Pages - Menu

Pages

13, జూన్ 2010, ఆదివారం

మళ్ళీ నిజమైన జ్యోతిషం


భారతీయ జ్యోతిష్య విజ్ఞానం అద్భుతమైనది. కారణం అది ఋషిప్రోక్తం కావడమే. మొన్న కుజుని రాశిమార్పు సందర్భంగా నేను వ్రాస్తూ త్వరలో భూకంపాలు,అగ్ని ప్రమాదాలు జరుగబోతున్నాయి అని చెప్పాను.అమావాస్య పౌర్ణమిలకు అటూఇటూగా ఇవి జరుగనున్నాయి అని అంతకు ముందు పోస్ట్ లోనే వ్రాశాను. నిన్న జరిగిన సంఘటనలు దీనికి అక్షరాలా అద్దంపడుతున్నాయి.

నిన్న శనివారం అమావాస్య. నిన్న రాత్రి విశాఖపట్నం నుంచి మద్రాస్ వరకూ కోస్తా జిల్లాలలో భూకంపం వచ్చింది. అండమాన్లో బాగా ఎక్కువగా కంపించి రిచ్టర్ స్కేల్మీద ఏడు పాయింట్లు నమోదైంది. పేపర్లు అన్నింటిలోనూ వార్తలు వచ్చాయి. భారతీయ జ్యోతిర్విజ్ఞాన మహిమకు ప్రెడిక్షన్ నిజం కావడం ఒక మచ్చు తునక.

తూర్పు కోస్తాలోనూ దక్షిణాదినా భూకంపం రావడానికి కారణాలు ఏమై ఉంటాయి? కుజుడు తూర్పు దిక్కును సూచించే సింహరాశిలో ఉన్నాడు.శని దక్షిణ దిక్కుకు సూచిక అయిన కన్యారాశిలో ఉన్నాడు. రవి దక్షిణ దిక్కును సూచించే వృషభరాశిలో ఉండడమే గాక, దక్షిణ దిక్కుకు అధిపతి అయిన కుజునిదైన మృగశిరానక్షత్రంలో ఉన్నాడు. కనుక తూర్పు కోస్తాలోనూ దక్షిణాదినా భూకంపాలు జరిగాయి.

భారతీయ జ్యోతిర్విజ్ఞానం నిజంగా అద్బుతమైనది అనడానికి ఎన్నో ఋజువులు అడుగడుగునా కనిపిస్తాయి. చూచే దృష్టి మనకు ఉండాలి. ఇటువంటి మహోన్నత జ్ఞానాన్ని మనకిచ్చిన ప్రాచీన ఋషులకు నిజంగా మనం ఋణపడి ఉన్నాం. హేళనాత్మక దృష్టివల్లా,గర్వం వల్లా, తెలిసినా తెలియకపోయినా ప్రతిదాన్నీ ఎగతాళి చెయ్యడం అలవాటు అయినందువల్లా ఇటువంటి దైవవిద్యలను ఉపయోగించుకోలేక మనమే నష్టపోతున్నాం. సంపద చేతిలో ఉండికూడా తెలియక బిచ్చగాడిలా ప్రవర్తించేవారివలె ఉంది మన స్థితి. ఇప్పటికే చాలామంది విదేశీయులు మనవైన యోగా,జ్యోతిష్యమూ,తంత్రమూ,వీరవిద్యలూ మొదలైన అన్నీ నేర్చుకుని మనకే తిరిగి నేర్పే స్థాయిలో ఉన్నారు. అయితేనేం!!! మనకు ఆత్మాభిమానం ఎప్పుడో అంతరించింది గదా. ప్రస్తుతం మనకు కనిపించేది ఒక్క డాలర్ మాత్రమే. మనకు పరమావధులు విలాసాలూ బౌతిక సుఖాలూ, డబ్బుతో వచ్చే గర్వమూ అహంకారమూ మాత్రమే.

మన పొరుగున ఉన్న చైనావారు తమ ప్రాచీన సంస్కృతిని గౌరవించుకుంటూ ఎంత అభివృద్ధి సాధిస్తున్నారో మనం గమనించాలి. జపాన్ కూడా తమ ప్రాచీన విద్యలనూ సంస్కృతినీ అమితంగా అబిమానిస్తూ గౌరవిస్తూ ఆచరిస్తూ ఎంత అభివృద్ది చెందిందో మనకు కనపడదా? ఇప్పటికైనా కళ్ళుతెరిచి
మన ప్రాచీన విద్యలను,భారతీయ వైదిక సంస్కృతినీ మనం గౌరవించడం నేర్చుకుందామా? లేక ఇలాగే విలాస జీవిత మోజులో, భౌతిక జీవితమే పరమావధి అనే భ్రమలో పడి తెలీని గమ్యాలకు కొట్టుకుపోదామా?