Pages - Menu

Pages

18, సెప్టెంబర్ 2010, శనివారం

జైమినీయ కారకాంశ- ఒక పాత జ్ఞాపకం

1998 ప్రాంతాలలో నాకొక స్నేహితుడుండేవాడు. అతని పేరు శ్రీనివాస్ అప్పటికే అతను.మంచి జ్యోతిష్య జ్ఞానం ఉన్నవాడు. అప్పట్లోనే పదివేలు పెట్టి ఒక పామ్ టాప్ కంప్యూటర్ లాటిది కొని దాన్ని వాడుతూ జాతక చక్రాలు వేసి చూస్తుండేవాడు. ఒక రూం నిండా అతని లైబ్రరీ ఉండేది. వాళ్ళుబ్రాహ్మణులు కారు. పద్మ శాలీలని ఒకసారి చెప్పినట్లు లీలగా గుర్తుంది. రాత్రింబగళ్ళు జ్యోతిష్య శాస్త్రాన్ని శోధిస్తుండేవాడు. అతనికి జ్యోతిష్య శాస్త్రం మీద అంతటి నిమగ్నత ఎలా వచ్చిందో నాకు ఆశ్చర్యం వేసేది. నేను నా స్నేహితుల కులాలని ఎప్పుడూ అడగను. కొంతమంది నా కాలేజి స్నేహితుల కులాలు ఈ మధ్యనే నాకు ఒక వివాహ మూలకంగా తెలిశాయి. మా స్నేహాలు, ఆ విధంగా కులాలకు అతీతంగా సబ్జెక్ట్ పరంగా ఉండేవి.

అదలా ఉంచితే, అతను సాయంత్రానికి స్నానం చేసి గణపతి మంత్రం జపించేవాడు. ఎవరిదగ్గర ఉపదేశం పొందాడో నేనూ అడుగలేదు అతనూ చెప్పలేదు. అతను కృష్ణమూర్తి పద్దతి ఫాలో అయ్యేవాడు. కృష్ణమూర్తి గారు ఉచ్చిష్ట గణపతిఉపాసకుడు కనుక విధానం ఫాలో అయ్యేవారు చాలామంది మంత్రాన్ని జపిస్తారని నాకు తెలుసు. అందుకనినేనూ అడుగలేదు. కాని రాత్రి కాగానే మద్య మాంసాలు స్వీకరించేవాడు. అతనికి ఇలాటి అలవాట్లు ఉన్నాయని అప్పటిదాకా నాకు తెలియదు. కాని ఒక జ్యోతిష్య కాన్పరెన్స్ కు కలకత్తా వెళ్ళినపుడు అతనూ నేనూ ఒకే గదిలో ఉన్నాము. అప్పుడు ఇదంతా చూచాను. ఒకపక్క జ్యోతిష్య సాధన చేస్తూ, మంత్ర సాధన చేస్తూ, పనులేమిటి అని మాత్రం అడిగాను. దానికి సమాధానం చెప్పలేదు గాని "తాంత్రికసాధనలో మద్య మాంసాలు తీసుకోవచ్చుగా" అని చెప్పాడు. నాకప్పటికే తంత్రసాధనలో గట్టి అనుభవం ఉంది. చాలామంది తమ నిగ్రహలేమికి తంత్రం అని పేరుపెట్టుకుని సరిపుచ్చుకోవటం నాకు తెలుసు. అతను అర్ధం చేసుకునేస్థితిలో లేడని గ్రహించి, వాదనెందుకని నేను నవ్వి ఊరుకున్నాను. కాని ఒకటి మాత్రం చెప్పాను. "జ్యోతిష్య సాధన చేసేవారు నియమ నిష్టలు పాటించాలి. ఇలాటి అలవాట్లు ఉండరాదు.లేకపోతే ఈ జ్ఞానం పట్టుబడదు. ఒకవేళ పూర్వకర్మప్రభావం వల్ల గట్టి ఇంట్రెస్టు ఉన్నా సరిగా ఉపయోగపడదు. దానికి తోడు రెమెడీలు పని చెయ్యవు. ఇతరుల కర్మవిపాక విధానాలను చెప్పేమాట అటుంచి, తన కర్మ తానే తీర్చుకోలేడు " అన్నాను. అతను నవ్వి ఊరుకున్నాడు. అతను వినడని, అలవాట్లు మానుకునే స్థాయి దాటిపోయాడని నేను గ్రహించాను.

