరిపోవడం లేదు.

>>
ముప్పై రెండవ ఏట స్వామికి శనిలో రవి అంతరం జరిగింది. శని లగ్నానికి మారకుడే. రవి ద్వితీయాధిపత్యం ఉన్నప్పటికీ మారకుడు కాదు. పై పెచ్చు దశమంలో ఉఛ్చ స్థితిలో ఉండి మహిమాన్వితమైన వాక్కును ఇస్తున్నాడు. కనుక అంతరంలో మారకం జరగడం కుదరదు. అనగా జాతకునికి ముప్పై రెండో ఏట మరణం లేదు. కనుక జాతకం ఆది శంకరులది కాదు అని చెప్పవచ్చు.

అందరూ నమ్ముతున్న క్రీ.శ 788 శంకరుల జనన సంవత్సరం కాదు అని పై జ్యోతిష్య విశ్లేషణ ద్వారా తెలుస్తున్నది. అందులోని సంన్యాస యోగం, రవి శుక్ర కుజుల ఉచ్చ స్థితుల వల్ల
ఇది ఒక మహిమాన్వితుల జాతకమే అని అర్ధం అవుతున్నది.

మిగిలిన
రెండు జాతకాలను మున్ముందు పరిశీలిద్దాం.