ఒకరోజు అతని జాతకం చూస్తూ చర్చిస్తుండగా జైమిని సూత్రాల ప్రకారం "ఆత్మాధిక కలాధిభి:" అని జైమిని మహర్షిచెప్పినదానిని బట్టి, " భవేద్రాశి కలయో రాధిక్యా దాత్మకారక:" అని పరాశరులు చెప్పినదానినిబట్టి అతని ఆత్మకారకుని నిర్ధారించి పరిశీలిస్తున్నాము. అతనికి జైమిని విధానం తెలియదు. కనుక దానిగురించి నన్ను అడిగేవాడు. అప్పట్లో మేము రకరకాల జ్యోతిషవిధానాలను తీవ్రంగా పరిశీలిస్తూ వాటిని వివిధ జాతకాలకు అప్లై చేసి చర్చిస్తూ ఉండేవాళ్లం. కాని అతను సాంప్రదాయ రెమెడీలు పాటించేవాడు కాదు. ఏవో పిరమిడ్స్ అని, డాలర్స్ అని, రుద్రాక్షలని ఇంకా ఏవేవో తనకు తోచిన వాటిని, బజారులోని పుస్తకాలలో వచ్చేవాటిని రోజుకొకటి చొప్పున రెమెడీల క్రింద ట్రై చేస్తుండేవాడు. మాయలో పడవద్దని నేను చెప్పేవాణ్ణి కాని అతను వినేవాడుకాదు. సాంప్రదాయం గా వస్తున్న రెమెడీలు పాటించేవాడు కాదు. అతని జాతకంలోని కారకాంశను చూడటం తోనే "సమే వాహనా దుచ్చాచ్చ క్రమాత్పతనం " అన్న జైమిని సూత్రం నాకు స్ఫురణకు వచ్చింది. కారకాంశ ధనుస్సుగనుక అయితే వాహనాలనుంచి పడటంవల్ల గాని ఎత్తైన ప్రదేశాలనుంచిపడటం వల్ల గాని ప్రమాదం ఉంటుంది. అతని జాతకంలో అదే కాంబినేషన్ కనిపించింది. వెంటనే జైమినీయ చరదశను, గోచారాన్ని పరిశీలించాము. అప్పుడు జరుగుతున్న దశ చూడగానే నా గుండె గుభిల్లుమంది. ఎలా చెప్పాలా అనిచాలాసేపు ఆలోచించి, " ఏది ఏమైనా సరే, వాహనాలు స్పీడుగా నడపకు" అని మాత్రం చెప్పాను. సరే అనితలూపాడు.

ఇది జరిగిన నెల రోజులకనుకుంటాను. రాత్రి పదకొండు గంటలకు విజయవాడ నుంచి మోటార్ సైకిల్ మీద తాడేపల్లికి వస్తుండగా, సాయిబాబా గుడి టర్నింగ్ వద్ద స్పీడు గా ఎదురునుంచి వస్తున్న ఒక కారు అదుపుతప్పి ఇతన్ని గుద్దేసింది. వాహనం మీదనుంచి పడి దొర్లుకుంటూ రోడ్డుపక్కన డౌన్ లో పడిపోయాడు. కాలుప్రాక్చర్ అయింది. ఒక వారం హాస్పటల్ లో ఉండి, ఆపరేషన్ టేబుల్ మీద హార్ట్ ఎటాక్ తో చనిపోయాడు. అప్పుడతనికి 33 సంవత్సరాలు మాత్రమే. "వాహనా దుచ్చాచ్చ క్రమాత్పతనం" --"వాహనం మీద నుంచి పడి ఎత్తునుండి కిందకు దొర్లుటద్వారా ప్రమాదం జరుగును" అని జైమిని మహర్షి వేల సంవత్సరాల క్రితం చెప్పిన సూత్రం అక్షరాలా అతని విషయం లో జరిగింది. కాని అన్ని వేల ఏళ్ళ క్రితమే ఇలాటి కాంబినేషన్స్ ను పరిశోధనలో నిగ్గు తేల్చి వాటిని సూత్రాలుగా వ్రాసిపెట్టిన మహర్షుల మేధాశక్తి ఎంతటిదో అల్పజ్ఞులమైన మన ఆలోచనకు అందదు. విషయం నన్ను చాలాఆశ్చర్యానికి గురిచేసింది. శాస్త్రంలో ఇంకా లోతైన పరిశీలన చెయ్యాలన్న ఆసక్తిని పురికొల్పింది. చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ, మరువలేని కొన్ని పాత ప్రిడిక్షన్స్ లో ఇదొకటి.